Schools Fees
-
తెలంగాణలో చదువుకోవాలంటే లక్షలు కట్టాలి
-
AP: స్కూల్ ఫీజుల చరిత్రలో చారిత్రక ఘట్టం
ఫీజుల విధానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టం. ఇంతకుముందు కూడా ఫీజులపై పలు విధానాలను గత ప్రభుత్వాలు ప్రకటించాయి. అవేవీ ఆచరణకు నోచుకోలేదు. ఉదాహరణకు ప్రతి విద్యాసంస్థకు ఒక గవర్నింగ్ బాడీ ఉండాలి. ఇందులో యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు. ఆ పాఠశాల/కళాశాలకు ఈ కమిటీయే ఫీజులను నిర్ణయించాలి. ఇలా ఎప్పుడైనా జరిగిందా? అసలు గవర్నింగ్ బాడీ అనేది ఉంటుందని ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, డీఈఓ తదితరులతో కూడిన బృందం ఫీజుల నిర్ణయం, వాటి పెంపుదల చేసేలా ఓ విధానం వచ్చింది. అదీ అమలు కాలేదు. దాంతో ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు నిర్ణయించుకున్నాయి, పెంచుకున్నాయి. (చదవండి: అట్టడుగు వర్గాలకు అక్షర కాంతులు) ఇప్పుడు హేతుబద్ధంగా ఫీజులు ఖరారు అవుతాయి. అన్ని పాఠశాలలు, కళాశాలలను ఒకటే గాటన కట్టి వేయడం లేదు. నాణ్యమైన విద్య, మంచి వసతులు అందిస్తున్నవీ ఉన్నాయి. వాటికి తప్పకుండా అందుకు సరిపడా ఫీజు నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఫీజులను గట్టిగా అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఎంత ఉందో, అంతకు రెట్టింపు తల్లిదండ్రుల మీద ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఈ ఫీజులు అమలు అవుతున్నాయో లేదో ప్రత్యక్షంగా తెలుసుకునేది తల్లిదండ్రులే. గతాన్ని వదిలేస్తే ఇప్పుడు ప్రభుత్వానికి విద్యా వ్యవస్థపై ఎంతో నిబద్ధత ఉంది. ఈ సందర్భంలో తల్లిదండ్రులు తమ వంతు సహకారాన్ని అందిస్తే విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయవచ్చు. ఐఐటీ, మెడిసిన్ భ్రమల్లో పడిన తల్లిదండ్రులు పిల్లలకు ఇష్టం ఉన్నా లేకపోయినా, సామర్థ్యం ఉన్నా లేకపోయినా బలవంతంగా కార్పొరేట్ కళాశాలలో చేర్పిస్తున్నారు. మార్కుల పరుగులో అలసిపోయిన పిల్లల కన్నీళ్లను తల్లిదండ్రులు గుర్తించలేక, వారు అఘాయిత్యానికి పాల్పడ్డాక జీవితమంతా కన్నీళ్లను మోస్తున్నారు. (తెలుగు నేర్చుకో, ఆంగ్లంలో చదువుకో!) మీరు గమనించారా? ఐఐటీ, మెడిసిన్ ర్యాంకులన్నీ హైదరాబాద్, విజయవాడ క్యాంపస్‌లలో మాత్రమే వస్తాయి. పిల్లల్లో మెరికల్ని గుర్తించడానికి మాత్రమే జిల్లా కేంద్రాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. ఐఐటీ, మెడిసిన్ కోసం 5 నుంచి 10 వేల రూపాయలతో కొనిపించిన ప్రత్యేక మెటీరియల్‌ను చాలా క్యాంపసుల్లో అసలు ఓపెన్ చేయరని మీకు తెలుసా? (ఆంధ్రప్రదేశ్ విద్యావిధానం దేశానికే ఆదర్శం) మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ డబ్బులు వసూలు చేసి, ఒక పూట తిండి లేదా వసతి సరిగ్గా కల్పించకపోతే ఎంత బాధపడతారు? మరి లక్షలాది ఫీజులు కట్టి, ఉండటానికి రూమ్ సరిగా లేదు, తగినన్ని బాత్రూంలు లేవు, బాత్రూం వెళ్లాల్సి వస్తుందని నీళ్లు తాగడం లేదు, సరైన భోజనం పెట్టడం లేదు అని పిల్లలు ఫిర్యాదు చేస్తే మీరు పట్టించుకుంటున్నారా? మీరు చదవడానికి వచ్చారా, తినడానికి వచ్చారా? అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. రెండేళ్ల పాటు ఆ నరకంలో సర్దుకొమ్మని చెబుతున్నారు. అసలు మీ దృష్టికి తీసుకురాలేని ఎన్నో సమస్యల మధ్య పిల్లలు మానసికంగా కుమిలిపోతూ చదువుకుంటున్నారు. ఉదాహరణకు కాలకృత్యాలకు, స్నానానికి ఐదు నిమిషాలు సమయం ఇస్తారు. ఒకవేళ ఆ గడువు దాటితే బాత్రూం డోర్‌కు వేలాడదీసిన బట్టల్ని బయటనుంచి లాగేస్తారు. ఒక కాలేజీ విజిట్‌లో అమ్మాయిలు కన్నీళ్ళతో చేసిన ఫిర్యాదు ఇది. తల్లిదండ్రులను యాజమాన్యాలు హాస్టల్ లోపలికి అడుగు పెట్టనీయడం లేదు. పిల్లల్ని వదిలిన మొదటి రోజు, కోర్సు అయిపోయిన చివరి రోజు మాత్రమే హాస్టల్లోకి అనుమతిస్తున్నారు. ఈ దాపరికం ఎందుకని ఏ రోజైనా ప్రశ్నించారా? అడ్మిషన్ సమయంలో ఫీజు తగ్గిస్తామని చెప్పి టీసీ తీసుకునే సమయంలో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రోజూ మా గ్రీవెన్స్‌కు ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా మోసం చేశారని యాజమాన్యాలను ప్రశ్నిస్తున్నారా? నిర్ణయించిన ఫీజు కంటే అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రశ్నించండి. ఫీజుకు తగ్గ విద్య, వసతులు కల్పించకపోతే ప్రశ్నించండి. ఓ పది రూపాయల వస్తువులో లోపం కనిపిస్తే దుకాణదారుతో గొడవపడే మనం, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేక పోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రశ్నిస్తేనే ప్రక్షాళన జరుగుతుంది. నేటి సమస్త మానవాళి అభివృద్ధి పథానికి మూలం సైన్స్. ఆ సైన్స్ అభివృద్ధికి మూలం, ప్రశ్న. తల్లిదండ్రులుగా మీ గళాన్ని విప్పండి. మీకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ మద్దతు ఎప్పటికీ ఉంటుంది. (మా గ్రీవెన్స్ ఫోన్ నంబర్: 9150381111) ఈ చారిత్రక సందర్భంలో మీరు, మేము, మనందరం పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కలసికట్టుగా పని చేద్దాం. - సాంబశివారెడ్డి ఆలూరు వ్యాసకర్త సీఈఓ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ -
కరోనా: ఫీజు చెల్లిస్తేనే ఇంటికి పంపిస్తాం!
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల తాత్కాలిక మూసివేతకు మంగళవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫీజు చెల్లిస్తేనే విద్యార్థిని ఇంటికి పంపిస్తామని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం డిమాండ్ చేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వీణవంక మండల కేంద్రానికి చెందిన కూచనపల్లి గణేశ్-శ్రీదేవి దంపతుల కూతురు శృతి. జమ్మికుంట పట్టణంలోని న్యూమిలీనియం స్కూల్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. పాఠశాలల వేసివేత నేపథ్యంలో తమ కూతురును ఇంటికి తీసుకెళ్లేందుకు గణేశ్–శ్రీదేవి దంపతులు బుధవారం స్కూల్‌కు వచ్చారు. అయితే ఫీజు రూ. 20 వేలు చెల్లిస్తేనే శృతిని ఇంటికి పంపిస్తామని యాజమాన్యం తేల్చి చెప్పడంతో ఇంటిదారి పట్టారు. గురువారం మళ్లీ పాఠశాలకు రాగా, యాజమాన్యం అలాగే చెప్పడంతో తమ వద్ద అంత డబ్బు లేదని బాధితులు చెప్పినా వినిపించుకోలేదు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు బాధితులతో కలిసి పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. ఎస్సై ప్రవీణ్‌రాజ్ పాఠశాల వద్దకు చేరుకుని ఇరువురితో మాట్లాడడంతో యాజమాన్యం విద్యార్థినిని ఇంటికి పంపిచేందుకు అంగీకరించింది. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బత్తుల రాజు, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు కారంకొండ శ్రావణ్‌కుమార్, శివకుమార్, కొల్లూరి ప్రశాంత్, కల్లపెళ్లి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పని భారం!
