సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతోంది. విద్యార్థి ఎక్కడున్నా నేర్చుకునేలా పాఠాలను అందిస్తోంది. పాఠ్యాంశాలు విద్యార్థికి మరింత అర్థమయ్యేలా, వివిధ మాధ్యమాల ద్వారా నేర్చుకునేలా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఏపీ ఎస్‌సీఈఆర్‌టీ) వీడియో కంటెంట్‌ను రూపొందించింది.
ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో మూడు నుంచి 9వ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలను సిద్ధం చేసింది.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్‌పీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందిస్తోంది. మరోవైపు అవే పాఠాలను ట్యాబ్‌ల ద్వారా ఇంటి వద్ద కూడా నేర్చుకునేలా బైజూస్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసి అందించింది.
వీటితోపాటు ఆయా తరగతుల అన్ని పాఠ్యాంశాలకు నిపుణులైన ఉపాధ్యాయులతో 366 వీడియోలను రూపొందించిన ఎస్‌సీఈఆర్‌టీ వాటిని యూట్యూబ్ (ఆంధ్రప్రదేశ్ ఈ–పాఠశాల చానల్)లోనూ అప్‌లోడ్ చేసింది.వీటిని మొబైల్ ఫోన్‌లోనూ చూసే అవకాశం కల్పించింది. ఈ వీడియోలను విద్యార్థి ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు. తద్వారా బడిలో ఉపాధ్యాయులు బోధించినప్పుడు విస్మరించిన, మరిచిపోయిన అంశాలను తిరిగి మననం చేసుకోవచ్చు.
ఐదు డీటీహెచ్ చానళ్ల ద్వారా ప్రసారం
టీవీలకు అలవాటుపడిన విద్యార్థుల్లో కూడా చదువుపై ఆసక్తి కలిగించేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విధానంలో ప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు ఈ–విద్య డీటీహెచ్ చానళ్లను కేటాయించింది. వీటిలో ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక చానల్ వినియోగిస్తున్నారు.
మిగిలిన నాలుగు చానళ్లను ఆరు నుంచి 9వ తరగతి పాఠ్యాంశాల ప్రసారానికి కేటాయించారు. ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన విద్యా క్యాలండర్, పాఠ్యప్రణాళిక ప్రకారం.. ఆయా నిర్మిత తేదీల్లో డీటీహెచ్ చానళ్లలో ఆ నెల పాఠ్యాంశాలను నిరంతరం ప్రసారం చేస్తారు. ఇలా 100 శాతం కంటెంట్‌తో ఈ–విద్య డీటీహెచ్ చానళ్ల ద్వారా పూర్తి స్థాయి పాఠాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ, జూనియర్ విభాగాల్లో టోఫెల్‌ను ప్రవేశపెట్టడంతో ఆయా పాఠాల బోధనకు మరో మూడు డీటీహెచ్ చానళ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు.
మొబైల్ యాప్ సైతం..
ఆన్‌లైన్‌లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ‘ఈ–పాఠశాల’ మొబైల్ యాప్‌ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్‌పీ, ట్యాబ్, డీటీహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్.. ఇలా అన్ని మాధ్యమాల్లోనూ ఒకే తరహా కంటెంట్, బోధన ఉండేలా వీడియోలను రూపొందించారు. దీంతో విద్యార్థి ఎలాంటి గందరగోళం లేకుండా తన తరగతి పాఠాలను ఈ ఐదు మాధ్యమాల్లో సులువుగా నేర్చుకోవచ్చు.
అన్ని కేబుల్ నెట్‌వర్క్‌ల్లోనూ ప్రసారం
బడిలో ఉపాధ్యాయులు బోధించే అన్ని పాఠాలను ఈ–కంటెంట్ రూపంలోకి మార్చాం. నిష్ణాతులైన సబ్జెక్టు ఉపాధ్యాయులతో సిలబస్ వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వీడియో పాఠాలు రూపొందించాం. ఈ–పాఠశాల చానళ్లను అందించేందుకు ప్రైవేటు టీవీ నెట్‌వర్క్ ప్రొవైడర్లు కూడా అంగీకరించారు.
ఇప్పటికే కొన్నిచోట్ల ప్రసారమవుతున్నాయి. త్వరలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంట్లో టీవీ ద్వారా విద్యార్థులు పాఠాలు వినొచ్చు. అలాగే యూట్యూబ్‌లో కూడా ఎప్పుడైనా వీటిని చూడొచ్చు.
– కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతులు
3 నుంచి 9 తరగతి వరకు వీడియో కంటెంట్
పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల్లోని కంటెంట్‌ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖకు అందించింది. వీటిని యధావిధిగా విద్యార్థులకు ఐఎఫ్‌పీల ద్వారా బోధించడంతోపాటు ట్యాబ్‌ల్లోనూ అప్‌లోడ్ చేశారు. అయితే, ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్‌తోపాటు కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించింది.
ఇందులో ప్రధానంగా మూడో తరగతి విద్యార్థులకు.. తెలుగు, ఇంగ్లిష్ , మ్యాథ్స్, ఈవీఎస్, నాలుగు, ఐదు తరగతులకు.. తెలుగు, ఇంగ్లిష్ , ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు.. తెలుగు, ఇంగ్లిష్ , హిందీ సబ్జెక్టుల్లో వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది.
యూట్యూబ్‌లో పాఠాలు అందరికీ అందుబాటులో ఉండగా.. ప్రైవేటు నెట్‌వర్క్ ప్రొవైడర్లు చాలా ప్రాంతాల్లో డీటీహెచ్ చానళ్లను అందించడం లేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన డీటీహెచ్ చానళ్లను అన్ని ప్రైవేటు కేబుల్ నెట్‌వర్క్ సంస్థలు కూడా అందించేలా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను రూపొందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment