లఘువొచ్చె.. ‘గురువు’ను వెక్కిరించె.. | narayana school teachers classes to govt teachers in eluru | Sakshi
Sakshi News home page

లఘువొచ్చె.. ‘గురువు’ను వెక్కిరించె..

Published Sun, May 15 2016 11:23 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

లఘువొచ్చె.. ‘గురువు’ను వెక్కిరించె..

లఘువొచ్చె.. ‘గురువు’ను వెక్కిరించె..

 ► నారాయణ.. ఏమిటీ ‘శిక్ష’ణ?
 ► మునిసిపల్ టీచర్లకు
      కార్పొరేట్ సంస్థల ఫ్యాకల్టీలతో తరగతులు
 ► ఉపాధ్యాయుల నిరసన

ఏలూరు: ‘గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించింది’ అన్న చందంగా తయారైంది మున్సిపల్ టీచర్ల పరిస్థితి. కఠినమైన పోటీ పరీక్షలను ఎదుర్కొని ప్రభుత్వ కొలువుల్లో స్థిరపడిన వారికి.. నన్నిగా మొన్న వచ్చిన ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లోని ఫ్యాకల్టీలు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇదంతా రాష్ర్ట పురపాలక మంత్రి నారాయణ మాయ అని తెలుసుకున్న గురువులంతా మండిపడుతున్నారు. ఎక్కడి శిక్షణలు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు.

జిల్లాలోని పురపాలక, నగరపాలక యాజమాన్యంలో పనిచేస్తోన్న ఉపాధ్యాయులకు ఐఐటీ ఫౌండేషన్ పేరుతో కార్పొరేట్ విద్యా సంస్థ ‘నారాయణ’లో పనిచేస్తోన్న టీచర్లతో ప్రత్యేక శిక్షణ  ఇప్పించడం ఆక్షేపణీయమవుతోంది. మూడు రోజులుగా ఏలూరు వన్‌టౌన్‌లోని కస్తూరిభా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో మునిసిపల్ టీచర్లకు ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ  తరగతులు నిర్వహిస్తున్నారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు మునిసిపల్ శాఖ డైరెక్టరేట్ నుంచి పురపాలక సంఘాల కమిషనర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి శిక్షణలు ఇవ్వటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన శిక్షణలను పలు ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి.

శనివారం కొద్దిమంది ఉపాధ్యాయులు ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. జిల్లాలోని 8 మునిసిపాల్టీలు, ఏలూరు కార్పొరేషన్ నుంచి ఐదుగురు సబ్జెక్టు టీచర్లకు ఈ శిక్షణ ఇస్తున్నారు. గణితం, ఇంగ్లిష్, బయాలాజికల్ సైన్సు, పీఎస్ సబ్జెక్టు టీచర్లు శిక్షణ పొందుతున్నారు. శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులతో పాఠశాలల్లోని పిల్లలకు ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ ఇప్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు
తమను కించపరిచేలా రాష్ట్రమంత్రి నారాయణ తన పాఠశాల ఉపాధ్యాయులతో శిక్షణలు ఇప్పించటం దారుణమని మునిసిపల్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల వారు అంటున్నారు. మెల్లగా మునిసిపల్ స్కూళ్లలో పాగా వేసేందుకే పక్కా ప్రణాళికతో ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ అంటూ ప్రారంభించారని విమర్శిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో ఉన్నట్టు ప్రతి సబ్జెక్టుకూ ఒక ఉపాధ్యాయుడిని ప్రభుత్వ స్కూళ్లలో నియమించాలని కోరారు. ఒకవేళ నైపుణ్యం కోసం శిక్షణలు ఇచ్చినా చాలా కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయని, ఒక్క ‘నారాయణ’కే ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వేసవిలో శిక్షణల ఇస్తే వాటికి ఉత్తర్వులు అధికారికంగా ఉండాలని, కానీ ఈ శిక్షణలకు మౌఖిక ఆదేశాలతోనే పనిచేయించటం ఏమిటంటున్నారు. డీఈవో డి.మధుసూదనరావు తదితరులు ఈ శిక్షణ తరగతులను ప్రారంభించటం విశేషం.
 
‘గంటా’ వద్దన్నా..
వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణలు ఇవ్వకూడదని మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గట్టిగా చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. మునిసిపల్ మంత్రి నారాయణ ఆదేశాలతో శిక్షణ తరగతులు ప్రారంభించడం వివాదస్పదమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ శిక్షణ తరగతులపై ఆందోళనలు, తరగతుల బహిష్కరణ చేయటంతో వెంటనే స్పందించిన మంత్రి గంటా శిక్షణలు వెంటనే నిలిపివేయాలని ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది. శనివారం కూడా ఈ శిక్షణ తరగతులు యథావిధిగా కొనసాగాయి.
 
ఉపాధ్యాయులను కించపరిచేలా..  
కార్పొరేట్ విద్యా సంస్థల టీచర్లతో ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ ఇప్పించడం ఉపాధ్యాయులను కించపరిచేలా ఉంది. కార్పొరేట్ స్కూళ్లలో అమలు చేస్తోన్న డేటా బేస్ విధానాన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ అమలు చేసేలా చూస్తుండడం తగదు. గుణాత్మక విద్యతోనే సత్ఫలితాలు ఉంటాయి.    - పి.ఆంజనేయులు, పీఆర్‌టీయూ రాష్ట్ర కౌన్సిలర్
 
మౌఖిక ఆదేశాలు ఉన్నాయి

మునిసిపల్ శాఖ డెరైక్టరేట్, పాఠశాల విద్యా కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు చెప్పారు. మౌఖిక ఆదేశాలతోనే శిక్షణ నిర్వహించాం. జిల్లా వ్యాప్తంగా అన్ని మునిసిపాల్టీల నుంచి  సబ్జెక్టు టీచర్లు వచ్చారు. కొందరు శిక్షణ బహిష్కరించి వెళ్లిపోగా, కొందరు మాత్రమే శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. నారాయణ విద్యాసంస్థల ఫ్యాకల్టీ శిక్షణ ఇస్తున్నారు. - వేమగిరి శాంతమ్మ, కో-ఆర్డినేటర్
 
కార్పొరేట్‌కు అప్పగిస్తారా?
ఈ శిక్షణతో మునిసిపల్ పాఠశాలల్లో విద్యా బోధన కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పగిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసేలా మంత్రి నారాయణ వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఎంఎస్సీలు, ఏఎడ్‌లు చేసిన ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. -డీవీఏవీ ప్రసాదరాజు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement