సాక్షి, వరంగల్: ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ రుద్రారపు హరీశ్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఓ యువతి వేధింపుల కారణంగానే ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. తమ కుమారుడి మృతికి సదరు యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన యువతి ఏడు నెలల కిందట హరీష్‌కు కాల్ చేసింది. మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. హైదరాబాద్‌లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేదని సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి ఎస్‌ఐ హరీష్ ఆరా తీశాడు. దీంతో అతనికి కొన్ని విషయాలు తెలిశాయి.
ఈ 26 ఏళ్ల యువతిది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం. ఊళ్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. అందులో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయింది. ఈ విషయాలను తెలుసుకున్న హరీశ్.. ఆమె పెళ్లి ప్రతిపాదనను నిరాకరించాడు. ఇంట్లో వాళ్లు చూసే సంబంధాన్ని చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్ల కట్ట సమీపంలోని ఓ రిసార్టుకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. సెటిల్మెంట్ చేసుకోవడానికి ఎస్సై ప్రయత్నించగా, సదరు యువతి అందుకు అంగీకరించకలేదు. అంతేకాకుండా తమ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన హరీశ్ తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. తమ కుమారుడి మృతికి యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ నెల ఆరో తేదీన హరీష్‌కు నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment