inferior
-
పారాసిటమాల్ నాసిరకం
న్యూఢిల్లీ: ఒళ్లు కాస్తంత వేడిగా అనిపించినా వెంటనే మింగే మాత్ర పారాసిటమాల్. అది నాసిరకం మాత్ర అని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) తేల్చింది! పారాసిటమాల్ 500 ఎంజీతో పాటు విటమిన్ సి, విటమిన్ డీ3, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి 53 సర్వసాధారణ ఔషధాల నాణ్యత కూడా ప్రమాణాల మేరకు లేదని ప్రకటించింది. తాజా నెలవారీ నాణ్యతా పరీక్షలో ఇవన్నీ ఫెయిలైనట్టు పేర్కొంది. యాంటీబయాటిక్స్, రక్తపోటు ఔషధాలు, విటమిన్ల మాత్రల్లో కూడా నాణ్యత లోపించిందని వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో డ్రగ్ ఆఫీసర్లు ర్యాండమ్‌గా ఆయా విభాగాల ఔషధాలను చెక్ చేసి ఈ మేరకు నిర్ధారించారు. విటమిన్ సీ సాఫ్ట్‌జెల్స్, ఎసిడిటీ నివారణకు వాడే పాన్ డీతో పాటు చక్కెరవ్యాధికి వాడే గ్లిమిపిరిడిన్. బీపీకి వాడే టెల్మీసార్టాన్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయోటిక్స్, ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్, హెటెరో డ్రగ్స్ సహా చాలా ఔషధ తయారీ సంస్థల డ్రగ్స్ పరీక్షల్లో ఫెయిలయ్యాయి. జీర్ణకోశ, ఉదర సంబంధ ఇన్ఫెక్షన్లకు అత్యంత ఎక్కువగా వాడే మెట్రోనిడజోల్ (హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్) కూడా నాణ్యత పరీక్షలో విఫలమైంది. షెల్కాల్ (టోరెంట్ ఫార్మాస్యూటికల్స్), క్లావమ్ 625, పాన్ డీ (ఆల్కెమ్ హెల్త్‌కేర్ సైన్సెస్), పారాసిటమాల్ (కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్), సెపోడెమ్ చిన్నారులకు తీవ్రమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ చికిత్సకు ఎక్కువగా వాడే ఎక్స్పీ50 (హెటిరో–హైదరాబాద్) కూడా ప్రమాణాలను అందుకోలేకపోయాయని సీడీఎస్సీఓ పేర్కొంది. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న 156 ఫిక్స్ డోస్ డ్రగ్ కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ సీడీఎస్సీఓ వాటిని గత ఆగస్ట్‌లో నిషేధించడం తెల్సిందే. సర్వసాధారణంగా వాడే జ్వరం మందులు, నొప్పి నివారిణులు, అలర్జీని తగ్గించే ఔషధాల వంటివి వాటిలో ఉన్నాయి. -
హాజరు పడితేగా...?
విజయనగరం ఫోర్ట్: బయోమెట్రిక్‌తో సిబ్బంది సమయపాలన పాటిస్తారని భావిస్తే ఆ పరికరాలు పనిచేయకపోవడం వారికి ఇప్పుడు అవకాశంగా మారింది. గత ప్రభుత్వం నాసిరకంగా పరికరాలు సమకూర్చడంతో అవి ఏడాది తిరగకుండానే మూలకు చేరి... దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్, డిస్పెన్సరీలో ఉద్యోగులు సమయపాలన పాటించేందుకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరం మూలకు చేరింది. నాసిరకం పరికరాలను అప్పటి ప్రభుత్వం సరఫరా చేయడంతో ఏర్పాటు చేసిన కొద్ది నెలలకే దిష్టి బొమ్మలా మారింది. పాడైన వెంటనే ఈఎస్ఐ అధికారులు పంపించినప్పటికీ నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఒక్కో పరికరం రూ.16 వేలు విలువ చేస్తే రూ.72 వేలకు కొనుగోలు చేసినట్టు నివేదిక ఇచ్చారు. దీనిని బట్టి అప్పటి టీడీపీ పాలకులు ఎంత మేర అవినీతికి పాల్పడ్డారో అర్థమవుతోంది. ఏడాది తిరగకుండానే మూలకు.. ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్లో బయోమెట్రిక్ పరికరం ఏర్పాటు చేసిన కొద్ది నెలలకే మూలకు చేరింది. 2018 జనవరి నెలలో ఇక్కడి వైద్య సిబ్బంది హాజరు నిమిత్తం వీటిని ఏర్పాటు చేశారు. 