Vitamin B
-
పారాసిటమాల్ నాసిరకం
న్యూఢిల్లీ: ఒళ్లు కాస్తంత వేడిగా అనిపించినా వెంటనే మింగే మాత్ర పారాసిటమాల్. అది నాసిరకం మాత్ర అని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) తేల్చింది! పారాసిటమాల్ 500 ఎంజీతో పాటు విటమిన్ సి, విటమిన్ డీ3, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి 53 సర్వసాధారణ ఔషధాల నాణ్యత కూడా ప్రమాణాల మేరకు లేదని ప్రకటించింది. తాజా నెలవారీ నాణ్యతా పరీక్షలో ఇవన్నీ ఫెయిలైనట్టు పేర్కొంది. యాంటీబయాటిక్స్, రక్తపోటు ఔషధాలు, విటమిన్ల మాత్రల్లో కూడా నాణ్యత లోపించిందని వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో డ్రగ్ ఆఫీసర్లు ర్యాండమ్‌గా ఆయా విభాగాల ఔషధాలను చెక్ చేసి ఈ మేరకు నిర్ధారించారు. విటమిన్ సీ సాఫ్ట్‌జెల్స్, ఎసిడిటీ నివారణకు వాడే పాన్ డీతో పాటు చక్కెరవ్యాధికి వాడే గ్లిమిపిరిడిన్. బీపీకి వాడే టెల్మీసార్టాన్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయోటిక్స్, ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్, హెటెరో డ్రగ్స్ సహా చాలా ఔషధ తయారీ సంస్థల డ్రగ్స్ పరీక్షల్లో ఫెయిలయ్యాయి. జీర్ణకోశ, ఉదర సంబంధ ఇన్ఫెక్షన్లకు అత్యంత ఎక్కువగా వాడే మెట్రోనిడజోల్ (హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్) కూడా నాణ్యత పరీక్షలో విఫలమైంది. షెల్కాల్ (టోరెంట్ ఫార్మాస్యూటికల్స్), క్లావమ్ 625, పాన్ డీ (ఆల్కెమ్ హెల్త్‌కేర్ సైన్సెస్), పారాసిటమాల్ (కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్), సెపోడెమ్ చిన్నారులకు తీవ్రమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ చికిత్సకు ఎక్కువగా వాడే ఎక్స్పీ50 (హెటిరో–హైదరాబాద్) కూడా ప్రమాణాలను అందుకోలేకపోయాయని సీడీఎస్సీఓ పేర్కొంది. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న 156 ఫిక్స్ డోస్ డ్రగ్ కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ సీడీఎస్సీఓ వాటిని గత ఆగస్ట్‌లో నిషేధించడం తెల్సిందే. సర్వసాధారణంగా వాడే జ్వరం మందులు, నొప్పి నివారిణులు, అలర్జీని తగ్గించే ఔషధాల వంటివి వాటిలో ఉన్నాయి. -
విటమిన్–బీతో గర్భస్రావాలకు చెక్?
సిడ్నీ: పనిఒత్తిడి, కాలుష్యం వంటి కారణాలతో ఆకస్మిక గర్భస్రావాలు జరుగుతుంటాయి. అయితే గర్భస్రావాలే కాకుండా పుట్టే పిల్లల్లో వచ్చే అనేక లోపాలను అధిగమించేందుకు తగినంత విటమిన్ –బీ3 ఎంతో ఉపయోగపడుతుందని ఆస్ట్రేలియాలోని విక్టక్ చాంగ్ కార్డియాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నికొటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ (ఎన్ఏడీ) అనే మూలకం పిండం అభివృద్ధికి, డీఎన్ఏ మరమ్మతులు, కణాల మధ్య సమాచారం అందించేందుకు ఎంతో కీలకమని వీరు ఓ అధ్యయనం ద్వారా గుర్తించారు. ఈ మూలకం తగినంత లేకపోవడం వల్ల గర్భస్రావాలు జరిగే అవకాశాలు పెరుగుతాయని, పుట్టబోయే బిడ్డ గుండె, వెన్నెముక, మూత్రపిండాల్లో లోపాలు తలెత్తవచ్చని తెలిసింది. కూరగాయల్లో ఎక్కువగా ఉండే నియాసిన్ ద్వారా ఎన్ఏడీ మూలకం శరీరానికి అందుతుందని, గర్భధారణ సమయంలో తీసుకునే మల్టీ విటమిన్ మాత్రల ద్వారా కూడా విటమిన్–బీ3 మోతాదు బాగా పెరుగుతున్నట్లు తాము గుర్తించామని శాస్త్రవేత్త సాలీ డున్వుడీ తెలిపారు. ఎలుకల్లో జరిపిన ప్రయోగాల్లో విటమిన్–బీ3 మోతాదు తక్కువగా ఉన్నప్పుడు గర్భస్రావాలు ఎక్కువైనట్లు గుర్తించామని, విటమిన్‌ను అందించినప్పుడు గర్భస్రావాలు గణనీయంగా తగ్గాయని సాలీ చెప్పారు. ఈ నేపథ్యంలో శరీరంలోని ఎన్ఏడీ మోతాదులను గుర్తించేందుకు, తద్వారా విటమిన్–బీ3 వాడకాన్ని నిర్ధారించేందుకు ఓ పరీక్షను సిద్ధం చేస్తున్నామని, ఇది అందుబాటులోకి వస్తే గర్భస్రావాల సంఖ్య తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. -
ఎండు ద్రాక్షలో... మెండుగా పోషకాలు!
ఆరోగ్యమే మహాభాగ్యం ఎండుద్రాక్షల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అది రక్తహీనత ఏర్పడకుండా చూస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి రక్తకణాల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. ఆకలిని ఎక్కువ చేసే లెప్టిన్‌ని ఎండు ద్రాక్షలు నియంత్రిస్తాయి. కాబట్టి డైటింగ్ చేసేవారు వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే ఆహారాన్ని ఎక్కువ తీసుకోకుండా ఉండగలుగుతారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడుతాయి. కాబట్టి ఇన్ఫెక్షన్లు, జ్వరం వంటివి దరి చేరవు. రక్తంలో ఉండే యాసిడోసిస్ అనే టాక్సిన్... చర్మవ్యాధులు, ఆర్థరైటిస్, క్యాన్సర్, ట్యూమర్లు వంటి వాటిని కలిగిస్తుంది. ఎండుద్రాక్షల్లో ఉండే పొటాసియం, మెగ్నీసియం యాసిడోసిస్‌ను నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎండుద్రాక్షల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కనుక ఎముకలు దృఢంగా అవుతాయి. ఎండు ద్రాక్ష దంతక్షయాన్ని దరిచేరనివ్వదు.