
ఇంటర్నల్ మార్కుల కోసమంటూ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల బాదుడు
ఎక్కువ మార్కులు వేస్తేనే.. ఎక్కువ జీపీఏ వస్తుందంటూ వసూళ్లు
ఒక్కో విద్యార్థి వద్ద రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్న వైనం
రూ.కోట్లలో ‘వ్యాపారం’... మార్కుల తనిఖీ బృందాలకు ముడుపులు..
ఎంఈవోలు, డీఈవోలు, ఉన్నతాధికారుల దాకా వాటాలు వెళతాయనే ఆరోపణలు
ప్రైవేటు స్కూళ్లలో 20కి 20 మార్కులు.. సర్కారీ స్కూళ్లలో గీచిగీచి మార్కులు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి(Tenth class) అంతర్గత మార్కులపై ప్రైవేటు,(Private schools) కార్పొరేట్ విద్యా సంస్థలు దందా మొదలుపెట్టాయి. ఎక్కువ ఇంటర్నల్ మార్కులు వేసే పేరిట అదనపు వసూళ్లు మొదలు పెట్టాయి. ఇలా ఎక్కువ మార్కులు వేస్తే, మొత్తంగా మార్కులు పెరి గి... జీపీఏ ఎక్కువగా వస్తుందని ఒత్తిడి చేస్తున్నాయి. ఇంటర్నల్ మార్కుల(internal marks) తనిఖీలకు వచ్చే బృందాలకు కొంత ముట్టజెబుతున్నాయి. జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకూ అందులో వాటాలు వెళుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
‘ఇంటర్నల్స్’వసూళ్ల దందా దాదాపు రూ.వంద కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ఓ అధికారి కనుసన్నల్లో ఇదంతా నడుస్తున్నట్టు విద్యాశాఖ వర్గాలే పేర్కొంటుండటం గమనార్హం. ప్రతీ జిల్లాకు టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లు పెద్ద ఎత్తున ‘ఇంటర్నల్స్’ఖర్చు పెడుతున్నాయి. విద్యార్థుల జీపీఏ పెంచుకోవడం, దాన్ని ప్రచారానికి వాడుకోవడం, తద్వారా మార్కెట్ పెంచుకోవడమే దీని ముఖ్య ఉద్దేశంకాగా.. ఈ అక్రమాలకు విద్యాశాఖ అధికారులు సహకరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
మొత్తం మార్కులూ వేసుకుని..
టెన్త్ క్లాస్‌లో ఒక్కో సబ్జెక్టుకు వంద మార్కులుంటాయి. 80 మార్కులు థియరీ పరీక్షల ద్వారా వస్తాయి. ఇంటర్నల్ మార్కులు 20. విద్యార్థులకు ఈ మార్కులు వేయడానికి విద్యాశాఖ కొన్ని నిబంధనలు పెట్టింది. సంవత్సరంలో నిర్వహించే అంతర్గత పరీక్షలన్నింటినీ కొలమానంగా తీసుకోవాలి. స్లిప్ టెస్టులకు 5 మార్కులు, ప్రాజెక్టు వర్క్‌కు 5, టెక్ట్స్‌బుక్స్ రైటింగ్, రీడింగ్‌కు 5, పుస్తక సమీక్షకు 5 మార్కులు వేయాలి. ప్రతీ ప్రైవేటు పాఠశాల ఈ మార్కులను మొత్తం 20కి 20గా వేసుకుంటున్నాయి. నిజానికి ఈ మార్కుల శాస్త్రీయతను జిల్లా విద్యాశాఖ నేతృత్వంలోని కమిటీలు పరిశీలించాలి.
డీఈవో నేతృత్వంలో ప్రతి మండలానికి కొన్ని కమిటీలను వేస్తారు. జిల్లావ్యాప్తంగా 60 నుంచి వంద కమిటీల వరకూ వేస్తుంటారు. ఒక్కో కమిటీలో ఒక గెజిటెడ్ హెచ్‌ఎం, నాన్–లాంగ్వేజ్, లాంగ్వేజ్ టీచర్ కలిపి ముగ్గురు ఉంటారు. వారు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి.. విద్యార్థులకు వేసిన ఇంటర్నల్స్ మార్కులు సరిగానే ఉన్నాయా? లేదా? పరిశీలిస్తారు. తర్వాత మార్కులను డీఈవో కార్యాలయానికి పంపుతారు. అక్కడ రాష్ట్రస్థాయి పోర్టల్‌లో ఈ మార్కులను ఫీడ్ చేస్తారు.
థియరీ పరీక్షల్లో మార్కులను, ఇంటర్నల్ మార్కులను కలిపి తుది ఫలితాన్ని ఇస్తారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులకు వేసిన మార్కులు సరైనవేనని తనిఖీ కమిటీలు నిర్ధారిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు 14కు మించని పరిస్థితి ఉంటే.. ప్రైవేటు బడుల్లో మాత్రం కనిష్టంగా 18 నుంచి గరిష్టంగా 20 వరకు వేసినా కమిటీలు ఆమోదం చెబుతున్నాయి.
జరుగుతున్న తంతు ఇదీ...
⇒ ప్రైవేటు స్కూళ్లలో ఇంటర్నల్ అసెస్‌మెంట్‌పై తనిఖీ బృందాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా యి. ఎక్కడా శాస్త్రీయత లేదని సభ్యులు పేర్కొంటున్నారు. అయినా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఉన్నతాధికారులపై ఒత్తిడి చేయడం వల్ల తామేమీ చేయలేపోతున్నా మని అంటున్నారు. తనిఖీ బృందాలు ఇచ్చి న ఫీడ్ బ్యాక్ ప్రకారం కొన్ని ఉదాహరణలివీ..
