కుమ్‌ఖాత్ సిట్రస్ జాతి పండు. నారింజలాగే ఉంటుంది. కానీ, గుండ్రంగా కాకుండా కోడి గుడ్డు మాదిరిగా ఓవెల్ ఆకారంలో చిన్నగా (1–2 అంగుళాలు) ఉంటుంది. చైనా దీని పుట్టిల్లు. 500 ఏళ్ల క్రితం దీన్ని ఫార్చునెల్లా అని పిలిచేవారట. చైనీస్ భాషలో గామ్ (అంటే బంగారం), గ్వాత్ (టాంగెరిన్స్‌కు మరో పేరు) మాటల కలయిక వల్ల కుమ్‌ఖాత్ అనే పేరు ఈ పంటకు, పండుకు స్థిరపడింది. 400 ఏళ్ల క్రితమే ఈ పంట యూరప్‌కి, అమెరికాకు చేరింది. ఇది అతి చలిని, అతి వేడిని కూడా తట్టుకొని బతకగల విలక్షణ నారింజ జాతి పంట. దీన్ని తొక్క తీపిగా ఉంటుంది. దాంతో పాటుగా తినేయొచ్చు.
కుమ్‌ఖాత్ పండ్లు వగర, పులుపు, కొద్దిగా తీపి కలగలిసిన రుచి కలిగి ఉంటుంది. కట్ చెయ్యాల్సిన అవసరం లేకుండా నోట్లో పెట్టుకొని తినెయ్యగలిగే ఈ పండ్లలో విటమిన్ సి, పీచు పదార్థం పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్లు, మాంగనీసు, రాగి, కాల్షియం తదితర పోషకాలు కూడా ఉన్నాయి. కుమ్‌ఖాత్ పండులోని విత్తనాలు కూడా తినదగినవే. ఆరోగ్యదాయకమైన ఒమెగా –3 ఫ్యాటీ ఆసిడ్స్ వున్నాయి. నీటి శాతం కూడా ఎక్కువే. కుమ్‌ఖాత్ పండ్ల జాతిలో అనేక రకాలున్నాయి. జనాదరణ పొందిన రకాలు.. నగమి, మరుమి, మీవ. మురుమి, మీవ కుమ్‌ఖాత్ రకాల పండ్లు గుండ్రంగా ఉంటాయి. ఓవెల్ షేప్‌లో కొంచెం పుల్లగా ఉండే నగమి పండ్ల కన్నా తియ్యగా ఉంటాయి.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్
నారింజ జాతి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్న వారిలో ఈ పండ్లు బ్లడ్ గ్లూకోజ్‌ను పెంచవు. అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌తో పాటు పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున కుమ్‌ఖాత్ పండ్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.
అధిక పీచు
కుమ్‌ఖాత్ పండ్లలో పీచుతో కూడిన సంక్లిష్ట పిండిపదార్థాలుంటాయి. కాబట్టి, జీర్ణకోశంలో ఎక్కువ సేపు అరిగిపోకుండా ఉంటాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. అందువల్ల బరువు పెరగకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. దీనిలోని జీర్ణమయ్యే పీచుకు విరేచనాలను అరికట్టే గుణం ఉంది. ఇది జీర్ణకోశంలోని అదనపు నీటిని పీల్చుకొని, జెల్ మాదిరిగా ఏర్పడుతుంది. అందువల్ల, ఎక్కువ సార్లు విరేచనాలు అవుతూ ఉంటే గుప్పెడు కుమ్‌ఖాత్ పండ్లు నోట్లో వేసుకుంటే సరి.
ఆరోగ్యదాయకమైన కొవ్వులు
కుమ్‌ఖాత్ పండ్లలో కొవ్వు చాలా తక్కువ. కాబట్టి, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు వారి దినసరి ఆహారంలో కుమ్‌ఖాత్ పండ్లను చేర్చుకుంటే మంచిది. ఈ పండ్లలోని విత్తనాలను కూడా నమిలి తినాలి. ఈ విత్తనాల్లో ఒమెగా ఫాటీ ఆసిడ్లు ఉంటాయి కాబట్టి దేహంలో బాడ్ కొలెస్ట్రాల్ తగ్గి, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
యాంటీఆక్సిడెంట్‌గా ఉపయోగం
కుమ్‌ఖాత్ పండ్లలో విటమిన్ ఎ, సి వంటి యాంటీఆక్సిడెంట్ విటమిన్లు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ దేహంలో ఎక్కువైతే కణ నిర్మాణం దెబ్బతింటుంది. మన దేహంలో ఫ్రీ రాడికల్స్ కలిగించే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను కుమ్‌ఖాత్ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు తగ్గిస్తాయి.
గుండె ఆరోగ్యానికి మేలు
కుమ్‌ఖాత్ పండ్లలోని విటమిన్ సి, పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ వంటి పోషకాలు రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోయి గుండెపోటు రాకుండా చూస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలా అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మొత్తంగా గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఎల్‌డిఎల్‌ను తగ్గించటం ద్వారా గుండె సమస్యల్ని నిరోధిస్తాయి.
ఇన్‌ఫ్లమేషన్‌కు చెక్
కుమ్‌ఖాత్ పండ్లలో కీంప్‌ఫెరాల్, లుటియోలిన్, హెస్పెరిడిన్, క్యుఎర్సెటిన్, సి–గ్లైకోసైడ్ వంటి ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. సి–గ్లైకోసైడ్ దేహంలో వాపును నివారించే గుణం కలిగిఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. రోగనిరోధక వ్యవస్థలో ఇన్‌ఫ్లమేటరీ రీయాక్షన్‌ను, ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ పుట్టుకను తగ్గించటంలో సి–గ్లైకోసైడ్ ఉపయోగపడుతుంది.
యాంటీబాక్టీరియల్ ప్రభావం
కుమ్‌ఖాత్ పండు తొక్కలోని నూనెకు సూక్ష్మక్రిములను హరించే గుణం ఉందని పరిశోధనల్లో తేలింది. ఆహార పదార్థాలపై పెరిగే బూజు, సూక్ష్మజీవులను నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా ఆహార పదార్థాలు త్వరగా చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఇది దోహదం చేస్తుంది.
కేన్సర్‌నూ అరికడుతుంది
కుమ్‌ఖాత్ పండులో ఉండే అపిజెనిన్ అనే ఫ్లేవనాయిడ్ కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుందని పరిశోధనల్లో తేలింది. అపిజెనిన్ కేన్సర్ కణాలను ఇతర ఆరోగ్యకరమైన కణాలకు సోకకుండా అరికట్టగలుగుతుందని భావిస్తున్నారు.
ఊబకాయాన్ని తగ్గిస్తుంది
కుమ్‌ఖాత్ పండ్లలోని పోన్సిరిన్ అనే ఓ ఫ్లావనాయిడ్ ఊబకాయాన్ని తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేహం కొత్త కొవ్వు కణాలను తయారు చేసుకోకుండా అడ్డుకోవటం ద్వారా బరువు పెరగకుండా ఉండేందుకు పోన్సిరిన్ దోహదపడుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీనితో పాటు ఈ పండ్లలోని అధిక పీచుపదార్థం కడుపులో ఎక్కువ సేపు దన్నుగా ఉండటం వల్ల ఆకలి భావనను త్వరగా కలగనివ్వదు.
కంటి చూపునకు మంచిది
కుమ్‌ఖాత్ పండ్లలో బీటా కరోటెన్ రూపంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. ఈ పండ్లలో ఉన్న 11 కెరొటెనాయిడ్లలో ఇదొకటి. బీటీ కరోటెన్, జియాక్సాంతిన్, లుటీన్ వంటి కెరొటెనాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కంటి చూపు బాగుండాలంటే విటమిన్ ఎ తోడ్పాటుతో రోడోస్పిన్ ఉత్పత్తి అవుతుంది.
మూడ్ డిజార్డర్లకూ...
వత్తిడి సమస్యలను, మూడ్ డిజార్డర్లను, నిద్ర సమస్యలను విటమిన్ సి ఆహారాలు అరికడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వత్తిడి, కుంగుబాటు, ఆందోళనల తీవ్రతను తగ్గించటం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యాంటీడిప్రెసెంట్ మాదిరిగా కుమ్‌ఖాత్ పండ్లు పనిచేస్తాయి. ఆరోగ్యదాయకమైన నిద్రకు దోహదం చేస్తాయి. అయితే, అది ఏ విధంగా దోహదపడతాయో ఇంకా స్పష్టంగా తెలియదు.
ఎముక పుష్టికి..
ఎముక పెరుగుదలలో విటమిన్ సి పాత్ర కీలకమైనది. విటమిన్ సి కొల్లజెన్ ఏర్పడటానికి దోహదపడుతుంది. కుమ్‌ఖాత్ పండ్లలో కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఎముకలు పటుత్వాన్ని కోల్పోయే ఆస్టియోపోరోసిన్ వంటి సమస్యలను విటమిన్ సి తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకల నుంచి కాల్షియంను హరించే యాసిడ్ ఫుడ్స్ ఎముక సమస్యల్ని పెంచుతాయి. కుమ్‌ఖాత్ పండ్లు ఆల్కలిన్ ఫ్రూట్స్ కాబట్టి ఆస్టియోపోరోసిన్‌కు దారితీయకుండా కాపాడుతాయని చెప్చొచ్చు.
రోగనిరోధక శక్తి
కుమ్‌ఖాత్ పండ్లలోని బీటా–క్రిప్టోక్సాంతిన్, ఎల్–లైమోనెనె మన దేహంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని ఓ అధ్యయనం చెబుతోంది. సహజ సిద్ధమైన కిల్లర్ సెల్స్ కార్యకలాపాలను పెంపొందించటం ద్వారా దేహంలో మెటబాలిక్ స్ట్రెస్‌ను తగ్గించటంలో ఇవి ఉపయోపడతాయి.
చదవండి: పొలాల్లో రసాయనాల వాడకంతో మనుషుల్లో జబ్బుల పెరుదల
కుమ్‌ఖాత్ పోషక విలువలు:
100 గ్రాముల కుమ్‌ఖాత్ పండ్లలో పోషకవిలువలు ఇలా ఉంటాయి...
శక్తి : 71 కిలోకేలరీలు;
పిండిపదార్థాలు : 15.9 గ్రా;
మాంసకృత్తులు : 1.8 గ్రా;
కొవ్వు : 0.8 గ్రా;
పీచు : 6.5 గ్రా;
విటమిన్ ఎ : 15 మిల్లీ గ్రాములు;
విటమిన్ సి : 43.9 ఎం.జి;
రిబొఫ్లేవిన్ : 0.09 ఎం.జి;
క్లోరిన్ : 8.4 ఎం.జి;
కాల్షియం : 62 ఎం.జి;
ఐరన్ : 0.87 ఎం.జి;
మెగ్నీషియం : 20 ఎం.జి;
మాంగనీసు : 0.13 ఎం.జి;
జింక్ : 0.17 ఎం.జి;
Comments
Please login to add a commentAdd a comment