govt teachers
-
ఒక్క నెల ముచ్చటేనా?
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు(Salaries), పెన్షన్లు(pensions) చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt)... దాన్ని ఒక్క నెల ముచ్చటగా మార్చేసింది. తొలి నెల మినహా తర్వాత నెల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లు అందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. నూతన సంవత్సరంలోను మూడో తేదీ వచ్చినప్పటికీ వేతనాల కోసం సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు. రెండో తేదీ కొంత మంది ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వం జమ చేసింది. అయితే 3వ తేదీ కూడా ఉపాధ్యాయులు ఎవరికీ జీతాలు అందలేదు.జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు జమచేయలేదు. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. యూనివర్సిటీల ప్రొఫెసర్లకు కూడా ఈ నెల వేతనాలు ఇంకా అందలేదు. వైద్య ఆరోగ్య శాఖతోపాటు మరికొన్ని శాఖల్లో పెన్షనర్లకు పెన్షన్లు కూడా అందలేదు.ప్రభుత్వం గత నెల 31వ తేదీ మంగళవారం రూ.5,000 కోట్లు అప్పు చేసినప్పటికీ తమకు వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయమని ఉపాధ్యాయులు అంటున్నారు. వేతనాలు అందకపోవడంతో పిల్లల ఫీజులు, ఈఎంఐ చెల్లింపులకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఒక నెల మాత్రమే కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, ఆ తర్వాత నుంచి ఏ నెలలో కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లు అందరికీ ఒకటో తేదీన వేతనాలు ఇవ్వలే -
మాకు రారా కొత్త టీచర్లు?
వాజేడు: చదువుకునేందుకు విద్యార్థులున్నా.. ఉపాధ్యాయులు లేని పాఠశాల అది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని జంగాలపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల బదిలీల్లో ఇక్కడ ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు కాచారం, మరొకరు మంగపేట మండలం చుంచుపల్లికి బదిలీ అయ్యారు. ఇక్కడ ఒక ఉపాధ్యాయినిని నియమించగా.. ఆమె బీఈడీ ఓడీలో ఉన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు రోజూ బడికి వచ్చి వెళ్తున్నారు. కాగా, పే సెంటర్ ఇన్చార్జ్ హెచ్ఎం కేశవరావు ఇతర పాఠశాలల ఉపాధ్యాయుల్లో రోజుకొకరిని జంగాలపల్లి పాఠశాలకు పంపిస్తూ నెట్టుకొస్తున్నారు. కొత్త డీఎస్సీలోనూ ఈ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.66 మందికి ఇద్దరే టీచర్లా?అధికారుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం.. పర్వత్‌పల్లి పాఠశాలకు తాళంబషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పర్వత్‌పల్లి ప్రాథమిక పాఠశాలకు గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేశారు. పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 66 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులే ఉన్నారని, అందులో భరత్ అనే ఎస్జీటీ ఉపాధ్యాయుడిని బుధవారం అధికారులు రిలీవ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కొత్త ఉపాధ్యాయులను నియమిస్తుంటే తమ గ్రామానికి ఎందుకు నియమించలేదని నిలదీశారు. టీచర్లు లేని పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్‌ను పాడు చేయలేమని స్పష్టం చేశారు. కొత్తగా ఉపాధ్యాయులను నియమించే వరకు పిల్లలను బడికి పంపేదిలేదంటూ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాఠశాలలో సద్దాం హుస్సేన్, రవీందర్‌రెడ్డి అనే ఇద్దరు టీచర్లే లిఉన్నారని వీరు ఐదు తరగతులకూ పాఠాలు ఎలా బోధిస్తారో అధికారులే చెప్పాలన్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు చెప్పారు. మరోవైపు త్వరలో కొత్త టీచర్లు వస్తారని, విద్యార్థులను బడికి పంపాలని ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చూడండి: డీఎస్సీ–2024 ఉపాధ్యాయులు ఉరుకులు.. పరుగులు (ఫొటోలు) -
ఉర్దూ టీచర్.. ఈ తెలుగమ్మాయి!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పుట్టింది హిందూ తెలుగు కుటుంబంలో.. అయితేనేం.. ఉర్దూ మీడియంలో చదువుకుంది. ఉర్దూ ఉపాధ్యాయిని ఉద్యోగం సాధించింది. ఆమె కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి గ్రామానికి చెందిన పొనగంటి జయశ్రీ. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు బిచ్కుంద మండల కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకున్న జయశ్రీ.. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు బాన్సువాడలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ అక్కడి జెడ్పీహైస్కూల్లో చదువుకుంది.ఇంటర్ బాన్సువాడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకుని డిగ్రీ బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అభ్యసించింది. డిగ్రీ అయ్యాక బోధన్‌లోని ఆజాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ పూర్తి చేసింది. గతేడాది టెట్ రాసి ఎంపికైంది. 2024–డీఎస్సీ పరీక్ష రాసి స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ) ఉద్యోగం సాధించి బుధవారం నియామక పత్రం అందుకుంది. తొలి ప్రయత్నంలోనే టెట్, డీఎస్సీలో మంచి ప్రతిభ కనబరచడం విశేషం. మాస్టారైన గొర్రెల కాపరి.. భిక్కనూరు: కష్టాలు ఎదురైతే..ఆగిపోకుండా సాగితే విజయాలు సాధ్యమని నిరూపించాడీ యువకుడు.. చదువు మానేసి గొర్రెలు కాయడానికి వెళ్లాడు.. చదువుపై ఇష్టం, స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ చదువుకొని ప్రస్తుతం డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ఆ విజేత భిక్కనూరుకు చెందిన కోరే కుమార్. గ్రామానికి చెందిన కోరే కమల–బీరయ్య దంపతులకు ఒక కొడుకు కుమార్, కుమార్తె ఉన్నారు.పేద కుటుంబం కావడంతో నాలుగో తరగతిలోనే తల్లిదండ్రులు కుమార్ చదువు మాన్పించారు. దీంతో ఆయన గొర్రెలు కాయడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో చదువుపై మక్కువతో 2014లో ఓపెన్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన కుమార్ పాసయ్యాడు. భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో సీఈసీ, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. నిజా మాబాద్‌లోని సారంగపూర్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశాడు. డీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి సోషల్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.చదవండి: మీరే మా వారధులు: డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ సభలో సీఎం రేవంత్ పట్టుపట్టి.. కొలువు కొట్టి రేగోడ్(మెదక్): ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ఓ గిరిజన బిడ్డ. మండలంలోని కాకంచ తండాకు చెందిన రవికుమార్ స్కూల్ అసిస్టెంట్‌గా జిల్లా మొదటి ర్యాంకు సాధించి బుధవారం నియామకపత్రం అందుకున్నాడు. ఈసందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. తన పన్నెండేళ్ల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని ఎన్నో కలలు కన్నానని చెప్పాడు. తన ఇంట్లో పలువురు ఉన్నత ఉద్యోగాల్లో ఉండగా.. మరికొందరు ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిపారు. నాన్నకు ప్రేమతో.. రేగోడ్(మెదక్): నాన్న ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడుగా కావాలన్న కల నెరవేరిందని స్కూల్ అసిస్టెంట్‌గా నియామకపత్రం అందుకున్న జిల్లా మొదటి ర్యాంకు ఉపాధ్యాయుడు రేగోడ్ గ్రామానికి చెందిన మహేశ్ తెలిపారు. 2018లో ఉద్యోగం రాలేదని, పట్టు వదలకుండా చదివి ప్రస్తుతం సాధించానని ఆనందం వ్యక్తం చేశాడు. -
తెలంగాణలో టీచర్ల పదోన్నతులు, బదిలీలు
-
ఇంటికే ‘ఈ–పాఠం’
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతోంది. విద్యార్థి ఎక్కడున్నా నేర్చుకునేలా పాఠాలను అందిస్తోంది. పాఠ్యాంశాలు విద్యార్థికి మరింత అర్థమయ్యేలా, వివిధ మాధ్యమాల ద్వారా నేర్చుకునేలా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఏపీ ఎస్సీఈఆర్టీ) వీడియో కంటెంట్‌ను రూపొందించింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో మూడు నుంచి 9వ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలను సిద్ధం చేసింది.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్‌పీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందిస్తోంది. మరోవైపు అవే పాఠాలను ట్యాబ్‌ల ద్వారా ఇంటి వద్ద కూడా నేర్చుకునేలా బైజూస్ కంటెంట్‌ను అప్లోడ్ చేసి అందించింది. వీటితోపాటు ఆయా తరగతుల అన్ని పాఠ్యాంశాలకు నిపుణులైన ఉపాధ్యాయులతో 366 వీడియోలను రూపొందించిన ఎస్సీఈఆర్టీ వాటిని యూట్యూబ్ (ఆంధ్రప్రదేశ్ ఈ–పాఠశాల చానల్)లోనూ అప్లోడ్ చేసింది.వీటిని మొబైల్ ఫోన్లోనూ చూసే అవకాశం కల్పించింది. ఈ వీడియోలను విద్యార్థి ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు. తద్వారా బడిలో ఉపాధ్యాయులు బోధించినప్పుడు విస్మరించిన, మరిచిపోయిన అంశాలను తిరిగి మననం చేసుకోవచ్చు. ఐదు డీటీహెచ్ చానళ్ల ద్వారా ప్రసారం టీవీలకు అలవాటుపడిన విద్యార్థుల్లో కూడా చదువుపై ఆసక్తి కలిగించేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విధానంలో ప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు ఈ–విద్య డీటీహెచ్ చానళ్లను కేటాయించింది. వీటిలో ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక చానల్ వినియోగిస్తున్నారు. మిగిలిన నాలుగు చానళ్లను ఆరు నుంచి 9వ తరగతి పాఠ్యాంశాల ప్రసారానికి కేటాయించారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన విద్యా క్యాలండర్, పాఠ్యప్రణాళిక ప్రకారం.. ఆయా నిర్మిత తేదీల్లో డీటీహెచ్ చానళ్లలో ఆ నెల పాఠ్యాంశాలను నిరంతరం ప్రసారం చేస్తారు. ఇలా 100 శాతం కంటెంట్‌తో ఈ–విద్య డీటీహెచ్ చానళ్ల ద్వారా పూర్తి స్థాయి పాఠాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ, జూనియర్ విభాగాల్లో టోఫెల్‌ను ప్రవేశపెట్టడంతో ఆయా పాఠాల బోధనకు మరో మూడు డీటీహెచ్ చానళ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. మొబైల్ యాప్ సైతం.. ఆన్లైన్లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ‘ఈ–పాఠశాల’ మొబైల్ యాప్‌ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్‌పీ, ట్యాబ్, డీటీహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్.. ఇలా అన్ని మాధ్యమాల్లోనూ ఒకే తరహా కంటెంట్, బోధన ఉండేలా వీడియోలను రూపొందించారు. దీంతో విద్యార్థి ఎలాంటి గందరగోళం లేకుండా తన తరగతి పాఠాలను ఈ ఐదు మాధ్యమాల్లో సులువుగా నేర్చుకోవచ్చు. అన్ని కేబుల్ నెట్‌వర్క్‌ల్లోనూ ప్రసారం బడిలో ఉపాధ్యాయులు బోధించే అన్ని పాఠాలను ఈ–కంటెంట్ రూపంలోకి మార్చాం. నిష్ణాతులైన సబ్జెక్టు ఉపాధ్యాయులతో సిలబస్ వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వీడియో పాఠాలు రూపొందించాం. ఈ–పాఠశాల చానళ్లను అందించేందుకు ప్రైవేటు టీవీ నెట్వర్క్ ప్రొవైడర్లు కూడా అంగీకరించారు. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రసారమవుతున్నాయి. త్వరలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంట్లో టీవీ ద్వారా విద్యార్థులు పాఠాలు వినొచ్చు. అలాగే యూట్యూబ్‌లో కూడా ఎప్పుడైనా వీటిని చూడొచ్చు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతులు 3 నుంచి 9 తరగతి వరకు వీడియో కంటెంట్ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల్లోని కంటెంట్‌ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖకు అందించింది. వీటిని యధావిధిగా విద్యార్థులకు ఐఎఫ్‌పీల ద్వారా బోధించడంతోపాటు ట్యాబ్‌ల్లోనూ అప్లోడ్ చేశారు. అయితే, ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్‌తోపాటు కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ఇందులో ప్రధానంగా మూడో తరగతి విద్యార్థులకు.. తెలుగు, ఇంగ్లిష్ , మ్యాథ్స్, ఈవీఎస్, నాలుగు, ఐదు తరగతులకు.. తెలుగు, ఇంగ్లిష్ , ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు.. తెలుగు, ఇంగ్లిష్ , హిందీ సబ్జెక్టుల్లో వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్‌లో పాఠాలు అందరికీ అందుబాటులో ఉండగా.. ప్రైవేటు నెట్వర్క్ ప్రొవైడర్లు చాలా ప్రాంతాల్లో డీటీహెచ్ చానళ్లను అందించడం లేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన డీటీహెచ్ చానళ్లను అన్ని ప్రైవేటు కేబుల్ నెట్వర్క్ సంస్థలు కూడా అందించేలా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను రూపొందించనుంది. -
టీచర్ల ఆస్తి ప్రకటన జీవోపై వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: టీచర్ల వార్షిక ఆస్తి ప్రకటనపై జీవోను తెలంగాణ సర్కార్ నిలిపివేసింది. విద్యా శాఖ ఉద్యోగులు వార్షిక ఆస్తి ప్రకటన చేయాలని విద్యా శాఖ సంచాలకులు జారీ చేసిన ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యా శాఖ కార్యదర్శిని ఆదేశించారు. చదవండి: టీచర్ల సీనియారిటీపై కసరత్తు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి తప్పసరి చేస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది. టీచర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. -
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల విన్నూత నిరసన
-
సీఎం కేసీఆర్‌వి తుగ్లక్ నిర్ణయాలు: బండి సంజయ్
సాక్షి, వరంగల్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల విషయంలో సీఎం కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వరంగల్‌లోని బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బీజేపీ రాజకీయ శిక్షణా తరగతులు గురువారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంజయ్ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 36 నెలల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంటే.. సీఎం కేసీఆర్ 36 నెలలుగా ఫాంహౌస్‌లో పడుకొని.. ఆగమేఘాలపై జీఓ 317 జారీ చేసి ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాడని ఆరోపించారు. స్థానికత కోసం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే.. అదే స్థానికత పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులను చీల్చి గోస పుచ్చుకుంటున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన 370 యాక్ట్ వచ్చినట్లు ఉందన్నారు. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులు, భార్యాభర్తల బదిలీల్లో మూర్ఖంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, అన్యాయం జరిగిందని అర్జీ పెట్టుకున్నా పరిష్కరించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన అన్యాయాన్ని పునః పరిశీలించి అందరికి న్యాయం చేయాలని, 317 జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఉద్యోగుల పక్షాన ఉద్యమ కార్యాచరణ ప్రకటించక తప్పదని సంజయ్ హెచ్చరించారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలి.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలన వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రాబోయే సాధారణ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా పనిచేసినప్పుడే పార్టీ నిర్మాణం బలంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకురాలు బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వి.శ్రీ రాములు, జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, నాయకులు చింతాకుల సునీల్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: దేశాన్ని అమ్మకానికి పెట్టి కమ్యూనిస్టులపై విమర్శలా! -
ఉద్యోగుల బదిలీలలో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు జిల్లాల కేటాయింపు వ్యవహారంలో నకిలీ అనారోగ్య సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. దీనివల్ల అసలైన వ్యాధిగ్రస్తులకు, దివ్యాంగులకు అన్యాయం జరిగే వీలుందని పలువురు వాపోతున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు, దివ్యాంగులను బదిలీల నుంచి మినహాయించే నిబంధన ఉండటంతో దీన్ని అడ్డం పెట్టుకొని కొందరు నకిలీ వ్యాధులు ఉన్నట్లు సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారనే ఆరోపణలు అన్ని జిల్లాల నుంచి వస్తున్నాయి. అయినా ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వాటన్నింటినీ పరిశీలించడం ఎలా అని ఉన్నతాధికారులు అంటున్నారు. ►వరంగల్ జిల్లాలో 40 మందికిపైగా ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులొచ్చాయని సమాచారం. దీనిపై కలెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఇంతవరకూ విచారణకు కూడా ఆదేశించలేదని ఓ ఉపాధ్యాయుడు తెలిపాడు. ►మేడ్చల్, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ 10 మందికిపైగా టీచర్లు చిన్నచిన్న సర్జరీలు చేయించుకున్నప్పటికీ తమకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లు సర్టిఫికెట్లు పుట్టించి బదిలీలు లేకుండా ప్రయత్నిస్తున్నారని స్థానిక ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఉన్నతాధికారుల బంధువులూ ఉన్నారని చెబుతున్నారు. ►ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో కొందరు ఉపాధ్యాయులు సమర్పించిన పత్రాలపై అధికారుల్లోనూ అనుమానాలున్నట్లు తెలిసింది. సీనియారిటీపైనా సందేహాలు! టీచర్ల సీనియారిటీ జాబితా తయారీపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జరిగిన ప్రమోషన్లు, బదిలీల్లో కొందరు అధికారులు అవినీతికి పాల్పడి సస్పెండైన ఉదంతాలున్నాయని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. ఇలాంటి అధికారులు ప్రస్తుతం పారదర్శకంగా సీనియారిటీ జాబితాను తయారు చేస్తారా? అని ఖమ్మంకు చెందిన ఓ ఉపాధ్యాయుడు అనుమానం వ్యక్తం చేశాడు. కేడర్ స్ట్రెంత్, రోస్టర్ విధానం, వర్కింగ్ పోస్టులు, క్లియర్ వెకెన్సీలు ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ స్పష్టతలేదన్నాడు. జిల్లాలోని వర్కింగ్, ఖాళీ పోస్టులను ఏ దామాషా ప్రకారం భర్తీ చేయనున్నారో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదని గుర్తుచేశాడు. వితంతువులకు, ఒంటిరి మహిళలకు, తీవ్ర వ్యాధిగ్రస్థులకు రక్షణ లేదని, మీడియం పంచాయితీలో సీనియారిటీని ఎలా రూపొందించాలో స్పష్టత ఇవ్వలేదని పలువురు టీచర్లు అంటున్నారు. -
తమిళనాడు గర్ల్స్ హైస్కూల్స్‌లో...మహిళా టీచర్లే మేలా!
తమిళనాడు ఇప్పుడు టీచర్ల లైంగిక వేధింపులతో ఉడుకుతోంది. వరుసబెట్టి టీచర్ల లైంగిక దుశ్చర్యలను విద్యార్థినులు బయటపెడుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇకపై గర్ల్స్ హైస్కూల్స్‌లో అందరూ మహిళా టీచర్లనే నియమించే ఆలోచన చేస్తోంది. అయితే అది సరైన నిర్ణయమేనా అని చర్చ జరుగుతోంది. చేసిన పాపం ఊరికే పోదని పెద్దలు అంటారు. విద్యార్థినుల అమాయకత్వాన్ని, నిస్సహాయతను, బెదురును, భయాన్ని ఆసరాగా చేసుకుని వారిపై లైంగిక దుశ్చర్యలకు పాల్పడిన టీచర్లను ఇప్పుడా పాపం వెంటాడుతోంది. తమిళనాడులో ఇప్పటికి నలుగురు టీచర్లు అరెస్ట్ అయ్యారు. అయితే వీరిలో ఇద్దరు ఆ పాఠశాలల పూర్వవిద్యార్థుల ఫిర్యాదుల వల్ల కావడం గమనించాల్సిన విషయం. బ్యాచెస్ వెళ్లిపోయాయి... మనం బాధించిన విద్యార్థినులు ఇప్పుడు లేరు... మన పబ్బం గడిచిపోయింది అని కీచకచర్యలకు పాల్పడిన టీచర్లు ఎవరైనా అనుకుంటూ ఉంటే వారు ఇకపై మనశ్శాంతిగా ఉండే వీలులేదని, ఏ క్షణమైనా వారిపై పూర్వవిద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చని, వాటిపై వెంటనే చర్యలు ఉంటాయని తమిళనాడులో జరుగుతున్న ఉదంతాలు నిరూపిస్తున్నాయి. మూడు వారాల క్రితం మొదలు మూడు వారాల క్రితం చెన్నైలోని ప్రతిష్టాత్మక పద్మ శేషాద్రి బాలభవన్ స్కూల్ విద్యార్థినులు ఆ స్కూల్లో పని చేసే కామర్స్ టీచర్ రాజగోపాలన్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేశారు. స్కూల్లో చదువుతున్న విద్యార్థినులతో పాటు చదివి బయటకు వెళ్లిన విద్యార్థినులు కలిసి సోషల్ మీడియాలో నేరుగా రాజగోపాలన్‌పై పోస్ట్ పెట్టడంతో దుమారం రేగింది. వెంటనే తమిళ సెలబ్రిటీలు చాలామంది విద్యార్థినుల రక్షణ గురించి, వాళ్లకు జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడటం మొదలెట్టారు. రాజగోపాలన్ తన ఆన్లైన్ క్లాసుల్లో కేవలం టవల్ కట్టుకుని హాజరవడం, వాట్సప్‌లో తప్పుడుగా వ్యవహరించడం ఇవన్నీ విద్యార్థినులు పెద్దలకు పోలీసులకు తెలియచేశారు. ఈ సంఘటనకు వచ్చిన మద్దతు చూశాక మెల్లగా ఇతర స్కూళ్లలో ఇలాంటి టీచర్ల వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థినులు బయటకు వచ్చి ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. వీటి ఫలితంగా మరో కామర్స్ టీచర్, ఒక పి.టి టీచర్, ఒక కేంద్రీయ విద్యాలయ టీచర్ అరెస్ట్ అయ్యారు. కేంద్రీయ విద్యాలయ టీచర్‌పై ఏకంగా 22 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. కీచక ఆలోచనలు కీచక టీచర్లు విద్యార్థినులను వేధించడానికి రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. స్కూల్ టైమ్ కంటే ముందు రమ్మని విద్యార్థినులను కోరడం, తల్లిదండ్రులు లేని సమయంలో పలకరింపుగా స్టూడెంట్ ఇంటికి వెళ్లడం, తండ్రి లాంటి వాణ్ణి అంటూ చనువుగా తాకడం, ఏదైనా క్యాంప్‌కు తీసుకెళ్లినప్పుడు అవకాశం తీసుకోవడం, ఫోన్లలో వీడియోకాల్స్‌లో అర్ధనగ్నంగా కనిపించడం... ఇవన్నీ విద్యార్థినులకు వేదన కలిగిస్తున్నాయి. కొందరు మాత్రమే తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళుతున్నారు. కొందరు స్కూలు యాజమాన్యాల దృష్టికి తీసుకువెళుతున్నారు. అయితే ఇలాంటి కీచక టీచర్లు విద్యార్థినుల వద్ద తప్ప మిగిలిన ప్రవర్తన అంతా ఆదర్శప్రాయంగా ఉండేలా జాగ్రత్త పడుతూ ఉండటంతో మేనేజ్మెంట్లు అయోమయంలో పడటం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఇలాంటి ప్రవర్తన ఎదురుకాని ఇతర విద్యార్థినులు ‘సార్ మంచోడ’న్న కితాబు ఇస్తుండటంతో సమస్య వస్తోంది. అయితే ప్రస్తుతం చెన్నైలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి టీచర్లో ఒకరికి మించి ఆరోపణలు చేస్తుండటంతో వారు ‘పోక్సో’ చట్టం, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం తీవ్ర విచారణ ఎదుర్కొనాల్సి ఉంటుంది. నివారణ చర్యలు తమిళనాడు ప్రభుత్వం జరుగుతున్న పరిణామాల పట్ల వెంటనే స్పందించింది. ప్రతి స్కూల్లో విద్యార్థినుల కోసం కమిటీలు వేయడం ఒక నిర్ణయంగా తీసుకుంది. అంతేకాదు, ఆన్లైన్ క్లాసుల నిర్వహణ గురించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆన్లైన్ క్లాసుల సమయంలో టీచర్లు కాని, విద్యార్థులు కాని స్కూళ్లలో హాజరైనట్టుగా ఫార్మల్ బట్టలు ధరించాలని చెప్పింది. అంతే కాదు... లైంగిక వేధింపుల నివారణకు ఇకపై అన్ని ప్రభుత్వ బాలికా పాఠశాలల్లో అందరూ మహిళా టీచర్లనే నియమించాలనే ఆలోచన కూడా చేస్తోంది. అయితే ఈ ఆలోచన చర్చకు తావిస్తోంది. అందరూ మహిళా టీచర్లనే నియమిస్తే విద్యార్థినులకు జెండర్‌కు సంబంధించిన వివేచన, స్పృహ బొత్తిగా తప్పిపోయే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ‘కేవలం మహిళలనే నియమించాలనే నియమం వల్ల మంచి టీచర్ కాకపోయినా స్త్రీ కాబట్టి నియమించే ప్రమాదం ఉంది’ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ‘మహిళా టీచర్లను నియమించడం కంటే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కఠినమైన చట్టాల అమలు గురించి ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది’ అని మరికొందరు అంటున్నారు. గురువుకు సంస్కారం సమాజంలో గురువుకు ఉన్న స్థానం మరెవరికీ లేదు. తల్లితండ్రి తర్వాత గురువునే పూజించాలని మన ధర్మాలు చెబుతున్నాయి. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత పిల్లలు గడిపేది గురువుతోనే. గురువుల వ్యక్తిత్వం, ప్రవర్తన పిల్లలపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. తాము గౌరవించే గురువుల్లో ఒకరిద్దరైనా సరే తమ పట్ల మలినంగా వ్యవహరిస్తే వారి మనసులకు చాలా గట్టి దెబ్బ తగులుతుంది. అయితే గురువుల ఎంపిక గురించి ఇప్పుడు మేనేజ్మెంట్లకు ఎలాంటి పట్టింపు ఉంది అనేది చర్చనీయాంశం. సబ్జెక్ట్‌లో బాగుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కాని వారి వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉంది, వారు ఏ పుస్తకాలను చదివారు, ఏ భావధారను కలిగి ఉన్నారు, ఏ విలువలు ప్రదర్శిస్తున్నారు అనేది గమనించే అవకాశం లేదు. సాహిత్య స్పర్శ, సామాజిక స్పృహ ఉన్న గురువుల సంఖ్య చాలా తక్కువ ఉంటోందని గతాన్ని ప్రస్తుతాన్ని పోల్చి చూసే వారు అంటుంటారు. విద్యార్థులకు సత్ప్రవర్తనను నూరి పోసే గురువుల సదాచారాల ఉన్నతి కోసం సంస్థాగతమైన శిబిరాలు, శిక్షణల గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సి ఉంటుంది. గురువు అనే అద్దం నుంచే ఈ సమాజం అనే ప్రతిబింబం పుడుతుందని గురువులందరూ అర్థం చేసుకుంటే విద్యార్థుల నుంచి వారికి సదా జేజేలే అందుతాయి. – సాక్షి ఫ్యామిలీ -
ప్రమోషన్ టైమ్..
సాక్షి, శ్రీకాకుళం : పదోన్నతుల కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యాశాఖామాత్యులుగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పదోన్నతుల ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు సోమవారం జిల్లా విద్యాశాఖకు అందాయి. దీంతో విద్యాశాఖ అధికారులు ఆఘమేఘాలపై సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు. జిల్లాలో 440 హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ యాజమాన్యాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. 400 పోస్టులు జెడ్పీ, 40 ప్రభుత్వ యాజమాన్యం కేటగిరీల్లో ఉన్నాయి. సబ్జెక్టు వారీగా చూస్తే 59 గ్రేడ్ –2 హెచ్ఎం పోస్టులు జిల్లా పరిషత్ పాఠశాలలోనూ, 8 పోస్టులు ప్రభుత్వ పాఠశాలలో, 113 పోస్టులు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయ పోస్టులు జిల్లా పరిషత్ పాఠశాలల్లో, 8 పోస్టులు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల విషయానికి వస్తే ఇంగ్లీష్ సబ్జెక్టులో–11, గణితం– 14, పీ ఎస్– 5, బయోలాజికల్ పోస్టులు– 17, ఎస్ ఎస్– 101, స్కూల్ అసిస్టెంట్ తెలుగు– 41, హిందీ –17, ఒరియా– 3 , పీడీ– 19 పోస్టులు జెడ్పీలో పదోన్నతులపై భర్తీకి ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలో గణితం 2, పీఎస్–1, ఎస్ఎస్–6, తెలుగు –4, హిందీ–4, ఒరియా–2, పీడీ పోస్టులు 5 పదోన్నతులతో భర్తీ కానున్నాయి.దాదాపు మూడున్నరేళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇది సాధ్యం కాలేదు. ఉమ్మడి సర్వీస్ రూల్‌ను సాకుగా చూపించి తాత్సారం చేశారు. ఇది వరలా అడ్‌హక్ రూల్స్ రూపొందించి పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేసినా అరణ్య రోదనగానే మిగిలింది. ఈ పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఈ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ అయితే అర్హత గల ఉపాధ్యాయులకు న్యాయం జరగటంతోపాటు, సబ్జెక్టు టీచర్ల కొరత కూడా తీరుతుంది. పదోన్నతులకు నోచుకోక వందలాది మంది ఉపాధ్యాయులు గత మూడున్నరేళ్లలో పదవీ వరమణ పొందారు. వెబ్సైట్లో సీనియర్ల జాబితా పదోన్నతులకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తర్వులు వెలువడ్డాయి. సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో పొందుపరిచాం. ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 27 తేదీలోగా అప్పీల్ చేసుకోవాలి. త్వరలో పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేస్తాం. – ఎం.సాయిరాం, జిల్లా విద్యాశాఖ అధికారి -
163 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి డుమ్మా కొట్టిన టీచర్లపై జిల్లా విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేపర్ల మూల్యాంకనానికి గైర్హాజరైన 163 మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీచేసింది. విద్యాశాఖ చర్యలతో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేగింది. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్ పాఠశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈనెల 15న మూల్యాంకనం ప్రారంభంకాగా.. తొలిరోజు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్ల మూల్యాంకనానికి 163 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు (స్కూల్ అసిస్టెంట్లు) అనధికారికంగా గైర్హాజరయ్యారు. అన్ని పేపర్ల మూల్యాంకనం ఈనెల 26వ తేదీకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 11 రోజుల్లోనే ఆరు లక్షల జవాబు పేర్లను దిద్దాల్సిన బాధ్యతను సుమారు మూడు వేల మంది టీచర్లకు అప్పగించారు. స్వల్ప సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉండగా.. టీచర్లు విధులకు గైర్హాజరయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన డీఈఓ కె.సత్యనారాయణరెడ్డి.. డుమ్మా కొట్టిన టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. సీసీఏ నియయ నిబంధనలు–1991 ప్రకారం సర్వీసు నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో పేర్కొనాలని నోటీసుల్లో ప్రస్తావించారు. 24 గంటలలోగా వివరణ ఇవ్వకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇదీ పరిస్థితి.. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు, వికలాంగులు, ఏడాదిలోపు శిశువు ఉన్న టీచర్లకు మూల్యాంకన విధులకు సాధారణంగా గైర్హాజరవుతారు. దీన్ని ఎవరూ తప్పబట్టరు. అయితే ఒక్క సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లే భారీగా డుమ్మా కొట్టిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే వారు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్‌లో రిపోర్టు చేయలేదని తెలుస్తోంది. వాస్తవంగా జవాబు పత్రాల మూల్యంకనం.. టీచర్ల విధుల్లో భాగం. పైగా ఈ విధులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇటువంటి కీలక బాధ్యతలు చేపట్టాల్సిన ఉపాధ్యాయలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని జిల్లా విద్యాశాఖ ఉపేక్షించడం లేదు. వాస్తవంగా గతంలో పోల్చుకుంటే మూల్యాంకనం ఈసారి కొంత ఆలస్యమైంది. అంతకుముందు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడానికి ముందే వాల్యుయేషన్ ముగిసేది. అయితే ఇటీవల లోక్‌సభ ఎన్నికలు రావడంతో మూల్యాంకనానికి ఆలస్యమైంది. సెలవు రోజుల్లో మూల్యాంకనం చేస్తే ఉపాధ్యాయులు సంపాదిత సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. సంపాదిత సెలవులకు బదులుగా పాత ఉత్తర్వుల ప్రకారం టీఏ, డీఏలు ఇస్తోంది. కచ్చితంగా సంపాదిత సెలవులే ఇవ్వాలని టీచర్లు పట్టుబడుతున్నారు. పైగా కొత్త జిల్లాల ప్రకారం స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు అనుగుణంగా క్యాంప్‌ను కొనసాగిస్తున్నారు. ఈ కేంద్రానికి వికారాబాద్, మేడ్చల్ జిల్లాల నుంచి రాకపోకలు జరిపేందుకు తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైనా సర్కారు స్పందించలేదు. ఈ రెండు కారణాల వల్లే కొందరు టీచర్లు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. మరికొందరు మూల్యాంకనం తమ బాధ్యత కాదన్నట్లుగా భావించి పెడచెవిన పెట్టినట్లు సమాచారం. -
ఇద్దరు ప్రధానోపాధ్యాయుల సస్పెన్షన్
గుండాల: మండలంలోని రెండు గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఐటీడీఏ పీఓ పమెల సత్పథి సస్పెన్షన్ వేటు వేశారు. మరో హెచ్ఎంతో పాటు ఒక ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. గురువారం ఆమె ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసి బోధన తీరును పరిశీలించారు. తొలుత కాచనపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యాబోధనను పరిశీలించారు. పాఠశాల హెచ్ఎం లక్ష్మి, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కొరవడిందని గుర్తించారు. చేయూత పథకం పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని, డైరీ రాయించడం లేదని, చదివించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్‌లో విద్యార్థులు పూర్తిగా వెనుకబడి ఉంటున్నారని అన్నారు. శంభూనిగూడెం పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆ రెండు పాఠశాలల హెచ్ఎంలు లక్ష్మి, వసంతపై సస్పెన్షన్ వేటు విధించారు. శంభునిగూడెం పాఠశాల ఇంగ్లిష్ ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మామకన్ను బాలుర ఆశ్రమ పాఠశాలలోనూ పరిస్థితి బాగా లేదని తెలుసుకుని అక్కడి హెచ్ఎం నరేందర్‌కు కూడా షోకాజ్ నోటీసు అందించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
పనిచేయని బయోమెట్రిక్
సాక్షి, ఏటూరునాగారం: రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన బయోమెట్రిక్ హాజరు విధానం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కుంటుపడింది. ఇందుకు సాంకేతిక కారణాలతో పాటు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, యాజమాన్య పాఠశాలలు మొత్తం 783 ఉండగా ఉపాధ్యాయులు 2,248 మంది పనిచేస్తున్నారు. మొత్తం 37,199 మంది విద్యార్థులు చదువుతున్నారు. బయోమెట్రిక్ యంత్రాలు ఈ ఏడాది జూన్‌లో వచ్చాయి. ఆగస్టు నుంచి ఉపయోగిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో నెట్వర్క్ సరిగా లేకపోవడంతో 379 బయోమెట్రి క్ యంత్రాలు మూలనపడి ఉన్నాయి. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం 404 బయోమెట్రిక్ యంత్రాల ద్వారా ఉపాధ్యాయులు హాజరు నమోదు చేసుకుంటున్నారు. కొన్ని పాఠశాలలో సిగ్నల్ అందక భవనాల పైకి, పాఠశాల ఆవరణలోకి యంత్రాన్ని తీసుకెళ్లి హాజరు వేసుకో వాల్సిన పర్థితులు నెలకొన్నాయి. మొదలుకాని పరిశీలన ప్రక్రియ విద్యాశాఖ రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి రోజు వారీ బయోమెట్రిక్ హాజరు నివేదికను కోరుతోం ది. పాఠశాలల్లో వేలిముద్రల హాజరును పరిశీలించేందుకు క్లస్టర్, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో లాగిన్లను ఏర్పాటు చేశారు. అన్ని స్థాయిల్లో పరిశీలించే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. యంత్రాలు సిద్ధం చేసినప్పటికీ వందలాది పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు వీటిని వివిధ కారణాలతో ప్రారంభించడం లేదు. విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం.. బయోమెట్రిక్ హాజరు నమోదులో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పలు పాఠశాలల్లో విద్యార్థుల లాగిన్ ఐడీ నంబర్లు,వేలి ముంద్రలు సరిపోవడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వా రం రోజుల విద్యార్థుల హాజరు పరిశీలిస్తే 4 శాతం కంటే తక్కువగా నమోదుకావడం గమనార్హం. ఆసక్తి చూపని కొందరు టీచర్లు.. బయోమెట్రిక్‌లో హాజరు నమోదుకు కొందరు ఉ పాధ్యాయులు ఆసక్తి చూడపంలేదు. ఇందుకు సాంకేతిక కారణాలు ఉన్నాయి. జిల్లాలో 2,248 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా చాలా మంది వివిధ ప్రాంతాలకు వెళ్లారు. యంత్రాల్లో కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుల ఐడీ లేకపోవడంతో లాగిన్ అవ్వ డం లేదు. వీరి విషయం పక్కనబెడితే బదిలీ కా కుండా అదే పాఠశాలలో పనిచేస్తున్న కొంత మం ది టీచర్లు సైతం బయోమెట్రిక్ హాజరుపై నిర్లక్ష్యం గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానంపై విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు అవగాహ న కల్పించడం లేదని పలువురు చెబుతున్నారు. మూడు జోన్లు.. పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు ప్రార్థన సమ యం కంటే ముందుగానే బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో బయోమెట్రిక్ ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు గ్రీన్ జోన్, 9.35 నుంచి 9.45 వరకు ఎల్లో జోన్లో ఉంటుంది. ఆ తర్వాత ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులకు రెడ్‌జోన్ చూపిస్తోంది. సాయంత్రం 4.45 నుంచి 5 గంటల వరకు గ్రీన్‌జోన్ చూపిస్తుంది. మారని పరిస్థితి.. మధ్యాహ్న భోజన విషయంలో తక్కువ పిల్లలు ఉంటే ఎక్కువ పిల్లలు ఉన్నట్లు నమోదు చేసుకొని ఏజెన్సీ, హెచ్ఎంలు నిధులు స్వాహా చేస్తున్నారని, దీనిని కట్టడి చేయడానికి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలను అమలులోకి తెచ్చారు. బయోమెట్రిక్ యంత్రానికి విద్యార్థుల ఆధార్‌ను లింక్ చేశా రు. అలాగే ఐరిష్ కనుపాప ద్వారా హాజరు వేసే విధంగా ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థుల వేలిముద్రలు నమోదు కావడంలేదు. ఐరిష్ సైతం పనిచేయడం లేదు. సిమ్ కార్డులు మార్చుతున్నారు బయోమెట్రిక్ మిషన్లకు సెల్ సిగ్నల్స్ అందకపోవడంతో ఆ ప్రాంతంలో పనిచేసే సిమ్ కార్డులను మార్చుతున్నారు. పిల్లలకు ఐరీష్, ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల చేతి వేలి ముద్రలు పడడం లేదు. సమస్య పరిష్కరించడానికి మండలానికి ఒక ఆధార్ నమోదు మిషన్ ఏర్పాటు చేసి ఆధార్ అనుసంధానం చేయడంతోపాటు కొత్తవారికి సైతం నమోదు చేస్తున్నాం. రోజుకు వంద మంది పిల్లలకు ఆధార్ తీయడం వల్ల ఆలస్యమవుతోంది. మిషన్లతో సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. – శ్రీనివాస్‌రెడ్డి, డీఈఓ -
టీచర్ల అరెస్ట్‌ను ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఉద్యోగులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. న్యాయమైన తమ డిమాండ్ల కోసం ఆందోళన చేపట్టిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యవహరించిన తీరును ఏపీ ప్రతిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన ‘సీపీఎస్ కోసం అమరావతిలో నిరసన వ్యక్తం చేసిన టీచర్లను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. Strongly condemn the arrest of teachers protesting for the abolition of CPS in Amaravati. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 18, 2018 అంతకు ముందు ఉద్యోగుల అక్రమ అరెస్టులపై పీడీఎఫ్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్‌పై వైఎస్ జగన్ ఇప్పటికే తన వైఖరి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో టీడీపీ తన వైఖరి వెల్లడించడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఎన్నడు లేని విధంగా ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. సీపీఎస్ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్‌పై చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. ఏపీలో వేలాది మంది ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారని.. ప్రభుత్వం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం -
చట్టం.. వారి ఇష్టం!
ఉన్న చట్టాలనే సరిగా అమలు చేయడంలేదు.. మళ్లీ కొత్త చట్టాలతో బోలెడు నిబంధనలు.. ముందస్తు చర్చలు శూన్యం.. వారి నిర్ణయమే శిరోధార్యం.. టీచర్ అడ్మినిస్ట్రేషన్ (ఉపాధ్యాయ పాలన), టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ (ఉపాధ్యాయ బదిలీలు) ప్రత్యేక చట్టాలకు సంబంధించి ఇటీవల ముసాయిదా బిల్లులను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచారు. దీనిపై ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరారు. కొత్త చట్టాలను తీసుకొస్తూ తమ జీవితాలతో ఆడుకుంటోందని, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై ఉపాధ్యాయులు, సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కడప ఎడ్యుకేషన్/బద్వేలు: ఉపాధ్యాయులకు సంబంధించి ఉన్న చట్టాలను ప్రభుత్వం అమలు చేయకపోగా కొత్తవి తేవడంపై ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొంతన లేని నిర్ణయాలతోపాటు కొత్తకొత్త చట్టాలను తీసుకొస్తూ తమ జీవితాలతో ఆటలాడుకుంటుందని వాపోతున్నారు. టీచర్ అడ్మిషన్(ఉపాధ్యాయ పాలన), టీచర్స్ ట్రాన్సఫర్ యాక్ట్ (ఉపాధ్యాయ బదిలీలు) ప్రత్యేక చట్టాలకు సంబంధించి ఇటీవల ముసాయిదా బిల్లులను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచి ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరారు. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశంలో బిల్లును ఆమోదించి, చట్టం చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో మాటమాత్రమూ చర్చింకుండానే విద్యాశాఖ ఏకపక్షంగా బదిలీల ముసాయిదా చట్టాన్ని రూపొందించడంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత విషయంలో కోర్టులు సైతం జోక్యం చేసుకోవడానికి వీలులేకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు రూపొందించిందని ఆరోపిస్తుస్తున్నారు. గుడ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాలతో జిల్లాలో పలు యాజమాన్యాలలో పనిచేస్తున్న దాదాపు 12 వేలమంది ఉపాధ్యాయులపై ప్రభావం చూపనుంది. సౌకర్యాలు శూన్యం జిల్లాలోని పలు పాఠశాలలకు సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోక పోగా ఉపాధ్యాయులకు కొత్తకొత్త చట్టాలెందుకని పలువురు విద్యావేత్తలు, మేధావులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించి తర్వాత ఉపాధ్యాయుల అడ్మినిస్ట్రేషన్ , బదిలీల చట్టాల గురించి ఆలోచించాలని వారు హితువు పలుకుతున్నారు. సర్వీస్ ఆధారంగా ఉపాధ్యాయులకు సంబంధించి పదోన్నతులు కల్పించాల్సిన ప్రభుత్వం దాని గురించి పట్టించుకోక పోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా ఉపాధ్యాయులకు సంబంధించిన హక్కులను అమలు చేసి తర్వాత నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని పలువురు మేధావులు తెలియజేస్తున్నారు. బదిలీ విధానం ఇలా.. గత ఏడాది ఆగస్టు 2017 జరిగిన బదిలీల్లో ఉపాధ్యాయుల సర్వీస్పాయింట్లతోపాటు ప్రతిభ ఆధారిత పాయింట్లద్వారా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. పనితీరు సూచికలు తొలగించాలని కోరుతూ ఉపాధ్యాయులు పెద్దఎత్తున ఆందోళన చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. బదిలీలపైన ఇంత గందరగోళం జరిగినా, ఉపాధ్యాయులు, సంఘాలురోడ్డు ఎక్కి ఆందోళన చేసినా ప్రభుత్వం అవన్నీ మరచిపోయి తిరిగి శాశ్వత బదిలీల చట్టం పేరుతో తీసుకొచ్చిన ముసాయిదాలో మళ్లీ అవే పాయింట్లు 70 శాతం మేర తీసుకోవడం వివాదాస్పదం అవుతుంది. ఉపాధ్యాయుల బయోమెట్రిక్హాజరుకు 10 పాయింట్లు, సంగ్రహణాత్మక పరీక్షల్లో విద్యార్థుల సామర్థ్యానికి 15 పాయింట్లు ఫ్రొఫిసిడల్ డెవలఫమెంట్ 15 పాయింట్లు, జాతీయ, రాష్ట్ర అవార్డులు పొందిన వారికి 5 పాయింట్లు, రీసోర్సు పర్సన్లుగా పనిచేసిన వారికి 5 పాయింట్లు, డిజిటల్ విద్యాబోధనలో పాల్గొన్నందుకు 15 పాయింట్లు, సైన్సు, లెక్కల ప్రదర్శన శాలలకు 5 పాయింట్లు స్టూడెంట్ ఎన్రోల్మెంట్కు 5 పాయింట్లు, మధ్యాహ్నం భోజన వివరాలను ఆన్లైన్లో పంపినందకు 5 పాయింట్లు, పాఠశాల యాజమాన్య సమావేశాలు నిర్వహించినందుకు 5 పాయింట్లు, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నందుకు 4 పాయింట్లు, విద్యార్థులను డ్రాపౌట్స్‌గా మారకుండా చూసినందుకు 8 పాయింట్లు ఇలా వందపాయింట్లను ప్రామాణికంగా తీసుకుని బదిలీలు చేపట్టనున్నారు. నియంతలా వ్యవహిరిస్తున్నప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ పాలన ఉపాధ్యాయుల మనోభావాలకు విరుద్ధంగా ఉంది. ఉపాధ్యాయ సంఘాల వాదనను పెడచెవిన పెడుతూ నియంతలా వ్యవహరిస్తోంది. ఎటువంటి శాస్త్రీయత లేని అసంబద్ధమైన విషయాలను ప్రమాణికంగా తీసుకుని ఉపాధ్యాయ బదిలీలకు ముడిపెట్టడం సరైయిందికాదు. చాలా పాఠశాలల్లో సర్వర్లు పనిచేయక బయోమెట్రిక్ హాజరులో ఇబ్బంది ఎదుర్కొంటుంటే పాయింట్లు పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదు. – శ్యాంసుందర్‌రెడ్డి, ఏపీటీఎఫ్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆందోళన చేస్తాం గత బదిలీల్లో ప్రతిభ ఆధారిత పనితీరు సూచికలు తొలగించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం తిరిగి అవే నిబంధనలనే బదిలీల చట్టంలో పొందుపరచడం అంటే ఉపాధ్యాయులను భయాంధోళనకు గురి చేయడమే. చట్ట నిబంధనలను సవరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతాం. – రమణారెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాఠశాలకు సౌకర్యాలు కల్పించాలి పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి. నేటికి చాలా పాఠశాలల్లో సరైన మరుగుదొడ్లు, మంచీనీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల నిర్వహణ పేరుతో ఇచ్చే గ్రాంటు కరెంటు బిల్లులకు సరిపోవడం లేదు. వాటి గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఉపాధ్యాయుల గురించి ఆలోచిస్తుంది. ఇదెక్కడి న్యాయం – బాలగంగిరెడ్డి, ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉపాధ్యాయులకు ప్రత్యేకమా...? కొంత కాలంగా పాయింట్ల విధానాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2017 బదిలీలలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీనిపై నిరసన వ్యక్తం చేశారు. మరోసారి తెరపైకి పాయింట్ల విధానాన్ని తీసుకురావటం సరికాదు. ఏశాఖకు లేని పాయింట్ల విధాననం మాకే ఎందుకు పెట్టాలనుకుంటున్నారు. దీనిపై మా సంఘం రాష్ట్ర నాయకులకు వ్యతిరేకత తెలియజేస్తాం. – సీవీ ప్రసాద్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విభేదాలు వచ్చే అవకాశముంది చాలా సార్లు యాప్‌లు సరిగా పని చేయక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి సంబంధించిన అంశాలు అన్లైన్లో నమోదు కావు. హెచ్ఎంలకు పాయింట్లు వచ్చే అవకాశముంది. దీంతో పాయింట్లు రాని ఉపాధ్యాయులకు హెచ్ఎంలతో విభేదాలు ఏర్పడే అవకాశముంది. పాయింట్ల విధానంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పాయింట్లు కేటాయిస్తే బాగుంటుంది. – రామక్రిష్ణారెడ్డి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు -
సారూ.. చెట్టులెక్కగలవా?
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ఏదో అద్దంలో చూస్తూ మురిసిపోతున్నట్లుగా ఉంది కదూ. ఈయన మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సంజీవరాయుడు అనే ఉపాధ్యాయుడు. బయోమెట్రిక్ హాజరు వేసేందుకు తరగతి గదిలోనుంచి బయటికి వచ్చి ఇలా అగచాట్లు పడుతున్నాడు. సాక్షి, ఆళ్లగడ్డ రూరల్ : ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు చెట్లు, పుట్టలు ఎక్కాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం వీరిని మానసిక ఆందోళనలకు గురిచేస్తోంది. పాఠశాలకు హాజరైన వెంటనే, అలాగే వెళ్లే సమయంలో అందులో వేలి ముద్రలు నమోదు చేయాలి. అప్పుడే వారికి హాజరు నమోదవుతుంది. ఏ మాత్రం ఆలస్యమైనా, లేదా వేలి ముద్రలు నమోదు కాకపోయినా ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరి వారు రెడ్‌జోన్ పరిధిలోకి చేరి చర్యలకు గురవుతారు. ఉపాధ్యాయుల హాజరు మెరుగుపర్చడానికే బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టినా..అమలులో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. సిగ్నల్ అందక రోడ్లమధ్యలో, మిద్దెలపై, చెట్లపై ఎక్కుతూ అష్టకష్టాలు పడే పరిస్థితి దాపురించింది. అందని సిగ్నల్స్.. జిల్లాలో జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలు 2,404, ఏపీ మోడల్ స్కూల్స్ 35, కస్తూర్బా విద్యాలయాలు 53, మున్సిపల్ స్కూళ్లు 141, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 78 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 3.84 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి చదువు చెప్పేందుకు 14,398 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు కచ్చితంగా సమయపాలన పాటించేలా 2015–16 విద్యాసంవత్సరం చివర్లోనే విద్యాశాఖ బయోమెట్రిక్ పరికరాలను పాఠశాలలకు అందజేసింది. గతేడాది నుంచి బయోమెట్రిక్ హాజరు కచ్చితంగా అమలు చేస్తున్నారు. అయితే మారుమూల పల్లెల్లోని పాఠశాలల్లో నెట్వర్క్ సిగ్నల్స్ సరిగ్గా అందక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది సిగ్నల్స్ సమస్యలు అధికంగా ఉన్నాయి. పట్టించుకునేవారేరీ? ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు, ఓబుళంపల్లి, ఆర్.కృష్ణాపురం, అహోబిలం ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఉయ్యాలవాడ మండలంలోని హరివరం, తుడుములదిన్నె, రుద్రవరం మండలంలోని శ్రీరంగాపురం, కోటకొండ గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 2జి సిగ్నల్ మాత్రమే వస్తోంది. 3జి, 4జి సిగ్నల్స్ వచ్చినప్పుడే యంత్రాలు బాగా పనిచేస్తాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదుకు అందించిన యంత్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. ప్రతి రోజూ ఇబ్బందులే. పల్లె ప్రాంతం కావడంతో సిగ్నల్స్ సరిగ్గా అందడం లేదు. ఒక్కోసారి 11గంటల సమయంలో పనిచేస్తాయి. పాఠశాల పనివేళల్లో పనిచేయడం లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. –రమణయ్య, పేరాయిపల్లె, హెచ్ఎం మానసిక ఒత్తిడికి గురవుతున్నాం బయోమెట్రిక్ విధానం బాగానే ఉన్నప్పటికీ మానసికంగా ఒత్తిడికి గురికావాల్సి వస్తోంది. ఈ విధానంలో ఎల్లో, గ్రీన్, రెడ్ జోన్లను కేటాయించారు. పాఠశాల సమయం దాటి 20 నిమిషాలు ఆలస్యమైనా రెడ్‌జోన్‌లో పడితే సెలవు కింద తీసుకుంటుంది. 10 నిమిషాలు ఆలస్యం అయితే గ్రీన్ జోన్‌కింద పడి ఇలా ఐదు రోజులు జరిగితే ఉపాధ్యాయులకు మెమోలు వస్తున్నాయి. సాంకేతిక సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాకే ఈ విధానం ప్రవేశపెట్టింటే బాగుండేది. –రామనందకిశోర్, ఉపాధ్యాయుడు -
గురువులా, వెట్టి కార్మికులా?
గురువును దైవ సమానంగా భావించి, గౌరవించే సంప్రదాయం దేశంలో నానా టికీ క్షీణించిపోతున్నదని ఆందోళనపడేవారికి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుతో తల తిరగడం ఖాయం. ఏటా జరిగే ‘కపాల మోచన్ మేళా’ కోసం వంద పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఆరురోజులపాటు ఆలయ పూజారు లుగా, స్నానఘట్టాల్లో పురోహితులుగా పనిచేయాలని... అలాగే హుండీల్లోని ఆదా యానికి పద్దులు రాయడం, భక్తులిచ్చే కానుకల్ని సర్కారీ గోడౌన్లకు చేర్చడంలాంటి పనులు చేయాలని ఆ ఉత్తర్వుల సారాంశం. ఇందుకోసం వారికి మూడురోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. కొందరు ఆ శిక్షణ ఎగ్గొడితే అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందికే వస్తుందని బెదిరిస్తూ నోటీసులు జారీ చేసింది. ఉపాధ్యా యులను వెట్టి కార్మికులకన్నా హీనంగా చూడటంలో ఖట్టర్ ప్రభుత్వం ఇప్పటికే తెచ్చుకున్న అప్రదిష్ట అంతా ఇంతా కాదు. కోతలయ్యాక పొలాల్లో మిగిలే గడ్డిని తగలబెట్టే రైతులను గుర్తించడం, వారిని ఆపడం వంటి పనులు చేయడానికి ఇటీ వలే సిర్సా జిల్లాలో ఉపాధ్యాయులను పంటపొలాల వద్ద తెల్లవార్లూ కాపలా పెట్టింది. ఆ వివాదం సద్దుమణగకముందే ఇప్పుడు ఈ ఉత్తర్వులిచ్చింది. గుళ్లూ గోపురాల్లో, స్నానఘట్టాల్లో ఈ ఉపాధ్యాయులు రోజురోజంతా పనిచేసేలా షిఫ్టులు నిర్ణయించింది. హర్యానాలోని యమునానగర్ జిల్లాలో భారీయెత్తున ఈ కపాల మోచన్ మేళా ఏటా జరుగుతుంది. ఇందులో పాల్గొనడానికి హర్యానా నలుమూల లనుంచి మాత్రమే కాదు... పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీలనుంచి లక్షలాదిమంది భక్తులు వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని ప్రభుత్వం ఆత్రపడటాన్ని అర్ధం చేసుకోవచ్చు. అందుకోసం ఉపాధ్యాయులందరినీ తరలించాలనుకోవడం, పిల్లల చదువులు ఏమైపోయినా పర్వాలేదనుకోవడం క్షమార్హం కాదు. ప్రభుత్వం తల్చుకుంటే ఆ జాతరకు అవసరమైన కార్యకర్తలను సమకూర్చుకోవడం కష్టమేమీ కాదు. అడిగితే అలాంటి సేవలందించడానికి వేలా దిమంది స్వచ్ఛందంగా ముందుకొస్తారు. ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఉపాధ్యాయులే ఆ పనులన్నీ చేయాలనడం, అందుకు నిరాకరించినవారిపై చర్యలు తీసుకుంటా మని బెదిరించడం భావ్యమేనా? ప్రపంచ దేశాల్లో వేర్వేరు సంస్కృతులు, సంప్రదాయాలూ ఉండొచ్చు. భిన్న రాజకీయ వ్యవస్థలుండొచ్చు. కానీ గురువుల పట్ల గౌరవభావం ఎక్కడికెళ్లినా ఒకలాగే ఉంటుంది. పసి మనసుల్ని సానబట్టి రేపటి సమాజానికి అవసరమయ్యే పటుతర శక్తిగా వారిని మలచడంలో ఉపాధ్యాయులు నిర్వర్తించే పాత్ర గురించిన అవగాహనే ఇందుకు కారణం. కానీ మన దగ్గర రాను రాను ఉపాధ్యాయులను హీనంగా చూసే ధోరణి పెరుగుతోంది. బడి మానేసే పిల్లల్ని గుర్తించి వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకు రావడంతో మొదలుపెట్టి పాఠశాలల్లో ఉపా ధ్యాయులు చేయాల్సిన బోధనేతర పనులు అన్నీ ఇన్నీ కావు. పిల్లలు ఉపయోగించే మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడటం, ఆ పిల్లలు మంచి దుస్తులు వేసు కునేలా చూడటం, వారికి పెట్టే మధ్యాహ్న భోజనంపై ఓ కన్నేసి ఉంచడం, అన్ని పదార్థాలూ అందుతున్నాయో లేదో పర్యవేక్షించడం, తిండి తినే పిల్లల దగ్గర ఆధార్ కార్డుందో లేదో తనిఖీ చేయడం...ఇలా సవాలక్ష పనులు అప్పగించడంతో ఆ టీచర్లు బోధనపై దృష్టి కేంద్రీకరించడం సాధ్యం కావడంలేదు. ఇవిగాక జనాభా లెక్కలూ వారే రాయాలి. ఓటర్ల జాబితాల కోసం ఇంటింటికీ తిరిగి పేర్లు సేక రించడమూ వారి బాధ్యతే. మధ్య మధ్యన ఏవో సర్వేలు జరపాలంటే అందుకూ సిద్ధపడాలి. ఈమధ్యకాలంలో యోగ డే, స్వచ్ఛ భారత్, బేటీ బచావో వంటివి కూడా వచ్చిచేరాయి. విద్యాబోధన ఏదో యాంత్రికంగా చేసే పని కాదు. తరగతి గదిలో ఉండే పిల్ల లంతా ఒకే స్థాయిలో ఉండరు. చెప్పింది వెనువెంటనే అర్ధం చేసుకునే పిల్లలతో బాటే ఎన్నివిధాల చెప్పినా అవగాహన చేసుకోలేనివారు కూడా ఉంటారు. వారం దరికీ సమానంగా అర్ధం చేయించడం ఎంతో నైపుణ్యం అవసరమైన పని. అలాంటి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించవలసి ఉంటుంది. వినూత్న పద్ధతుల్లో బోధించడానికి అవలంబించాల్సిన మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. ఇలాంటి కసరత్తులు చేయడానికి టీచర్లకు కాస్తయినా వ్యవధి ఉండాలా? వ్యక్తులుగా కొంతమంది ఉపాధ్యాయులు సృజనాత్మకంగా ఆలో చించి రూపొందించుకునే విధానాలను పదుగురితో పంచుకోవడానికి, వాటికి మరింత సమగ్ర రూపం తీసుకొచ్చి అన్నిచోట్లా అమలు చేయించడానికి అవసర మైన పునశ్చరణ తరగతులను నిర్వహిస్తే మన బడులు మరింత సుసంపన్న మవుతాయి. కానీ బోధనపై దృష్టి పెట్టేందుకు టీచర్లకు కాస్తయినా అవకాశం ఇవ్వ డంలేదు. ఎంతసేపూ ప్రభుత్వాలు చెప్పే పనుల్లో కూరుకుపోయి, అధికారులు తిర గమన్నచోటికల్లా తిరుగుతూ గొడ్డు చాకిరీ చేయడమే వారి బాధ్యతన్నట్టు ప్రభు త్వాలు ప్రవర్తిస్తున్నాయి. అచ్చయిన పుస్తకాలను చూసి, అందులో ఉన్నవి చెప్పడం తప్ప టీచర్లు బడుల్లో చేసేది ఏముంటుందన్న చిన్నచూపు పాలకుల్లో ఉన్నట్టుంది. ఇది ఎంత త్వరగా వదుల్చుకుంటే అంత మంచిది. హర్యానా సర్కారు ఉత్తర్వు చూస్తే వారికి అటు దేవాలయాల్లో జరిగే పూజా దికాలపైగానీ, ఇటు బోధనపైగానీ అవగాహన లేదని అర్ధమవుతుంది. కేవలం సంస్కృతం బోధించే టీచర్లనే పూజార్లుగా ఎంపిక చేశామని ఒక అధికారంటే, ఏ పాఠ్యాంశం బోధించే ఉపాధ్యాయులైనా ఆ పని చేయాల్సిందేనని మరో అధికారి చెబుతున్నాడు. అసలు సంస్కృతం చదివి ఉపాధ్యాయులుగా వచ్చిన ప్రతివారికీ మంత్రాలు వచ్చి ఉంటాయని... ఒకవేళ రాకున్నా మూడురోజుల శిక్షణతో అది ఒంటబడుతుందని ఈ మరుగుజ్జులకు చెప్పిందెవరో?! పాలకుల తీరు ఇలా ఉండ బట్టే విద్యారంగ ప్రమాణాలు కొడిగడుతున్నాయి. పిల్లల భవిష్యత్తు గాలిలో దీపమ వుతున్నది. కనీసం కేంద్రమైనా జోక్యం చేసుకుని ఖట్టర్‌కు నచ్చజెప్పాలి. లేకుంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మతిమాలిన పోకడలు పుట్టుకొస్తాయి. -
ఏకీకృత సర్వీసు నిబంధనలు వద్దు
► ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఉపాధ్యాయుల ధర్నా సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ విరుద్ధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబం ధనలను అమలు చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలను ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యా యులు కోరారు. ఏకీకృత సర్వీసు నిబం ధనలను అమలు చేయవద్దని డిమాండ్ చేస్తూ రెండు రాష్ట్రాల ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యాన సోమ వారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేప ట్టారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ, పంచా యతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేయడం సరికాదని ఉన్నత న్యాయస్థానాలు తీర్పు చెప్పాయని తెలిపారు. సర్వీ స్ రూల్స్ అమలుకు పంపిన ఫైలును గతంలో ఇద్దరు రాష్ట్రపతులు వెనక్కి పంపారని గుర్తు చేశారు. అయితే, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేయాలనుకోవడం సరికాదన్నారు. ఇద్దరు రాష్ట్రప తులు గతంలో వెనక్కి పంపిన ఫైలును మళ్లీ రాష్ట్రపతి ఆమోదానికి పంపేందుకు సిద్ధమవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కోర్టు తీర్పు లను అమలు చేయకపోవడం వల్ల 20 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు హక్కుగా లభించాల్సిన పదోన్నతులు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి)ని పరిరక్షించి, తమ ప్రయోజనాలను కాపాడాలని కోరు తూ రాష్ట్రపతి భవన్లో వినతిపత్రం సమర్పిం చి నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ధర్నాలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల అధ్య క్షులు బి.తిరుపాల్, సన సురేంద్ర, ప్రధాన కార్య దర్శులు తులసీదాస్, వీరాచారి పాల్గొన్నారు. -
నాకు నీవు.. నీకు నేను.. ఒకరికొకరం
హిందూపురం : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే... హిందూపురంలో వింత పరిస్థితి నెలకొంది. స్థానిక కంసలపేటలో ఉన్న వివేకానంద మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఏడాది 1వ తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. 2వ తరగతిలో ఒకరు, 3లో ఇద్దరు, 4లో ఒకరు, 5లో ఒకరు ఉన్నారు. గత విద్యాసంవత్సరంలో ఈ పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉండగా..ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య ఐదుకు చేరింది. గతంలో ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గింది... ఉపాధ్యాయుల సంఖ్య పెరిగింది. దీనిపై అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. -
నోటీసు బోర్డుల్లో టీచర్ల ఫొటోలు
డూప్లికేట్ టీచర్లను నివారించేందుకు విద్యా శాఖ చర్యలు కేంద్రం ఆదేశాల మేరకు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో రెగ్యులర్ టీచర్‌కు బదులు మరొకరిని పెట్టి బోధిస్తున్న పద్ధతికి చెక్ పెట్టేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అన్ని పాఠశాలల్లో ఆయా పాఠశాలలకు కేటాయించిన టీచర్ల ఫొటోలను నోటీసు బోర్డుల్లో పెట్టాలని మండల విద్యాధికారులను, ఎంఈవోలను ఆదేశించింది. తద్వారా ఆ పాఠశాలకు చెందిన రెగ్యులర్ టీచర్ ఎవరు? బడికి వస్తున్నది ఎవరన్నది గ్రామ ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. తద్వారా డూప్లికేట్ టీచర్లను నివారించవచ్చని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఫొటోలను వచ్చే 15 రోజుల్లోగా నోటీసు బోర్డులో పెట్టాలని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించిందని, దీనిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా డెరైక్టరేట్ ప్రొసీడింగ్స్ (ఆర్సీ నంబరు 1497) జారీ చేసింది. 21 నుంచి సెర్చ్ కమిటీల భేటీలు: రాష్ట్రం లోని యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ నెల 21 నుంచి వీసీల ఎంపికకు నియమించిన సెర్చ్ కమిటీలు భేటీ కానున్నాయి. వరుసగా ఒక్కో రోజు ఒక్కో యూనివర్సిటీకి సంబంధించిన సెర్చ్ కమిటీ సమావేశం కానుంది. ఆ యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నాయి. ఆ ముగ్గురిలో ఒక్కరిని ప్రభుత్వం వీసీలుగా నియమించనుంది. ఈ ప్రక్రియ ఈ నెల 21న ప్రారంభించడం సాధ్యం కాకపోతే 22వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. -
బడిబాటలో టీచర్లకు ఝలక్..
అల్లాదుర్గం: మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బుధవారం చేపట్టిన బడిబాట కార్యక్రమం టీచర్లకు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక జిల్లా పరిషత్ బాలికల పాఠశాల టీచర్లు గ్రామంలో బుధవారం బడిబాట ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి తమ పాఠశాలలో నాణ్యమైన విద్యనందిస్తామని, పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. దీంతో ముచ్చుల సంగమేశ్వర్ అనే వ్యక్తి మీ పిల్లలు ఏ పాఠశాలలో చదివిస్తున్నారని టీచర్లను ఎదురు ప్రశ్నించారు. ప్రైవేట్ పాఠశాలలో అని ఉపాధ్యాయ బృందం బదులిచ్చింది. దీంతో ఆయన మీరు మాత్రం మీ పిల్లలను మంచి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తారు. మా పిల్లలను మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించమని అడుగుతారా... అంటూ నిలదీయడంతో దీంతో టీచర్లు అవాకయ్యారు. ‘మీ ఇష్టం ఉంటే చేర్పించండి.. లేకుంటే ఎక్కడైనా చదివించుకోండి..’ అని చెప్పి వెనుతిరిగారు. పాఠశాలలో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించామని, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటూ విద్యబోధన ప్రైవేటుకు దీటుగా అందిస్తున్నామని హెచ్ఎం అనూరాధ విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తూ విద్యార్థులను చేర్పించే ప్రయత్నం చేశారు. -
లఘువొచ్చె.. ‘గురువు’ను వెక్కిరించె..
► నారాయణ.. ఏమిటీ ‘శిక్ష’ణ? ► మునిసిపల్ టీచర్లకు కార్పొరేట్ సంస్థల ఫ్యాకల్టీలతో తరగతులు ► ఉపాధ్యాయుల నిరసన ఏలూరు: ‘గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించింది’ అన్న చందంగా తయారైంది మున్సిపల్ టీచర్ల పరిస్థితి. కఠినమైన పోటీ పరీక్షలను ఎదుర్కొని ప్రభుత్వ కొలువుల్లో స్థిరపడిన వారికి.. నన్నిగా మొన్న వచ్చిన ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లోని ఫ్యాకల్టీలు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇదంతా రాష్ర్ట పురపాలక మంత్రి నారాయణ మాయ అని తెలుసుకున్న గురువులంతా మండిపడుతున్నారు. ఎక్కడి శిక్షణలు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. జిల్లాలోని పురపాలక, నగరపాలక యాజమాన్యంలో పనిచేస్తోన్న ఉపాధ్యాయులకు ఐఐటీ ఫౌండేషన్ పేరుతో కార్పొరేట్ విద్యా సంస్థ ‘నారాయణ’లో పనిచేస్తోన్న టీచర్లతో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం ఆక్షేపణీయమవుతోంది. మూడు రోజులుగా ఏలూరు వన్‌టౌన్‌లోని కస్తూరిభా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో మునిసిపల్ టీచర్లకు ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు మునిసిపల్ శాఖ డైరెక్టరేట్ నుంచి పురపాలక సంఘాల కమిషనర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి శిక్షణలు ఇవ్వటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన శిక్షణలను పలు ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి. శనివారం కొద్దిమంది ఉపాధ్యాయులు ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. జిల్లాలోని 8 మునిసిపాల్టీలు, ఏలూరు కార్పొరేషన్ నుంచి ఐదుగురు సబ్జెక్టు టీచర్లకు ఈ శిక్షణ ఇస్తున్నారు. గణితం, ఇంగ్లిష్, బయాలాజికల్ సైన్సు, పీఎస్ సబ్జెక్టు టీచర్లు శిక్షణ పొందుతున్నారు. శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులతో పాఠశాలల్లోని పిల్లలకు ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ ఇప్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు తమను కించపరిచేలా రాష్ట్రమంత్రి నారాయణ తన పాఠశాల ఉపాధ్యాయులతో శిక్షణలు ఇప్పించటం దారుణమని మునిసిపల్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల వారు అంటున్నారు. మెల్లగా మునిసిపల్ స్కూళ్లలో పాగా వేసేందుకే పక్కా ప్రణాళికతో ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ అంటూ ప్రారంభించారని విమర్శిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో ఉన్నట్టు ప్రతి సబ్జెక్టుకూ ఒక ఉపాధ్యాయుడిని ప్రభుత్వ స్కూళ్లలో నియమించాలని కోరారు. ఒకవేళ నైపుణ్యం కోసం శిక్షణలు ఇచ్చినా చాలా కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయని, ఒక్క ‘నారాయణ’కే ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వేసవిలో శిక్షణల ఇస్తే వాటికి ఉత్తర్వులు అధికారికంగా ఉండాలని, కానీ ఈ శిక్షణలకు మౌఖిక ఆదేశాలతోనే పనిచేయించటం ఏమిటంటున్నారు. డీఈవో డి.మధుసూదనరావు తదితరులు ఈ శిక్షణ తరగతులను ప్రారంభించటం విశేషం. ‘గంటా’ వద్దన్నా.. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణలు ఇవ్వకూడదని మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గట్టిగా చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. మునిసిపల్ మంత్రి నారాయణ ఆదేశాలతో శిక్షణ తరగతులు ప్రారంభించడం వివాదస్పదమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ శిక్షణ తరగతులపై ఆందోళనలు, తరగతుల బహిష్కరణ చేయటంతో వెంటనే స్పందించిన మంత్రి గంటా శిక్షణలు వెంటనే నిలిపివేయాలని ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది. శనివారం కూడా ఈ శిక్షణ తరగతులు యథావిధిగా కొనసాగాయి. ఉపాధ్యాయులను కించపరిచేలా.. కార్పొరేట్ విద్యా సంస్థల టీచర్లతో ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ ఇప్పించడం ఉపాధ్యాయులను కించపరిచేలా ఉంది. కార్పొరేట్ స్కూళ్లలో అమలు చేస్తోన్న డేటా బేస్ విధానాన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ అమలు చేసేలా చూస్తుండడం తగదు. గుణాత్మక విద్యతోనే సత్ఫలితాలు ఉంటాయి. - పి.ఆంజనేయులు, పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ మౌఖిక ఆదేశాలు ఉన్నాయి మునిసిపల్ శాఖ డెరైక్టరేట్, పాఠశాల విద్యా కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు చెప్పారు. మౌఖిక ఆదేశాలతోనే శిక్షణ నిర్వహించాం. జిల్లా వ్యాప్తంగా అన్ని మునిసిపాల్టీల నుంచి సబ్జెక్టు టీచర్లు వచ్చారు. కొందరు శిక్షణ బహిష్కరించి వెళ్లిపోగా, కొందరు మాత్రమే శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. నారాయణ విద్యాసంస్థల ఫ్యాకల్టీ శిక్షణ ఇస్తున్నారు. - వేమగిరి శాంతమ్మ, కో-ఆర్డినేటర్ కార్పొరేట్‌కు అప్పగిస్తారా? ఈ శిక్షణతో మునిసిపల్ పాఠశాలల్లో విద్యా బోధన కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పగిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసేలా మంత్రి నారాయణ వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఎంఎస్సీలు, ఏఎడ్లు చేసిన ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. -డీవీఏవీ ప్రసాదరాజు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు -
13న ప్రభుత్వ టీచర్ల ధర్నా
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డిప్యూటీ డీఈవో, ఎంఈవో, డైట్ లెక్చరర్, బీఎడ్ కాలేజీ లెక్చరర్ పోస్టుల్లో ప్రభుత్వ టీచర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న ధర్నా నిర్వహించాలని ప్రభుత్వ టీచర్ల సంఘం (జీటీఏ) నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్‌లో జీటీఏ కార్యవర్గ సమావేశం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇంత కాలమైనా ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంలో విద్యా శాఖ చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాన సురేందర్, మామిడోజు వీరాచారి తెలిపారు. -
‘ప్రైవేటు’టీచర్లలోనే క్వాలిటీ ఉందంటే రాజీనామా
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సవాల్ హైదరాబాద్: ప్రభుత్వ టీచర్లలో ఉన్న క్వాలిటీ ప్రైవేట్ టీచర్లలో ఉందని నిరూపిస్తే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టిఎస్‌యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యా సమస్యలపైన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యావిధానం బలంగానే ఉంద న్నారు. ప్రైవేట్ సంస్థలు తమకు వచ్చిన కొద్ది ర్యాంకులను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్, ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు నారాయణ, టీఎస్‌యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డీవైఎఫ్ఐ నాయకులు చావా రవి, సాంబశివ, హైమావతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.