2018 నవంబర్ నెలలో అది మూలకు చేరింది. అప్పట్లోనే అధికారులు బాగు చేయించాల్సిందిగా ఈఎస్ఐ డైరెక్టర్‌కు పంపించారు. కాని అధికారులు ఇంతవరకు బాగు చేయించలేదు. వేలాది రుపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాటిని బాగు చేయించకుండా వదిలేశారు. సమయ పాలన గాలికి... బయోమెట్రిక్ లేకపోవడంతో వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు సమయపాలనకోసం ఏర్పాటు చేసిన పరికరాలు పనికిరాకుండా పోవడంతో వారిలో క్రమశిక్షణ లోపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేయాల్సి ఉన్నా... 10 గంటలకు, 10:30 గంటలకు సిబ్బంది విధులకు హాజరు అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై డయోగ్నోస్టిక్ సెంటర్ సూపరింటెండెంట్ అల్లం కృష్ణారావువద్ద సాక్షి ప్రస్తావించగా 2018 నవంబర్ నెలలో బయోమెట్రిక్ పాడైందనీ, దానిని బాగు చేయించాలని ఈఎస్ఐ డైరక్టర్ కార్యాలయానికి పంపించామనీ, కానీ ఇప్పటివరకూ రాలేదని తెలిపారు. -
నా కార్యాలయంలో డొల్లతనం మంచిదే!
సాక్షి, విజయవాడ: దుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిలోని ఆలయ ఈవో కార్యాలయంలో రెండేళ్లకే పైకప్పు పెచ్చులూడడంపై ఈవో కోటేశ్వరమ్మ విచారణకు ఆదేశించారు. నాసిరక నిర్మాణంపై అధికారులతో కమిటీ వేసి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. గత ఈవోల హయాంలో ఈ పనులు జరిగినందున అవినీతి గురించి ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈవో కార్యాలయంలోనే డొల్లతనం బయటపడడం ఒక రకంగా మంచిదేనని దేవస్థానంలో మిగిలిన నిర్మాణాలపై దృష్టి సారించి భక్తులకు ఇబ్బంది కలుగకుండా కట్టడాల నాణ్యతను పర్యవేక్షిస్తామని ఆమె వెల్లడించారు. రూ. పది లక్షల ఖర్చుతో రెండేళ్ల క్రితమే పార్టేషన్ పనులను చేయగా ఇప్పుడే ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అందమైన మోసం
జోరుగా నకిలీ కాస్మొటిక్స్ దందా హన్మకొండ చౌరస్తా అడ్డాగా అమ్మకాలు ఏటా రూ.2 కోట్ల వ్యాపారం నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యం దాడులు చేసినా చర్యలు లేవు.. ఏడాది గడిచినా రాని నివేదికలు అధికారుల తీరుపై అనుమానాలు సాక్షి, హన్మకొండ : జిల్లాలో నకిలీ కాస్మొటిక్స్(సౌందర్య ఉత్పత్తులు) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నాసిరకం, నకిలీ ఔషధాలు, కాస్మొటిక్స్ అమ్మకాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అనుమానితులు, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు డ్రగ్ కంట్రోల్ అధికారులకు మధ్య సత్సంబంధాలు ఉండటంతో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 2012, ఆగస్టులో వరంగల్ నగరంలో నకిలీ కాస్మొటిక్స్, ఔషధాల వ్యాపా రం జోరుగా సాగుతోందని ఓ వినియోగదారుడు ఇచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు సీపీ రెడ్డి కాంప్లెక్సులోని ఓ లేడీస్ ఎం పోరియం దుకాణంపై దాడులు చేశారు. దాడు ల్లో దాదాపు పది రకాల బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఇంపోర్టెడ్ కాస్మొటిక్స్ నకిలీవిగా అనుమానించారు. వీటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఔషధ నియంత్రణ శాఖ లేబోరేటరీకి పంపిస్తామని అప్పుడు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ పరీక్షల్లో నకిలీవని తేలితే చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్నారు. సదరు