Teacher Posts
-
మాకు రారా కొత్త టీచర్లు?
వాజేడు: చదువుకునేందుకు విద్యార్థులున్నా.. ఉపాధ్యాయులు లేని పాఠశాల అది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని జంగాలపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల బదిలీల్లో ఇక్కడ ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు కాచారం, మరొకరు మంగపేట మండలం చుంచుపల్లికి బదిలీ అయ్యారు. ఇక్కడ ఒక ఉపాధ్యాయినిని నియమించగా.. ఆమె బీఈడీ ఓడీలో ఉన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు రోజూ బడికి వచ్చి వెళ్తున్నారు. కాగా, పే సెంటర్ ఇన్చార్జ్ హెచ్ఎం కేశవరావు ఇతర పాఠశాలల ఉపాధ్యాయుల్లో రోజుకొకరిని జంగాలపల్లి పాఠశాలకు పంపిస్తూ నెట్టుకొస్తున్నారు. కొత్త డీఎస్సీలోనూ ఈ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.66 మందికి ఇద్దరే టీచర్లా?అధికారుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం.. పర్వత్‌పల్లి పాఠశాలకు తాళంబషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పర్వత్‌పల్లి ప్రాథమిక పాఠశాలకు గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేశారు. పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 66 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులే ఉన్నారని, అందులో భరత్ అనే ఎస్జీటీ ఉపాధ్యాయుడిని బుధవారం అధికారులు రిలీవ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కొత్త ఉపాధ్యాయులను నియమిస్తుంటే తమ గ్రామానికి ఎందుకు నియమించలేదని నిలదీశారు. టీచర్లు లేని పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్‌ను పాడు చేయలేమని స్పష్టం చేశారు. కొత్తగా ఉపాధ్యాయులను నియమించే వరకు పిల్లలను బడికి పంపేదిలేదంటూ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాఠశాలలో సద్దాం హుస్సేన్, రవీందర్‌రెడ్డి అనే ఇద్దరు టీచర్లే లిఉన్నారని వీరు ఐదు తరగతులకూ పాఠాలు ఎలా బోధిస్తారో అధికారులే చెప్పాలన్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు చెప్పారు. మరోవైపు త్వరలో కొత్త టీచర్లు వస్తారని, విద్యార్థులను బడికి పంపాలని ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చూడండి: డీఎస్సీ–2024 ఉపాధ్యాయులు ఉరుకులు.. పరుగులు (ఫొటోలు) -
ఉర్దూ టీచర్.. ఈ తెలుగమ్మాయి!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పుట్టింది హిందూ తెలుగు కుటుంబంలో.. అయితేనేం.. ఉర్దూ మీడియంలో చదువుకుంది. ఉర్దూ ఉపాధ్యాయిని ఉద్యోగం సాధించింది. ఆమె కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి గ్రామానికి చెందిన పొనగంటి జయశ్రీ. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు బిచ్కుంద మండల కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకున్న జయశ్రీ.. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు బాన్సువాడలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ అక్కడి జెడ్పీహైస్కూల్లో చదువుకుంది.ఇంటర్ బాన్సువాడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకుని డిగ్రీ బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అభ్యసించింది. డిగ్రీ అయ్యాక బోధన్‌లోని ఆజాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ పూర్తి చేసింది. గతేడాది టెట్ రాసి ఎంపికైంది. 2024–డీఎస్సీ పరీక్ష రాసి స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ) ఉద్యోగం సాధించి బుధవారం నియామక పత్రం అందుకుంది. తొలి ప్రయత్నంలోనే టెట్, డీఎస్సీలో మంచి ప్రతిభ కనబరచడం విశేషం. మాస్టారైన గొర్రెల కాపరి.. భిక్కనూరు: కష్టాలు ఎదురైతే..ఆగిపోకుండా సాగితే విజయాలు సాధ్యమని నిరూపించాడీ యువకుడు.. చదువు మానేసి గొర్రెలు కాయడానికి వెళ్లాడు.. చదువుపై ఇష్టం, స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ చదువుకొని ప్రస్తుతం డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ఆ విజేత భిక్కనూరుకు చెందిన కోరే కుమార్. గ్రామానికి చెందిన కోరే కమల–బీరయ్య దంపతులకు ఒక కొడుకు కుమార్, కుమార్తె ఉన్నారు.పేద కుటుంబం కావడంతో నాలుగో తరగతిలోనే తల్లిదండ్రులు కుమార్ చదువు మాన్పించారు. దీంతో ఆయన గొర్రెలు కాయడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో చదువుపై మక్కువతో 2014లో ఓపెన్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన కుమార్ పాసయ్యాడు. భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో సీఈసీ, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. నిజా మాబాద్‌లోని సారంగపూర్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశాడు. డీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి సోషల్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.చదవండి: మీరే మా వారధులు: డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ సభలో సీఎం రేవంత్ పట్టుపట్టి.. కొలువు కొట్టి రేగోడ్(మెదక్): ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ఓ గిరిజన బిడ్డ. మండలంలోని కాకంచ తండాకు చెందిన రవికుమార్ స్కూల్ అసిస్టెంట్‌గా జిల్లా మొదటి ర్యాంకు సాధించి బుధవారం నియామకపత్రం అందుకున్నాడు. ఈసందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. తన పన్నెండేళ్ల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని ఎన్నో కలలు కన్నానని చెప్పాడు. తన ఇంట్లో పలువురు ఉన్నత ఉద్యోగాల్లో ఉండగా.. మరికొందరు ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిపారు. నాన్నకు ప్రేమతో.. రేగోడ్(మెదక్): నాన్న ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడుగా కావాలన్న కల నెరవేరిందని స్కూల్ అసిస్టెంట్‌గా నియామకపత్రం అందుకున్న జిల్లా మొదటి ర్యాంకు ఉపాధ్యాయుడు రేగోడ్ గ్రామానికి చెందిన మహేశ్ తెలిపారు. 2018లో ఉద్యోగం రాలేదని, పట్టు వదలకుండా చదివి ప్రస్తుతం సాధించానని ఆనందం వ్యక్తం చేశాడు. -
TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET) 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు హాల్‌టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీనే హాల్ టికెట్లు విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ ప్రకటించినప్పటికీ ఒక రోజు ఆలస్యమైంది. అభ్యర్థులు తమ జర్నల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.కాగా టెట్ కోసం 2,83,441 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మే 20 నుంచి జూన్ 6 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు జూన్ 12న విడుదలయ్యే అవకాశం ఉంది.హాల్ టికె ట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టెట్ ఫీజుపై టెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) ఫీజును అమాంతం రెండింతలకుపైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫీజును తగ్గించాల్సిందేనని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో విపక్షాలూ తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాల్లోనే తర్జన భర్జన జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా టెట్ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2017 వరకూ టెట్‌కు ఒక్కో పేపర్‌కు రూ.200 ఉండేది. ఆ తర్వాత ఇది రూ.300 అయింది. 2023లో కూడా టెట్ ఫీజును రెండు పేపర్లకు కలిపి రూ. 400 చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక పేపర్‌కు రూ. వెయ్యి, రెండు పేపర్లయితే రూ. 2 వేలు ఫీజు నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫీజు తగ్గించలేమా? ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు టెట్ ఫీజు పెంపుపై వస్తున్న విమర్శలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా సంప్రదించినట్టు తెలిసింది. ఫీజు పెంపు అంశం తమ ముందు అసలు చర్చకే రాలేదని, అధికారుల స్థాయిలోనే ఇది జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ నిరుద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకుని ఉండాలని సీఎంవో భావిస్తున్నట్టు తెలిసింది. సమస్య మరింత జఠిలం కాకముందే ఫీజు తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని సీఎంవో భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరిందని సమాచారం. అయితే ఫీజు పెంపు సమంజసమేనని అధికారులు సమర్థించుకుంటున్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు నిర్ణయించిన ఫీజు విషయంలోనూ తొలుత కొంత వ్యతిరేకత వచి్చనా, తర్వాత సద్దుమణిగిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఆన్లైన్లో టెట్ నిర్వహించడం వల్ల వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల నిర్వహణకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలని అంటున్నారు. ఈ కారణంగానే టెట్ ఫీజు పెంచాల్సి వచ్చిందనేది అధికారుల వాదన. కాగా, దీనిపై పునరాలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది అన్యాయం లక్షల మంది పేద విద్యార్థులు అప్పులు చేసి, టెట్ కోచింగ్ తీసుకున్నారు. టీచర్ కొలువులు వస్తాయని గంపెడాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టెట్ ఫీజులను రూ. 400 నుంచి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం. ఆన్లైన్ ఫీజు పేరుతో పేదలపై భారం మోపడాన్ని ఎంతమాత్రం ఊరుకోం. ఫీజు తగ్గించకపోతే ఆందోళన చేపడతాం. –ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు) ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు? పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది. అందుకు విరుద్ధంగా టెట్ ఫీజును రెండింతల నుంచి నాలుగింతలకుపైగా పెంచింది. ఇది పేద విద్యార్థులకు మోయలేని భారం. నిరుద్యోగుల పట్ల కనీస కనికరం కూడా చూపకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణం. ప్రభుత్వం చెప్పిందేంటో? చేస్తున్నదేంటో? ప్రజలు అర్థం చేసుకోవాలి. –రావుల మనోహర్‌రెడ్డి (బీఈడీ, డీఎడ్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు) -
డీఎడ్ అర్హులకే ఎస్జీటీ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: మెగా డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అర్హులే దరఖాస్తు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పేపర్–2 ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించడం లేదని వెల్లడించింది. బీఈడీ నేపథ్యంతో ఉన్న వాళ్లంతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ విధి విధానాలను రూపొందించింది. ఇందుకు సంబంధించిన సమాచార బులెటిన్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇప్పటికే డీఎస్సీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 2వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి, ఈసారి రిజర్వేషన్ అభ్యర్థులకు కొత్తగా ఇంటర్ మార్కుల అర్హతలో 5 మార్కులు సడలింపు ఇచ్చారు. టెట్ ఉత్తీర్ణులై, బీఈడీ, డీఎడ్ ఆఖరి సంవత్సరంలో ఉన్న వారు కూడా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్ష మొత్తం ఆన్లైన్ విధానంలో ఉంటుందని, 11 పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. కొత్తగా దరఖాస్తు చేసే వాళ్లు రూ.వెయ్యి పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సినవసరం లేదు. పరీక్షాకేంద్రాలు ఇవీ.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి. అయితే ఈ పట్టణాల్లో ఎన్ని పరీక్షాకేంద్రాలు ఉండాలనేది వచ్చే దర ఖాస్తుల ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు. మహిళలకు మూడోవంతు పోస్టులు ఉంటాయి. వయో పరిమితి మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసేవారు 18–46 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. 2005 జూలై 7కు ముందు పుట్టి ఉండాలి. 1977 జూలై 2 నుంచి పుట్టిన వారిని గరిష్ట వయో పరిమితిగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాలు, రోస్టర్ విధానాన్ని తర్వాత వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. నియామక విధానం రాత పరీక్షకు 80 మార్కులుంటాయి. టెట్ వెయిటేజ్ 20 శాతం ఉంటుంది. టీఎస్, ఏపీ టెట్, కేంద్ర టెట్లను పరిగణనలోనికి తీసు కుంటారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దర ఖాస్తు చేసే వారు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45%) డిగ్రీ ఉండాలి. బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి సంవత్సరం బీఈడీ అభ్యర్థులు నియామకం జరిగే నాటికి సర్టిఫికెట్ పొంది ఉండాలి. టెట్ పేపర్ 2 ఉత్తీర్ణులై ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు, సబ్జెక్టు టీచర్లు ఆయా సబ్జెక్టులతో బీఈడీ చేసి ఉండాలి. ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50% మార్కులతో ఇంటర్మిడియెట్ (రిజర్వేషన్ అభ్యర్థులకు 40%) పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల కాలపరిమితి గల డీఎడ్, నాలుగేళ్ల స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. పేపర్–1 టెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు సంబంధిత సబ్జెక్టుల్లో డీఎడ్ చేయాలి. -
Gurukul Jobs: పూర్తిస్థాయి పీజీటీ, ఆర్ట్ టీచర్ నోటిఫికేషన్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రకటనలను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఈ నెల 5న టీఆర్‌ఈఐఆర్‌బీ 9,231 ఉద్యోగాల భర్తీకి ఒకేసారి 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లను దరఖాస్తు సమయంలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఈ నెల 17న జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్, లైబ్రేరియన్ కొలువులకు సంబంధించిన రెండు ప్రకటనలను విడుదల చేయగా... తాజాగా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ టీచర్ (పీజీటీ), ఆర్ట్ టీచర్ కొలువులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటి ఫికేషన్లు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రక టనలన్నీ గురుకుల నియామకాల బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మరో 5 ప్రకటనలకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్లు ఈ నెల 24న వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు గురుకుల బోర్డు అధికారులు చెబుతున్నారు. 1,276 పీజీటీ పోస్టులు... గురుకుల పాఠశాలల్లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు 1,276 ఉన్నాయి. ఇందులో అత్యధికం మహిళలకే రిజర్వ్ కావడం గమనార్హం. బాలికల విద్యాసంస్థల్లో ఉద్యోగాలు వంద శాతం మహిళలకే కేటాయించడంతోపాటు బాలుర విద్యాసంస్థల్లో 33 శాతం పోస్టులను మహిళలకు కేటాయించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఈ మేరకు పోస్టుల కేటాయింపులు జరిగాయి. ఈ క్రమంలో 966 పీజీటీ పోస్టులు మహిళలకు రిజర్వ్ కాగా... జనరల్ కేటగిరీలో 310 పోస్టులు వచ్చాయి. పీజీటీలోని మొత్తం పోస్టుల్లో మహిళలకు 75.70 శాతం ఉద్యోగాలు, జనరల్ కేటగిరీలో 24.30 శాతం రిజర్వ్ అయ్యాయి. ఆర్ట్ టీచర్ పోస్టులు 132 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలో ఆర్ట్ టీచర్ కేటగిరీలో 132 పోస్టుల భర్తీకి గురుకుల నియామకాల బోర్డు ప్రకటన జారీ చేసింది. ఇందులో మహిళలకు 112 పోస్టులు రిజర్వ్ కాగా... జనరల్ కేటగిరీలో 20 పోస్టులు ఉన్నాయి. మోత్తం పోస్టుల్లో మహిళలకు 84.85 శాతం కేటాయింపు కాగా జనరల్ కేటగిరీలో 15.15 శాతం పోస్టులు లభించాయి. -
1998లో డీఎస్సీ రాశారు.. ఎన్నో ట్విస్ట్ ల తర్వాత .. కథ శుభం
గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్పీ– 1998 అభ్యర్థుల కల ఫలిచింది. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అధికారం వచ్చిన వెంటనే క్వాలిఫైడ్ అభ్యర్థుల జీవితాల్లో వెలుగు నింపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా పరీక్షలు రాసి, అర్హత సాధించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో, మంచి మనసున్న ఏ ముఖ్యమంత్రి తమ గోడు ఆలకించకపోతారా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ కల్పిస్తున్నట్లు గతంలో ప్రకటించిన ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా జిల్లాల వారీగా క్వాలిఫైడ్ అభ్యర్థుల వివరాలు సేకరించింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇచ్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఈనెలలోనే దానిని పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఈనెల 13లోపు పోస్టింగ్స్ కల్పించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ విడుదల చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా విద్యాశాఖాధికారులు చర్యలు ప్రారంభించారు. కాగా ఉద్యోగ నియామక పరీక్షలు రాసిన 25 ఏళ్ల తరువాత ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంపై అభ్యర్థులు ఆనందోత్సాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా విద్యాశాఖాధికారులు గతేడాది అక్టోబర్‌లో గుంటూరు నగరంలో క్వాలిఫైడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు. డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 229 మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ తెలిపారు. ఈనెల 12వ తేదీలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన దృష్ట్యా, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మినిమం టైం స్కేల్‌పై ఉపాధ్యాయులుగా నియమితులైన అభ్యర్థులను అవసరమైన పాఠశాలల్లో నియమిస్తామని చెప్పారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితాను htts://doefnt.bofrpot.com సైట్లో ఉంచినట్లు చెప్పారు. అభ్యర్థులు ఈనెల 12న ఉదయం 10 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, ఐదు పాస్‌పోర్ట్ ఫోటోలు, డీఎస్సీ–1998 హాల్ టిక్కెట్‌ను తీసుకుని గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న డీఈవో కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. -
Telangana: బీఈడీకే దిక్కులేదు.. డీఎడ్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్ల క్రితం వరకూ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) సీటు కోసం విపరీతమైన పోటీ ఉండేది. కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్లి మరీ డీఎడ్ తత్సమానమైన కోర్సులు చేసేవాళ్లు. డీఎడ్ చేస్తే ఉపాధ్యాయ పోస్టు (ఎస్జీటీ) గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎక్కువ సీట్లు ఉంటున్నాయి.. చేరే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో డీఎడ్ కాలేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. నాలుగేళ్లలో 112 కాలేజీలు మూతపడ్డాయంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. ఇదే ట్రెండ్ కొనసాగితే డీఎడ్ కోర్సు ఉండే అవకాశమే లేదని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. డీఎడ్ నాణ్యత పెంచడంతోపాటు, కోర్సు చేస్తే ఉపాధి వస్తుందనే భరోసా ఉండాలంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ సంఖ్య పెంచడంతోపాటు, ప్రైవేటు స్కూళ్లలోనూ ఈ అర్హత ఆధారంగా ఉద్యోగాలు దక్కినప్పుడే ఈ కోర్సు ఆశాజనకంగా ఉంటుందని చెబుతున్నారు. మూతపడుతున్న కాలేజీలు ప్రభుత్వ లెక్కల ప్రకారం 2016–17లో రాష్ట్రంలో 212 డీఎడ్ కాలేజీలున్నాయి. ఇందులో పది ప్రభుత్వ అధీనంలోనివి. మిగతావి ప్రైవేటులో కొనసాగుతున్నాయి. ఇప్పుడు డీఎడ్ కాలేజీలు వందకు పడిపోయాయి. మరిన్ని మూసివేతకు సిద్ధమవుతున్నాయి. కోర్సుల్లో చేరే వాళ్లూ తగ్గుతు న్నారు. 2017–18లో 11,500 సీట్లుంటే, 7,650 మందే చేరారు. 2020–21 నాటికి ఈ సంఖ్య ఇంకా పడిపోయింది. 6,250 సీట్లున్నా 2,828 మందే చేరారు. కొన్ని కాలే జీల్లో 20 మంది కూడా చేరలేదు. కారణాలేంటి? యాజమాన్య కోటా కింద ప్రతీ కాలేజీకి పది సీట్లుంటాయి. కన్వీనర్ కోటా కిందే భర్తీ కానప్పుడు యాజమాన్య కోటా కింద చేరే ప్రసక్తే ఉండదు. కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం ఏటా రూ.11 వేల ఫీజు రీయింబర్స్మెంట్ కింద, రూ. 1,500 ఇతర ఖర్చుల కింద కాలేజీలకు ఇస్తుంది. ఇవి సమయానికి అందడం లేదని, దీంతో కాలేజీల నిర్వహణ కష్టమవుతోందని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. అధ్యాపకులకు వేతనాలు చెల్లించడమే కష్టంగా ఉందని అంటున్నాయి. దీనికితోడు బీఎడ్ చేసిన వారికే ఉపాధి కష్టంగా ఉందని, డీఎడ్ చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. పైగా కరోనా తర్వాత ప్రైవేటు స్కూళ్లు ఉపాధ్యాయులకు వేతనాలు అరకొరగా చెల్లిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ టీచర్ల నియామకం జరగలేదు. ఈ కోర్సు పట్ల విద్యార్థుల్లో ఆసక్తి సన్నగిల్లుతోందని నిపుణులు అంటున్నారు. -
'దేశంలో మగ టీచర్లే అధికం'
ముంబై: మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశంలోని ఉపాధ్యాయులపై చేపట్టిన లింగ నిష్పత్తి సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లోని బోధన సిబ్బందిలో ఆడవారి కంటే ఎక్కువ మంది మగ ఉపాధ్యాయులు ఉన్నారని వెల్లడించింది. అంతేకాక ఉపాధ్యాయుల లింగనిష్పత్తి అత్యల్పంగా బీహార్‌లో నమోదైనట్లు పేర్కొంది. కానీ ఒక్క నర్సింగ్ కోర్సులోని ఉపాధ్యాయుల్లో మాత్రం భిన్నంగా.. మగవారి కంటే ఎక్కువగా ఆడవారు ఉన్నారు. యూనివర్సిటీలు, కాలేజీల్లోని బోధనేతర సిబ్బందిలోనూ మహిళల కంటే ఎక్కువగా మగవారే ఉన్నట్లు ఈ సర్వేలో నిరూపితమయింది. దేశంలో బోధన సిబ్బంది సంఖ్య మొత్తం 14 లక్షలకు పైగా ఉపాధ్యాయులు ఉండగా.. అందులో మగవారు 57.8 శాతం, మహిళలు 42.2 శాతం ఉన్నారు. బీహార్ మాత్రం అతి తక్కువ మహిళ టీచర్లను కలిగి.. అత్యల్ప లింగ నిష్పత్తితో ప్రథమ స్థానంలో ఉంది. అక్కడి ఉపాధ్యాయుల్లో 78.97 శాతం మగవారు ఉండగా, 21.03 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇదేకోవలో జార్ఖండ్ రెండవ స్థానాన్ని, ఉత్తరప్రదేశ్ మూడవ స్థానాన్ని ఆక్రమించాయి. అయితే వీటికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాల్లో (కేరళ, పంజాబ్, హర్యానా, చంఢీగర్, మేఘాలయ, నాగాలాండ్, ఢిల్లీ, గోవా) మగ ఉపాధ్యాయుల కంటే ఎక్కువగా మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని సర్వే నివేదిక వెల్లడించింది. అఖిల భారత స్థాయి బోధన సిబ్బందిలో.. ప్రతి 100 మంది మగ ఉపాధ్యాయులకు.. విశ్వవిద్యాలయ స్థాయిలో 58 మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా కళాశాల, స్టాండ్-అలోన్ సంస్థల వారిగా చూసినట్లయితే వరుసగా.. 76, 71 శాతం మంది మహిళలు ఉన్నారు. ముస్లిం మైనారిటీకి చెందిన వారిలో 57 శాతం మంది మహిళలు ఉండగా, ఇతర మైనారిటీల్లో ప్రతి 100 మంది మగవారికి 151 మంది మహిళలు ఉన్నారు. ఇక వికలాంగ(పీడబ్ల్యూడీ) వర్గానికి చెందిన బోధన సిబ్బందిలో.. మగవారికంటే తక్కువగా 37 మంది మహిళలు ఉన్నారు. అయితే మగవారి కంటే అత్యధిక మహిళా ఉపాధ్యాయులు కలిగిన ఏకైక కోర్సు నర్సింగ్. మగ ఉపాధ్యాయులను తోసిరాజని మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు. నర్సింగ్ కోర్సులలో 100 మంది మగ ఉపాధ్యాయులకు అత్యధికంగా 330 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని సర్వే తెలిపింది. -
టీఆర్టీ అభ్యర్థులకు తీపికబురు
సాక్షి, ఆదిలాబాద్ : ఎట్టకేలకు టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో టీఆర్టీ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంతో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. ప్రభుత్వం ఇది వరకే ఫలితాలు విడుదల చేసినా నియామకాలు చేపట్టకపోవడంతో గత కొన్ని రోజులుగా ఎంపికైన అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం విద్యావలంటీర్ల నియామకాలు చేపట్టినా టీఆర్టీ నియామకాలు చేపట్టకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. తాజా నిర్ణయం వారికి తీపి కబురును అందించినట్టయింది. అయితే ఇప్పటికే అభ్యర్థుల ఫలితాలను ప్రకటించారు. సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది. అయితే కేవలం విద్యాశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా ప్రాంతాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వడమే మిగిలి ఉంది. త్వరలోనే పాఠశాలలకు కొత్త పంతుళ్లు రానున్నారు. ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,582 పోస్టులు ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ 2017 అక్టోబర్ 21న విడుదల చేశారు. 2018 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఫలితాలు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. గతేడాది చివరి మాసంలో ఫలితాలు విడుదలయ్యాయి. అయితే నియామకాలు మాత్రం జరపలేదు. కొంతమంది కోర్టుకు వెళ్లడంతో నియామకాలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఈ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.10 విడుదల చేసింది. కాగా ఈ నియామకాలు ఉమ్మడి జిల్లా పరిధిలో చేపట్టనున్నారు. మొత్తం 1,582 పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిలో లాంగ్వేజ్ పండితులు 122, ఎస్జీటీ పోస్టులు 1314, పీఈటీ పోస్టులు 25, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 118, మూడు ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. తీరనున్న ఇబ్బందులు.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 2012లో డీఎస్సీ నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే నియామకాలు చేపట్టడంలో జాప్యం జరిగిన విషయం తెలిసిందే. పరీక్షలు రాసి ఎంపికైన అభ్యర్థులు నియామకాల కోసం గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడంతో మానసికంగా ఆందోళన చెందుతున్నారు. టీఆర్టీ నిర్వహించిన తర్వాత గతేడాది, ఈ ఏడాది కూడా విద్యావలంటీర్లతోనే చదువులను కొనసాగిస్తోంది. అయితే ఎంపికైన అభ్యర్థులు నియామకాలు చేపట్టకపోవడంతో ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం ప్రభుత్వం నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియామకాలు జరగనున్నాయి. ఇదివరకు జరిగిన డీఎస్సీల్లో విద్యా శాఖాధికారులే సర్టిఫికెట్ల పరిశీలన, రోస్టర్, మెరిట్ జాబితాను ప్రకటించేది. కాని ఈసారి ప్రభుత్వమే ప్రక్రియను పూర్తి చేసింది. కేవలం విద్యాశాఖాధికారులు ఆయా ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, ఉమ్మడి జిల్లా డీఈఓ కార్యదర్శిగా, సభ్యులుగా జెడ్పీ సీఈఓ, ఉమ్మడి జిల్లా పరిధిలోని డీఈఓలు ఉంటారు. నియామకాలు పారదర్శకంగా చేపడతాం టీఆర్టీ నియామకాలను పారదర్శకంగా చేపడతాం. దీనికి సంబంధించిన షెడ్యూల్ రాగానే మొదట కేటగిరి–4, తర్వాత 3,2,1 వారీగా పోస్టులు భర్తీ చేస్తాం. బాలికల పాఠశాలలకు మహిళా ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇస్తాం. మొదట ఒక్కరుకూడా ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో పోస్టులు భర్తీ చేస్తాం. ఆ తర్వాత ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు చేపడతాం. ఈ నియామకాలకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. – ఎ.రవీందర్‌రెడ్డి, డీఈఓ -
11 గురుకులాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నూతన గురుకులాలు ప్రారంభం కానున్నాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పూర్తిస్థాయిలో ఉన్న 11 నియోజకవర్గాల్లో 11 గురుకులాలను జూన్ 1వ తేదీన ప్రారంభించనున్నారు. అయితే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కడ్తాల(రంగారెడ్డి జిల్లా)లో ఏర్పాటు చేయనున్నారు. కొడంగల్, షాద్‌నగర్ రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. కొత్తవాటి ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలో గురుకులాల సంఖ్య 26కి పెరగనుంది. ఒక్కో గురుకులంలో 240 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే అవకాశం. తెలంగాణరాష్ట్ర ఏర్పాటు కాకముందు నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, చిట్యాల్‌లో మాత్రమే గురుకులాలు ఉండేవి. అయితే 2017–18 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం 12 గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇక ఈ విద్యాసంవత్సరంలో కూడా 11 గురుకులాలను ఏర్పాటు చేయడంతో మొత్తం సంఖ్య 26కు చేరనుంది. ఇది వరకు ఆయా నియోజకవర్గాల్లో బాలుర గురుకులం ఉంటే కొత్తగా బాలికలకు సంబంధించి, బాలికల గురుకులం ఉంటే బాలురులకు సంబంధించి ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి జిల్లాలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో అందే అవకాశం. విద్యార్థులకు నాణ్యమైన విద్య.. విద్యాపరంగా వెనుకబడిన పాలమూరు జిల్లాలో నూతన గురుకులాల ఏర్పాటు పేద విద్యార్థులకు వరంగా మారనుంది. ఏటేటా గురుకులాల్లో ఫలితాలు చాలా మెరుగుపడడంతో వాటిలోనే విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. విద్యతో పాటు నాణ్యమైన భోజనం, పుస్తకాలు, దుస్తులు వంటి అనేకం ఉచితంగా లభించడంతో కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వం అందించే అవకాశాలు మొండుగా ఉన్నాయి. సీట్ల భర్తీ ఇలా.. బీసీ గురుకులాల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కోసం ప్రభుత్వం బీసీ గురుకులాలకు ప్రవేశాలకు సంబంధించి గతనెల ప్రవేశ పరీక్ష నిర్వహించింది. వీటితో పాటు అన్ని గురుకులాలకు కామన్ ప్రవేశ పరీక్ష కూడా నిర్వహించారు. వీటిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సీట్లును కేటాయిస్తారు. బీసీ గురుకుల్లాలో మొదటి ప్రాధానత్య కింద 70శాతం సీట్లను బీసీ వర్గాలకు చెందిన వారికి కేటాయిస్తారు. మిగిలిన వాటిని వివిధ వర్గాల వారి రిజర్వేషన్ల ఆధారంగా కేటాయిస్తారు. ప్రస్తుతం ప్రారంభమయ్యే గురుకులాల్లో మొదటగా 5, 6, 7 తరగతులకు సంబంధించి అడ్మిషన్లు తీసుకోనున్నారు. వీటిలో ఒక్కో తరగతికి రెండు సెక్షన్ల చొప్పున విభజిస్తారు. ఒక్కో సెక్షన్లో 40 మంది విద్యార్థులను చేరిస్తారు. ఇలా రెండో సెక్షన్లలు కలిపి 80 మంది విద్యార్థులు, మూడు తరగతులు కలిపి మొత్తం ఒక్క గురుకులాల్లో 240 మందిని చేర్పిస్తారు. వీటితో పాటు నూతన గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది కూడా పెద్ద ఎత్తున భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గతంలో గురుకులా టీఆర్టీ ద్వారా భర్తీ చేసిన అధ్యాపకులతో పాటు, గతంలో వివిధ గురుకులాల్లో పనిచేసిన గెస్టు, ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా జిల్లా లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. -
సమస్యల్లో ఆదర్శం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ఆదర్శ(మోడల్) పాఠశాలలు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఓ వైపు ఉపాధ్యాయుల కొరత వెక్కిరిస్తుంటే, మరోవైపు ఉన్న సిబ్బంది మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతోంది. ప్రతిభ ఉండి ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమవుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2012–13లో ‘మోడల్’ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. వసతితో పాటు ఇంగ్లిష్ మీడియంలో చదువుకునే అవకాశం రావడంతో గ్రామీణ విద్యార్థులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీటి ఏర్పాటు వెనుక ప్రభుత్వ ఆశయం బాగుంది కానీ, అమలులో మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అనే చందంగా తయారైంది. చాలా స్కూళ్లలో అధికార పార్టీ నాయకుల రాజకీయ జోక్యం అధికమవుతోంది. దీంతో పర్యవేక్షించాల్సిన అధికారులు కఠినత్వం ప్రదర్శించలేకపోతున్నారు. ఫలితంగా ఉద్యోగులు ఆడిందే ఆడ పాడిందే పాట చందంగా వ్యవహరిస్తున్నారు. ఉన్న వారిలో ఆధిపత్యపోరు ఉన్న ఉపాధ్యాయులైనా విద్యార్థుల బోధనపై దృష్టి సారిస్తున్నారంటే అదీలేదు. చాలా స్కూళ్లలో ఆధిపత్యపోరుతో విద్యార్ధుల చదువును గాలికొదిలేశారు. కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, విడపనకల్లు, యాడికి, పుట్లూరు తదితర స్కూళ్లలో రాజకీయాలు మరీ ఎక్కువయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎంతసేపు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేసుకోవడం తప్ప చదువు గురించి పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, టీజీటీలు ‘ఎవరికివారు యమునా తీరే’ చందంగా వ్యవహరిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకుల అండతో అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ కింద నియామకమైన వార్డెన్లు కూడా రాజకీయాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రాత్రి పూట ఉండి విద్యార్థులతో చదివించాల్సి ఉంది. చాలాచోట్ల వార్డెన్లు రాత్రిపూట ఉండడం లేదు. ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీలు కూడా స్కూల్‌కు 8 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాల్సి ఉన్నా.. చాలామంది జిల్లా కేంద్రం, ఇతర పట్టణాల నుంచి రోజూ వెళ్లి వస్తున్నారు. తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య మోడల్ స్కూళ్లలో హాస్టల్ వసతి ఉంటుందని ప్రారంభంలో ప్రకటించడంతో విద్యార్థులు పోటీ పడి దరఖాస్తు చేసుకున్నారు. విపరీతమైన డిమాండ్ నెలకొనడంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సిఫార్సు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తర్వాత విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం 9 నుంచి ఇంటర్ వరకు విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తున్నారు. వసతి లేమి, ఉపాధ్యాయుల కొరత, ఉన్న ఉపాధ్యాయుల్లో సమన్వయం లేకపోవడంతో చదువుకునేందుకు విద్యార్థులు, చేర్పించేందుకు తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. ఒక్కో పాఠశాలలో 6 నుంచి ఇంటర్ దాకా 560 మంది చొప్పున 25 స్కూళ్లలో 14వేల మంది ఉండాల్సి ఉండగా.. కేవలం 10468 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 3,532 సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. మా దృష్టికి వచ్చాయి కొన్ని స్కూళ్లలో సిబ్బంది మధ్య చిన్నచిన్న మనస్పర్థలున్నట్లు మా దృష్టికీ వచ్చింది. ఈ ప్రభావం విద్యార్థులపై పడకూడదని హెచ్చరించాం. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల్లో గెస్ట్ ఫ్యాకల్టీని నియమించాం. డీఎస్పీ పోస్టులు భర్తీకాగానే రెగ్యులర్ టీచర్లు వస్తారు. విద్యార్థులకు బోధన విషయంలో రాజీపడం. రాజకీయాలు చేస్తూ విద్యార్థుల చదువును నిర్లక్ష్యం చేసే సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. – పుష్పరాజు, మోడల్ స్కూళ్ల ఏడీ -
టీచర్ పోస్టుల భర్తీ; తెలుగు రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఫిబ్రవరి చివరికల్లా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం జరుగుతోందంటూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణలో నియామక ప్రక్రియ పూర్తయిందని, ఇందుకు సంబంధించిన పత్రాలను అందజేయాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా కొన్ని పోస్టులకు మాత్రం ఇంకా ఫలితాలు వెల్లడించలేదని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయని, ఫిబ్రవరి చివరినాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల చివరినాటికి మొత్తం పోస్టులు భర్తీ చేయాలన్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. కాగా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సుప్రీం ఆదేశాలు అమలు చేయడం లేదంటూ జేకే రాజు, వెంకటేశ్ అనే వ్యక్తులు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
నిబంధనలు పాతవే.. బోర్డు కొత్తది!
సాక్షి, హైదరాబాద్ : గురుకులాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు ఆలస్యమవుతున్నాయని భావించిన ప్రభుత్వం.. ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రశ్న పత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ, ఫలితాలు, నియామకాలకు సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు చర్చించి ఓ నిర్ణయానికొచ్చారు. మరోవైపు అభ్యర్థుల అర్హతలు, మార్కులు తదితర అంశాలను మాత్రం పాత పద్ధతికే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. గతేడాది నిర్వహించిన పరీక్షల్లో 50 శాతం మార్కులున్న అభ్యర్థులకు అవకాశం కల్పించారు. అదేవిధంగా వయోపరిమితిలోనూ గతేడాది తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేస్తే సరిపోతుందని మెజార్టీ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో నియామకాలకు సంబంధించి బోర్డు మాత్రమే కొత్తదని, మిగతా ప్రక్రియ పాత పద్ధతిలోనే జరుగుతుందని, దీనిపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని ఓ అధికారి ‘సాక్షి’తో అన్నారు. అన్ని గురుకులాల్లో దాదాపు 6 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ మేరకు ఖాళీలను పేర్కొంటూ ఆయా శాఖలు ప్రభుత్వానికి నివేదికలు సైతం సమర్పించాయి. తాజాగా ప్రత్యేక బోర్డు ఏర్పాటు కావడంతో భర్తీ బాధ్యతలు దాని ద్వారా చేపట్టనున్నారు. -
వర్సిటీ అధ్యాపకుల భర్తీపై న్యాయసలహా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ వ్యవహారంలో రోస్టర్ విధానంపై న్యాయ సలహా ఇవ్వాలని ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్‌ను కోరింది. ఈమేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య లేఖ రాసినట్లు తెలిపింది. పోస్టుల భర్తీలో యూనివర్సిటీల వారీగా రోస్టర్ అమలు చేయాలా? లేక విభాగాల (సబ్జెక్టు) వారీగా రోస్టర్‌ను అమలు చేయాలా? అన్న విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చిన సమాధానంపై ఈ లేఖ రాశారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని గతంలోనే యూజీసీకి లేఖ రాయగా, అది సెంట్రల్ యూనివర్సిటీలకు వర్తిస్తుందని ఒక చోట, అన్ని యూనివర్సిటీలకు వర్తిస్తుందనే అర్థం వచ్చేలా మరొక చోట పేర్కొనడంతో గందరగోళం నెలకొంది. దీంతో ఆ లేఖను ఎలా అన్వయించు కోవాలన్న విషయంలో సలహా ఇవ్వాలని ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్‌ను కోరింది. -
టీచర్ల బదిలీల షెడ్యూల్ ప్రకటించాలి
హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్ దోమలగూడలోని యూటీఎఫ్ కార్యాల యంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రాములు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో రెండేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారన్నారు. సర్వీస్ రూల్స్ సమస్య కోర్టు వివాదంలో ఉన్నందున ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా బదిలీలు, పదోన్నతుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ఉప విద్యాధికారి, మండల విద్యాధికారి వంటి పర్యవేక్షణాధికారి పోస్టులు అధిక సంఖ్యలో ఖాళీగా ఉండటంతో విద్యా రంగం కుంటుపడుతోందని పేర్కొన్నారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లతో పదోన్నతుల ద్వారా జూనియర్, డైట్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యా మిషన్‌ను ప్రక టించాలని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తరగతికొక ఉపాధ్యాయుడు, తరగతి గది ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు సంయుక్త, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, ఉపాధ్యక్షులు సోమశేఖర్, దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. -
చేతిలో బీఈడీ.. చెల్లని పట్టా
అశోక్... టీచర్ కొలువు సాధించాలన్న పట్టుదలతో బీఈడీ చేశాడు. కానీ డిగ్రీలో నిర్ణీత మార్కులు(50%) ఉండాలన్న నిబంధనతో టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోయాడు. చేసేదిలేక నిరాశలో కూరుకుపోయి తన బీఎడ్ సర్టిఫికెట్‌ను ఫేస్బుక్లో ఇలా అమ్మకానికి పెట్టాడు. స్వాతి.. టీచర్ కావాలన్న ఆశతో అప్పులు చేసి మరీ నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంది. ఈమెది అదే సమస్య. డిగ్రీలో నిర్ణీత మార్కులు లేకపోవడంతో దరఖాస్తుకు కూడా దూరమైంది. తీవ్ర ఆవేదనతో ఊరెళ్లిపోయింది. సాక్షి, హైదరాబాద్ : ..ఇలా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) చేసి, ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్) అర్హత సాధించిన వేలాది మంది అభ్యర్థులు ఇంటిబాట పట్టారు!! ఉద్యోగం మాట దేవుడెరుగు.. కనీసం టీచర్ పోస్టు కోసం దర ఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేక కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. హైదరాబాద్‌కు వచ్చి కోచింగ్‌లు తీసుకున్నవారంతా ప్రస్తుత నిబంధనలతో ఆవేదన చెందుతున్నారు. 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే వీల్లేకుండా చేసి తమను విద్యాశాఖ రోడ్డు పాల్జేసిందని వాపోతున్నారు. రాష్ట్రంలో బీఎడ్ పూర్తి చేసినవారు 3.5 లక్షల మంది ఉంటే.. అందులో వేలాది మంది ఇలా టీచర్ పోస్టులకు అర్హత లేక ఆందోళన చెందుతున్నారు. 2012 తర్వాత ఇన్నాళ్లకు ఇచ్చిన అవకాశాన్ని నిబంధనల పేరిట దూరం చేస్తున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. విద్యాశాఖ నిబంధనలివీ.. ఆరు నుంచి పదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్ అభ్యర్థి బీఎడ్ చేసి, టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాల్సిందే. బీసీ, ఎస్సీ, ఎస్టీలైతే డిగ్రీలో 45% మార్కులు సాధించాలి. అలా ఉంటేనే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. విద్యాశాఖ రూపొందించిన ఈ నిబంధనలు అభ్యర్థుల పాలిట శాపంగా మారాయి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల మేరకే ఈ రూల్స్ రూపొందించామని చెబుతున్న విద్యాశాఖ.. అవే ఎన్సీటీఈ నిబంధనల్లో ఇతర అంశాలను విస్మరించింది. ఎన్సీటీఈ ఏం చెబుతోంది..? ఉపాధ్యాయులకు ఉండాల్సిన కనీస అర్హతలను ఎన్సీటీఈ నిర్ణయిస్తుంది. 2001, 2002, 2007, 2010, 2014లో అర్హతలను ప్రకటించింది. 2014లో ప్రకటించిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఎస్జీటీ పోస్టులకు (1 నుంచి 5 వరకు బోధించేవారు) జనరల్ అభ్యర్థులు ఇంటర్లో 50% (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 %) మార్కులుండాలి. డీఎడ్ చేసి ఉండాలి. టెట్‌లో అర్హత సాధించాలి. లేదా డీఎడ్‌లో చేరేందుకు 2002, 2007లో జారీ చేసిన ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం.. ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 45% మార్కులున్నా సరిపోతుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం మార్కులున్నా చాలు. వాటితోపాటు డీఎడ్ చేసి ఉండాలి. టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. 6,7,8,9,10 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే జనరల్ అభ్యర్థులకు డిగ్రీ/పీజీలో 50 శాతం(ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం) మార్కులు ఉండాలి. అలాగే బీఎడ్‌తోపాటు టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. లేదా బీఎడ్‌లో చేరేందుకు 2002, 2007లో ఎన్సీటీఈ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. డిగ్రీలో జనరల్ అభ్యర్థులకు 45% మార్కులుంటే చాళు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40% మార్కులున్నా చాలు. లేదా 6,7,8 క్లాసుల టీచర్లకు రెండేళ్ల బీఎడ్‌తోపాటు డిగ్రీలో నిర్ణీత మార్కులు సాధించి ఉండాలి. నిబంధనలు బేఖాతరు 2014 నవంబర్ 12న ఎన్సీటీఈ జారీ చేసిన ‘ఎన్సీటీఈ (డిటర్మినేషన్ ఆఫ్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఫర్ పర్సన్స్ టు బి రిక్రూటెడ్ యాజ్ ఎడ్యుకేషన్ టీచర్స్) రెగ్యులేషన్స్‌లోని అన్ని నిబంధనలను పరిగణన లోకి తీసుకోకుండానే విద్యాశాఖ అర్హతలను నిర్ణయించింది. దీంతో చాలామంది టీచరు పోస్టులకు అనర్హులవుతున్నారు. డిగ్రీలో 50% మార్కులు (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం) లేవన్న సాకుతో వేల మంది అభ్యర్థులకు అర్హత లేకుండా పోయింది. డిగ్రీ చదివి, రెండేళ్ల డీఎడ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు 6, 7, 8 తరగతులకు బోధించే అవకాశం కల్పించాలని ఎన్సీటీఈ నిబంధనలు న్నాయి. కానీ 6, 7, 8 తరగతులకు బోధించే టీచర్ల విషయంలో డిగ్రీ, డీఎడ్ వారికి విద్యాశాఖ అవకాశం ఇవ్వలేదు. పీజీలో 50% మార్కులు వచ్చినా దరఖాస్తుకు అవకాశం ఇవ్వడం లేదు. ఈ ప్రశ్నలకు బదులేదీ? ఎన్సీటీఈ జారీ చేసిన నిబంధనల్లో డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొన్న నిబంధన ఇప్పుడు కొత్తగా తెచ్చిందేమీ కాదు. 2010 ఆగస్టు 23న జారీ చేసిన ఎన్సీటీఈ మార్గదర్శకాల్లోనూ ఉంది. అలాగే 45 శాతం మార్కుల నిబంధన కూడా ఉంది. 2002లో జారీ చేసిన ఎన్సీటీఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. అంటే 2002 నుంచి 50 శాతం మార్కుల నిబంధన ఉందని అనుకుందాం.. మరి అప్పుడే అభ్యర్థులు బీఎడ్‌లో చేరేప్పుడు 50 శాతం మార్కులు లేవు కాబట్టి మీకు ప్రవేశం కల్పించబోమని విద్యాశాఖ ఎందుకు ప్రకటించలేదు. పైగా 50 శాతం మార్కులు లేకుండానే బీఎడ్ పూర్తి చేసిన వారికి 2010లో టెట్ అమల్లోకి వచ్చాక టెట్‌కు హాజరయ్యేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారు? అన్నది అధికారులే చెప్పాలి. డిగ్రీ లేదా పీజీలో 50 శాతం మార్కులున్నా సరిపోతుందన్నారు. నిబంధనల ప్రకారం డిగ్రీలో 50 శాతం లేదని తిరస్కరిస్తున్నారు సరే.. మరి పీజీలో 50 శాతం కంటే ఎక్కువ మార్కులున్నా ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. -
‘టీచర్ పోస్టుల భర్తీ’ విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, అందుకు అవసరమైన నిబంధనల ఉత్తర్వుల్ని సవాల్ చేసిన వ్యాజ్యంపై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఉపాధ్యాయ పోస్టులు 8,792 భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్, నిబంధనల జీవో 25 రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ కె.బాలకృష్ణ ముదిరాజ్, రాంమోహన్‌రెడ్డి, భాను ఇతరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ వాదిస్తారని, విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. దీనికి అంగీకరించిన న్యాయమూర్తి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. -
ఉపాధ్యాయ డిప్యుటేషన్లకు రంగం సిద్ధం
- వర్క్ అడ్జస్ట్మెంట్ కింద జిల్లాలో 152 పోస్టుల గుర్తింపు - త్వరలో ఉత్తర్వులు మెదక్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద 152 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, మారిన సిలబస్, పరీక్ష విధానాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా గత విద్యాసంవత్సరానికి సంబంధించి డిసెంబర్లో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపగా ఈసారి జూలైలోనే పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 550 ఉన్నత పాఠశాలలు ఉండగా చాలా పాఠశాలల్లో సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ సబ్జెక్ట్‌లకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సబ్జెక్ట్ టీచర్లు లేరు. దీంతో నాన్ సక్సెస్ పాఠశాలలో డబుల్ పోస్టింగ్ ఉన్న చోటు నుంచి ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట విద్యా సంవత్సరం చివరి వరకు డిప్యూటేషన్ పంపుతున్నారు. ఈ సారి జూలై నెలలోనే వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ పూర్తిచేసి విద్యాబోధనకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించడంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు మెదక్ సబ్ డివిజన్లో 22 మంది టీచర్లను, సిద్దిపేట సబ్ డివిజన్లో 60 మంది టీచర్లను, జోగిపేట సబ్ డివిజన్లో 30 మంది టీచర్లను తాత్కాలికంగా బదిలీ చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అయితే ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్న పాఠశాలల నుంచి ఇతర పాఠశాలల్లోకి వెళ్లేందుకు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. కౌన్సెలింగ్‌లో ఇష్టపడి వచ్చిన పాఠశాలను కాదని, ఇతర పాఠశాలల్లో విధులు నిర్వర్తించడానికి సుముఖత చూపడం లేదు. కాని వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట ఉపాధ్యాయులను వారికి దగ్గరలో అనుకూలంగా ఉన్న పాఠశాలకే పంపుతున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జరిగిన కౌన్సెలింగ్‌లో బదిలీ అయిన ఉపాధ్యాయులకు రిలీవర్లు రాక పోవడంతో వారు కొత్త పోస్టుల్లో చేరలేదు. వారు విధుల్లో చేరి ఉంటే ఇబ్బందులు ఇంతగా ఉండేవి కావని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో బోధన కుంటు పడకుండా ఉండటానికే వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపుతున్నామని మెదక్ డిప్యూటీ ఈఓ శ్యామ్యూల్ పేర్కొన్నారు.