సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పుట్టింది హిందూ తెలుగు కుటుంబంలో.. అయితేనేం.. ఉర్దూ మీడియంలో చదువుకుంది. ఉర్దూ ఉపాధ్యాయిని ఉద్యోగం సాధించింది. ఆమె కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి గ్రామానికి చెందిన పొనగంటి జయశ్రీ. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు బిచ్కుంద మండల కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకున్న జయశ్రీ.. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు బాన్సువాడలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ అక్కడి జెడ్పీహైస్కూల్‌లో చదువుకుంది.
ఇంటర్ బాన్సువాడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకుని డిగ్రీ బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అభ్యసించింది. డిగ్రీ అయ్యాక బోధన్‌లోని ఆజాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ పూర్తి చేసింది. గతేడాది టెట్ రాసి ఎంపికైంది. 2024–డీఎస్సీ పరీక్ష రాసి స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ) ఉద్యోగం సాధించి బుధవారం నియామక పత్రం అందుకుంది. తొలి ప్రయత్నంలోనే టెట్, డీఎస్సీలో మంచి ప్రతిభ కనబరచడం విశేషం.
మాస్టారైన గొర్రెల కాపరి..
భిక్కనూరు: కష్టాలు ఎదురైతే..ఆగిపోకుండా సాగితే విజయాలు సాధ్యమని నిరూపించాడీ యువకుడు.. చదువు మానేసి గొర్రెలు కాయడానికి వెళ్లాడు.. చదువుపై ఇష్టం, స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ చదువుకొని ప్రస్తుతం డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ఆ విజేత భిక్కనూరుకు చెందిన కోరే కుమార్. గ్రామానికి చెందిన కోరే కమల–బీరయ్య దంపతులకు ఒక కొడుకు కుమార్, కుమార్తె ఉన్నారు.
పేద కుటుంబం కావడంతో నాలుగో తరగతిలోనే తల్లిదండ్రులు కుమార్ చదువు మాన్పించారు. దీంతో ఆయన గొర్రెలు కాయడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో చదువుపై మక్కువతో 2014లో ఓపెన్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన కుమార్ పాసయ్యాడు. భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్‌లో సీఈసీ, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. నిజా మాబాద్‌లోని సారంగపూర్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశాడు. డీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి సోషల్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.
చదవండి: మీరే మా వారధులు: డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ సభలో సీఎం రేవంత్
పట్టుపట్టి.. కొలువు కొట్టి
రేగోడ్(మెదక్): ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ఓ గిరిజన బిడ్డ. మండలంలోని కాకంచ తండాకు చెందిన రవికుమార్ స్కూల్ అసిస్టెంట్‌గా జిల్లా మొదటి ర్యాంకు సాధించి బుధవారం నియామకపత్రం అందుకున్నాడు. ఈసందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. తన పన్నెండేళ్ల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని ఎన్నో కలలు కన్నానని చెప్పాడు. తన ఇంట్లో పలువురు ఉన్నత ఉద్యోగాల్లో ఉండగా.. మరికొందరు ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిపారు.
నాన్నకు ప్రేమతో..
రేగోడ్(మెదక్): నాన్న ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడుగా కావాలన్న కల నెరవేరిందని స్కూల్ అసిస్టెంట్‌గా నియామకపత్రం అందుకున్న జిల్లా మొదటి ర్యాంకు ఉపాధ్యాయుడు రేగోడ్ గ్రామానికి చెందిన మహేశ్ తెలిపారు. 2018లో ఉద్యోగం రాలేదని, పట్టు వదలకుండా చదివి ప్రస్తుతం సాధించానని ఆనందం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment