Ramadan ఉపవాసాల అసలు లక్ష్యం | Ramzan 2025 Special Story: Ramadan Fasting Rules, Significance And Interesting Facts In Telugu | Sakshi
Sakshi News home page

Ramadan ఉపవాసాల అసలు లక్ష్యం

Published Tue, Mar 11 2025 9:50 AM | Last Updated on Tue, Mar 11 2025 10:31 AM

Ramadan fasting rules and significance interesting facts

పవిత్ర రమజాన్‌ రాకడతో శుభాల పర్వం మొదలయింది. ముస్లింలు ఎంతో ఉత్సాహంతో ఉపవాస దీక్షలు ప్రారంభించారు. చిన్నపిల్లలు సైతం ‘రోజా’ పాటించడానికి ఉబలాట పడుతున్నారు. దీనికి కారణం ఏమిటి? అసలు ఉపవాసంఎందుకుండాలి? దీనికి  స్వయంగా దైవమే, ‘ఉపవాసం వల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది’ అంటున్నాడు. భయ భక్తులంటే ఏమిటి? మానవుడి మనస్సు దుష్కర్మలపట్ల ఏవగింపును, అసహ్యాన్ని ప్రకటిస్తూ, సత్కర్మల పట్ల అధి కంగా మొగ్గుచూపే స్థితి. ఈ స్థితిని మానవ ఆంతర్యంలో జనింపజేయడమే ఉపవా సాల అసలు ఉద్దేశ్యం. 

అందుకని ఉపవాసం పాటించేవారు బాహ్య పరిశుభ్రతతోపాటు, అంతశ్శుద్ధిని కూడా పాటించాలి. నోటిని నియంత్రణలో ఉంచుకోవాలి. మాట్లాడే అవసరం లేకపోతే మౌనం పాటించాలి. ఇతరులెవరైనా అకారణంగా రెచ్చగొట్టినా తాము ఉపవాస దీక్ష పాటిస్తున్నామన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఈ స్పృహ ఉన్నప్పుడే అన్నిరకాల చెడుల నుండి సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఉపవాస దీక్ష పాటిస్తున్నప్పటికీ అసత్యం పలకడం, అసత్యాన్ని ఆచరించడం మానుకోనివారు నిజానికి వ్రతం పాటిస్తున్నట్లు కాదు. కేవలం పస్తులుండడంతో సమానం. ఉపవాసదీక్షల పేరుతో ఇలా ఆకలిదప్పు లతో పడి ఉండటం పట్ల దైవానికి ఏమాత్రం ఆసక్తిలేదు. మహ మ్మద్‌ ప్రవక్త(స) ఇలా చెప్పారు: ‘ఉపవాస దీక్ష పాటించే చాలా మందికి, తమ ఉపవాసాల ద్వారా ఆకలిదప్పుల బాధ తప్ప, మరెలాంటి ప్రయోజనమూ చేకూరదు’.    

ఉపవాస లక్ష్యం మనిషిని ఆకలిదప్పులతో మాడ్చిఉంచడం కాదు. దైవాదేశ పాలనలో మరింత రాటుదేలే విధంగా తీర్చిదిద్దడం. దైవ విధేయతా పరిధిని ఏమాత్రం అతిక్రమించకుండా, అన్నిరకాల చెడుల నుండి సురక్షితంగా ఉంచడం. పవిత్ర రమజాన్‌లో ఏ విధంగా అన్ని రకాల చెడులకు, అవలక్షణాలకు దూరంగా సత్కార్యాల్లో, దాన ధర్మాల్లో, దైవధ్యానంలో, సమాజ సంక్షేమ కార్యకలాపాల్లో పాల్గొంటారో... అలాగే మిగతా కాలమంతా సమాజంలోశాంతి, న్యాయం, ధర్మం పరిఢవిల్లుతూ జీవితం సాఫీగా గడిచిపోవాలని, పరలోక సాఫల్యం సిద్ధించాలన్నది అసలు ధ్యేయం.
– యండి. ఉస్మాన్‌ ఖాన్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement