Dyeo
-
ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్లలో అక్రమాలు!
సాక్షి, అమరావతి: ఉర్దూ పాఠశాలకు తెలుగు పండిట్.. 130 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఇప్పటికే నలుగురు ఉపాధ్యాయులు ఉండగా.. మరొకరికి అక్కడే పోస్టింగ్.. 370 మంది ఉన్న మరో స్కూల్లో కేవలం నలుగురు మాత్రమే పాఠాలు బోధిస్తున్నారు.. అక్కడికి ఒక్కరిని కూడా పంపలేదు. ఈ మూడు ఉదాహరణలు చాలు వీఎంసీలో వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవడానికి. అవసరాలకు అనుగుణంగా బదిలీ చేపట్టాలని మున్సిపల్ కమిషనరేట్ ఇచ్చిన జీవోను అధికారులు ఇష్టారీతిన ఉపయోగించుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ తంతుపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పరిమితికి మించి పనిచేస్తున్న చోటు నుంచి అవసరమైన చోటుకు ఉపాధ్యాయులు బదిలీ చేయమని మున్సిపల్ కమిషనరేట్ ఇటీవల జారీ చేసిన జీవోను విజయవాడ నగరపాలక సంస్థ అధికారులకు వరంగా మారింది. ఆ జీఓను అడ్డుపెట్టుకొని తన వర్గానికి చెందిన ఉపాధ్యాయులకు నచ్చిన చోట పోస్టింగ్‌లు ఇచ్చుకున్నారు. ఎక్కువమంది విద్యార్థులు ఉన్న స్కూల్‌కి కాకుండా తక్కువ ఉన్న స్కూల్‌కి నలుగురు ఉపాధ్యాయులను బదిలీ చేయటంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తెలుగు ఉపాధ్యాయుడిని ఉర్దూ హైస్కూల్‌కి.. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట బదిలీ చేసిన ఉపాధ్యాయుల లిస్ట్‌లో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఎంకే బేగ్ ఎలిమెంటరీ స్కూల్లో తెలుగుమీడియం బోధిస్తున్న ఓ ఉపాధ్యాయుడిని ఎస్ఎంఏకే ఉర్దూ మీడియం హైస్కూల్‌కు బదిలీ చేశారు. తెలుగు మీడియం ఉపాధ్యాయుడు ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఎలా బోధించగలడో అధికారులకే తెలియాలి. గ్రౌండ్ బాగా ఉండి నగరంలోనే ఎక్కువ విద్యార్థులున్న ఏకేటీపీ మున్సిపల్ పాఠశాల నుంచి గ్రౌండ్ సరిగాలేని మరో పాఠశాలకు ఓ పీఈటీని బదిలీ చేశారు. ఓ డ్రాయింగ్ టీచర్ బదిలీ విషయంలోను ఇదే జరిగింది. తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం పటమటలోని జీడీఈటీకి మార్చారు. అనారోగ్య కారణాలున్నా పట్టించుకోలేదు.. వి. సుబ్బారావు అనే ఎస్జీటీ ఉపాధ్యాయుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కమిషనర్‌కి లెటర్ పెట్టుకున్నారు. పరిశీలించమని డీవైఈఓకు రాసినప్పటికీ పట్టించుకోలేదు. ప్రస్తుతం మూడు అంతస్తులు ఎక్కిదిగాల్సిన పరిస్థితి ఆయనది. కానీ కొంతమంది ఇంటికి దగ్గరగా ఉందన్న నెపంతో వర్క్ అడ్జస్ట్మెంట్ చేసినవి ఉండటం జాబితాలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం బదిలీ అయిన ఓ మహిళా ఉపాధ్యాయురాలి పనిచేస్తున్న స్కూల్లో 296 మంది విద్యార్థులున్నారు. అక్కడ 8 మంది టీచర్లు ఉన్నారు. మరో 3 ఉపాధ్యాయులు అవసరం కానీ అందులోంచి ఇద్దరిని తీసి 6 మంది టీచర్లే ఉండేలా సర్దుబాటు చేశారు. అలాగే 130 మంది విద్యార్థులు ఉన్న ఓ పాఠశాలకు ఇప్పటికే నలుగురు టీచర్లు ఉండగా పై మహిళా ఉపాధ్యాయురాలిని ఒకరిని ఇక్కడికి బదిలీ చేశారు. మరోవైపు బీఎస్ఆర్కే స్కూల్లో 370 మందికి కేవలం నలుగురు టీచర్లే ఉండగా అక్కడికి ఒక్కరిని పంపకపోవడం గమనార్హం. అయినవారి కోసమేనా..! తన వర్గం ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడుకోవటానికే డీవైఈఓ, మాజీ డీవైఈఓలు బదిలీ చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 13 మంది స్కూల్ అసిస్టెంట్లలలో నలుగురు ఉపాధ్యాయులను డీవైఈఓ పనిచేస్తున్న స్కూల్ ఒక్కదానికే వేసుకోవటం దీనికి ఉదాహరణ అని వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థుల అవసరాల కోసం కాకుండా ఉపాధ్యాయులు సౌకర్యంగా ఉండేలా సర్దుబాటు చేశారని ఆరోపిస్తున్నారు. చాలా అవకతవకలు జరిగాయి.. ఉపాధ్యాయుల సర్దుబాట్లలో చాలా అవకతవకలు జరిగాయి. అడ్డగోలుగా ఉపాధ్యాయులను మార్చారు. అవసరమైన చోట్లను విస్మరించారు. సర్దుబాట్లు జూలై నెల చివర్లో చేయటం సరికాదు. విద్యా ప్రణాళికలు దెబ్బతింటాయి. – నాగరామారావు, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం నేత క్షేత్రస్థాయి పరిశీలన జరగలేదు.. సర్దుబాటులో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయలేదు. కేవలం అవసరమైన వారి కోసం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఇది వరకే ఏసీజీ, డీవైఈఓలను కలసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. అందరి అభిప్రాయాలు తీసుకుని చేసి ఉంటే బాగుండేది. – మణిబాబు, బీటీఏ రాష్ట్ర కార్యదర్శి అందరి అభిప్రాయాలు తీసుకున్నాం.. వర్క్ అడ్జస్ట్మెంట్ సక్రమంగానే జరిగింది. అన్ని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాం. ఎవరికైన ఇబ్బందులు ఉంటే ఇంకా సర్దుబాట్లు ఉన్నందును అవసరమైన చోట్లకు ఈసారి పంపిస్తాం. – నాగలింగేశ్వరరావు, డీవైఈఓ -
డీవైఈఓ పోస్టుల భర్తీ ఎప్పుడో?
సాక్షి, ఒంగోలు టౌన్: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పాఠశాల పనితీరును పర్యవేక్షించేందుకు డీవైఈఓలు కరువయ్యారు. జిల్లా విద్యాశాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీ ఎప్పుడా అని పలువురు ఉపాధ్యాయులు నేటికీ ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని సీనియర్ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కోరుతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు, కందుకూరు, పర్చూరు, మార్కాపురం ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఉన్నాయి. ఒంగోలు ఉప విద్యాశాఖాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న దయానందం ఈ ఏడాది జూన్ 30వ తేదీ ఉద్యోగ విరమణ చేశారు. కందుకూరు ఉప విద్యాశాఖాధికారి పోస్టు గత కొన్నేళ్ల నుంచి ఖాళీగా ఉండటంతో లక్ష్మయ్య ఇన్చార్జి ఉప విద్యాశాఖాధికారిగా నియమించారు. ఆయన ఏడాదిన్నర క్రితం ఉద్యోగ విరమణ చేశారు. పర్చూరు ఉప విద్యాశాఖాధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో రామ్మోహనరావును ఇన్చార్జి ఉప విద్యాశాఖాధికారిగా నియమించారు. ఆయన గత ఏడాది ఉద్యోగ విరమణ చేశారు. మార్కాపురం ఉప విద్యాశాఖాధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో కాశీశ్వరరావును నియమించారు. ఆయన గత ఏడాది ఉద్యోగ విరమణ చేశారు. జిల్లా విద్యాశాఖ పరిధిలోని కీలకమైన నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుత జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్ సుబ్బారావుపై అదనపు బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదులపై నివేదిక ఇచ్చేదెవరు? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వచ్చినా, ఉపాధ్యాయుల మధ్య వివాదాలు తలెత్తి ఫిర్యాదులు చేసుకున్నా, పాఠశాలలకు కేటాయించిన నిధులు దుర్వినియోగమైనా ఉప విద్యాశాఖాధికారి అక్కడకు వెళ్లి ఎంక్వయిరీ చేసి, అందుకు సంబంధించిన రిపోర్టును జిల్లా విద్యాశాఖాధికారికి అందించాల్సి ఉంటుంది. ఆ నివేదికను ఆధారం చేసుకుని జిల్లా విద్యాశాఖాధికారి చర్యలు(జడ్జిమెంట్) తీసుకుంటారు. అయితే ప్రస్తుతం జిల్లాలోని నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులకు జిల్లా విద్యాశాఖాధికారే ఇన్చార్జిగా వ్యవహరిస్తుండటంతో ఏమైనా ఫిర్యాదులు వస్తే స్వయంగా డీఈఓ వెళ్లి ఎంక్వయిరీ చేసి, ఆ ఎంక్వయిరీపై జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వీస్ రూల్స్ లేకపోవడమే జిల్లాలో కీలకమైన ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీ గత కొన్నేళ్ల నుంచి నిలిచిపోయింది. అందుకు కారణం వారికి సంబంధించిన సర్వీస్ రూల్స్ లేకపోవడమే. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల మధ్య ఆధిపత్య పోరు కూడా కీలకమైన ఇలాంటి పోస్టులకు విఘాతం కలిగిస్తోంది. సర్వీస్ రూల్స్‌కు సంబంధించి ఆ రెండు యాజమాన్యాలకు చెందినవారు ఒకరి తర్వాత ఒకరు కోర్టులను ఆశ్రయిస్తుండటంతో సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది. ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతుల విషయంలో నెలకొన్న రగడ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. అప్పటి ప్రభుత్వాల చేతులు దాటిపోయి చివరకు కోర్టుల వరకు వెళ్లడంతో కీలకమైన ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీపై ప్రభావం చూపుతోంది. విద్యాశాఖ మంత్రి జోక్యం తప్పనిసరి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఇన్చార్జిలను నియమించినప్పటికీ వారు జీత భత్యాల బిల్లులకు సంబంధించిన విషయాలకే ఎక్కువగా పరిమితమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో, జిల్లా విద్యాశాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీకి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీనియర్ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కోరుతున్నారు. విజిట్స్..ఇన్స్పెక్షన్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలోని ఉప విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని ఉన్నత పాఠశాలలను క్రమం తప్పకుండా విజిట్స్, ఇన్స్పెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. ► ప్రాథమిక పాఠశాలలు మండల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో ఉండగా, ఉన్నత పాఠశాలల పనితీరును ఉప విద్యాశాఖాధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. ► ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో వసతులు సమకూరుతున్నాయా, వారికి పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందించారా, మ«ధ్యాహ్న భోజనం సక్రమంగా అందుతుందా, విద్యార్థుల పాఠశాలలకు సక్రమంగా హాజరవుతున్నారా తదితరాలన్నింటిని ఉప విద్యాశాఖాధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. ► అంతేగాక ఉన్నత పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులు çసకాలంలో పాఠశాలలకు హాజరవుతున్నారా, తరగతులు ఏవిధంగా చెబుతున్నారు, విద్యార్థులకు పాఠ్యాంశాలు ఎలా బోధిస్తున్నారు తదితర వాటిని కూడా ఉప విద్యాశాఖాధికారులు చూడాల్సి ఉంటుంది. ► ఉన్నత పాఠశాలలకు సంబంధించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు అందుతున్నాయా, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అన్న విషయాలను పరిశీలించి జిల్లా విద్యాశాఖాధికారికి నివేదిక అందించాల్సి ఉంటుంది. ► ఇక ఉన్నత పాఠశాలలకు విడుదలవుతున్న నిధులు సక్రమంగా వినియోగిస్తున్నారా, నిధులు సరిపోక ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నారా అన్న విషయాలను కూడా తెలుసుకుని జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించడం జరుగుతుంది. వీటితోపాటు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంబంధించిన సెలవులు, ఇంక్రిమెంట్లను కూడా ఉప విద్యాశాఖాధికారులే చూడాల్సి ఉంటుంది. -
మూడంచెల ముడుపులు
విద్యాశాఖ సిబ్బంది బలవంతపు వసూళ్లు పదోన్నతికి రూ. 50 వేలు చెల్లించుకోవాల్సిందే.. అప్పుడే డీవైఈఓ, డీఈఓ, ఆర్జేడీ కార్యాలయాల్లో దస్త్రం కదలిక గగ్గోలు పెడుతున్న ఎయిడెడ్ ఉపాధ్యాయులు.. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో మూడంచెలు, ఐదంచెల కార్యక్రమాల అమలు విధానం చూశాం.. మరి ఈ మూడంచెల ముడుపుల విధానం ఏమిటి అనుకుంటున్నారా.. ఇది విద్యాశాఖ సిబ్బంది ప్రవేశపెట్టిన విధానం. ఎయిడెడ్ ఉపాధ్యాయుల పదోన్నతుల్లో నిషేధం ఎత్తివేయడం ఆ శాఖ ఉద్యోగులకు అనుకోని వరంగా పరిణమించింది. అదెలాగో ఒకసారి చూద్దాం.. ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులను నిషేధిస్తూ 2004వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన పాఠశాల విద్యాశాఖ అధికారులు మెమో నెం. 18836ను జారీ చేశారు. దానిపై ఎయిడెడ్ ఉపాధ్యాయులు 2005వ సంవత్సరంలో కోర్టులో సవాల్ చేశారు. అప్పటి నుంచి కోర్టులో మగ్గిపోయిన ఈ ఫైల్‌కు ఈ ఏడాది కదలిక వచ్చింది. కోర్టు తీర్పు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు అనుకూలంగా వచ్చింది. దీంతో గత జూన్ 30న ఎయిడెడ్ ఉపాధ్యాయుల పదోన్నతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ జీఓ ఎంఎస్ నెంబర్ 40ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పదోన్నతులకు మార్గం సుగమమయింది. జీఓ నెం 40 ప్రకారం ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ లోపు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నెల14వ తేదీ లోపు పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు కొత్త పోస్టుల్లో చేరాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ వ్యవహారంతో తలమునకలై ఉన్న విద్యాశాఖాధికారులు ఈ విషయంలో కాస్త అశ్రద్ధ వహించారని ఎయిడెడ్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొనసాగుతున్న ప్రక్రియ.. ఎయిడెడ్ ఉపాధ్యాయులు, సిబ్బంది పదోన్నతుల ప్రక్రియను గత వారం రోజులుగా విద్యాశాఖాధికారులు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికీ వారి వద్ద పూర్తి సమాచారం అందుబాటులో లేదు. ఎయిడెడ్ పాఠశాలల విషయానికొస్తే జిల్లాలో 222 ప్రాథమిక, 14 ప్రాథమికోన్నత, 37 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులు వచ్చే అవకాశం లేదు. కేవలం ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లోనే సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నారు. ఈ పదోన్నతుల్లో ఎంతమందికి అవకాశం ఉంది అనే విషయంలో విద్యాశాఖాధికారుల్లో ఇప్పటికీ స్పష్టత లేకపోయినప్పటికీ సుమారు 80 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పదోన్నతులు పొందవచ్చని చెబుతున్నారు. మూడంచెల ముడుపుల విధానం ఇలా.. సుమారు 13 సంవత్సరాల తరువాత పదోన్నతులకు అవకాశం వచ్చిందని ఎయిడెడ్ ఉపాధ్యాయులు సంతోషపడుతున్న సమయంలో వారికి విద్యా శాఖాధికారులు ఝలక్ ఇచ్చారు. పదోన్నతులు ఊరికే రావు, మీ పదోన్నతుల దస్త్రం కదలాలంటే ’మాకేంటి’ అంటున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ మేరకు ముందుగా డీవైఈఓ కార్యాలయం నుంచి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి దస్త్రం చేరాలంటే డీవైఈఓ కార్యాలయానికి రూ. 5 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. అక్కడి నుంచి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి చేరుకుని ఆర్జేడీ కార్యాలయానికి చేరాలంటే విద్యాశాఖలో ఎయిడెడ్ ఉపాధ్యాయుల దస్త్రాలను పరిశీలించే నలుగురు ఉద్యోగులు రూ. 20 వేలు అడుగుతున్నారని అది కేవలం తమకు మాత్రమే కాదని, జిల్లా విద్యాశాఖాధికారికి కూడా అందులో వాటా వెళుతుందని చెబుతున్నారని వాపోతున్నారు. అక్కడితో తమకు పదోన్నతులు వచ్చేసినట్టే అనుకుంటే తిరిగి ఆర్జేడీ కార్యాలయంలో పదోన్నతులకు ఆమోద ముద్ర పడడానికి మరో రూ. 25 వేలు సమర్పించుకోవాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బందే చెబుతున్నారంటున్నారు. అంటే పదోన్నతి కావాలంటే ఒక్కో ఉపాధ్యాయుడూ సుమారు రూ. 50 వేలు సమర్పించుకోవాన్నమాట. బేరసారాల్లో ఉపాధ్యాయులు.. ఎంతోకొంత సమర్పించకపోతే పదోన్నతి పొందడం కష్టమని ఆలోచిస్తున్న ఉపాధ్యాయులు మామూళ్లు ఇవ్వడానికి ఆయా కార్యాలయాల సిబ్బందితో బేరసారాలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏలూరులోని కేపీడీటీ స్కూల్ ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయంలోని ఉద్యోగులకు రూ. 8 వేలు ఇవ్వగలమని చెప్పినట్లు తెలిసింది. డెల్టా ప్రాంతమైన భీమవరం, నరసాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు మాత్రం తాము ముడుపులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినట్టు, ముడుపులు ఇవ్వకపోతే ఏమి చేస్తారో మేమూ చూస్తాం అనే ధోరణిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. నా దృష్టికి తీసుకురండి.. ఆర్ఎస్ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి.. ఇప్పటి వరకూ ఈ విషయం నా దృష్టికి రాలేదు. పదోన్నతుల ఫైలు కదలడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వనక్కరలేదు. అలా ఎవరైనా డిమాండ్ చేస్తే నా దృష్టికి తీసుకురావాలి. ఉపాధ్యాయులు ఫిర్యాదు చేస్తే సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తున్న ఆరోపణలపై విచారణ చేపడతాం. -
నేటి నుంచి జేవీవీ సైన్స్ సంబరాలు
ఉండి : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో సైన్సు సంబరాలు నిర్వహిస్తున్నట్టు వేదిక జిల్లా నాయకుడు గాదిరాజు రంగరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉండిలో జేవీవీ సైన్సు సంబరాల పోస్టర్‌ను డీవైఈవో మద్దూరి సూర్యనారయణమూర్తి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా డీవైఈవో మాట్లాడుతూ సైన్సుపై విద్యార్థులకు మక్కువ కలిగించడంలో జేవీవీ కృషి అభినందనీయమని అన్నారు. 26 సంవత్సరాలుగా సైన్సుపై విద్యార్థులకు అవగాహన పెంపొందించేందుకు చెకుముకి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రంగరాజు తెలిపారు. ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జెడ్పీ హైస్కూళ్లలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. వేదిక శాఖ మండల ప్రధాన కార్యదర్శి దాసరి సునీల్‌కుమార్, నిమ్మల సత్యనారాయణ పాల్గొన్నారు. -
మునెయ్య సేవలు అమోఘం
హిందూపురం టౌన్ : పెనుకొండ సబ్‌డివిజన్ డీవైఈఓగా విధులు నిర్వహించి కర్నూల్ డైట్‌కు బదిలీ అయిన మునెయ్య సే వలు అమోఘమని ప్రస్తుత డీవైఈఓ రామసుబ్బారావు అన్నారు. శని వారం స్థానిక చి న్మయ విద్యాలయంలో ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో మునెయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు. రామసుబ్బారా వు మాట్లాడుతూ పెనుకొండ సబ్‌డివిజ న్లో మునెయ్య ఏడేళ్లుగా పని చేసి విద్యాప్రమాణాలు పెంపునకు ఎనలేని కృషి చేశారన్నారు. అనంతరం మునెయ్యను ఘనంగా సన్మానించారు. ఎంఈఓ గంగప్ప, సీనియర్ ప్రధానోపాధ్యాయులు చాంద్‌బాషా, ఫణికుమార్, ప్రధానోపాధ్యాయుల సంఘం బాధ్యులు శేషగిరిరావు, గోపాల్, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
డీవైఈవోల నియామకం
చిత్తూరు(ఎడ్యుకేషన్): జిల్లాలో ఎంఈవోలుగా పనిచేస్తున్న ఐదుగురిని ఖాళీగా ఉన్న డివిజన్లలో డీవైఈవోలుగా నియమిస్తూ కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఎంఈవోలకు అర్హత పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. ఆ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారి పేర్లను డీఈవో నాగేశ్వరరావు కలెక్టర్‌కు నివేదిక రూపంలో అందజేశారు. నివేదికను పరిశీలించిన కలెక్టర్ చిత్తూరు డీవైఈవోగా సుధాకర్ (తిరుపతి అర్బన్, ఎంఈవో), మదనపల్లి డీవైఈవోగా వాసుదేవనాయుడు(అకడమిక్ డీవైఈవో), పుత్తూరు డీవైఈవోగా ప్రసాద్ (తిరుపతి రూరల్ ఎంఈవో), రాష్టీయ మాధ్యమిక సేవా అభియాన్ శాఖ(ఆర్‌ఎంస్‌ఏ) డీవైఈవోగా దయానంద (పీలేరు ఎంఈవో), జిల్లా పరిషత్ yీ వైఈవోగా ( పంకజాక్షి, పుత్తూరు ఎంఈవో) ను నియమిస్తూ ఉత్తర్వులను జారీచేశారు. నియమితులైన డీవైఈవోలందరూ తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ ఆ ఉత్తర్వుల రూపంలో ఆదేశించారు. వారు రెండు రోజుల్లో తమ భాధ్యతలను స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ద్వారా తెలిసింది.