దగ్గుకు వాడుతున్న సిరప్‌లు ప్రాణాంతకం.. మరణానికి దారితీసే అవకాశం ఉందని.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వెల్లడించింది. 100 కంటే ఎక్కువ ఫార్మా యూనిట్ల నుంచి సేకరించిన దగ్గు సిరప్ నమూనాలు, క్వాలిటీ టెస్టులో విఫలమయ్యాయని నివేదికలో స్పష్టం చేసింది.
పరీక్షించిన చాలా సిరప్‌లలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వెల్లడైంది. డైథలీన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్ (EG) పీహెచ్ వంటివన్నీ తగిన పరిమితులలో లేదని నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 7,087 బ్యాచ్‌ల మందులను పరీక్షిస్తే.. 353 బ్యాచ్‌లలో క్వాలిటీ ప్రమాణాలు లేవని నిర్దారణ అయ్యాయి.
డైఇథిలిన్ గ్లైకాల్ (DEG), ఇథిలీన్ గ్లైకాల్ (EG) పరిమాణం తొమ్మిది బ్యాచ్‌లలో తక్కువగా ఉన్నట్లు, మరికొన్ని సిరప్‌లలో వీటి పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇవి కూడా ప్రాణాంతకమని వెల్లడించారు.
భారతదేశం ఉత్పత్తి చేసిన దగ్గు సిరప్‌లను ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లల మరణాలకు కారణమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తరువాత భారత ప్రభుత్వం రంగంలోకి దిగి.. సిరప్ నాణ్యతలను టెస్ట్ చేయడం మొదలుపెట్టింది.
గాంబియాలో చిన్నారుల మరణాలు
అక్టోబర్ 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కిడ్నీ సమస్యల కారణంగా.. గాంబియాలో సుమారు 70 మంది చిన్నారులు మరణించారని, దీనికి భారతదేశంలో తయారయ్యే దగ్గు, జలుబు సిరప్‌లు కారణమై ఉండొచ్చని వెల్లడించింది. ఆ తరువాత సంబంధిత అధికారులు దగ్గు సిరప్ తయారీ యూనిట్ల తనిఖీలను నిర్వహించి.. ఫార్మా-గ్రేడ్ ప్రొపైలిన్ గ్లైకాల్ వాడకంపై తయారీదారులకు అవగాహన కల్పించారు.
మే 2023లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఎగుమతి కోసం ఉద్దేశించిన తయారీదారుల నుంచి దగ్గు సిరప్ నమూనాలను టెస్ట్ చేయడానికి గుర్తింపు పొందిన ల్యాబ్‌లను అనుమతివ్వాలని రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌లను ఆదేశించింది. గత జూన్ నుంచి దగ్గు సిరప్ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ ప్రయోగశాలలలో పరీక్షించి.. సర్టిఫికేట్ అందించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)ను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment