ప్రభుత్వానికి రాష్ట్ర విద్యా కమిషన్ సిఫారసులు
పాఠశాలల్లో కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి
స్కూళ్లను కేటగిరీలుగా విభజించి ఫీజులు నిర్ధారించాలి
సాక్షి, హైదారబాద్: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల విషయమై తెలంగాణ విద్యా కమిషన్ పలు కీలక సిఫారసులు చేసింది. రాష్ట్రంలోని సాంకేతిక విద్యా కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రస్తుతం ఉన్న ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) మాదిరిగానే పాఠశాలలల్లోనూ ఫీజుల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసేలా చూడాలని సిఫారసు చేసింది. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు శుక్రవారం ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు నివేదిక సమర్పించారు.
ప్రత్యేక శిక్షణ ఇచ్చే పక్షంలోనే అదనపు ఫీజులు
ఫీజుల నియంత్రణకు రాష్ట్ర స్థాయి కమిటీతో పా టు, ప్రతి జిల్లాలో కలెక్టర్ల ఆధ్వరంలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. రాష్ట్రంలో పాఠశాలల స్థాయి ఆధారంగా ఫీజులు ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.20 లక్షల వరకు ఉన్నట్లుగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తమకు అందిన ఫిర్యాదులను కమిషన్ తన నివేదికలో పొందుపరిచింది. ఆప్షనల్‌గా విద్యార్థులకు ఈత, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చే పక్షంలోనే అదనపు ఫీజులకు అనుమతించాలని లేని పక్షంలో ఒక్క ట్యూషన్ ఫీజు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. స్కూళ్లను కేటగిరీల వారీగా విభజించి ఫీజులను నిర్ధారించాలని పేర్కొంది. పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మాకుండా చూసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించింది.
పుస్తకాలు, డ్రెస్‌ల అమ్మకాలు నిషేధించాలి
పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, స్కూల్ డ్రెస్‌లు, షూ, టై లాంటివి అమ్మడాన్ని నిషేధించాలని, తమకు ఇష్టమైన చోట వాటిని కొనుగోలు చేసే అవకాశం విద్యార్థులకు కల్పించాలని సిఫారసు చేసింది. పాఠశాలల్లో మౌలిక వసతులైన లైబ్రరీ, ప్రయోగశాలలు, కంప్యూటర్లు, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, బోధనా సిబ్బంది విద్యార్హతలు, ఉపాధ్యాయుల సంఖ్య, వారికి చెల్లిస్తున్న వేతనాలు, ఉన్న క్రీడా సౌకర్యాలు, పాఠశాల నిర్వహణ వ్యయం తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఫీజులు నిర్ధారించాలని స్పష్టం చేసింది.
పాఠశాలలు పూర్తిగా
దోపిడీ చేస్తున్నాయన్న కమిషన్!
కలెక్టర్, జిల్లా విద్యాధికారి, ఆడిటర్ తదితరులతో ఏర్పాటయ్యే కమిటీ నిర్ధారించే ఫీజులు అధికంగా ఉన్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తే రాష్ట్రస్థాయి కమిటీకి అప్పీల్ చేసే సౌకర్యం ఉండాలని కమిషన్ సూచించింది. ఒకవేళ రాష్ట్రంలో మరో కమి టీ ఎందుకు అని ప్రభుత్వం భావించినట్టైతే..పూర్తి చట్టబద్ధతతో విద్యా కమిషన్‌కు ఆ బాధ్యతను అప్పగించాలని సూచించినట్లు తెలిసింది. మొత్తం ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను పూర్తిగా దోపిడీ చేస్తున్నాయన్న అభిప్రాయాన్ని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పై వివిధ వర్గాలతో చర్చలు జరిపిన తర్వాత కమిషన్ ఈ అభిప్రాయానికి వచి్చంది. చైర్మన్ ఆకు నూరి మురళితో పాటు సభ్యులు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, జ్యోత్స్న, శివారెడ్డిలు నివేదికను సమరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment