53 డ్రగ్స్ నాణ్యత లేవు: కేంద్రం
జాబితాలో క్లావమ్ 625, పాన్ డీ, గ్లిమిపిరిడిన్, టెల్మీసార్టాన్ తదితరాలు
న్యూఢిల్లీ: ఒళ్లు కాస్తంత వేడిగా అనిపించినా వెంటనే మింగే మాత్ర పారాసిటమాల్. అది నాసిరకం మాత్ర అని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) తేల్చింది! పారాసిటమాల్ 500 ఎంజీతో పాటు విటమిన్ సి, విటమిన్ డీ3, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి 53 సర్వసాధారణ ఔషధాల నాణ్యత కూడా ప్రమాణాల మేరకు లేదని ప్రకటించింది.
తాజా నెలవారీ నాణ్యతా పరీక్షలో ఇవన్నీ ఫెయిలైనట్టు పేర్కొంది. యాంటీబయాటిక్స్, రక్తపోటు ఔషధాలు, విటమిన్ల మాత్రల్లో కూడా నాణ్యత లోపించిందని వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో డ్రగ్ ఆఫీసర్లు ర్యాండమ్‌గా ఆయా విభాగాల ఔషధాలను చెక్ చేసి ఈ మేరకు నిర్ధారించారు. విటమిన్ సీ సాఫ్ట్‌జెల్స్, ఎసిడిటీ నివారణకు వాడే పాన్ డీతో పాటు చక్కెరవ్యాధికి వాడే గ్లిమిపిరిడిన్. బీపీకి వాడే టెల్మీసార్టాన్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయోటిక్స్, ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్, హెటెరో డ్రగ్స్ సహా చాలా ఔషధ తయారీ సంస్థల డ్రగ్స్ పరీక్షల్లో ఫెయిలయ్యాయి. జీర్ణకోశ, ఉదర సంబంధ ఇన్ఫెక్షన్లకు అత్యంత ఎక్కువగా వాడే మెట్రోనిడజోల్ (హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్) కూడా నాణ్యత పరీక్షలో విఫలమైంది.
షెల్‌కాల్ (టోరెంట్ ఫార్మాస్యూటికల్స్), క్లావమ్ 625, పాన్ డీ (ఆల్కెమ్ హెల్త్‌కేర్ సైన్సెస్), పారాసిటమాల్ (కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్), సెపోడెమ్ చిన్నారులకు తీవ్రమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ చికిత్సకు ఎక్కువగా వాడే ఎక్స్‌పీ50 (హెటిరో–హైదరాబాద్) కూడా ప్రమాణాలను అందుకోలేకపోయాయని సీడీఎస్‌సీఓ పేర్కొంది. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న 156 ఫిక్స్ డోస్ డ్రగ్ కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ సీడీఎస్‌సీఓ వాటిని గత ఆగస్ట్‌లో నిషేధించడం తెల్సిందే. సర్వసాధారణంగా వాడే జ్వరం మందులు, నొప్పి నివారిణులు, అలర్జీని తగ్గించే ఔషధాల వంటివి వాటిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment