సాక్షి, న్యూఢిల్లీ : ఫిబ్రవరి చివరికల్లా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం జరుగుతోందంటూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణలో నియామక ప్రక్రియ పూర్తయిందని, ఇందుకు సంబంధించిన పత్రాలను అందజేయాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా కొన్ని పోస్టులకు మాత్రం ఇంకా ఫలితాలు వెల్లడించలేదని తెలిపారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయని, ఫిబ్రవరి చివరినాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల చివరినాటికి మొత్తం పోస్టులు భర్తీ చేయాలన్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. కాగా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సుప్రీం ఆదేశాలు అమలు చేయడం లేదంటూ జేకే రాజు, వెంకటేశ్ అనే వ్యక్తులు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment