వాజేడు: చదువుకునేందుకు విద్యార్థులున్నా.. ఉపాధ్యాయులు లేని పాఠశాల అది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని జంగాలపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల బదిలీల్లో ఇక్కడ ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు కాచారం, మరొకరు మంగపేట మండలం చుంచుపల్లికి బదిలీ అయ్యారు. ఇక్కడ ఒక ఉపాధ్యాయినిని నియమించగా.. ఆమె బీఈడీ ఓడీలో ఉన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు రోజూ బడికి వచ్చి వెళ్తున్నారు. కాగా, పే సెంటర్ ఇన్‌చార్జ్ హెచ్‌ఎం కేశవరావు ఇతర పాఠశాలల ఉపాధ్యాయుల్లో రోజుకొకరిని జంగాలపల్లి పాఠశాలకు పంపిస్తూ నెట్టుకొస్తున్నారు. కొత్త డీఎస్సీలోనూ ఈ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
66 మందికి ఇద్దరే టీచర్లా?
అధికారుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం.. పర్వత్‌పల్లి పాఠశాలకు తాళం
బషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పర్వత్‌పల్లి ప్రాథమిక పాఠశాలకు గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేశారు. పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 66 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులే ఉన్నారని, అందులో భరత్ అనే ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిని బుధవారం అధికారులు రిలీవ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కొత్త ఉపాధ్యాయులను నియమిస్తుంటే తమ గ్రామానికి ఎందుకు నియమించలేదని నిలదీశారు. టీచర్లు లేని పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్‌ను పాడు చేయలేమని స్పష్టం చేశారు.
కొత్తగా ఉపాధ్యాయులను నియమించే వరకు పిల్లలను బడికి పంపేదిలేదంటూ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాఠశాలలో సద్దాం హుస్సేన్, రవీందర్‌రెడ్డి అనే ఇద్దరు టీచర్లే లిఉన్నారని వీరు ఐదు తరగతులకూ పాఠాలు ఎలా బోధిస్తారో అధికారులే చెప్పాలన్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు చెప్పారు. మరోవైపు త్వరలో కొత్త టీచర్లు వస్తారని, విద్యార్థులను బడికి పంపాలని ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment