Work Adjustment
-
ఎక్కువ పని చేయడానికి అనుమతించం.. మోతీలాల్‌ఓస్వాల్ కీలక నిర్ణయం
అధిక పని గంటలతో ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఉద్యోగం మానేద్దామంటే ద్రవ్యోల్బణం కారణంగా ఇతర కంపెనీల్లో కొత్త నియామకాలు చేపట్టడం లేదు. జీతాల పెరుగుదల అంతంతమాత్రమే. దానికితోడు వారానికి డెబ్బై గంటల పనిపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు కాస్ట్‌కటింగ్‌లో భాగంగా ఉద్యోగాలను తొలగిస్తూ.. ఉన్నవారితో ఎలా ఎక్కువసేపు పనిచేయించుకోవాలో ఆలోచిస్తున్నాయి. అందుకు విరుద్ధంగా మోతీలాల్‌ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ.. పని గంటలపై చర్చ కొనసాగుతున్నప్పటికీ కొత్త విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. ఉద్యోగులు తమకు కేటాయించిన సమయం 8-8.5 గంటల కంటే ఎక్కువ పని చేయడానికి అనుమతించరు. ఉద్యోగుల ఆరోగ్యం, ఉత్పాదకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ నిరేన్ శ్రీవాస్తవ తెలిపారు. పని సమయం ముగిసిన వెంటనే కంపెనీ ఈమెయిల్ సర్వర్లను ఆపేస్తామన్నారు. 45 నిమిషాల గ్రేస్ పిరియడ్ తర్వాత కంపెనీ తరఫున ఎలాంటి ఈమెయిల్‌లు పంపడం, స్వీకరించడం జరగదని చెప్పారు. ఎవరైనా షిఫ్ట్ సమయానికి మించి కార్యాలయంలో ఉంటే వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. కొత్త పాలసీని ఉద్దేశించి సంస్థ ఎండీ, సీఈఓ మోతీలాల్ ఓస్వాల్ మాట్లాడుతూ.. తమకు పని గంటల సంఖ్య ముఖ్యం కాదని ఉద్యోగుల మనశ్శాంతి, సంతృప్తి, ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రైవేట్ ఈక్విటీ, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో పనిచేస్తున్న సంస్థలోని కొందరు ఉన్నత అధికారులకు వారి సొంత పని షెడ్యూల్ కారణంగా ఈ పాలసీ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఈ విధానాన్ని సంస్థ అన్ని కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. కొత్త పాలసీ సంస్థలో పనిచేస్తున్న 11,000 మందిలో దాదాపు 9,500 మందికి వర్తిస్తుందని చెప్పారు. -
ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్లలో అక్రమాలు!
సాక్షి, అమరావతి: ఉర్దూ పాఠశాలకు తెలుగు పండిట్.. 130 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఇప్పటికే నలుగురు ఉపాధ్యాయులు ఉండగా.. మరొకరికి అక్కడే పోస్టింగ్.. 370 మంది ఉన్న మరో స్కూల్లో కేవలం నలుగురు మాత్రమే పాఠాలు బోధిస్తున్నారు.. అక్కడికి ఒక్కరిని కూడా పంపలేదు. ఈ మూడు ఉదాహరణలు చాలు వీఎంసీలో వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవడానికి. అవసరాలకు అనుగుణంగా బదిలీ చేపట్టాలని మున్సిపల్ కమిషనరేట్ ఇచ్చిన జీవోను అధికారులు ఇష్టారీతిన ఉపయోగించుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ తంతుపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పరిమితికి మించి పనిచేస్తున్న చోటు నుంచి అవసరమైన చోటుకు ఉపాధ్యాయులు బదిలీ చేయమని మున్సిపల్ కమిషనరేట్ ఇటీవల జారీ చేసిన జీవోను విజయవాడ నగరపాలక సంస్థ అధికారులకు వరంగా మారింది. ఆ జీఓను అడ్డుపెట్టుకొని తన వర్గానికి చెందిన ఉపాధ్యాయులకు నచ్చిన చోట పోస్టింగ్‌లు ఇచ్చుకున్నారు. ఎక్కువమంది విద్యార్థులు ఉన్న స్కూల్‌కి కాకుండా తక్కువ ఉన్న స్కూల్‌కి నలుగురు ఉపాధ్యాయులను బదిలీ చేయటంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తెలుగు ఉపాధ్యాయుడిని ఉర్దూ హైస్కూల్‌కి.. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట బదిలీ చేసిన ఉపాధ్యాయుల లిస్ట్‌లో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఎంకే బేగ్ ఎలిమెంటరీ స్కూల్లో తెలుగుమీడియం బోధిస్తున్న ఓ ఉపాధ్యాయుడిని ఎస్ఎంఏకే ఉర్దూ మీడియం హైస్కూల్‌కు బదిలీ చేశారు. తెలుగు మీడియం ఉపాధ్యాయుడు ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఎలా బోధించగలడో అధికారులకే తెలియాలి. గ్రౌండ్ బాగా ఉండి నగరంలోనే ఎక్కువ విద్యార్థులున్న ఏకేటీపీ మున్సిపల్ పాఠశాల నుంచి గ్రౌండ్ సరిగాలేని మరో పాఠశాలకు ఓ పీఈటీని బదిలీ చేశారు. ఓ డ్రాయింగ్ టీచర్ బదిలీ విషయంలోను ఇదే జరిగింది. తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం పటమటలోని జీడీఈటీకి మార్చారు. అనారోగ్య కారణాలున్నా పట్టించుకోలేదు.. వి. సుబ్బారావు అనే ఎస్జీటీ ఉపాధ్యాయుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కమిషనర్‌కి లెటర్ పెట్టుకున్నారు. పరిశీలించమని డీవైఈఓకు రాసినప్పటికీ పట్టించుకోలేదు. ప్రస్తుతం మూడు అంతస్తులు ఎక్కిదిగాల్సిన పరిస్థితి ఆయనది. కానీ కొంతమంది ఇంటికి దగ్గరగా ఉందన్న నెపంతో వర్క్ అడ్జస్ట్మెంట్ చేసినవి ఉండటం జాబితాలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం బదిలీ అయిన ఓ మహిళా ఉపాధ్యాయురాలి పనిచేస్తున్న స్కూల్లో 296 మంది విద్యార్థులున్నారు. అక్కడ 8 మంది టీచర్లు ఉన్నారు. మరో 3 ఉపాధ్యాయులు అవసరం కానీ అందులోంచి ఇద్దరిని తీసి 6 మంది టీచర్లే ఉండేలా సర్దుబాటు చేశారు. అలాగే 130 మంది విద్యార్థులు ఉన్న ఓ పాఠశాలకు ఇప్పటికే నలుగురు టీచర్లు ఉండగా పై మహిళా ఉపాధ్యాయురాలిని ఒకరిని ఇక్కడికి బదిలీ చేశారు. మరోవైపు బీఎస్ఆర్కే స్కూల్లో 370 మందికి కేవలం నలుగురు టీచర్లే ఉండగా అక్కడికి ఒక్కరిని పంపకపోవడం గమనార్హం. అయినవారి కోసమేనా..! తన వర్గం ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడుకోవటానికే డీవైఈఓ, మాజీ డీవైఈఓలు బదిలీ చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 13 మంది స్కూల్ అసిస్టెంట్లలలో నలుగురు ఉపాధ్యాయులను డీవైఈఓ పనిచేస్తున్న స్కూల్ ఒక్కదానికే వేసుకోవటం దీనికి ఉదాహరణ అని వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థుల అవసరాల కోసం కాకుండా ఉపాధ్యాయులు సౌకర్యంగా ఉండేలా సర్దుబాటు చేశారని ఆరోపిస్తున్నారు. చాలా అవకతవకలు జరిగాయి.. ఉపాధ్యాయుల సర్దుబాట్లలో చాలా అవకతవకలు జరిగాయి. అడ్డగోలుగా ఉపాధ్యాయులను మార్చారు. అవసరమైన చోట్లను విస్మరించారు. సర్దుబాట్లు జూలై నెల చివర్లో చేయటం సరికాదు. విద్యా ప్రణాళికలు దెబ్బతింటాయి. – నాగరామారావు, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం నేత క్షేత్రస్థాయి పరిశీలన జరగలేదు.. సర్దుబాటులో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయలేదు. కేవలం అవసరమైన వారి కోసం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఇది వరకే ఏసీజీ, డీవైఈఓలను కలసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. అందరి అభిప్రాయాలు తీసుకుని చేసి ఉంటే బాగుండేది. – మణిబాబు, బీటీఏ రాష్ట్ర కార్యదర్శి అందరి అభిప్రాయాలు తీసుకున్నాం.. వర్క్ అడ్జస్ట్మెంట్ సక్రమంగానే జరిగింది. అన్ని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాం. ఎవరికైన ఇబ్బందులు ఉంటే ఇంకా సర్దుబాట్లు ఉన్నందును అవసరమైన చోట్లకు ఈసారి పంపిస్తాం. – నాగలింగేశ్వరరావు, డీవైఈఓ -
సర్కార్ బడికి తాళం!
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యాభివృద్ధికి పాటుపడాల్సిన ఆ శాఖ అధికారులు నిరుపేద చిన్నారులను బడికి దూరం చేస్తున్నారు. ఉన్న ఒక్క టీచర్‌ను.. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో వేరే మండలానికి పంపించి పాఠశాల మూతపడేలా చేశారని రాయికోడ్ మండల పరిధిలోని అల్లాపూర్వాసులు మండిపడ్డారు. ఇలాగైతే తమ పిల్లల బతుకులు ఏం కావాలని ప్రశ్నించారు. - ‘వర్క్ అడ్జస్ట్మెంట్’తో మూతపడిన పాఠశాల - ఉన్న ఒక్క టీచర్ని వేరే చోటకు పంపిన వైనం - ఆందోళనలో అల్లాపూర్వాసులు రాయికోడ్: ఉపాధ్యాయులు లేక, విద్యార్థుల సంఖ్యతగ్గిబోసిపోతున్న సర్కారీ బడులను బలోపేతం చేయాల్సిన విద్యాశాఖ అధికారులు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఇష్టానుసారంగా టీచర్లను ఇతర మండలాలకు పంపిస్తూ పేద విద్యార్థులను చదువు నుంచి దూరం చేస్తున్నారు. మండలంలోని అల్లాపూర్ ప్రాథమిక పాఠశాలే దీనికి నిదర్శనం. దీనిలో 1 నుంచి 5వ తరగతి వరకు 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే టీచర్ ఉండటంతో.. గ్రామానికి చెందిన 40 మంది పిల్లలు ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన 25 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో స్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయురాలు సంతోషను వర్క్ అడ్జస్ట్మెంట్పై పటాన్చెరు మండలం కిష్టారెడ్డిపేటకు పంపించారు. వంట మనిషి నాగమ్మ బుధవారం మధ్యాహ్న భోజనం వడ్డించిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు పాఠశాలకు తాళం వేశారు. ఉన్న ఒక్క టీచర్‌ను కూడా ఇతర పాఠశాలకు పంపించడంపై తల్లిదండ్రులు, స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నవాళ్లు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాల్లో చదివిస్తున్నారని.. కూలీనాలి చేసుకుని బతికే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. డీఈఓ కార్యాలయం నుంచి గత నెల 28న తమకు అందిన ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయురాలిని వర్క్ అడ్జస్ట్మెంట్పై పంపించామని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. పాఠశాల మూతపడటం, వర్క్‌అడ్జస్ట్‌మెంట్ అంటే అర్థమేంటని..? జోగిపేట డిప్యూటీ ఈఓ పోమ్యానాయక్‌ను అడగగా.. టీచర్‌ను ఇతర మండలానికి పంపించినట్లు తనకు సమాచారం లేదని జవాబు దాటవేశారు. రాష్ట్ర స్థాయి నాయకులు, అధికారుల నుంచి వచ్చిన వత్తిడి మేరకే పాఠశాల మూత పడుతోందని తెలిసినా అధికారులు నోరు మెదపడం లేదని తెలిసింది. ఈ ఏడాది జూలై లోను మండల పరిధిలోని కర్చల్ పాఠశాల ఉపాధ్యాయరాలు స్వప్నను కూడా ఇదే రీతిలో లింగారెడ్డిపల్లి పాఠశాలకు పంపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు తమ పాఠశాలలో సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఉపాధ్యాయ డిప్యుటేషన్లకు రంగం సిద్ధం
- వర్క్ అడ్జస్ట్మెంట్ కింద జిల్లాలో 152 పోస్టుల గుర్తింపు - త్వరలో ఉత్తర్వులు మెదక్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద 152 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, మారిన సిలబస్, పరీక్ష విధానాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా గత విద్యాసంవత్సరానికి సంబంధించి డిసెంబర్లో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపగా ఈసారి జూలైలోనే పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 550 ఉన్నత పాఠశాలలు ఉండగా చాలా పాఠశాలల్లో సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ సబ్జెక్ట్‌లకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సబ్జెక్ట్ టీచర్లు లేరు. దీంతో నాన్ సక్సెస్ పాఠశాలలో డబుల్ పోస్టింగ్ ఉన్న చోటు నుంచి ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట విద్యా సంవత్సరం చివరి వరకు డిప్యూటేషన్ పంపుతున్నారు. ఈ సారి జూలై నెలలోనే వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ పూర్తిచేసి విద్యాబోధనకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించడంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు మెదక్ సబ్ డివిజన్లో 22 మంది టీచర్లను, సిద్దిపేట సబ్ డివిజన్లో 60 మంది టీచర్లను, జోగిపేట సబ్ డివిజన్లో 30 మంది టీచర్లను తాత్కాలికంగా బదిలీ చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అయితే ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్న పాఠశాలల నుంచి ఇతర పాఠశాలల్లోకి వెళ్లేందుకు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. కౌన్సెలింగ్‌లో ఇష్టపడి వచ్చిన పాఠశాలను కాదని, ఇతర పాఠశాలల్లో విధులు నిర్వర్తించడానికి సుముఖత చూపడం లేదు. కాని వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట ఉపాధ్యాయులను వారికి దగ్గరలో అనుకూలంగా ఉన్న పాఠశాలకే పంపుతున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జరిగిన కౌన్సెలింగ్‌లో బదిలీ అయిన ఉపాధ్యాయులకు రిలీవర్లు రాక పోవడంతో వారు కొత్త పోస్టుల్లో చేరలేదు. వారు విధుల్లో చేరి ఉంటే ఇబ్బందులు ఇంతగా ఉండేవి కావని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో బోధన కుంటు పడకుండా ఉండటానికే వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపుతున్నామని మెదక్ డిప్యూటీ ఈఓ శ్యామ్యూల్ పేర్కొన్నారు.