⇒ హైదరాబాద్‌లోని నాలుగు ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల ప్రాజెక్టు వర్క్ అందరిదీ ఒకే రకంగా ఉంది. దాన్ని గూగుల్ నుంచి కాపీ కొట్టినట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు విద్యార్థులను ఆ ప్రాజెక్టు వర్క్‌పై ప్రశి్నస్తే.. సమాధానం చెప్పలేకపోయారు.
⇒ ఖమ్మంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో వంద మంది విద్యార్థుల రికార్డులు ఒకే రకంగా ఉన్నాయి. అవి కూడా ఎవరో రాసినట్టు తెలుస్తోంది. కొన్ని పదాలు పూర్తిగా ఆన్‌లైన్ నుంచి తీసుకున్నట్టుగా ఉంది. భాష కఠినమైన, పొంతనలేని తరహాలో ఉంది. దీనిపై విద్యార్థులకు ఏమాత్రం అవగాహన లేదు.
⇒ నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో అంతర్గత పరీక్షలకు హాజరవని విద్యార్థులకూ ఇంటర్నల్ మార్కులు వేశారు. పరీక్ష పేపర్లు ఎక్కడో పోయినట్టు వారు పేర్కొనడం గమనార్హం. ఓ రాజకీయ నాయకుడి బంధువు స్కూల్ కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
రూ.వంద కోట్ల దందా..
రాష్ట్రంలో ఈ సంవత్సరం 5,09,391 మంది టెన్త్ పరీక్షలు రాయనున్నారు. అందులో రెగ్యులర్‌గా రాసేవాళ్లు 4,97,341 మంది, గత ఏడాది ఫెయిలైన విద్యార్థులు మరో 12,050 ఉన్నారు. 11,544 ప్రైవేటు స్కూళ్ల నుంచి ఈ ఏడాది 2,36,674 మంది టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. వీరిలో చాలా మంది ఓ నాలుగైదు కార్పొరేట్ విద్యాసంస్థలకు చెందిన వారేనని అంచనా. ఇంటర్నల్ మార్కులు ఎక్కువ వస్తే జీపీఏ పెరుగుతుందని ఆ స్కూళ్లు చెబుతున్నాయి. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి స్కూల్ స్థాయిని బట్టి రూ.5 వేలు మొదలు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్నల్ మార్కుల కోసం అదనంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని.. ఈ మొత్తం రూ.వంద కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రతీ స్కూల్ కూడా తనిఖీ బృందాల్లో ముగ్గురికి రూ.లక్షల్లో ముట్టజెబుతున్నారని.. ఎంఈవోలు, డీఈవోలు, రాష్ట్ర విద్యాశాఖలోని ఉన్నతాధికారులకూ ముడుపులు వెళ్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో స్కూళ్లు వేసిన మార్కులు సరికాదని తెలిసినా.. కమిటీలు తూతూమంత్రంగానే తనిఖీ చేసి ఆమోదించాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విచారణకు ఆదేశిస్తాం
ఇంటర్నల్ మార్కుల తనిఖీ వ్యవహారంపై విచారణ జరిపిస్తాం. అనుమానమున్న జిల్లాలు, ప్రాంతా ల్లోని పరిస్థితిని సమీక్షించాలని అధికారులకు ఆదేశి స్తాం. ఇంత వరకు ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అయినా ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయేమో పరిశీలించి, అలాంటివి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఈవీ నర్సింహారెడ్డి, పాఠశాల విద్య డైరెక్టర్
దగ్గరుండి పరిశీలిస్తున్నాం
ప్రైవేటు స్కూళ్లలో అంతర్గత మార్కులను తనిఖీ బృందాలు పరిశీలించిన తర్వాత.. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మరోసారి పరిశీలన చేస్తున్నాం. ఎక్కడైనా అనుమానం వస్తే స్వయంగా వెళ్లి పరిశీలిస్తాం. బృందాలు ఇంకా మార్కులు ఫీడ్ చేయలేదు. చేసిన తర్వాత ఈ ప్రక్రియ ఉంటుంది. – సోమశేఖరశర్మ, డీఈవో, ఖమ్మం
ఇలా చేయడం దారుణం..
తనిఖీ బృందాలకు ముట్టజెప్పాలనే పేరుతో ప్రైవేటు స్కూళ్లు డబ్బులు వసూలు చేయడం దారుణం. దీనికి టీచ ర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. దీనిపై సమ గ్ర విచారణ జరిపించాల్సి ఉంది. అంతర్గత మార్కులు పెంచేందుకు అన్యాయంగా అనుమతిస్తే.. సంబంధిత తనిఖీ బృందాల్లోని టీచర్లపై చర్య లు తీసుకోవాలి. – ఆర్.రాజగంగారెడ్డి, గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
రూ.10 వేలు అడిగారు
ఇంటర్నల్ మార్కులు జీపీఏ పెరగడానికి కీలకమని కరస్పాండెంట్ చెప్పారు. అధికారులను మేనేజ్ చేయాలని, అందుకోసం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే మార్కులు తగ్గిస్తారని చెప్పారు. అందరూ ఇస్తున్నారు కాబట్టి భయంతో మేం కూడా ఇచ్చాం. – హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు స్కూల్ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment