Centre seeks causality status as Uzbekistan links deaths of 18 kids to Indian syrup - Sakshi
Sakshi News home page

ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి.. ‘భారత్‌ కంపెనీల సిరప్‌లే కారణం’

Published Thu, Dec 29 2022 11:34 AM | Last Updated on Thu, Dec 29 2022 12:58 PM

Indian Syrup linked To Deaths of 18 Kids in Uzbekistan, Centre seeks causality - Sakshi

ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. పిల్లల మరణానికి భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌ కారణమని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపించింది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 21 మంది పిల్లలలో 18 మంది నోయిడాకు చెందిన మారియన్‌ బయోటెక్‌ తయారు చేసిన  డాక్‌-1 మాక్స్‌ దగ్గు మందు తాగి పిల్లలు మృతిచెందారంటూ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సిరప్‌లపై నిర్వహించిన ల్యాబరేటరీ పరీక్షల్లో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ కనుగొన్నట్లు  తెలిపింది. 

సిరప్‌లపై నిషేధం
‘పిల్లలు ఆసుపత్రిలో చేరక ముందు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, తల్లిదండ్రులు లేదా ఫార్మసిస్ట్‌ల సలహా మేరకు అధిక మోతాదులో జలుబును తగ్గించేందుకు పిల్లలకు అందించారు.  2.5- 5 ఎంఎల్‌ మోతాదుతో రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు  2-7 రోజుల పాటు ఈ సిరప్‌ను తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రామాణిక మోతాదు కంటే ఎక్కువ’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 18 మంది పిల్లలు మరణించడంతో దేశంలోని అన్ని ఫార్మసీల నుంచి డాక్ -1 మాక్స్ టాబ్లెట్లు, సిరప్‌లపై నిషేధం విధించారు. కాగా 2012లో మారియన్ బయోటెక్‌ ఉజ్బెకిస్తాన్‌లో రిజిస్టర్ చేసుకుంది.

స్పందించిన భారత్‌
భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఉజ్బెకిస్తాన్‌ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు భారత్‌ సిద్ధమైంది. ఉజ్బెకిస్తాన్‌ ప్రకటన తమ దృష్టికి వచ్చిందని.. దీనికి సంబంధించిన వివరాలను తమకు అందించాలని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరినట్లు తెలిపింది. అయితే ఈ సిరప్‌ను ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించడం లేదని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా ఈ ఘటనపై సీడీఎస్‌ఓ-నార్త్ జోన్, ఉత్తరప్రదేశ్ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ బృందాలు సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయని తెలిసింది.

మారియన్‌ బయోటెక్‌ కంపెనీ ఏమన్నదంటే
ఉజ్బెకిస్తాన్‌లో పిల్లల మరణాల పట్ల చింతిస్తున్నామని మారియన్ బయోటెక్ ఫార్మా కంపెనీ పేర్కొంది. తయారీ యూనిట్‌ నుంచి దగ్గు మందు నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామని, నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం విచారణ జరుపుతోందని, పూర్తి నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ లీగల్ హెడ్ హసన్ రజా అన్నారు.

రెండోసారి
భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్‌లపై ఆరోపణలు రావడం ఈ  ఏడాదిలో ఇది రెండోసారి. ఇంతకుముందు ఆఫ్రికన్‌ దేశమైన గాంబియాలో 70 మందికిపైగా పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌లో తయారైన దగ్గు మందు సిరప్‌ కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. పిల్లల మృతిపై కంపెనీ సిరప్‌లకు సంబంధం ఉందని, వీటిని వాడవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఉబ్జెకిస్తాన్‌, గాంబియాలోనూ చిన్నారుల మరణాలకు సిరప్‌లో ప్రాణాంతక రసాయనం ఇథిలీన్ గ్లైకాల్‌ ఉండటమే కారణమని తేలింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement