ఉపాధ్యాయ డిప్యుటేషన్లకు రంగం సిద్ధం
- వర్క్ అడ్జస్ట్‌మెంట్ కింద జిల్లాలో 152 పోస్టుల గుర్తింపు
- త్వరలో ఉత్తర్వులు
మెదక్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వర్క్ అడ్జస్ట్‌మెంట్ కింద 152 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, మారిన సిలబస్, పరీక్ష విధానాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా గత విద్యాసంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌లో వర్క్ అడ్జస్ట్‌మెంట్ కింద ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపగా ఈసారి జూలైలోనే పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 550 ఉన్నత పాఠశాలలు ఉండగా చాలా పాఠశాలల్లో సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ సబ్జెక్ట్‌లకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సబ్జెక్ట్ టీచర్లు లేరు. దీంతో నాన్ సక్సెస్ పాఠశాలలో డబుల్ పోస్టింగ్ ఉన్న చోటు నుంచి ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరిట విద్యా సంవత్సరం చివరి వరకు డిప్యూటేషన్ పంపుతున్నారు. ఈ సారి జూలై నెలలోనే వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియ పూర్తిచేసి విద్యాబోధనకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించడంతో అధికారులు చర్యలు ప్రారంభించారు.
ఈ మేరకు మెదక్ సబ్ డివిజన్‌లో 22 మంది టీచర్లను, సిద్దిపేట సబ్ డివిజన్‌లో 60 మంది టీచర్లను, జోగిపేట సబ్ డివిజన్‌లో 30 మంది టీచర్లను తాత్కాలికంగా బదిలీ చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అయితే ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్న పాఠశాలల నుంచి ఇతర పాఠశాలల్లోకి వెళ్లేందుకు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. కౌన్సెలింగ్‌లో ఇష్టపడి వచ్చిన పాఠశాలను కాదని, ఇతర పాఠశాలల్లో విధులు నిర్వర్తించడానికి సుముఖత చూపడం లేదు.
కాని వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరిట ఉపాధ్యాయులను వారికి దగ్గరలో అనుకూలంగా ఉన్న పాఠశాలకే పంపుతున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జరిగిన కౌన్సెలింగ్‌లో బదిలీ అయిన ఉపాధ్యాయులకు రిలీవర్లు రాక పోవడంతో వారు కొత్త పోస్టుల్లో చేరలేదు. వారు విధుల్లో చేరి ఉంటే ఇబ్బందులు ఇంతగా ఉండేవి కావని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో బోధన కుంటు పడకుండా ఉండటానికే వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరిట ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపుతున్నామని మెదక్ డిప్యూటీ ఈఓ శ్యామ్యూల్ పేర్కొన్నారు.