సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, అందుకు అవసరమైన నిబంధనల ఉత్తర్వుల్ని సవాల్ చేసిన వ్యాజ్యంపై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఉపాధ్యాయ పోస్టులు 8,792 భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్, నిబంధనల జీవో 25 రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ కె.బాలకృష్ణ ముదిరాజ్, రాంమోహన్‌రెడ్డి, భాను ఇతరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ వాదిస్తారని, విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. దీనికి అంగీకరించిన న్యాయమూర్తి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.