ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు చేకూరని లబ్ధి
ఏళ్ల కిందటి నిబంధనలతో ఇబ్బందులు
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పదో తరగతి పరీక్ష ఫీజు రాయితీ అందడం లేదు. ఇందుకు ఏళ్ల కిందట రూపొందించిన నిబంధనలే కారణమని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయంపై తగిన మార్పుల కోసం రాష్ట్ర విద్యాశాఖ దృష్టి సారించడం లేదని వారంటున్నారు. రాయితీ నిబంధనలను ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా సవరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, నగర విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
రాయితీ పొందాలంటే..
ప్రస్తుతం 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఈ నెల 28వ తేదీతో గడువు ముగియనుంది. విద్యార్థులంతా ఫీజులు చెల్లించే పనుల్లో నిమగ్నమయ్యారు.
నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి పరీక్ష రుసుం కింద రూ.125 చెల్లించాలి. వంద శాతం రాయితీ పొందాలంటే విద్యార్థులు వార్షిక ఆదాయ ధ్రువపత్రాన్ని సమరి్పంచాలి. హైదరాబాద్ నగరంతో సహా శివారు జిల్లాల్లోని విద్యాసంస్థల్లో ఈ ఏడాది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సుమారు 1.18 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో సుమారు 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉంటారని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి.
వీరి కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేల లోపు ఉంటేనే వంద శాతం ఫీజు రాయితీ వర్తిస్తుంది. కానీ ప్రస్తుతం అంత తక్కువ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఎక్కడా ఇవ్వడం లేదు. ఈ నిబంధన చాలా ఏళ్ల కిందట రూపొందించారు. ఇప్పుడు సగటున వార్షిక ఆదాయం రూ.లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉండాలని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏ విద్యారి్థకీ రాయితీ లభించడం లేదు. ఆదాయ పరిమితిని సవరిస్తేనే ఫలితం ఉంటుందని టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ ఇలా
అపరాధ రుసుం లేకుండా గడువు: ఈ నెల 28 వరకు
రూ.50 అపరాధ రుసుం: డిసెంబరు 2
రూ.200 అపరాధ రుసుం: డిసెంబరు 12
రూ.500 అపరాధ రుసుంతో: డిసెంబరు 21 వరకు..
Comments
Please login to add a commentAdd a comment