ఈఎస్‌ఐ డయోగ్నోస్టిక్ సెంటర్
విజయనగరం ఫోర్ట్: బయోమెట్రిక్‌తో సిబ్బంది సమయపాలన పాటిస్తారని భావిస్తే ఆ పరికరాలు పనిచేయకపోవడం వారికి ఇప్పుడు అవకాశంగా మారింది. గత ప్రభుత్వం నాసిరకంగా పరికరాలు సమకూర్చడంతో అవి ఏడాది తిరగకుండానే మూలకు చేరి... దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఈఎస్‌ఐ డయోగ్నోస్టిక్ సెంటర్, డిస్పెన్సరీలో ఉద్యోగులు సమయపాలన పాటించేందుకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరం మూలకు చేరింది. నాసిరకం పరికరాలను అప్పటి ప్రభుత్వం సరఫరా చేయడంతో ఏర్పాటు చేసిన కొద్ది నెలలకే దిష్టి బొమ్మలా మారింది. పాడైన వెంటనే ఈఎస్‌ఐ అధికారులు పంపించినప్పటికీ నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఒక్కో పరికరం రూ.16 వేలు విలువ చేస్తే రూ.72 వేలకు కొనుగోలు చేసినట్టు నివేదిక ఇచ్చారు. దీనిని బట్టి అప్పటి టీడీపీ పాలకులు ఎంత మేర అవినీతికి పాల్పడ్డారో అర్థమవుతోంది.
ఏడాది తిరగకుండానే మూలకు..
ఈఎస్‌ఐ డయోగ్నోస్టిక్ సెంటర్‌లో బయోమెట్రిక్ పరికరం ఏర్పాటు చేసిన కొద్ది నెలలకే మూలకు చేరింది. 2018 జనవరి నెలలో ఇక్కడి వైద్య సిబ్బంది హాజరు నిమిత్తం వీటిని ఏర్పాటు చేశారు. 2018 నవంబర్ నెలలో అది మూలకు చేరింది. అప్పట్లోనే అధికారులు బాగు చేయించాల్సిందిగా ఈఎస్‌ఐ డైరెక్టర్‌కు పంపించారు. కాని అధికారులు ఇంతవరకు బాగు చేయించలేదు. వేలాది రుపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాటిని బాగు చేయించకుండా వదిలేశారు.
సమయ పాలన గాలికి...
బయోమెట్రిక్ లేకపోవడంతో వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు సమయపాలనకోసం ఏర్పాటు చేసిన పరికరాలు పనికిరాకుండా పోవడంతో వారిలో క్రమశిక్షణ లోపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేయాల్సి ఉన్నా... 10 గంటలకు, 10:30 గంటలకు సిబ్బంది విధులకు హాజరు అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై డయోగ్నోస్టిక్ సెంటర్ సూపరింటెండెంట్ అల్లం కృష్ణారావువద్ద సాక్షి ప్రస్తావించగా 2018 నవంబర్ నెలలో బయోమెట్రిక్ పాడైందనీ, దానిని బాగు చేయించాలని ఈఎస్‌ఐ డైరక్టర్ కార్యాలయానికి పంపించామనీ, కానీ ఇప్పటివరకూ రాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment