మూడంచెల ముడుపులు
మూడంచెల ముడుపులు
Published Thu, Aug 17 2017 12:24 AM | Last Updated on Sun, Sep 17 2017 5:35 PM
విద్యాశాఖ సిబ్బంది బలవంతపు వసూళ్లు
పదోన్నతికి రూ. 50 వేలు చెల్లించుకోవాల్సిందే..
అప్పుడే డీవైఈఓ, డీఈఓ, ఆర్జేడీ కార్యాలయాల్లో దస్త్రం కదలిక
గగ్గోలు పెడుతున్న ఎయిడెడ్ ఉపాధ్యాయులు..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో మూడంచెలు, ఐదంచెల కార్యక్రమాల అమలు విధానం చూశాం.. మరి ఈ మూడంచెల ముడుపుల విధానం ఏమిటి అనుకుంటున్నారా..
ఇది విద్యాశాఖ సిబ్బంది ప్రవేశపెట్టిన విధానం. ఎయిడెడ్ ఉపాధ్యాయుల పదోన్నతుల్లో నిషేధం ఎత్తివేయడం ఆ శాఖ ఉద్యోగులకు అనుకోని వరంగా పరిణమించింది. అదెలాగో ఒకసారి చూద్దాం..
ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులను నిషేధిస్తూ 2004వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన పాఠశాల విద్యాశాఖ అధికారులు మెమో నెం. 18836ను జారీ చేశారు. దానిపై ఎయిడెడ్ ఉపాధ్యాయులు 2005వ సంవత్సరంలో కోర్టులో సవాల్ చేశారు. అప్పటి నుంచి కోర్టులో మగ్గిపోయిన ఈ ఫైల్‌కు ఈ ఏడాది కదలిక వచ్చింది. కోర్టు తీర్పు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు అనుకూలంగా వచ్చింది. దీంతో గత జూన్ 30న ఎయిడెడ్ ఉపాధ్యాయుల పదోన్నతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ జీఓ ఎంఎస్ నెంబర్ 40ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పదోన్నతులకు మార్గం సుగమమయింది. జీఓ నెం 40 ప్రకారం ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ లోపు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నెల14వ తేదీ లోపు పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు కొత్త పోస్టుల్లో చేరాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ వ్యవహారంతో తలమునకలై ఉన్న విద్యాశాఖాధికారులు ఈ విషయంలో కాస్త అశ్రద్ధ వహించారని ఎయిడెడ్ ఉపాధ్యాయులు చెబుతున్నారు.
కొనసాగుతున్న ప్రక్రియ..
ఎయిడెడ్ ఉపాధ్యాయులు, సిబ్బంది పదోన్నతుల ప్రక్రియను గత వారం రోజులుగా విద్యాశాఖాధికారులు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికీ వారి వద్ద పూర్తి సమాచారం అందుబాటులో లేదు. ఎయిడెడ్ పాఠశాలల విషయానికొస్తే జిల్లాలో 222 ప్రాథమిక, 14 ప్రాథమికోన్నత, 37 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులు వచ్చే అవకాశం లేదు. కేవలం ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లోనే సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నారు. ఈ పదోన్నతుల్లో ఎంతమందికి అవకాశం ఉంది అనే విషయంలో విద్యాశాఖాధికారుల్లో ఇప్పటికీ స్పష్టత లేకపోయినప్పటికీ సుమారు 80 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పదోన్నతులు పొందవచ్చని చెబుతున్నారు.
మూడంచెల ముడుపుల విధానం ఇలా..
సుమారు 13 సంవత్సరాల తరువాత పదోన్నతులకు అవకాశం వచ్చిందని ఎయిడెడ్ ఉపాధ్యాయులు సంతోషపడుతున్న సమయంలో వారికి విద్యా శాఖాధికారులు ఝలక్ ఇచ్చారు. పదోన్నతులు ఊరికే రావు, మీ పదోన్నతుల దస్త్రం కదలాలంటే ’మాకేంటి’ అంటున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ మేరకు ముందుగా డీవైఈఓ కార్యాలయం నుంచి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి దస్త్రం చేరాలంటే డీవైఈఓ కార్యాలయానికి రూ. 5 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. అక్కడి నుంచి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి చేరుకుని ఆర్‌జేడీ కార్యాలయానికి చేరాలంటే విద్యాశాఖలో ఎయిడెడ్ ఉపాధ్యాయుల దస్త్రాలను పరిశీలించే నలుగురు ఉద్యోగులు రూ. 20 వేలు అడుగుతున్నారని అది కేవలం తమకు మాత్రమే కాదని, జిల్లా విద్యాశాఖాధికారికి కూడా అందులో వాటా వెళుతుందని చెబుతున్నారని వాపోతున్నారు. అక్కడితో తమకు పదోన్నతులు వచ్చేసినట్టే అనుకుంటే తిరిగి ఆర్‌జేడీ కార్యాలయంలో పదోన్నతులకు ఆమోద ముద్ర పడడానికి మరో రూ. 25 వేలు సమర్పించుకోవాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బందే చెబుతున్నారంటున్నారు. అంటే పదోన్నతి కావాలంటే ఒక్కో ఉపాధ్యాయుడూ సుమారు రూ. 50 వేలు సమర్పించుకోవాన్నమాట.
బేరసారాల్లో ఉపాధ్యాయులు..
ఎంతోకొంత సమర్పించకపోతే పదోన్నతి పొందడం కష్టమని ఆలోచిస్తున్న ఉపాధ్యాయులు మామూళ్లు ఇవ్వడానికి ఆయా కార్యాలయాల సిబ్బందితో బేరసారాలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏలూరులోని కేపీడీటీ స్కూల్ ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయంలోని ఉద్యోగులకు రూ. 8 వేలు ఇవ్వగలమని చెప్పినట్లు తెలిసింది. డెల్టా ప్రాంతమైన భీమవరం, నరసాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు మాత్రం తాము ముడుపులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినట్టు, ముడుపులు ఇవ్వకపోతే ఏమి చేస్తారో మేమూ చూస్తాం అనే ధోరణిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
నా దృష్టికి తీసుకురండి..
ఆర్‌ఎస్ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి..
ఇప్పటి వరకూ ఈ విషయం నా దృష్టికి రాలేదు. పదోన్నతుల ఫైలు కదలడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వనక్కరలేదు. అలా ఎవరైనా డిమాండ్ చేస్తే నా దృష్టికి తీసుకురావాలి. ఉపాధ్యాయులు ఫిర్యాదు చేస్తే సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తున్న ఆరోపణలపై విచారణ చేపడతాం.
Advertisement
Advertisement