దుకాణాన్ని సీజ్ చేశారు. తర్వాత ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఏడాది గడిచినా నకిలీ కాస్మొటిక్స్ కేసులో కనీస పురోగతి లేకుండా పోవడంతో మరో వినియోగదారుడు ఈ అంశంపై హైకోర్టులో కేసు దాఖలు చేశాడు. స్పందించిన హైకోర్టు తక్షణమే నకిలీ కాస్మొటిక్స్ కేసు వివరాలు అందజేయాలని డ్రగ్స్ కంట్రోలర్ ఉన్నతాధికారులకు 2013 ఆగస్టులో నోటీసులను జారీ చేసింది. జిల్లా డ్రగ్స్ అధికారులు హడావుడిగా 2013 ఆగస్టు 22న మరోసారి సీపీరెడ్డి కాంప్లెక్స్‌లో ఉన్న దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఈసారి నాలుగు బ్రాండెడ్ కంపెనీల కాస్మొటిక్స్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఏడాది గడుస్తున్నా చర్యలు లేవు. ఈ అంశంపై సమాచార హక్కు చట్టం కింద వివరాల కోసం ప్రయత్నించగా.. 2013 ఆగస్టు 22న సీపీరెడ్డి కాంప్లెక్స్‌లో కవితా గిఫ్ట్స్ అండ్ లేడీస్ ఎంపోరియంపై జరిపిన దాడిలో నాలుగు రకాల కాస్మొటిక్స్‌ను సేకరించి లేబోరేటరీకి పంపినట్లు డ్రగ్ కంట్రోల్ అధికారి పల్లవి పేర్కొన్నారు. ఇంతవరకు ల్యాబ్ నుంచి నివేదిక అందలేదని తెలిపారు. డ్రగ్స్ అధికారులు ఏం చేయాలి.. నకిలీ ఔషధాలు, కాస్మొటిక్స్ అమ్మకాల విషయంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేసిన షాపును సీజ్ చేయవచ్చు. ఆ షాప్‌లో సేకరించిన ఉత్పత్తులను ల్యాబ్‌కు పంపించి 45 రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి, కోర్టుకు నివేదించాలి. ల్యాబ్‌లో ఆయా కాస్మొటిక్స్ నకిలీవని తేలితే డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం-1940లోని సెక్షన్ 27(ఎ) ప్రకారం గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు, రూ.5 వేల జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఈ కేసులో డ్రగ్స్ అధికారులు అలా చేయలేదు. రెండేళ్లుగా డ్రగ్ కంట్రోలర్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ పేరుతో దాడులు చేయడం మినహా చర్యలు చేపట్టకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఏటా రూ.2 కోట్ల వ్యాపారం ముంబై నుంచి దిగుమతి అవుతున్న నకిలీ మా ల్ వ్యాపారానికి యువత టార్గెట్‌గా జరుగుతు న్న నకిలీ కాస్మొటిక్స్ దందాకు హన్మకొండ చౌర స్తా అడ్డాగా మారింది. ఈ దందా ఏడాదికి రూ. 2 కోట్లకు పైగా సాగుతోంది. ఇంత జరుగుతు న్నా డ్రగ్స్ అధికారులు ఒక్క కేసు నమోదు చేసి న దాఖలాలు లేవు. అంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. రెండేళ్లుగా ఈ కేసులో పురోగతి కని పించకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. గతేడాది దాడులు జరిగిన వెంటనే అధికారులకు, షాపుల యజమానులకు భారీ స్థాయిలో బేరం కుదిరినట్లు ప్రచారం జరిగింది. ఆ అధికారిపై అనుమానాలు డ్రగ్ కంట్రోల్ విభాగంలో వరంగల్‌కు పొరుగు జిల్లాలో కీలక పోస్టులో ఉన్న ఓ అధికారికి హన్మకొండ చౌరస్తాలోని ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న నకిలీ కాస్మొటిక్ దందాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో సదరు అధికారి ఈ మర్గాన్ని ఎంచుకున్నాడని చెబుతుంటారు. ఆయన అండదండలు ఉండటం వల్లనే ఈ నకిలీ కాస్మొటిక్ దందాపై సరైన చర్యలు తీసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఉత్తుత్తి దాడులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.