బయోమెట్రిక్ యంత్రంతో కుస్తీ పడుతున్న ఉపాధ్యాయుడు
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ఏదో అద్దంలో చూస్తూ మురిసిపోతున్నట్లుగా ఉంది కదూ. ఈయన మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సంజీవరాయుడు అనే ఉపాధ్యాయుడు. బయోమెట్రిక్ హాజరు వేసేందుకు తరగతి గదిలోనుంచి బయటికి వచ్చి ఇలా అగచాట్లు పడుతున్నాడు.
సాక్షి, ఆళ్లగడ్డ రూరల్ : ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు చెట్లు, పుట్టలు ఎక్కాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం వీరిని మానసిక ఆందోళనలకు గురిచేస్తోంది. పాఠశాలకు హాజరైన వెంటనే, అలాగే వెళ్లే సమయంలో అందులో వేలి ముద్రలు నమోదు చేయాలి. అప్పుడే వారికి హాజరు నమోదవుతుంది. ఏ మాత్రం ఆలస్యమైనా, లేదా వేలి ముద్రలు నమోదు కాకపోయినా ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరి వారు రెడ్‌జోన్ పరిధిలోకి చేరి చర్యలకు గురవుతారు. ఉపాధ్యాయుల హాజరు మెరుగుపర్చడానికే బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టినా..అమలులో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. సిగ్నల్ అందక రోడ్లమధ్యలో, మిద్దెలపై, చెట్లపై ఎక్కుతూ అష్టకష్టాలు పడే పరిస్థితి దాపురించింది.
అందని సిగ్నల్స్..
జిల్లాలో జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలు 2,404, ఏపీ మోడల్ స్కూల్స్ 35, కస్తూర్బా విద్యాలయాలు 53, మున్సిపల్ స్కూళ్లు 141, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 78 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 3.84 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి చదువు చెప్పేందుకు 14,398 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు కచ్చితంగా సమయపాలన పాటించేలా 2015–16 విద్యాసంవత్సరం చివర్లోనే విద్యాశాఖ బయోమెట్రిక్ పరికరాలను పాఠశాలలకు అందజేసింది. గతేడాది నుంచి బయోమెట్రిక్ హాజరు కచ్చితంగా అమలు చేస్తున్నారు. అయితే మారుమూల పల్లెల్లోని పాఠశాలల్లో నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగ్గా అందక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది సిగ్నల్స్ సమస్యలు అధికంగా ఉన్నాయి.
పట్టించుకునేవారేరీ?
ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు, ఓబుళంపల్లి, ఆర్.కృష్ణాపురం, అహోబిలం ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఉయ్యాలవాడ మండలంలోని హరివరం, తుడుములదిన్నె, రుద్రవరం మండలంలోని శ్రీరంగాపురం, కోటకొండ గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 2జి సిగ్నల్ మాత్రమే వస్తోంది. 3జి, 4జి సిగ్నల్స్ వచ్చినప్పుడే యంత్రాలు బాగా పనిచేస్తాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్ సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదుకు అందించిన యంత్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. ప్రతి రోజూ ఇబ్బందులే. పల్లె ప్రాంతం కావడంతో సిగ్నల్స్ సరిగ్గా అందడం లేదు. ఒక్కోసారి 11గంటల సమయంలో పనిచేస్తాయి. పాఠశాల పనివేళల్లో పనిచేయడం లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
–రమణయ్య, పేరాయిపల్లె, హెచ్‌ఎం
మానసిక ఒత్తిడికి గురవుతున్నాం
బయోమెట్రిక్ విధానం బాగానే ఉన్నప్పటికీ మానసికంగా ఒత్తిడికి గురికావాల్సి వస్తోంది. ఈ విధానంలో ఎల్లో, గ్రీన్, రెడ్ జోన్‌లను కేటాయించారు. పాఠశాల సమయం దాటి 20 నిమిషాలు ఆలస్యమైనా రెడ్‌జోన్‌లో పడితే సెలవు కింద తీసుకుంటుంది. 10 నిమిషాలు ఆలస్యం అయితే గ్రీన్ జోన్‌కింద పడి ఇలా ఐదు రోజులు జరిగితే ఉపాధ్యాయులకు మెమోలు వస్తున్నాయి. సాంకేతిక సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాకే ఈ విధానం ప్రవేశపెట్టింటే బాగుండేది.
–రామనందకిశోర్, ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment