ఒకేసారి రూ. వెయ్యికి పెంపుపై నిరుద్యోగుల నిరసనలు
ఎన్నికల వేళ ఎందుకీ రగడ అని ప్రభుత్వం పునరాలోచన
ఫీజు పెంపునకు గల కారణాలపై సీఎంవో ఆరా
ఆన్‌లైన్ పరీక్షల కారణంగా పెంచాల్సి వచ్చిందంటున్న విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) ఫీజును అమాంతం రెండింతలకుపైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫీజును తగ్గించాల్సిందేనని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో విపక్షాలూ తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాల్లోనే తర్జన భర్జన జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా టెట్ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2017 వరకూ టెట్‌కు ఒక్కో పేపర్‌కు రూ.200 ఉండేది. ఆ తర్వాత ఇది రూ.300 అయింది. 2023లో కూడా టెట్ ఫీజును రెండు పేపర్లకు కలిపి రూ. 400 చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక పేపర్‌కు రూ. వెయ్యి, రెండు పేపర్లయితే రూ. 2 వేలు ఫీజు నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఫీజు తగ్గించలేమా?
ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు టెట్ ఫీజు పెంపుపై వస్తున్న విమర్శలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా సంప్రదించినట్టు తెలిసింది. ఫీజు పెంపు అంశం తమ ముందు అసలు చర్చకే రాలేదని, అధికారుల స్థాయిలోనే ఇది జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ నిరుద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకుని ఉండాలని సీఎంవో భావిస్తున్నట్టు తెలిసింది. సమస్య మరింత జఠిలం కాకముందే ఫీజు తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని సీఎంవో భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరిందని సమాచారం. అయితే ఫీజు పెంపు సమంజసమేనని అధికారులు సమర్థించుకుంటున్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు నిర్ణయించిన ఫీజు విషయంలోనూ తొలుత కొంత వ్యతిరేకత వచి్చనా, తర్వాత సద్దుమణిగిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఆన్‌లైన్‌లో టెట్ నిర్వహించడం వల్ల వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల నిర్వహణకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలని అంటున్నారు. ఈ కారణంగానే టెట్ ఫీజు పెంచాల్సి వచ్చిందనేది అధికారుల వాదన. కాగా, దీనిపై పునరాలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఇది అన్యాయం
లక్షల మంది పేద విద్యార్థులు అప్పులు చేసి, టెట్ కోచింగ్ తీసుకున్నారు. టీచర్ కొలువులు వస్తాయని గంపెడాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టెట్ ఫీజులను రూ. 400 నుంచి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం. ఆన్‌లైన్ ఫీజు పేరుతో పేదలపై భారం మోపడాన్ని ఎంతమాత్రం ఊరుకోం. ఫీజు తగ్గించకపోతే ఆందోళన చేపడతాం. –ఆర్‌ఎల్ మూర్తి, టి.నాగరాజు (ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు)
ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు?
పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది. అందుకు విరుద్ధంగా టెట్ ఫీజును రెండింతల నుంచి నాలుగింతలకుపైగా పెంచింది. ఇది పేద విద్యార్థులకు మోయలేని భారం. నిరుద్యోగుల పట్ల కనీస కనికరం కూడా చూపకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణం. ప్రభుత్వం చెప్పిందేంటో? చేస్తున్నదేంటో? ప్రజలు అర్థం చేసుకోవాలి. –రావుల మనోహర్‌రెడ్డి (బీఈడీ, డీఎడ్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు)
Comments
Please login to add a commentAdd a comment