కొత్తకోట: జూన్ మాసం వచ్చిందంటే తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేసి వెళ్తుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నెల కావడంతో మామూలు రోజులకంటే సామాన్యులకు ఖర్చులు రెట్టింపవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 14 మండలాల పరిధిలో మొత్తం 852 పాఠశాలలు ఉండగా ఇందులో ఉన్నత పాఠశాలలు 101 , ప్రాథమికోన్నత పాఠశాలలు 58 , ప్రాథమిక పాఠశాలలు 61, కేజీబీవీలు 15, మోడల్ స్కూళ్లు 3, రెసిడెన్సియల్ స్కూళ్లు 13, మూడు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 55,644 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తమ పాఠశాలల్లో అడ్మిషన్లు పరిమితంగా ఉన్నాయంటూ విస్తృత ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మభ్య పెడుతున్నారు. టెక్నో, ఈ–టెక్నో, మోడల్, డీజీ స్కూల్ అనే వివిధ రకాల తోక పేర్లతో తల్లిదండ్రులను ఆకర్షితులను చేస్తున్నారు. పాఠశాలల్లో సాధించే ర్యాంకులు, ఉత్తమ మార్కులను వివిధ మాద్యమాల్లో ప్రచారం చేస్తూ అడ్మిషన్లు పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్నారు. ఏ పాఠశాలలో చేర్పించాలి? ఈనెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న ప్రచారం చూసి తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పిస్తే బాగుంటుందో తేల్చుకోలేక తల్లిదండ్రులు తికమక పడుతున్నారు. కొన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు తాము నియమించుకున్న పీఆర్ఓల ద్వారా అడ్మిషన్లు పెంచుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మాయమాటలు నమ్మి డొనేషన్లు ఇచ్చిన తల్లిదండ్రులను అయోమయానికి గురవుతున్నారు. అడ్మిషన్లు పెంచుకునేందుకు ఇతర పాఠశాలలపై కుట్రలు చేసేందుకు సైతం వెనకాడడం లేదు. ఇప్పటికే తల్లిదండ్రుల సెల్ నంబర్లను సేకరించిన యజమాన్యాలు అడ్మిషన్ల కోసం తరచూ ఫోన్లకు మేసేజ్‌లు చేయడంతోపాటు తరచూ ఫోన్లు చేస్తూ విసుగెత్తిస్తున్నారు. ఏటేటా పెరిగిపోతున్న భారం ఏటేటా ఫీజుల భారం భారీగా పెరుగుతూనే ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజులను మరింతగా పెంచేసి తల్లిదండ్రులు ఆలోచించే సమయం కూడా లేకుండా ప్రవేశాలు ఇచ్చేస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకే రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు ఫీజలు లాగుతున్నారు. దాంతోపాటు అడ్మిషన్ ఫీజు, బస్సు ఫీజులు, స్పెషల్ ఫీజులను ఇష్టారాజ్యాంగా పెంచేస్తున్నారు. దీనికితోడు పాఠశాలల్లోనే ఏర్పాటు చేసిన దుకాణాల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను కొనుగోలు చేయాలని నిబంధనలు పెడుతున్నారు. అలాగే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం రేట్లు పెరిగిపోయాయి. అధికారుల కళ్లముందే ఈ తతంగమంతా జరుగుతున్నా విద్యా హక్కు చట్టం నిబంధనలు పాటించకపోయినా పట్టించుకోకపోగా ఫీజుల నియంత్రణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రతీ పాఠశాలలో పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణను చేపట్టాల్సి ఉండగా ఏ పాఠశాలలో అలాంటి చర్యలు కనిపించడం లేదు. నామ్కేవాస్తెగా బడిబాట ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం యేటా బడిబాట కార్యక్రమాన్ని చేపడుతోంది. అయినా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. ఎన్నో కోట్ల రూపాయాలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్న విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదు. విద్యాశాఖా«ధికారులు ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ నివేదికలు జిల్లాలో డ్రాపౌట్ల సంఖ్య పెరిగిపోతుందుని స్పష్టం చేసిన అధికారులకు కనువిప్పు కలగడంలేదు. -
ఫీజు నియంత్రణ నివేదికను వెల్లడించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఫీజులను నియంత్రించకపోగా పెంచాలని సిఫారసు చేయడం అన్యాయమని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజులు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయని, తక్షణమే కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని సోమవారం డిమాండ్ చేశారు. అధిక ఫీజులు అరికట్టాలని సాగిన ఉద్యమాల వల్లే కమిటీని ప్రభుత్వం నియమించిందని గుర్తుచేశారు. మేనేజ్మెంట్ల సహాయ నిరాకరణ వల్ల ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన నివేదిక 10 నెలలు ఆలస్యంగా ఇచ్చినట్లు తెలుస్తోందని అన్నారు. నివేదికలో ఫీజుల భారం తగ్గించాలని ప్రతిపాదించకపోగా.. మరింత పెంచేలా సూచనలు చేసినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. విద్యారంగాన్ని పట్టిపీడిస్తున్న కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల సమస్యపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. -
అప్పుడే ‘కొత్త’ ఫీజులు!
- నూతన విద్యా సంవత్సర ఫీజు వసూళ్లకు మార్చి నుంచే తెరలేపిన ప్రైవేటు స్కూళ్లు - ఈ నెల వరకు ఫీజును తల్లిదండ్రులు గతేడాదే చెల్లించినా బేఖాతర్ - పైతరగతుల బోధన మొదలుపెట్టినందున కనీసం 25 శాతం చెల్లించాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి మార్చి 21 నుంచే ప్రారంభమైన నూతన విద్యా సంవత్సరం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు వరంగా, తల్లిదండ్రులకు శాపంగా మారుతోంది. వేసవి సెలవులకు ముందే పైతరగతుల బోధన ప్రారంభించినందున ఫీజుల్లో కనీసం 25 శాతాన్ని ఇప్పుడే చెల్లించాలని కొన్ని ప్రముఖ స్కూళ్లు తల్లిదండ్రులను డిమాండ్ చేస్తున్నాయి. మరికొన్ని స్కూళ్లు అయితే ఈ వేసవి సెలవుల ప్రారంభంలోగా (ఈ నెల 23లోగా) మొత్తం ఫీజు చెల్లిస్తే 10 శాతం నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపు స్తకాలు, యూనిఫారాలు మొదలైనవి తమ వద్దే కొనాలని పట్టుబడుతున్నాయి. ఈ నెలాఖరు వరకు ఫీజును గతేడాదే చెల్లించినా... వాస్తవానికి 2016–17 విద్యాసంవత్సరంలో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు తరగతులను కొనసాగించాలి. జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇచ్చి 12న తిరిగి పాఠశాలలను తెరవాలి. ఇందుకు అనుగుణంగానే తల్లిదండ్రులు ఏప్రిల్ చివరి వరకు అయ్యే ఫీజులను ఇప్పటికే చెల్లించారు. అయితే ప్రభుత్వ ఆదేశం ప్రకారం యాజమాన్యాలు ఈసారి మార్చి 15 నాటికే గత సంవత్సర వార్షిక పరీక్షలను పూర్తి చేసి మార్చి 21 నుంచి పైతరగతుల బోధన ప్రారంభించినందున 2017–18 విద్యా సంవత్సరం ఫీజులను తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నాయి. వాస్తవానికి జూన్, జూలైలలో ఈ ఫీజులను వసూలు చేయాల్సి ఉన్నా విద్యార్థులు ఇతర పాఠశాలలకు వెళ్లకుండా ఉండేందుకు ముందుగానే ఫీజుల వసూళ్లకు తెరలేపాయి. స్కూళ్లలోనే అధిక ధరలకు పుస్తకాల విక్రయాలు... పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, వర్క్‌బుక్‌లు, బూట్లు, యూనిఫారాలు మొదలైన వాటి విక్రయాల విషయంలోనూ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. తమ వద్దే వాటిని కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. అలాగే ఆరో∙తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ నిర్దేశిత పుస్తకాలతోపాటు అదనంగా మరికొన్ని టైటిళ్లకు సంబంధించిన పుస్తకాలను కొనుగోలు చేసేలా తప్పనిసరి పరిస్థితిని కల్పిస్తున్నాయి. ఇక ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు అయితే పాఠశాల నిర్ణయించిందే పాఠ్య పుస్తకం. గతేడాది ఈ విషయంలో పట్టుదలగా వ్యవహరించిన ప్రభుత్వం ఈసారి వదిలేసింది. దీంతో ఒక్కో పాఠశాల ఒక్కో పబ్లిషర్‌కు సంబంధించిన పాఠ్య పుస్తకాలను పెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. ప్రభుత్వ జీవో ప్రకారం పాఠ్యపుస్తకాలు విక్రయించే 3, 4 షాపుల పేర్లను పాఠశాలలు తమ నోటీసు బోర్డుల్లో ప్రకటించాల్సి ఉన్నా ఏ స్కూలు యాజమాన్యం కూడా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. -
ఫీజుల దోపిడీపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
నాంపల్లి: ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ బీసీ సంఘం నేత సిరిబాబు ఆత్మబలిదానం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెదక్ జిల్లాకు చెందిన సిరిబాబు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడని తెలిపారు. 50 శాతం కాలిన గాయాలతో ఉన్న సిరిబాబును నగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్పిస్తే అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రి యాజమాన్యం పోలీసుల సహాయంతో బయటకు గెంటేసిందని, వైద్యం అందకపోవడంతో అతను మృతి చెందాడని కృష్ణ తన ఫిర్యాదులో ఆరోపించారు. మరిన్ని ఆత్మబలిదానాలు కాకుండా ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలని, వైద్యం అందించకుండా సూరిబాబును గెంటివేసిన యశోదా ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్చార్సీ ఈ ఘటనపై విచారణ జరిపి సెప్టెంబర్ 1 లోగా సమగ్రమైన నివేదికను అందజేయాలని మెదక్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులను జారీ చేసింది. హెచ్చార్సీకి ఫిర్యాదు అందజేసిన వారిలో బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు శారదాగౌడ్, బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌గౌడ్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. పృధ్విరాజ్‌గౌడ్ ఉన్నారు.