‘పురుగులన్నం’ ఘటనల నేపథ్యంలో హెచ్‌ఎంల నుంచి అభిప్రాయ సేకరణ
సరుకులు సర్కారే ఇస్తే బాగుంటుంది.. బియ్యాన్ని రీసైక్లింగ్ చేయాలి
నెలల తరబడి బిల్లులివ్వకపోతే ఎలా.. ఉపాధ్యాయులను బలిచేస్తే లాభమేంటి?
‘మధ్యాహ్న భోజనం’పై నివేదికలు అందజేసిన పలు స్కూళ్ల హెచ్‌ఎంలు
సాక్షి, హైదరాబాద్: మధ్యాహ్న భోజనం పురుగులతో విద్యార్థులు ఏదో ఒకచోట అస్వస్థతకు లోనవుతూనే ఉన్నారు. ‘ఒకరోజు ఖమ్మం జిల్లాలో, మరోరోజు నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తినే మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వం పరువు పోతోంది. ఏం చేద్దాం..ఎలా పరిస్థితిని చక్కబెడదాం’అంటూ ఉన్నతాధికారులు హెచ్‌ఎంల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.
‘నాణ్యత లేని భోజనం పెడితే కటకటాలు లెక్కబెట్టిస్తాం’అని సీఎం నవంబర్ 14న ప్రకటించారు. అయినా వరుస ఘటనలు చోటు చేసుకోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సీఎంవో ఆదేశించింది. ఘటన జరిగినప్పుడు హెచ్‌ఎంనో, డీఈవోనో సస్పెండ్ చేస్తే కొత్త సమస్యలొస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్ల నుంచి వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నామని సీఎం భావిస్తున్నారు. ఇవేవీ లేకుండా పురుగుల అన్నంతో పరువు పోకుండా ఏం చేయాలో నివేదిక ఇవ్వడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు.
సమస్య ఎక్కడ?
రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్లున్నాయి. విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి పౌర సరఫరాల శాఖ నుంచి బియ్యం అందజేస్తారు. మిగతా సరుకులన్నీ స్వయం సహాయ బృందాల నిర్వహణలో ఉంటాయి. ఎక్కువ మంది విద్యార్థులుంటే కొంత వరకూ నిర్వహణ సాధ్యమవుతోంది. మరీ తక్కువగా విద్యార్థులుంటేనే నిర్వహణ వ్యయం ఇబ్బందే. 13,005 స్కూళ్లలో 50 లోపు విద్యార్థులే ఉన్నారు.
ఈ కారణంగా వచ్చే నిధులు తక్కువ. స్వయం సహాయ బృందాలకు నెలవారీ బిల్లులు కూడా చెల్లించడం లేదు. అప్పు తెచ్చి వంట చేస్తున్నామని, వడ్డీ తామే కడుతున్నామంటున్నారు. ఈ సమస్యలు పరిష్కరించకుండా ఏం చేసినా నాణ్యత ఎలా పెరుగుతుందని వారు ప్రశి్నస్తున్నారు. అదీగాక సివిల్ సప్లై నుంచి వచ్చే బియ్యంలో పురుగులు ఉంటున్నాయని, వాటిని రీ సైక్లింగ్ చేస్తే తప్ప పురుగులు అరికట్టడం సాధ్యం కాదంటున్నారు. దీనికి బడ్జెట్ ఉండదని హెచ్‌ఎంలు అంటున్నారు.
ఇక్కడో రీతి... అక్కడో తీరు
కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన మెనూ అమలు చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన ఆహారం ఇస్తారు. గుడ్లు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. అన్నం, వెజిటబుల్స్, రసం, కోడిగుడ్డు, ఆకుకూరపప్పు, నెయ్యి, పెరుగు ఇస్తున్నారు. కాబట్టి నిర్వహణ వ్యయం సరిపోతుందనేది హెచ్‌ఎంల వాదన. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం బియ్యం, కూరగాయలు, పప్పు మాత్రమే ఇస్తున్నారు. పప్పు, కోడిగుడ్డు రోజూ ఉండదు. కూరల రేట్లు రోజుకో విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ నిర్వహణ సమస్యగా ఉన్నాయని ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖకు తెలిపారు.
విధాన పరమైన లోపాలున్నాయి
మధ్యాహ్న భోజన నాణ్యత పెంచాలంటే ముందుగా విధానపరమైన మార్పులు అవసరం. సంబంధిత ఏజెన్సీలకు ముందుగా బిల్లులు చెల్లించాలి. నాణ్యత పెంచేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలి. నిధులు పెంచాలి. తప్పు జరిగినప్పుడు హెచ్‌ఎంలనే బాధ్యులను చేయడం అన్యాయం. – పి.రాజాభాను చంద్రప్రకాశ్, తెలంగాణ గెజిటెడ్ హెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు
టీచర్లనే ప్రశ్నించడం సరికాదు
మధ్యాహ్న భోజన పథకం అమలులో హెచ్‌ఎంల పాత్ర నామమాత్రమని 2014లో ముంబై హైకోర్టు తీర్పు చెప్పింది. బోధన సంబంధమైన విధులే హెచ్‌ఎంలకు తలకు మించి ఉన్నాయి. తప్పు జరిగితే బాధ్యులను చేయాలనే విధానం మంచిది కాదు.
– పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్‌టీయూటీఎస్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment