పెళ్లికి నిరాకరించి ముఖం చాటేసిన ప్రియుడు
ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించిన యువతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సోషల్ మీడియా ఇన్‌స్ట్రాగామ్‌లో చిగురించిన ప్రేమ ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో కొత్త మలుపు తిరిగింది. ప్రియురాలు ప్రియుడు ఇంటి ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని కోరిన ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల వివరాలు ప్రకారం..
ఇల్లంతకుంట మండలానికి చెందిన రచన అనే యువతికి తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడితో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి ఇరువురు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో రచన తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్న క్రమంలో ఆ విషయాన్ని సాగర్‌కు చెప్పి తనను వివాహం చేసుకోవాలని కోరింది. ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పించాలని కోరింది. అప్పటి నుంచి సాగర్ ముఖం చాటేశాడు.
రచన ఫోన్ నంబర్‌ను బ్లాక్‌లో పెట్టి స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించింది. ఆదివారం గండిలచ్చపేట గ్రామానికి చేరుకొని సాగర్ ఇంటి ఎదుట బైఠాయించింది. యువతి బైఠాయించిన విషయం తెలుసుకున్న తంగళ్లపల్లి ఎస్సై రామ్మోహన్ సఖీ టీమ్‌తో గండిలచ్చపేట చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రచన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment