biometric machines
-
హాజరు పడితేగా...?
విజయనగరం ఫోర్ట్: బయోమెట్రిక్‌తో సిబ్బంది సమయపాలన పాటిస్తారని భావిస్తే ఆ పరికరాలు పనిచేయకపోవడం వారికి ఇప్పుడు అవకాశంగా మారింది. గత ప్రభుత్వం నాసిరకంగా పరికరాలు సమకూర్చడంతో అవి ఏడాది తిరగకుండానే మూలకు చేరి... దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్, డిస్పెన్సరీలో ఉద్యోగులు సమయపాలన పాటించేందుకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరం మూలకు చేరింది. నాసిరకం పరికరాలను అప్పటి ప్రభుత్వం సరఫరా చేయడంతో ఏర్పాటు చేసిన కొద్ది నెలలకే దిష్టి బొమ్మలా మారింది. పాడైన వెంటనే ఈఎస్ఐ అధికారులు పంపించినప్పటికీ నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఒక్కో పరికరం రూ.16 వేలు విలువ చేస్తే రూ.72 వేలకు కొనుగోలు చేసినట్టు నివేదిక ఇచ్చారు. దీనిని బట్టి అప్పటి టీడీపీ పాలకులు ఎంత మేర అవినీతికి పాల్పడ్డారో అర్థమవుతోంది. ఏడాది తిరగకుండానే మూలకు.. ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్లో బయోమెట్రిక్ పరికరం ఏర్పాటు చేసిన కొద్ది నెలలకే మూలకు చేరింది. 2018 జనవరి నెలలో ఇక్కడి వైద్య సిబ్బంది హాజరు నిమిత్తం వీటిని ఏర్పాటు చేశారు. 2018 నవంబర్ నెలలో అది మూలకు చేరింది. అప్పట్లోనే అధికారులు బాగు చేయించాల్సిందిగా ఈఎస్ఐ డైరెక్టర్‌కు పంపించారు. కాని అధికారులు ఇంతవరకు బాగు చేయించలేదు. వేలాది రుపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాటిని బాగు చేయించకుండా వదిలేశారు. సమయ పాలన గాలికి... బయోమెట్రిక్ లేకపోవడంతో వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు సమయపాలనకోసం ఏర్పాటు చేసిన పరికరాలు పనికిరాకుండా పోవడంతో వారిలో క్రమశిక్షణ లోపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేయాల్సి ఉన్నా... 10 గంటలకు, 10:30 గంటలకు సిబ్బంది విధులకు హాజరు అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై డయోగ్నోస్టిక్ సెంటర్ సూపరింటెండెంట్ అల్లం కృష్ణారావువద్ద సాక్షి ప్రస్తావించగా 2018 నవంబర్ నెలలో బయోమెట్రిక్ పాడైందనీ, దానిని బాగు చేయించాలని ఈఎస్ఐ డైరక్టర్ కార్యాలయానికి పంపించామనీ, కానీ ఇప్పటివరకూ రాలేదని తెలిపారు. -
పనిచేయని బయోమెట్రిక్
సాక్షి, ఏటూరునాగారం: రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన బయోమెట్రిక్ హాజరు విధానం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కుంటుపడింది. ఇందుకు సాంకేతిక కారణాలతో పాటు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, యాజమాన్య పాఠశాలలు మొత్తం 783 ఉండగా ఉపాధ్యాయులు 2,248 మంది పనిచేస్తున్నారు. మొత్తం 37,199 మంది విద్యార్థులు చదువుతున్నారు. బయోమెట్రిక్ యంత్రాలు ఈ ఏడాది జూన్‌లో వచ్చాయి. ఆగస్టు నుంచి ఉపయోగిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో నెట్వర్క్ సరిగా లేకపోవడంతో 379 బయోమెట్రి క్ యంత్రాలు మూలనపడి ఉన్నాయి. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం 404 బయోమెట్రిక్ యంత్రాల ద్వారా ఉపాధ్యాయులు హాజరు నమోదు చేసుకుంటున్నారు. కొన్ని పాఠశాలలో సిగ్నల్ అందక భవనాల పైకి, పాఠశాల ఆవరణలోకి యంత్రాన్ని తీసుకెళ్లి హాజరు వేసుకో వాల్సిన పర్థితులు నెలకొన్నాయి. మొదలుకాని పరిశీలన ప్రక్రియ విద్యాశాఖ రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి రోజు వారీ బయోమెట్రిక్ హాజరు నివేదికను కోరుతోం ది. పాఠశాలల్లో వేలిముద్రల హాజరును పరిశీలించేందుకు క్లస్టర్, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో లాగిన్లను ఏర్పాటు చేశారు. అన్ని స్థాయిల్లో పరిశీలించే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. యంత్రాలు సిద్ధం చేసినప్పటికీ వందలాది పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు వీటిని వివిధ కారణాలతో ప్రారంభించడం లేదు. విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం.. బయోమెట్రిక్ హాజరు నమోదులో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పలు పాఠశాలల్లో విద్యార్థుల లాగిన్ ఐడీ నంబర్లు,వేలి ముంద్రలు సరిపోవడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వా రం రోజుల విద్యార్థుల హాజరు పరిశీలిస్తే 4 శాతం కంటే తక్కువగా నమోదుకావడం గమనార్హం. ఆసక్తి చూపని కొందరు టీచర్లు.. బయోమెట్రిక్‌లో హాజరు నమోదుకు కొందరు ఉ పాధ్యాయులు ఆసక్తి చూడపంలేదు. ఇందుకు సాంకేతిక కారణాలు ఉన్నాయి. జిల్లాలో 2,248 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా చాలా మంది వివిధ ప్రాంతాలకు వెళ్లారు. యంత్రాల్లో కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుల ఐడీ లేకపోవడంతో లాగిన్ అవ్వ డం లేదు. వీరి విషయం పక్కనబెడితే బదిలీ కా కుండా అదే పాఠశాలలో పనిచేస్తున్న కొంత మం ది టీచర్లు సైతం బయోమెట్రిక్ హాజరుపై నిర్లక్ష్యం గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానంపై విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు అవగాహ న కల్పించడం లేదని పలువురు చెబుతున్నారు. మూడు జోన్లు.. పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు ప్రార్థన సమ యం కంటే ముందుగానే బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో బయోమెట్రిక్ ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు గ్రీన్ జోన్, 9.35 నుంచి 9.45 వరకు ఎల్లో జోన్లో ఉంటుంది. ఆ తర్వాత ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులకు రెడ్‌జోన్ చూపిస్తోంది. సాయంత్రం 4.45 నుంచి 5 గంటల వరకు గ్రీన్‌జోన్ చూపిస్తుంది. మారని పరిస్థితి.. మధ్యాహ్న భోజన విషయంలో తక్కువ పిల్లలు ఉంటే ఎక్కువ పిల్లలు ఉన్నట్లు నమోదు చేసుకొని ఏజెన్సీ, హెచ్ఎంలు నిధులు స్వాహా చేస్తున్నారని, దీనిని కట్టడి చేయడానికి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలను అమలులోకి తెచ్చారు. బయోమెట్రిక్ యంత్రానికి విద్యార్థుల ఆధార్‌ను లింక్ చేశా రు. అలాగే ఐరిష్ కనుపాప ద్వారా హాజరు వేసే విధంగా ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థుల వేలిముద్రలు నమోదు కావడంలేదు. ఐరిష్ సైతం పనిచేయడం లేదు. సిమ్ కార్డులు మార్చుతున్నారు బయోమెట్రిక్ మిషన్లకు సెల్ సిగ్నల్స్ అందకపోవడంతో ఆ ప్రాంతంలో పనిచేసే సిమ్ కార్డులను మార్చుతున్నారు. పిల్లలకు ఐరీష్, ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల చేతి వేలి ముద్రలు పడడం లేదు. సమస్య పరిష్కరించడానికి మండలానికి ఒక ఆధార్ నమోదు మిషన్ ఏర్పాటు చేసి ఆధార్ అనుసంధానం చేయడంతోపాటు కొత్తవారికి సైతం నమోదు చేస్తున్నాం. రోజుకు వంద మంది పిల్లలకు ఆధార్ తీయడం వల్ల ఆలస్యమవుతోంది. మిషన్లతో సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. – శ్రీనివాస్‌రెడ్డి, డీఈఓ -
మొరాయిస్తున్న బయోమెట్రిక్
నల్లబెల్లి (వరంగల్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత పెంచడంతోపాటు విద్యార్థులకు నేరుగా పథకాలు అందించేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ను ప్రారంభించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలలకు బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేశారు. కానీ, ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం, అధికారులు అప్డేట్ కాకపోవడం, నెట్వర్క్ సమస్య తలెత్తడంతో బయోమెట్రిక్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. బయోమెట్రిక్ విధానం పక్కాగా అమలైతే తప్పనిసరిగా ప్రతిరోజు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ బడుల్లో కొంతైనా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. విద్యార్థులకు ఆంగ్ల బోధనతోపాటు మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పుస్తకాలు, హెల్త్ కిట్లను ఉచితంగా అందిస్తోంది. అయితే ఇవ్వన్ని విద్యార్థులకు చేరుతున్నాయా లేక దుర్వినియోగం అవుతున్నాయా అనే వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గత నెలలో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు యంత్రాల నిర్వహణపై రిసోర్స్ పర్సన్ల ద్వారా శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రం చొప్పున పాఠశాలలకు అందించారు. ఈ నెల 1వ తేదీ నుంచి అమలు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా క్షేత్రస్థాయిలో నిర్వహణలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. నెట్వర్క్ సరిగా ఉండకపోవడం, యంత్రాలు వినియోగించడంలో అవగాహన లోపం వంటి కారణాలతోపాటు ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల వివరాలు తొలగిస్తూ కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయకపోవడం తదితర సమస్యలతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరకుండా పోతోందని తెలుస్తోంది. ఒకే పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు వేలిముద్ర వేస్తే, మరికొందరు ఉపాధ్యాయులు వేయలేని పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రాలకు దూరంగా ఉన్న పాఠశాలల్లో నెట్వర్క్ సమస్యతో ఇబ్బందులు తలెత్తడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వేయలేని పరిస్థితి ఉందని పలువురు ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇటీవల మండలానికి ఒకరు చొప్పున 15 మంది టెక్నీషియన్లను నియమించారు. కానీ, వారు విధుల్లో చేరకపోవడంతో బయోమెట్రిక్ యంత్రాలను మరమ్మతు చేసేవారు కరువయ్యారు. సమస్యను అధిగమించేందుకు చర్యలు.. బయోమెట్రిక్ యంత్రంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సరైన వివరాలు నమోదు చేయాలి. యంత్రాల్లో తలెత్తే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నిపుణుల సాయం అందేలా చూడాలి. తద్వారా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ జవాబుదారీతనంగా వ్యవహరిస్తారు. మధ్యాహ్న భోజన నిర్వహణలో సత్ఫలితాలు సాధించవచ్చు. జవాబుదారీతనం పెరుగుతుంది.. బయోమెట్రిక్ యంత్రాలు ఉపయోగించడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యబోధన మెరుగుపడుతుంది. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. మా పాఠశాలకు అధికారులు మూడు యంత్రలు ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఐడీలు ఇవ్వలేదు. త్వరలోనే ఇస్తామని అధికారులు చెప్పారు. ఇచ్చిన వెంటనే బయోమెట్రిక్ యంత్రాలను ఉపయోగిస్తాం. – రామస్వామి, హెచ్ఎం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నల్లబెల్లి సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు చర్యలు జిల్లాలోని 699 ప్రభుత్వ పాఠశాలలకు 756 బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఉపాధ్యాయులు పనిచేసే సమయంపై పారదర్శకతతో పాటు మధ్యాహ్న భోజన నిర్వహణలో సత్ఫలితాలు పొందేందుకు ప్రభుత్వ పాఠశాలకు వీటిని పంపిణీ చేశాం. బయోమెట్రిక్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే సరిచేసేందుకు ప్రభుత్వం విజన్‌టెక్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. నెట్వర్క్ లేని పాఠశాలలను గుర్తించి సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – కె.నారాయణరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి, వరంగల్ రూరల్ -
ప్రైవేటు కనికట్టు.. ఇంటర్ బోర్డు తాకట్టు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డును ఓ ప్రైవేటు సంస్థకు తాకట్టు పెట్టారు. అధికారులు, ప్రైవేటు సంస్థ ప్రతినిధులు కుమ్మక్కై బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచే వ్యాపారానికి దారులు వేశారు. విద్యార్థుల వేలి ముద్రలు సేకరించే బయోమెట్రిక్ మెషీన్ల విక్రయాలకు బోర్డు వెబ్సైట్ ద్వారానే రాచబాట వేసి భారీగా దండుకుంటున్నారు. అసలు అవసరమే లేని.. ఒక్కోటి రూ.2 వేల విలువైన బయోమెట్రిక్ మెషీన్లను బోర్డు వెబ్సైట్ ద్వారా రూ.5 వేల చొప్పున కాలేజీలతో వేలాదిగా కొనుగోలు చేయించారు. అన్నీ అడ్డగోలు వ్యవహారాలే.. ఏటా 10 లక్షల మంది విద్యార్థుల సమాచారం, అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాల వెల్లడి వంటి వ్యవహారాలను ఇంటర్ బోర్డు సొంతంగా చేసుకునేలా ఓ సాఫ్ట్వేర్ సంస్థకు వచ్చిన ఆలోచనను అధికారులు ఆచరణలో పెట్టారు. తమకు భారీగా కమీషన్లు వస్తాయని ఉద్దేశంతో ఓకే చెప్పేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల డేటా ప్రాసెసింగ్, రిజల్ట్ ప్రాసెసింగ్ పనులను సదరు సంస్థకు అప్పగించారు. ఏటా రూ.20 లక్షలే ఆ పనులకు ఖర్చవుతున్నా.. సదరు సంస్థ రూ.4.5 కోట్లతో ఇచ్చిన ప్రతిపాదనలకు అనుమతిచ్చేశారు. డేటా ప్రాసెస్ పనులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) నుంచి తొలగించి ఆ సంస్థకు అప్పగించారు. పనులు దక్కించుకున్న సదరు సంస్థ తమ పనితీరును నిరూపించుకునేందుకు డేటా, రిజల్ట్స్ ప్రాసెసింగ్ టెస్టింగ్‌ను ఉచితంగా చేయాలి. కానీ అధికారులు టెస్టింగ్ కోసం కూడా రూ.75 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే టెస్టింగ్ ఏమైందో ఎవరికీ తెలియదు. ఒకటి తేలకుండానే ఇంకోటి.. టెస్టింగ్ ప్రాసెస్ తేలకముందే ఇంటర్ బోర్డు అదే సంస్థకు మరో పని అప్పగించింది. 2018–19కి సంబంధించి విద్యార్థుల ప్రవేశాలు, డేటా క్యాప్చర్ వంటి పనులను అప్పగించింది. మొదట ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్లైన్ చేసేందుకు సదరు సంస్థ చర్యలు చేపట్టింది. సాఫ్ట్వేర్ లేకపోవడం, ప్రోగ్రాం సరిగ్గా రూపొందించుకోని కారణంగా వీటిని సక్రమంగా చేయలేకపోయింది. సీజీజీ నుంచి గత ఏడాది ఆన్లైన్ ప్రవేశాల ప్రాసెస్ ప్రోగ్రాం మోడల్స్ తెచ్చుకొని కొంత మేర ఆన్లైన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అదీ కూడా సరిగ్గా చేయలేదు. ప్రభుత్వ కాలేజీల్లో రీ అడ్మిషన్లు, 37 వేల మంది సీబీఎస్ఈ విద్యార్థుల ప్రవేశాలు, ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి వెళ్లే విద్యార్థుల ప్రవేశాలు ఆన్లైన్ చేయలేకపోయింది. ప్రైవేటు కాలేజీల విద్యార్థుల ఆన్లైన్ ప్రవేశాలను ప్రాసెస్ చేయలేదు. మరో 30 రోజులు గడువు కావాలని కోరింది. దీంతో ఇంటర్ బోర్డు.. ప్రవేశాల వ్యవహారాలను తిరిగి సీజీజీకి అప్పగించింది. ప్రభుత్వ విధానాన్ని అడ్డుపెట్టుకొని.. విద్యార్థులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని, ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందే వారికే తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. దీంతో బయోమెట్రిక్ మెషీన్లను బోర్డు కొనుగోలు చేసింది. దీన్ని అడ్డుపెట్టుకొని సదరు సంస్థ రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ మెషీన్లు కొనుగోలు చేయాలని కాలేజీలకు ఆ సంస్థ సమాచారం పంపింది. కాలేజీల సమాచారం ఆ సంస్థకు ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు అర్థం కావడం లేదు. ఆ సమాచారమంతా ఇంటర్ బోర్డు, సీజీజీ, ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థ వద్దే ఉంది.ఆ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థనే కాలేజీల సమాచారాన్ని బయోమెట్రిక్ మెషీన్ల కంపెనీకి ఇచ్చి ఉంటుందని బోర్డు అధికారు లు అనుమానిస్తున్నారు. బోర్డు వెబ్సైట్లో (http:// acad.tsbie.telangana.gov.in) కాలేజీలు లాగి న్ అయ్యాక.. ‘మెషీన్లను బోర్డు గుర్తించింది. వాటినే కొనుగోలు చేయాలి’ అని కనిపించేలా మార్పులను ఆ ప్రైవేటు సంస్థే చేసిందని భావిస్తున్నారు. భారీ కుట్ర! బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే బయోమెట్రిక్ మెషీన్లను కొనుగోలు చేయాలనే పేజీ కనిపించదు. కాలేజీ యాజమాన్యాలు తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో వెబ్సైట్లో లాగిన్ అయ్యాక మాత్రం ప్రత్యేకంగా ఓ పేజీనే ప్రత్యక్షమయ్యేలా కుట్రపన్నారు. పైగా అవి బోర్డు ధ్రువీకరించిన మెషీన్లని, వాటిని కొనుగోలు చేయాలంటూ వెబ్సైట్లోనే మార్పులు చేసి భారీ మోసానికి పాల్పడ్డారు. ఇలా ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థ చేసిన మోసంతో యాజమాన్యాలు మెషీన్లను కొనుగోలు చేసి నష్టపోయా యి. రూ.కోట్ల వ్యవహారంలో బోర్డు అధికారులు కమీషన్ల రూపంలో భారీగా ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో రహస్యంగా ఉండాల్సిన విద్యార్థుల సమాచారా న్ని, బోర్డు ఆన్లైన్ వ్యవహారాలను కనీస గోప్యత పాటించని సంస్థకు అప్పగించడం వెనుక భారీ కుట్ర ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు సంస్థ మెషీన్ కొనుగోలు పేజీ -
సారూ.. చెట్టులెక్కగలవా?
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ఏదో అద్దంలో చూస్తూ మురిసిపోతున్నట్లుగా ఉంది కదూ. ఈయన మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సంజీవరాయుడు అనే ఉపాధ్యాయుడు. బయోమెట్రిక్ హాజరు వేసేందుకు తరగతి గదిలోనుంచి బయటికి వచ్చి ఇలా అగచాట్లు పడుతున్నాడు. సాక్షి, ఆళ్లగడ్డ రూరల్ : ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు చెట్లు, పుట్టలు ఎక్కాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం వీరిని మానసిక ఆందోళనలకు గురిచేస్తోంది. పాఠశాలకు హాజరైన వెంటనే, అలాగే వెళ్లే సమయంలో అందులో వేలి ముద్రలు నమోదు చేయాలి. అప్పుడే వారికి హాజరు నమోదవుతుంది. ఏ మాత్రం ఆలస్యమైనా, లేదా వేలి ముద్రలు నమోదు కాకపోయినా ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరి వారు రెడ్‌జోన్ పరిధిలోకి చేరి చర్యలకు గురవుతారు. ఉపాధ్యాయుల హాజరు మెరుగుపర్చడానికే బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టినా..అమలులో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. సిగ్నల్ అందక రోడ్లమధ్యలో, మిద్దెలపై, చెట్లపై ఎక్కుతూ అష్టకష్టాలు పడే పరిస్థితి దాపురించింది. అందని సిగ్నల్స్.. జిల్లాలో జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలు 2,404, ఏపీ మోడల్ స్కూల్స్ 35, కస్తూర్బా విద్యాలయాలు 53, మున్సిపల్ స్కూళ్లు 141, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 78 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 3.84 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి చదువు చెప్పేందుకు 14,398 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు కచ్చితంగా సమయపాలన పాటించేలా 2015–16 విద్యాసంవత్సరం చివర్లోనే విద్యాశాఖ బయోమెట్రిక్ పరికరాలను పాఠశాలలకు అందజేసింది. గతేడాది నుంచి బయోమెట్రిక్ హాజరు కచ్చితంగా అమలు చేస్తున్నారు. అయితే మారుమూల పల్లెల్లోని పాఠశాలల్లో నెట్వర్క్ సిగ్నల్స్ సరిగ్గా అందక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది సిగ్నల్స్ సమస్యలు అధికంగా ఉన్నాయి. పట్టించుకునేవారేరీ? ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు, ఓబుళంపల్లి, ఆర్.కృష్ణాపురం, అహోబిలం ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఉయ్యాలవాడ మండలంలోని హరివరం, తుడుములదిన్నె, రుద్రవరం మండలంలోని శ్రీరంగాపురం, కోటకొండ గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 2జి సిగ్నల్ మాత్రమే వస్తోంది. 3జి, 4జి సిగ్నల్స్ వచ్చినప్పుడే యంత్రాలు బాగా పనిచేస్తాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదుకు అందించిన యంత్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. ప్రతి రోజూ ఇబ్బందులే. పల్లె ప్రాంతం కావడంతో సిగ్నల్స్ సరిగ్గా అందడం లేదు. ఒక్కోసారి 11గంటల సమయంలో పనిచేస్తాయి. పాఠశాల పనివేళల్లో పనిచేయడం లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. –రమణయ్య, పేరాయిపల్లె, హెచ్ఎం మానసిక ఒత్తిడికి గురవుతున్నాం బయోమెట్రిక్ విధానం బాగానే ఉన్నప్పటికీ మానసికంగా ఒత్తిడికి గురికావాల్సి వస్తోంది. ఈ విధానంలో ఎల్లో, గ్రీన్, రెడ్ జోన్లను కేటాయించారు. పాఠశాల సమయం దాటి 20 నిమిషాలు ఆలస్యమైనా రెడ్‌జోన్‌లో పడితే సెలవు కింద తీసుకుంటుంది. 10 నిమిషాలు ఆలస్యం అయితే గ్రీన్ జోన్‌కింద పడి ఇలా ఐదు రోజులు జరిగితే ఉపాధ్యాయులకు మెమోలు వస్తున్నాయి. సాంకేతిక సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాకే ఈ విధానం ప్రవేశపెట్టింటే బాగుండేది. –రామనందకిశోర్, ఉపాధ్యాయుడు -
ఆదిలోనే మొరాయింపు
►నిరుపయోగంగా బయోమెట్రిక్ యంత్రాలు ►పాఠశాలల్లో అమలుకాని ఈ–హాజరు ►చోద్యం చూస్తున్న అధికారులు ఉపాధ్యాయులు, విద్యార్థులు సమయపాలన పాటించడం, మధ్యాహ్నభోజనంలో అక్రమాలు నిరోధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఈ–హాజరు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకు గాను కోట్ల రూపాయల వ్యయంతో బయోమెట్రిక్ యంత్రాలు అందజేసి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కానీ ప్రారంభంలోనే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ–హాజరు అటకెక్కింది. బద్వేలులోని ఉన్నత పాఠశాలలో దాదాపు 1,100 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేందుకు పది యంత్రాలను ప్రభుత్వం అందజేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఉపయోగించలేదు. ఉపాధ్యాయులు,విద్యార్థులు హాజరు వేయలేదు. జిల్లాలో 3,178 పాఠశాలలు ఉండగా వీటిలో 11,743 మంది ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మొదటి విడతగా 361 పాఠశాలలో ఈ–హాజరు ప్రవేశపెట్టారు. వీటిల్లో ఉన్న 3,764 మంది ఉపాధ్యాయులు, 55,886 మంది విద్యార్థులు బయోమెట్రిక్ హాజరు వేయాలని పేర్కొన్నారు. ఇందుకుగాను మొత్తం 5,129 బయోమెట్రిక్, ఐరిష్ యంత్రాలు అవసరమవుతాయని నిర్ణయించారు. ఇప్పటి వరకు 359 ఉన్నత పాఠశాలల్లో 989 యంత్రాలను రిజిస్టర్ చేశారు. మిగిలినవి అందజేసినా వాటిని రిజిస్టర్ చేయకుండా బీరువాల్లో భద్రపరిచారు. ఒక శాతం ఉపాధ్యాయులు కూడా బయోమెట్రిక్ యంత్రాలను ఉపయోగించడం లేదు. విద్యార్థుల ఈ–హాజరు శాతం సున్నా. జిల్లాలో ప్రతి రోజు ఐదు యంత్రాలను మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ నెల 17న పరిశీలించగా 13మంది ఉపాధ్యాయులు ఈ–హాజరు వేశారు. వారిలో కొండాపురం మండలంలో ఆరుగురు, దువ్వూరులో ఐదుగురు, వీరబల్లి, చిన్నమండెం మండలాలలో ఒకరు వంతున ఈ–హాజరు నమోదు చేశారు. 18న కొండాపురంలో 11 మంది, దువ్వూరులో ఐదుగురు, వీరబల్లిలో నలుగురు, చిన్నమండెంలో ఒకరు వంతున హాజరు నమోదు చేశారు. 19న కొండాపురంలో 9 మంది , దువ్వూరులో ఇద్దరు, ఒంటిమిట్టలో ముగ్గురు, వీరబల్లిలో నలుగురు, చిన్నమండెంలో ముగ్గురు మాత్రమే బయోమెట్రిక్ హాజరు వేశారు. పని చేయకపోవడంతోనే... బయోమెట్రిక్ హాజరుకు ప్రభుత్వం అందజేసిన యంత్రాలు నాసిరకంగా ఉన్నాయని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల 3–జీ నెట్వర్క్ ఉండకపోవడంతో హాజరు వేయడం కుదరడం లేదని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వేద్దామన్నా ఒక్కో పర్యాయం 3 నుంచి 5 నిమిషాల వరకు సమయం పడుతుందంటున్నారు. ఒక్కో యంత్రంలో వందమంది విద్యార్థులు హాజరు వేయాలని నిర్ణయించారు. నెట్వర్క్ సరిగా లేని సమయంలో వంద మంది నమోదు చేయాలంటే 3 నుంచి 4 గంటల సమయం పట్టవచ్చని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఒక్కొ యంత్రానికి ప్రభుత్వం రూ.7వేలకు పైనే వెచ్చించిందని సమాచారం. ఈ లెక్కన రూ.లక్షల ఖర్చు చేసి అందజేసిన యంత్రాలు మూలన పడటంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ–హాజరు విషయమై ఆయా పాఠశాలల నుంచి ఒక్కో ఉపాధ్యాయుడిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. అవగాహన లోపం.. అందని సాంకేతిక సహాయం యంత్రాల వినియోగంలో చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చినా పరిష్కరించలేక ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యుత్ సమస్య కూడా ఉండటంతో చార్జింగ్ విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినా సమస్య పరిష్కరించడంలో చొరవ చూపడం లేదు. వీటిని సరఫరా చేసిన ఏజెన్సీ నిర్వాహకులు సహకారం అంతంతమాత్రమే. సాంకేతిక సమస్యలపై ఫిర్యాదు చేస్తే తాము ఇచ్చే సమయంలో సరిగానే ఉన్నాయని చెబుతూ తప్పించుకుంటున్నారని కొంతమంది ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
భయోమెట్రిక్!
♦ కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏడుగురు డీలర్ల రాజీనామా ♦ కమీషన్ పెంచకుండా ఈ-పాస్ అమలుపై నిరసన ♦ పెరిగిన నిర్వహణ భారంతో రేషన్‌షాపులకు గుడ్‌బై ♦ కమీషన్ పెంపుపై సర్కారుకు జిల్లా యంత్రాంగం లేఖ ఈ- పాస్ అమలు చేస్తే ప్రభుత్వం ఇచ్చే కమీషన్ ఏ మూలకూ సరిపోదని ఉప్పల్‌లో ఇద్దరు, కాప్రా లో ఒకరు, బాలానగర్‌లో ఇద్దరు, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో ఒక్కొక్కరు చొప్పున డీలర్ షిప్‌నకు రిజైన్ చేశారు. రేషన్ డీలర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న కమీషన్‌పై పునరాలోచన చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి లేఖ రాసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పౌరసరఫరాల శాఖకు కొత్త చిక్కు వచ్చింది. ప్రజాపంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకుండా బయోమెట్రిక్ యంత్రాలను ప్రవేశపెడుతుంటే.. వాటి రాక తమ పొట్టకొడుతుందని భావిస్తున్న చౌకధరల దుకాణాల డీలర్లు రాజీనామా బాట పడుతున్నారు. స్టాకు విడుదల నుంచి కార్డుదారులకు పంపిణీ వరకు ప్రతిది ఈ -పాస్ యంత్రం కనుసన్నల్లో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్ షాపుల్లో వీటిని అమలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి వీటి ద్వారా సరుకులను జారీ చేయనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ యంత్రాలు తమను మరింత నష్టాల్లోకి నెడతాయని అంచనాకొచ్చిన పలువురు డీలర్‌షిప్‌ను వదులుకుంటున్నారు. బయోమెట్రిక్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏడుగురు డీలర్లు రాజీనామా చేయడం జిల్లాయంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ యంత్రాల అమలుతో నల్లబజారుకు తరలుతున్న సరుకుకు అడ్డుకట్ట వేయవచ్చని, కనిష్టంగా 14 నుంచి 20 శాతం మేర సరుకు ఆదా అవుతుందని యంత్రాంగం అంచనా వేసింది. తద్వారా సర్కారుకు గుదిబండగా మారిన సబ్సిడీ భారాన్ని కొంత మేర తగ్గించగలమని భావించింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 11.40 లక్షల రేషన్‌కార్డులకు ప్రతినెలా 25వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 1,800 కిలోలీటర్ల కిరోసిన్, అరకేజీ చొప్పున చక్కెర, కందిపప్పును అందజేస్తోంది. ఇవి పక్కదారి పట్టకుండా ఆపగలిగితే ఖజానాకు మంచిదనే అంచనాకొచ్చింది. నిజాయితీతో కష్టమే సుమా! అవినీతికి పాల్పడకుండా సరుకులు విక్రయిస్తే తమకు గిట్టుబాటు కాదని, ప్రభుత్వం ఇచ్చే కమీషన్ ఏ మూలకూ సరిపోదని కొంతకాలంగా రేషన్‌డీలర్లు వాపోతున్నారు. ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెడితే తమ కమీషన్‌ను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం కమీషన్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం.. వచ్చే నెలలో బయోమెట్రిక్ యంత్రాలు అమలులోకి తేనుండడంతో దిక్కుతోచని పలువురు డీలర్షిప్ నుంచి తప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉప్పల్‌లో ఇద్దరు, మల్కాజిగిరి, కాప్రాలో ఒకరు, బాలానగర్‌లో ఇద్దరు, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో ఒక్కొక్కరు చొప్పున డీలర్ షిప్‌కు రాజీనామా చేశారు. ఈ పరిణామాలను ముందే ఊహించిన అధికారులు మాత్రం.. ఇన్నాళ్లు సరుకు బ్లాక్ మార్కెట్‌కు తరలించి జేబులు నింపుకున్నారని, ఇప్పుడు దానికి బ్రేక్ పడుతుందని భయపడే ముందస్తుగానే డీలర్లుగా వైదొలుగుతున్నారని అంటున్నారు. బినామీ డీలర్లే రాజీనామాలు చేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. కాగా, రేషన్ డీలర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న కమీషన్‌పై పునరాలోచన చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి లేఖ రాసింది. జీహెచ్ఎంసీ పరిధిలో రేషన్ షాపుల నిర్వహణ భారంగా మారినందున.. కమీషన్‌ను పెంచాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం వర్తింజేస్తున్న కమీషన్‌ను రెట్టింపు చేసిన కొన్ని దుకాణాలు నష్టాల్లోనే నడిచే అవకాశమున్నందున.. కార్డుల ప్రాతిపదికన కమీషన్‌ను నిర్దేశించాలని కోరింది. కార్మికశాఖ లెక్కల ప్రకారం నెలకు 26 రోజులు పనిచేసే కూలీకి రూ.275 నుంచి రూ.287 చెల్లించినా నెలకు రూ.7152 లేదా 7482 వస్తుందని, అలాంటిది చౌక దుకాణం నిర్వహించే డీలరుకు ఆస్థాయిలో కమీషన్ ఇవ్వకపోవడం సహేతుకం కాదని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఇటీవల రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. సాధకబాధకాలను తెలుసుకుంది. దీనికి అనుగుణంగా వారిచ్చిన నివేదికను మదింపు చేసి.. రేషన్ షాపుల నిర్వహణ ఖర్చులను లెక్కించింది. -
పల్లెల్లోనూ ఈ- పాస్
ఆగస్టు 1నుంచి అమలుకు ఏర్పాట్లు 500 డిపోలకు బయోమెట్రిక్ మెషిన్లు మండలాలకు చేరిన పరికరాలు డీలర్లకు పూర్తయిన శిక్షణ అక్రమాల నిరోధమే లక్ష్యం నరసన్నపేట :సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్ర స్థాయిలో రేషన్సరకుల పంపిణీలో అక్రమాలను నివారించేందుకు జిల్లా పౌర సరఫరాల విభాగం సన్నద్ధమైంది. ఆగస్టు ఒకటి నుంచి జిల్లాలో రెండో విడతగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 500 రేషన్‌డిపోల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్(ఈ-పాస్) అమలుచేయనున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. నియోజకవర్గ స్థాయిలో డీలర్లకు ఈ -పాస్ యంత్రాల వినియోగంపై శిక్షణ కూడా పూర్తి చేశారు. ఇందులో భాగంగా నరసన్నపేటలో 21న నాలుగు మండలాలకు చెందిన డీలర్లకు శిక్షణ నిచ్చారు. ఈ-పాస్ అమలైతే రేషన్‌డిపోల్లో అక్రమాలను అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొదటి విడతగా మండల కేంద్రాలు, మున్సిపాల్టీల్లోని 282 రేషన్‌డిపోల్లో అమలు చేశారు. ఒక్క నరసన్నపేట మండలంలోనే నెలకు 50 క్వింటాళ్ల వరకూ బియ్యం ఆదా కన్పించింది. 500 కార్డు దారులు సరుకులు విడిపించలేదు. దీనివల్ల ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చింది. ఇక పల్లెల్లోనూ వీటిని ఉపయోగించడం ద్వారా మరిన్ని ఫలితాలు సాధించవచ్చని, ప్రభుత్వానికి అధికంగా మిగులు చూపించవచ్చని అధికారులు భావించి ఆగస్టు నుంచి అమలుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఉన్న అన్ని రేషన్ షాపుల్లో మరో రెండు నెలల్లో ఈ-పాస్ అమలు కానుంది. జిల్లాలో మొత్తం 2020 రేషన్‌షాపులున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ-పాస్ అమలైతే 20 శాతం వరకూ సరకులు మిగిలే అవకాశం ఉంది. ఆమదాలవలసలో 15, సరుబుజ్జిలి మండలంలో 13, బూర్జలో 11, పొందూరులో 13 డిపోల్లో ఈ-పాస్ అమలు కానుంది. అలాగే ఎచ్చెర్ల, కంచిలి, పోలాకి, సోంపేట, జలుమూరు, పాలకొండ, మందస, మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, గార, కోటబొమ్మాళి, నందిగాం, సంతకవిటిమండలాల్లో 13 డిపోల చొప్పున్న ఈ-పాస్ అమలు చేయనున్నారు. అలాగే లావేరు, రణస్థలం, నరసన్నపేట, కొత్తూరు, రాజాం మండలాల్లో 15 డిపోలు చొప్పున అమలు చేస్తారు. జి.సిగడాంలో 11, ఇచ్ఛాపురంలో 14, కవిటిలో 12, భామినిలో11, సీతంపేటలో 8, పలాసలో10, వీరఘట్టంలో 11, వంగరలో 12, శ్రీకాకుళం రూరల్ మండలంలో 20, టెక్కలిలో 17 డిపోల్లో ఈ-పాస్ అమలు చేస్తారు. డీలర్లలో ఆందోళన జిల్లా సివిల్ సపై్ల అధికారులు ఈ-పాస్ అమలుకు ఒక వైపు చర్యలు తీసుకుంటుంటే మరో వైపు రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ పాస్‌తో చిన్న తప్పు చేయలేమనీ, కచ్చినమైన తూకం అమలు చేయాలని దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని భయపడుతున్నారు. అన్ని స్థాయిల్లో అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లించుకుని నిజాయితీగా సరకులు అందిస్తే తాము చేతులు కాల్చుకోవాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం, పంచదార, పప్పు ఇతర సరుకులు ఇస్తున్నప్పుడు తూకంవేసి అప్పగించడంలేదనీ, ప్రతీ బస్తాకు కనీసం రెండు నుంచి 4 కేజీలు తరుగు ఉంటోందని చెబుతున్నారు. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు. కమీషన్ పెంచకుండా... నిర్బంధంగా ఈపాస్ అమలు చేస్తే డీలర్షిప్ కొనసాగించలేమని స్పష్టం చేస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లో తూకంవేసి సరకులు అప్పగించాలి ఈ-పాస్ అమలు మంచిదే. అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టి, నష్టాలకు గురి చేసి ఈ పద్ధతి అమలు చేయడం సరికాదు. ఈ-పాస్ అమలు చేస్తున్న డిపోలకు కచ్చితంగా సరకులు సరైన తూకంతో అప్పగించాలి. అలాగైతే పూర్తిగా సహకరిస్తాం. డీలర్లకు ఇచ్చే కమీషన్ పెంచాలి. ఇతర ఖర్చులుతగ్గించాలి.పాసిన ఆదెయ్య. డీలరు, గంగివలస -
ఇక గట్టి నిఘా
* బాలికల వసతిగృహాలలో భద్రత పెంపు * మొదటి దశగా గిరిజన హాస్టళ్లలో సీసీ కెమెరాలు * త్వరలోనే బీసీ, ఎస్సీ వసతి గృహాలలో అమలు * నివేదిక తయారు చేస్తున్న అధికారులు * త్వరలో బయోమెట్రిక్ మిషన్లు కూడా ఏర్పాటు * సిబ్బంది విధి నిర్వహణపైనా దృష్టి ఇందూరు : సంక్షేమ వసతి గృహాలలో బాలికల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. బాలికలుండే వసతిగృహాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలనేది దీని ఉద్దేశం. అనుమతి లేకుండా ఎవరైనా లోనికి చొరబడితే సీసీ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. వార్డెన్, వర్కర్ల పనితీరు, బాలికల హాజరు శాతాన్ని పరిశీలిస్తారు. మొదటి దశలో గిరిజన బాలికల వసతి గృహాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో ఎన్ని గిరిజన వసతి గృహాలున్నాయి.. అందులో బాలికల హాస్టళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి.. వసతి గృహాలలో ఉంటున్న బాలికల సంఖ్య త దితర వివరాలు తెలుపాలని జిల్లా అధికారులకు సంబంధిత శాఖ కమిషరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారు. తనిఖీలు ఇక తేలిక జిల్లాలో మొత్తం 17 గిరిజన సంక్షేమ వసతి గృహా లున్నాయి. ఇందులో నాలుగు బాలికల వసతి గృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వసతి గృహాలు ఐదు ఉ న్నాయి. వీటిలో బాలికలకు భద్రత కరువైందని, ఆగంతకులు చొరబడటంతో అనుకోని ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వార్డెన్లు సక్రమంగా విధులకు వస్తున్నారా.. వర్కర్లు, బాలికలు ఏం చేస్తున్నారు.. ఎంత మంది ఉంటున్నారనే విషయాలను ఉన్నతాధికారులు తనిఖీలకు వెళ్లకుండా కార్యాలయం లోనే కూర్చుని పరిశీలించే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఉన్న తొమ్మిది బాలికల వసతిగృహాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా అధికారుల కార్యాలయానికి అను సంధానం చేస్తా రు. ఈ నిఘా వ్యవస్థ ద్వారా బాలికలకు భద్రత పెరుగుతుంది. కొన్ని బాలికల వసతిగృహాలకు ప్రహరీలు నిర్మించకపోవడం మూలంగా రాత్రుల లో ఆ కతాయిల బెడద ఉంటుందని, దీంతో బాలి కలు భయం భయంగానే గడపాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. గిరిజన బాలికల వసతిగృహాల తర్వాత రెండో దశలో బీసీ, ఎస్సీ బాలికల వసతిగృహాలలోనూ సీసీ కెమెరాలు ఏర్పా టు చేసిన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచి స్తోంది. బయోమెట్రిక్ మెషిన్లు ఇదిలా ఉండగా, జిల్లాలోని 67 ఎస్సీ, 60 బీసీ వసతి గృహాలలో విద్యార్థుల మెస్ బిల్లుల అక్రమాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ మిషన్లు అందజేయనున్నట్లు రెం డు నెలల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానాన్ని జిల్లాలోని 17 గిరిజన సంక్షేమ వసతిగృహాలలో కూడా అమలు చేసేం దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు రాకున్నప్పటికీ హాజరు శాతం చూపించి వార్డెన్లు మెస్ బిల్లులను అక్రమంగా డ్రా చేసుకుంటున్నారనే అరోపణలు ముందునుంచి ఉన్నాయి. చాలా మం ది వార్డెన్లు దొరికిపోయారు కూడా. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ మెషిన్లు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులు హాస్టల్‌కు వెళ్లగానే ముందుగా మెషిన్ ద్వారా వేలి ముద్రలు ఇవ్వాలి, సాయంత్రం మరోసారి వేలి ముద్రలు ఇవ్వాలి. బయోమెట్రిక్ మెషిన్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగానే సరుకులను వార్డెన్లు వాడాల్సి ఉంటుంది. బిల్లులు అదేవిధంగా విడుదల అవుతాయి. -
అక్రమాలకు చెక్ !
సత్తెనపల్లి : వసతి గృహాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందులోభాగంగా వసతి గృహాల సంక్షేమాధికారులకు బయోమెట్రిక్ యంత్రాలు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థుల వేలిముద్రలు, ఆధార్ నంబర్లు సేకరిస్తున్నారు. ఇదీ సంగతి.. వసతి గృహాల్లో విద్యార్థులు తక్కువగా ఉంటున్నప్పటికీ ఎక్కువమంది ఉన్నట్లు చూపిస్తూ పలువురు సంక్షేమాధికారులు ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారు. ఈ దందాలో కొందరు అధికారులకూ భాగస్వామ్యం ఉంటోంది. వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు, జిల్లా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమాల గుట్టు రట్టరుున సంగతి తెలిసిందే. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులోభాగంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమల్లోకి తీసుకొస్తోంది. ఇదీ జరిగేది... * వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల హాజరును ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయూల్లో బయోమెట్రిక్ యంత్రాల్లో నమోదు చేస్తారు. ఈ వివరాలు ఇంటర్నెట్ ద్వారా రాజధానిలోని సీజీజీకి వెళతారుు. దీంతో ఏ రోజు ఎంతమంది విద్యార్థులు వసతి గృహాల్లో ఉన్నారో తెలిసిపోతుంది. * విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపేందుకు తప్పుడు వేలిముద్రలు వేసే అవకాశం ఉన్నందున ఆధార్ నంబర్లను అనుసంధానం చేస్తారు. బయోమోట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకుకు వసతి గృహాల సంక్షేమాధికారులకు ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం సమకూరుస్తారు. * జిల్లాలోని 94 ఎస్సీ సంక్షేమ వసతి గృహాల సంక్షేమాధికారులకు ల్యాప్‌టాప్‌లు, బయోమెట్రిక్ యంత్రాలను అందజేశారు. ల్యాప్ టాప్ల్లో నిక్షిప్తం చేసిన ప్రత్యేక సాప్ట్వేర్ ఆధారంగా విద్యార్థి పేరు, తల్లిదండ్రుల వివరాలతోపాటు, ఏ పాఠశాలల్లో చదువుతున్నారనే వివరాలను పొందుపరుస్తున్నారు. ఇప్పటికే వసతి గృహాల్లోని విద్యార్థుల ఆధార్ నంబర్లను సేకరించారు. వేలిముద్రలు సేకరించాల్సి ఉంది. బయోమెట్రిక్ విధానం అమలుపై సంక్షేమ అధికారులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.. బయోమెట్రిక్ విధానం అమలుతో వసతి గృహాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయూల్లోనే వేలిముద్రల సేకరణ ఉంటుంది. అనంతరం వేలిముద్రలు వేయాలన్నా యంత్రం తీసుకోదు. ఈ సమాచారం ఆధారంగానే వసతి గృహాలకు సరుకులు, నగదు అందుతారుు. ఈ విధానంపై సంక్షేమ అధికారులకు త్వరలోనే శిక్షణ ఇస్తాం. - ఆర్.అన్నపూర్ణ, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి -
టీచర్ల హాజరుకు బయోమెట్రిక్!!
ప్రభుత్వ ఉపాధ్యాయులపై నియంత్రణలు విధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమంగా ఒక్కో చర్య మొదలుపెడుతోంది. ఇప్పటికే వారి పనిగంటలను 30 నిమిషాల పాటు పెంచిన సర్కారు, తాజాగా వాళ్ల హాజరు విషయంలోనూ మరింత కఠినమైన నిబంధనలు అమలుచేసేందుకు సిద్ధం అవుతోంది. సాధారణంగా పిల్లల హాజరు టీచర్లు తీసుకుంటే, టీచర్ల హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ముందుగా విశాఖపట్నం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తారు. దీంతోపాటు పదివేల మందికి పైగా టీచర్లను హేతుబద్ధీకరించాలని (రేషనలైజేషన్) కూడా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని, తీసుకుంటున్న నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయమై తమ నిరసనను తెలియజేసేందుకు పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. -
పెన్షన్ల కోసం ప్రదక్షిణలు
తెనాలిటౌన్,న్యూస్‌లైన్: సకాలంలో పెన్షన్లు అందక తెనాలి డివిజన్లోని లబ్ధిదారులు పలు అగచాట్లు పడుతున్నారు. గ్రామాల్లోని పోస్టాఫీస్‌ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ పొందే లబ్ధిదారులకు ఏడోతేదీ వచ్చినా అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడు తున్నారు. వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. లబ్ధిదారుని గ్రామంలో పోస్టాఫీస్ లేకపోతే పక్క గ్రామానికి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీ కార్యదర్శులు పంపిణీ చేసినపుడు ఒకటో తేదీ పండగైనా, ఆదివారమైనా పెన్షన్ నగదు అందించేవారు. ప్రభుత్వం పోస్టాఫీస్‌ల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టిన తరువాతే ఈ ఇబ్బందులు ఆరంభమయ్యాయి. మొదటి రెండు మూడు నెలలు బాగానే ఇచ్చారు. ఆ తరువాత నుంచి తిప్పలు తప్పడం లేదు. తెనాలి మండలంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత పెన్షన్‌దారులు సుమారు 6500 మంది వరకు ఉన్నారు. కొల్లిపర మండలంలో అభయహస్తం, వికలాంగ, వితంతు, చేనేత, కల్లుగీత, వృద్ధాప్య పెన్షన్‌దారులు సుమారు 5,019 వరకు ఉన్నారు. తెనాలి డివిజన్లోని 18 మండలాల్లో పెన్షన్‌దారుల పరిస్థితి ఇలాగే ఉంది. పనిచేయని బయోమెట్రిక్ మెషిన్లు బయోమెట్రిక్ మెషిన్లు పనిచేయకపోవడం, సిగ్నల్స్ లేక సర్వర్లు కనెక్ట్ కాకపోవడం వల్ల సకాలంలో పెన్షన్లు అందించలేకపోతు న్నారు. వృద్ధుల వేళ్లు అరిగిపోవడంతో వేలిముద్రలు మెషిన్లపై పడడం లేదు. ఆధార్ కార్డు లేకపోయినా పెన్షన్ ఇవ్వడం లేదు. వచ్చే రెండొందల కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని, ఆటోలు, రిక్షాలకు యాభై రూపాయలు ఖర్చు అవుతున్నాయని వృద్ధులు వాపోతున్నారు. తెనాలి మండలం నందివెలుగులో 39 మందికి పెన్షన్లు మంజూరైనప్పటికీ మూడు నెలల నుంచి నగదు ఇవ్వడం లేదు. లబ్ధిదారుల జాబితా కంప్యూటర్లో నమోదు కావడం లేదని, ఆన్లైన్ కూడా పనిచేయడం లేదని, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు చెపుతున్నారు. దీనిపై కొలకలూరు పోస్ట్ మాస్టర్ ఝాన్సీరాణిని వివరణ కోరగా బయోమెట్రిక్ మెషిన్లు పనిచేయడం లేదన్నారు. వృద్ధుల వేలిముద్రలు పడకపోవడం, సిగ్నల్స్ లేక సర్వర్ పని చేయనందున పంపిణీ ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు. మరణించిన వారికీ పెన్షన్లు పోస్టాఫీస్ సిబ్బంది, సీఎస్పీలకు అవగాహన లేకపోవడంతో మరణించిన వారి పేరుతో ఉన్న పెన్షన్లను పంపిణీ చేసిన దాఖలాలు ఉన్నాయి. తెనాలి మండలం కఠెవరంలో ఐదుగురు, చావావారిపాలెంలో ఒక రు మరణించగా వారిపేరుతో వున్న పెన్షన్లు అందజేసినట్లు తెలిసింది. దారి ఖర్చులకు పోతున్నాయి. మాది గుదిబండివారిపాలెం. మాకు కొల్లిపరలో ఇస్తున్నారు. రెండు కిలోమీటర్లు వెళ్లాలి. రోజుకు రూ.30 లు ఆటోకే ఖర్చు అవుతుంది. పోస్టాఫీస్‌కు వెళితే వేలిముద్రలు పడటం లేదు అంటున్నారు. రెండు రోజులు ఆగిన తరువాత వెళితే మళ్ళీ రెండు రోజులు ఆగి రమ్మంటున్నారు. ఈ డబ్బులు దారి ఖర్చులకే సరిపోతున్నాయి. - జొన్నల వెంకటరెడ్డి, గుదిబండివారిపాలెం నాలుగు రోజులుగా తిరుగుతున్నా పెన్షన్ కోసం పోస్టాఫీస్ చుట్టూ నాలుగు రోజులుగా తిరుగుతున్నా. రోజూ రేపు రమ్మంటున్నారు. వేలిముద్రలు పడటం లేదని చెబుతున్నారు. వృద్ధులను ఇబ్బంది పెట్టటం దారుణం. - నలుకుర్తి మరియమ్మ, కొలకలూరు వారం గడిచినా ఇవ్వలేదు.. గతంలో ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ ఇచ్చేవారు. రెండు నెలల నుంచి నెలలో వారం రోజులు గడిచినా కూడా పెన్షన్ ఇవ్వడం లేదు. రెండు కిలోమీటర్ల దూరం నుంచి పోస్టాఫీస్‌కు వస్తున్నా. ఆధార్ కార్డు లేదని పెన్షన్ ఇవ్వడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్న మళ్లీ రేపు రా అంటున్నారు. - ఫాతిమున్నీసా, కొలకలూరు -
ఉపకారం దూరం
ఇందూరు, న్యూస్‌లైన్: మొన్న మొన్నటి వరకు కళాశాలలో చదువుతున్నట్లు ప్రిన్సిపాల్ సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు జిరాక్స్, బ్యాం కు ఖాతా, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల ను దరఖాస్తు ఫారానికి జత చేస్తే మార్చిలోగా ఉపకార వేతనాలు వచ్చేవి. కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం పైవాటితో పాటు ఆధార్ కార్డు, సొంత సెల్‌ఫోన్ నంబరుతో విద్యార్థులే నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కొన్ని నెల ల క్రితం నిబంధన విధించింది. ఈ నిబంధన లు సరిపోవన్నట్లుగా ఉపకార వేతనాల దర ఖా స్తుల పరిశీలన అధికారుల వ్యవస్థను రద్దు చేసి, ఆ బాధ్యతలను సంబంధిత కళాశాలల యాజ మాన్యాలకే అప్పగించింది. ఇక బయోమెట్రిక్ మెషిన్ ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలని, దీనికి విద్యార్థి వేలి ముద్రతో పాటు, కళాశాల ప్రిన్సిపాళ్ల సంతకం కూడా తప్పని సరిగా ఉండాలని, అయితేనే ఉపకార వేతనాలు మంజురు అవుతాయని కొత్త కొత్త షరతులు పెట్టి తల నొప్పిగా మా ర్చుతోంది ప్రభుత్వం. దీంతో ఉపకారం పేద విద్యార్థులకు అందని ద్రాక్షలా మారుతోంది. ఇదీ పరిస్థితి జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలు కలిపి సూమారు 280 వరకు ఉన్నాయి. ఇందులో ఫ్రెష్, రెన్యూవల్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకున్న ఎస్సీ, ఎస్ టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు దాదాపుగా 80 వేలకు పైగా ఉన్నారు. వీరిలో 15 శాతం మందికి ఆధార్ కార్డు రాకపోవడం, సొంత సెల్ఫోన్లు లేకపోవడంతో ఇప్పటి కీ ఆన్‌లైన్‌లోకి ఎంట్రీ కావడం లేదు. సెల్‌ఫోన్ నెంబరు లేకపోడం ప్రధాన సమస్యగా మారింది. ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునే వారందరు పేద విద్యార్థు లే కావడంతో సెల్‌ఫోన్‌ను వాటడంలేదు. వాడినవారికీ సమస్యగానే మారింది. ఎందుకంటే, ఉపకార వేతనాలు రెన్యూవల్ కావాలంటే సెల్ నంబరుకు ఒక హై సెక్యూ రిటీ నంబరును మెసేజ్ ద్వారా పంపుతారు. అది వచ్చిన మరుక్షణమే సంబంధిత కళాశాల వారు ఫోన్ చేసి ఆ నంబరు చెప్పమంటారు. అది చెబితేనే ఉపకార వేతనం పొందటానికి అర్హూలు. లేదంటే అనర్హూలవుతారు. ఈ నిబంధనతో జిల్లావ్యాప్తంగా రెండు నుంచి మూడు వేల మంది వరకు విద్యార్థులు తమ ఉపకార వేతనాన్ని నష్ట పోయినట్లు సంక్షేమాధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు అంచనా వేశారు. అంటే ప్రభుత్వం పెట్టిన లేనిపోని నిబంధనలతో వారికి అన్యాయం జరిగినట్టే. భయపెట్టిస్తున్న బయోమెట్రిక్ విధానం ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. నెలకో నిబంధన, కొత్త విధానాలంటూ అసలుకే ఎసరు పెడుతోంది. నెల రోజుల క్రితం కొత్తగా బ యో మెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అమలు చేసేందుకు చర్యలు కూడా ప్రారంభించింది. ఈ విధానంపై ప్రిన్సిపాళ్లు, జిల్లా సంక్షేమాధికారులకు అవగాహన కలిగించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్ వాయిదా పడుతూ వస్తోంది. ఉపకార వేతనం పొందాలంటే ప్రతి విద్యార్థి వేలిముద్ర కచ్చితంగా బయోమెట్రిక్ యంత్రంలో నమోదు కావాలి. దానితోపాటు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ సంతకం కూడా ఉండాలి. ఇటు విద్యార్థి ఆధార్ కార్డులో నమోదు చేసిన వేలి ముద్రలు, బయోమెట్రిక్ మెషిన్లో నమోదు చేసిన వేలిముద్రలు సరిపోలకుంటే ఆ విద్యార్థికి ఉపకార వే తనం రానట్లే. మూడు నెలలలో ఎలా సాధ్యం? ఉపకార వేతనాలను ఎగవేసే కుట్రలో భాగంగానే బయోమెట్రిక్ మెషిన్ విధానాన్ని ప్రవేశపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం మార్చితో ము గియనుంది. ఇంకా యంత్రాలు జిల్లాకు రాలేదు. ఈ పాటికే అధికారులు ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వం దీనికి వ్యవధిని నిర్ణయించకపోవడంతో నిధులు ఎ ప్పుడు విడుధల అవుతాయో అర్థకాని పరిస్థితి నెలకొంది. 80 వేల మందితో వేలిముద్రలు తీసుకోవడం, అవి ఆధార్‌లో ఉన్న వేలి ముద్రలతో సరిచూడడం కష్టసాధ్యం అవుతుందని ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ మెషిన్లను కళశాలల యాజమాన్యాలే కొనుగోలు చేసుకోవాలని సర్కారు మరో తిరకాసు పెట్టింది. ఒక్కో మె షిన్ రూ.30 వేల వరకు ఉండటంతో తాము సొంత నిధులతో ఎలా కొనుగోలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కొన్నా విద్యార్థుల నుంచే డబ్బులు వసూలు చేయాలని కళాశాలల యాజమాన్యాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ కళాశాలలు మాత్రం ప్రభుత్వం ఇచ్చే నిధులతో కొనుగోలు చేయాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయం సరికాదు విద్యార్థులకు మంజూరు చేసే ఉపకార వేతనాల విషయంలో ప్రభుత్వం నెలకో నిర్ణయం తీసుకుంటోంది. బయోమెట్రిక్ మెషిన్, సొంత సెల్ ఫోన్ నంబరు విధానం తో విద్యార్థులు ఉపకారానికి దూరం అయ్యే అవకాశం ఉంది. పేద విద్యార్థుల దగ్గర సెల్ఫోన్లు ఎలా ఉంటాయి? బయోమెట్రిక్ మెషిన్లను ఎవరికివారే కొనుక్కోవడ ం, వేలి ముద్రలు తీసుకోవడం యాజమాన్యాలకు అదనపు భారమే. - ప్రవీణ్ కుమార్, శ్రీసాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్,నందిపేట్