quality test
-
పారాసిటమాల్ నాసిరకం
న్యూఢిల్లీ: ఒళ్లు కాస్తంత వేడిగా అనిపించినా వెంటనే మింగే మాత్ర పారాసిటమాల్. అది నాసిరకం మాత్ర అని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) తేల్చింది! పారాసిటమాల్ 500 ఎంజీతో పాటు విటమిన్ సి, విటమిన్ డీ3, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి 53 సర్వసాధారణ ఔషధాల నాణ్యత కూడా ప్రమాణాల మేరకు లేదని ప్రకటించింది. తాజా నెలవారీ నాణ్యతా పరీక్షలో ఇవన్నీ ఫెయిలైనట్టు పేర్కొంది. యాంటీబయాటిక్స్, రక్తపోటు ఔషధాలు, విటమిన్ల మాత్రల్లో కూడా నాణ్యత లోపించిందని వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో డ్రగ్ ఆఫీసర్లు ర్యాండమ్‌గా ఆయా విభాగాల ఔషధాలను చెక్ చేసి ఈ మేరకు నిర్ధారించారు. విటమిన్ సీ సాఫ్ట్‌జెల్స్, ఎసిడిటీ నివారణకు వాడే పాన్ డీతో పాటు చక్కెరవ్యాధికి వాడే గ్లిమిపిరిడిన్. బీపీకి వాడే టెల్మీసార్టాన్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయోటిక్స్, ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్, హెటెరో డ్రగ్స్ సహా చాలా ఔషధ తయారీ సంస్థల డ్రగ్స్ పరీక్షల్లో ఫెయిలయ్యాయి. జీర్ణకోశ, ఉదర సంబంధ ఇన్ఫెక్షన్లకు అత్యంత ఎక్కువగా వాడే మెట్రోనిడజోల్ (హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్) కూడా నాణ్యత పరీక్షలో విఫలమైంది. షెల్కాల్ (టోరెంట్ ఫార్మాస్యూటికల్స్), క్లావమ్ 625, పాన్ డీ (ఆల్కెమ్ హెల్త్‌కేర్ సైన్సెస్), పారాసిటమాల్ (కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్), సెపోడెమ్ చిన్నారులకు తీవ్రమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ చికిత్సకు ఎక్కువగా వాడే ఎక్స్పీ50 (హెటిరో–హైదరాబాద్) కూడా ప్రమాణాలను అందుకోలేకపోయాయని సీడీఎస్సీఓ పేర్కొంది. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న 156 ఫిక్స్ డోస్ డ్రగ్ కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ సీడీఎస్సీఓ వాటిని గత ఆగస్ట్‌లో నిషేధించడం తెల్సిందే. సర్వసాధారణంగా వాడే జ్వరం మందులు, నొప్పి నివారిణులు, అలర్జీని తగ్గించే ఔషధాల వంటివి వాటిలో ఉన్నాయి. -
ప్రాణాలు తీస్తున్న దగ్గు సిరప్!.. క్వాలిటీ టెస్ట్‌లో షాకింగ్ విషయాలు
దగ్గుకు వాడుతున్న సిరప్లు ప్రాణాంతకం.. మరణానికి దారితీసే అవకాశం ఉందని.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వెల్లడించింది. 100 కంటే ఎక్కువ ఫార్మా యూనిట్ల నుంచి సేకరించిన దగ్గు సిరప్ నమూనాలు, క్వాలిటీ టెస్టులో విఫలమయ్యాయని నివేదికలో స్పష్టం చేసింది.పరీక్షించిన చాలా సిరప్‌లలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వెల్లడైంది. డైథలీన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్ (EG) పీహెచ్ వంటివన్నీ తగిన పరిమితులలో లేదని నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 7,087 బ్యాచ్‌ల మందులను పరీక్షిస్తే.. 353 బ్యాచ్‌లలో క్వాలిటీ ప్రమాణాలు లేవని నిర్దారణ అయ్యాయి.డైఇథిలిన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్ (EG) పరిమాణం తొమ్మిది బ్యాచ్‌లలో తక్కువగా ఉన్నట్లు, మరికొన్ని సిరప్‌లలో వీటి పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇవి కూడా ప్రాణాంతకమని వెల్లడించారు.భారతదేశం ఉత్పత్తి చేసిన దగ్గు సిరప్‌లను ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లల మరణాలకు కారణమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తరువాత భారత ప్రభుత్వం రంగంలోకి దిగి.. సిరప్ నాణ్యతలను టెస్ట్ చేయడం మొదలుపెట్టింది.గాంబియాలో చిన్నారుల మరణాలుఅక్టోబర్ 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కిడ్నీ సమస్యల కారణంగా.. గాంబియాలో సుమారు 70 మంది చిన్నారులు మరణించారని, దీనికి భారతదేశంలో తయారయ్యే దగ్గు, జలుబు సిరప్లు కారణమై ఉండొచ్చని వెల్లడించింది. ఆ తరువాత సంబంధిత అధికారులు దగ్గు సిరప్ తయారీ యూనిట్ల తనిఖీలను నిర్వహించి.. ఫార్మా-గ్రేడ్ ప్రొపైలిన్ గ్లైకాల్ వాడకంపై తయారీదారులకు అవగాహన కల్పించారు.మే 2023లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఎగుమతి కోసం ఉద్దేశించిన తయారీదారుల నుంచి దగ్గు సిరప్ నమూనాలను టెస్ట్ చేయడానికి గుర్తింపు పొందిన ల్యాబ్‌లను అనుమతివ్వాలని రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లను ఆదేశించింది. గత జూన్ నుంచి దగ్గు సిరప్ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ ప్రయోగశాలలలో పరీక్షించి.. సర్టిఫికేట్ అందించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)ను కోరింది. -
నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
యోగాగురు రామ్‌దేవ్ బాబాకు చెందిన ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలికి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లోని టెస్టింగ్ లాబొరేటరీలో పతంజలి ఆహార ఉత్పత్తి నాణ్యతా పరీక్షలో విఫలమవడంతో పితోర్‌ఘర్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్‌తో సహా ముగ్గురికి జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించారు.వివరాల్లోకి వెళ్తే.. 2019లో ఉత్తరాఖండ్ పితోర్‌ఘర్‌లోని బెరినాగ్ ప్రధాన మార్కెట్లోని లీలా ధర్ పాఠక్ దుకాణంలో పతంజలి నవరత్న ఎలైచి సోన్ పాపిడి నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన తర్వాత, సోన్‌పాపిడి నమూనాలను సేకరించి డిస్ట్రిబ్యూటర్‌కు, పతంజలి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.నాణ్యత పరీక్షలో పతంజలి సోన్‌పాపిడి విఫలం కావడంతో రుద్రపూర్‌లోని టెస్టింగ్ లేబొరేటరీ.. రాష్ట్ర ఆహార భద్రతా విభాగానికి నోటీసు పంపింది. ఈ ఘటన తర్వాత దుకాణదారుడు లీలా ధర్ పాఠక్, డిస్ట్రిబ్యూటర్ అజయ్ జోషి, పతంజలి అసిస్టెంట్ మేనేజర్ అభిషేక్ కుమార్లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ముగ్గురికి వరుసగా రూ. 5,000, రూ.10,000, రూ.25,000 చొప్పున జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించారు. -
ఇళ్లు కట్టేవారికి శుభవార్త! ఇంటి వద్దే నిర్మాణ నాణ్యత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కష్ట పడి పైసా పైసా కూడబెట్టి కట్టుకునే కలల గృహం నాణ్యంగా లేకపోతే కష్ట మం తా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ప్రాజెక్ట్ సైట్ వద్దనే కాంక్రీట్ మిశ్రమం నాణ్యత పరీక్షలు అందించే సేవలను గోద్రెజ్ కన్స్ట్రక్షన్స్ ప్రారంభించింది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు, డెవలపర్లు ఈ సేవలను వినియోగించుకోవచ్చని గోద్రెజ్ కన్స్ట్రక్షన్స్ తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా కాంక్రీట్ టెస్ట్ స్క్వాడ్ వ్యాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనంలో లేబొరేటరీ కాంక్రీట్ మిక్సర్, మైక్రోవేవ్ ఓవెన్, ఎల్రక్టానిక్ వెయిటింగ్ బ్యాలెన్స్, క్యూబ్‌ల వంటి పరికరాలు ఉంటాయి. -
పతంజలి ఉత్పత్తులు నాణ్యత పరీక్షల్లో ఫెయిల్!
బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి సంస్థ ఉత్పత్తులు సహా దాదాపు 40 శాతం వరకు ఆయుర్వేద ఉత్పత్తులు నాణ్యత పరీక్షలలో విఫలం అయినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది. హరిద్వార్‌కు చెందిన ఆయుర్వేద, యునానీ కార్యాలయం ఈ పరీక్షలు చేసింది. 2013 నుంచి 2016 వరకు మొత్తం 82 శాంపిళ్లు సేకరించి పరీక్షించగా, వాటిలో 32 నాణ్యత పరక్షీలలో విఫలమయ్యాయి. పతంజలి సంస్థ వారి దివ్య ఆమ్లా జ్యూస్, శివలింగి బీజ్ లాంటి ఉత్పత్తులలో కూడా నాణ్యత తగినంతగా లేదని తేలింది. పశ్చిమబెంగాల్లోని పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ వాళ్లు నిర్వహించిన నాణ్యత పరీక్షలలో కూడా ఆమ్లా జ్యూస్ విఫలం కావడంతో గత నెలలో సైనిక దళాల క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ (సీఎస్డీ) నుంచి దాన్ని ఉపసంహరించుకున్నారు. నీళ్లలో కరిగే పదార్థాలలో ఉన్న క్షారతను పరీక్షించడానికి చూసే పీహెచ్ విలువ.. ఆమ్లా జ్యూస్‌లో ఉండాల్సిన దానికంటే తక్కువ ఉందని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ల్యాబ్ నివేదిక తెలిపింది. 7 కంటే తక్కువ పీహెచ్ విలువ ఉన్న ఉత్పత్తుల వల్ల ఎసిడిటీ, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శివలింగి బీజ్‌లో 31.68 శాతం వేరే పదార్థాలు ఉన్నాయన్నారు. అయితే ఈ ఆరోపణలను పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ ఖండించారు.శివలింగి బీజం అనేది సహజమైన విత్తనమని, అందులో కల్తీ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. పతంజలి సంస్థ పేరు ప్రతిష్ఠలను మంటగలిపేందుకు ఇలా తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు. ఇటీవలి కాలంలో ఉత్తరాఖండ్ ఆయుర్వేద ఉత్పత్తుల కేంద్రంగా మారింది. ప్రధానంగా హరిద్వార్, రిషికేశ్లలోనే వెయ్యిమందికి పైగా ఆయుర్వేద డీలర్లు, ఉత్పత్తిదారులు, సరఫరా దారులు ఉన్నారు. -
నీళ్లలో పడి రూపం కోల్పోయిన రూ. 500 నోటు
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల నాణ్యతను పరీక్షించే పనిలో కొందరు బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే రూ.2000 నోటుపై వివిధ రకాలుగా పరీక్షలు చేసిన వీడియోలు ఆన్ లైన్ లో సంచలనం చేశాయి. కొత్త నోటు నలుగుతుందా, వాటర్ ప్రూఫా, కాదా అని పరీక్షించారు. రూ. 2000 నోటును నీటిలో ముంచి పరీక్షించారు. తడిసిన నోటు రంగు వెలిసిపోలేదు. దీంతో నోటు తడిసిన ఇబ్బందులు లేవని తేల్చారు. యూట్యూబ్ లో ఈ వీడియోలను కోట్లాది మంది వీక్షించిన విషయం తెలిసిందే. ఇక పరీక్షలకు కొత్త రూ.500 నోటు వంతు వచ్చింది. కానీ ఈ సారి పరీక్ష కావాలని చేయకపోయిన ప్రమాదవశాత్తు జరిగింది. శంకరమఠం ఏరియా వాసి, హైకోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ గురువారం ఏటీఎం నుంచి డ్రా చేసిన రూ. 500 నోటు చేతిలోంచి జారి నీళ్లలో పడిపోయింది. వెంటనే ఆ నోటును నీళ్లలోంచి తీసి..తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టారు. ఐదు నిమిషాలు తరువాత చూడగా ఆ నోటు రంగు వెలిసి నోటు ఆనవాళ్లు కోల్పోయింది. నోటులోని జాతిపిత గాంధీ బొమ్మతో పాటు ఇతర అక్షరాలు రూపం కోల్పోపోయాయి. దీంతో ఖంగుతిన్న అతను నోటు అసలా. నకిలీదా అని ఆందోళన చెందాడు. కానీ, కొన్ని చోట్ల వేడి నీటిలో పరీక్షించినా నోటుకు ఏమీ కాలేదు. కొత్త రూ.500 నోటును పరీక్షించకుండా ఉంటే మంచిదని తెలుస్తోంది. -
రూ.2000 నోటు వాటర్ ప్రూఫా?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్లను దక్కించుకునేందుకు సామాన్య జనం నరకయాతన పడుతుంటే కొందరు మాత్రం వాటి నాణ్యతను పరీక్షించే పనిలో పడ్డారు. రూ.2000 నోట్లు దక్కించుకున్న వారు వాటిని మార్చుకునేందుకు నానా కష్టాలు పడుతుండగా, కొందరు వీటిని వివిధ రకాలుగా పరీక్షిస్తున్నారు. ఈ వీడియోలు ఆన్ లైన్ లో సంచలనంగా మారాయి. కొత్త నోటు నలుగుతుందా, లేదా అని పరీక్షించారు. రూ. 2000 నోటును రెండు చేతుల్లోకి తీసుకుని నలిపేసి, మళ్లీ సరిచేశారు. అంతేకాదు వాటర్ ప్రూఫా, కాదా అనేది కూడా టెస్ట్ చేశారు. రూ. 2000 నోటును నీటిలో ముంచేసి, టాప్ వాటర్ తో దాన్ని తడిపి కూడా పరీక్షించారు. పాత నోట్లతో పోలిస్తే ఇది ఎంతవరకు ఎఫెక్టివ్ అని ప్రయోగాత్మకంగా నిరూపించేందుకు ఇలా చేశారు. తడిసిన రూ. 2000 నోటు రంగు వెలిసిపోలేదు. అంతేకాదు మామూలు కాగితం, పాత నోట్లతో పోలిస్తే త్వరగా పొడిగా మారింది. పాత నోట్లతో పోలిస్తే రూ. 2000 మెరుగ్గా ఉందని ఈ వీడియోల ద్వారా ప్రయోత్మకంగా నిరూపించారు. యూట్యూబ్ లో ఈ వీడియోలను కోట్లాది మంది వీక్షించడం విశేషం.