ఉపాధ్యాయుల వర్క్‌ అడ్జస్ట్‌మెంట్లలో అక్రమాలు! | Irregularities Taking Place In VMC Teacher's Work Adjustments | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల వర్క్‌ అడ్జస్ట్‌మెంట్లలో అక్రమాలు!

Published Sat, Jul 27 2019 10:23 AM | Last Updated on Sat, Jul 27 2019 11:30 AM

Irregularities Taking Place In VMC Teacher's Work Adjustments - Sakshi

సాక్షి, అమరావతి: ఉర్దూ పాఠశాలకు తెలుగు పండిట్‌.. 130 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఇప్పటికే నలుగురు ఉపాధ్యాయులు ఉండగా.. మరొకరికి అక్కడే పోస్టింగ్‌.. 370 మంది ఉన్న మరో స్కూల్‌లో కేవలం నలుగురు మాత్రమే పాఠాలు బోధిస్తున్నారు.. అక్కడికి ఒక్కరిని కూడా పంపలేదు. ఈ మూడు ఉదాహరణలు చాలు వీఎంసీలో వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ పేరిట అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవడానికి. అవసరాలకు అనుగుణంగా బదిలీ చేపట్టాలని మున్సిపల్‌ కమిషనరేట్‌ ఇచ్చిన జీవోను అధికారులు ఇష్టారీతిన ఉపయోగించుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ తంతుపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

పరిమితికి మించి పనిచేస్తున్న చోటు నుంచి అవసరమైన చోటుకు ఉపాధ్యాయులు బదిలీ చేయమని మున్సిపల్‌ కమిషనరేట్‌ ఇటీవల జారీ చేసిన జీవోను విజయవాడ నగరపాలక సంస్థ అధికారులకు వరంగా మారింది. ఆ జీఓను అడ్డుపెట్టుకొని తన వర్గానికి చెందిన ఉపాధ్యాయులకు నచ్చిన చోట పోస్టింగ్‌లు ఇచ్చుకున్నారు. ఎక్కువమంది విద్యార్థులు ఉన్న స్కూల్‌కి కాకుండా తక్కువ ఉన్న స్కూల్‌కి నలుగురు ఉపాధ్యాయులను బదిలీ చేయటంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. 

తెలుగు ఉపాధ్యాయుడిని ఉర్దూ హైస్కూల్‌కి..
వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ పేరిట బదిలీ చేసిన ఉపాధ్యాయుల లిస్ట్‌లో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఎంకే బేగ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో తెలుగుమీడియం బోధిస్తున్న ఓ ఉపాధ్యాయుడిని ఎస్‌ఎంఏకే ఉర్దూ మీడియం హైస్కూల్‌కు బదిలీ చేశారు. తెలుగు మీడియం ఉపాధ్యాయుడు ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఎలా బోధించగలడో అధికారులకే తెలియాలి. గ్రౌండ్‌ బాగా ఉండి నగరంలోనే ఎక్కువ విద్యార్థులున్న ఏకేటీపీ మున్సిపల్‌ పాఠశాల నుంచి గ్రౌండ్‌ సరిగాలేని మరో పాఠశాలకు ఓ పీఈటీని బదిలీ చేశారు. ఓ డ్రాయింగ్‌ టీచర్‌ బదిలీ విషయంలోను ఇదే జరిగింది. తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం పటమటలోని జీడీఈటీకి మార్చారు. 

అనారోగ్య కారణాలున్నా పట్టించుకోలేదు..
వి. సుబ్బారావు అనే ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కమిషనర్‌కి లెటర్‌ పెట్టుకున్నారు. పరిశీలించమని డీవైఈఓకు రాసినప్పటికీ పట్టించుకోలేదు. ప్రస్తుతం మూడు అంతస్తులు ఎక్కిదిగాల్సిన పరిస్థితి ఆయనది. కానీ కొంతమంది ఇంటికి దగ్గరగా ఉందన్న నెపంతో వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేసినవి ఉండటం జాబితాలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం బదిలీ అయిన ఓ మహిళా ఉపాధ్యాయురాలి పనిచేస్తున్న స్కూల్‌లో 296 మంది విద్యార్థులున్నారు. అక్కడ 8 మంది టీచర్లు ఉన్నారు. మరో 3 ఉపాధ్యాయులు అవసరం కానీ అందులోంచి ఇద్దరిని తీసి 6 మంది టీచర్లే ఉండేలా సర్దుబాటు చేశారు. అలాగే 130 మంది విద్యార్థులు ఉన్న ఓ పాఠశాలకు ఇప్పటికే నలుగురు టీచర్లు ఉండగా పై మహిళా ఉపాధ్యాయురాలిని ఒకరిని ఇక్కడికి బదిలీ చేశారు. మరోవైపు బీఎస్‌ఆర్‌కే స్కూల్‌లో 370 మందికి కేవలం నలుగురు టీచర్లే ఉండగా అక్కడికి ఒక్కరిని పంపకపోవడం గమనార్హం.

అయినవారి కోసమేనా..!
తన వర్గం ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడుకోవటానికే డీవైఈఓ, మాజీ డీవైఈఓలు బదిలీ చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 13 మంది స్కూల్‌ అసిస్టెంట్లలలో నలుగురు ఉపాధ్యాయులను డీవైఈఓ పనిచేస్తున్న స్కూల్‌ ఒక్కదానికే వేసుకోవటం దీనికి ఉదాహరణ అని వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థుల అవసరాల కోసం కాకుండా ఉపాధ్యాయులు సౌకర్యంగా ఉండేలా సర్దుబాటు చేశారని ఆరోపిస్తున్నారు. 

చాలా అవకతవకలు జరిగాయి..
ఉపాధ్యాయుల సర్దుబాట్లలో చాలా అవకతవకలు జరిగాయి. అడ్డగోలుగా ఉపాధ్యాయులను మార్చారు. అవసరమైన చోట్లను విస్మరించారు. సర్దుబాట్లు జూలై నెల చివర్లో చేయటం సరికాదు. విద్యా ప్రణాళికలు దెబ్బతింటాయి.
– నాగరామారావు, ఎస్‌టీయూ ఉపాధ్యాయ సంఘం నేత

క్షేత్రస్థాయి పరిశీలన జరగలేదు..   
సర్దుబాటులో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయలేదు. కేవలం అవసరమైన వారి కోసం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఇది వరకే ఏసీజీ, డీవైఈఓలను కలసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. అందరి అభిప్రాయాలు తీసుకుని చేసి ఉంటే బాగుండేది.
– మణిబాబు, బీటీఏ రాష్ట్ర కార్యదర్శి

అందరి అభిప్రాయాలు తీసుకున్నాం..
వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ సక్రమంగానే జరిగింది. అన్ని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాం. ఎవరికైన ఇబ్బందులు ఉంటే ఇంకా సర్దుబాట్లు ఉన్నందును అవసరమైన చోట్లకు ఈసారి పంపిస్తాం.
– నాగలింగేశ్వరరావు, డీవైఈఓ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement