
క్వాలిటీ ఖర్జూరాలు ఉపయోగించి..
గోల్కొండ: రంజాన్ అంటే మొదట గుర్తుకు వచ్చేది ఉపవాస దీక్ష.. ఉదయం నుంచి కఠిన ఉపవాసం చేసి సాయంత్రం పూట ఇఫ్తార్ విందులో రకరకాలైన పండ్లు ఆరగించి దీక్ష విరమిస్తారు. అందులో భాగంగా మార్కెట్‌లో పెద్దఎత్తున లభించే సీజనల్ ఫ్రూట్స్‌ను అందంగా ప్యాకింగ్ చేసి స్నేహితులు, బంధువులకు అందజేయడం హైదరాబాదీల ప్రత్యేకత.. కొత్తగా బంధుత్వాలు కలిసిన వారు తమ బంధుత్వాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి వారి వారి స్థాయి మేరకు ఫ్రూట్స్ ప్యాక్స్‌ను అందజేస్తుంటారు.
ఉద్యోగులు, వ్యాపారులు, స్నేహితులు ఇలా అందరూ పండ్లను అందజేసి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ మహా నగరంలో ఫ్రూట్స్ గిఫ్ట్ ప్యాక్ అందజేసే సంస్కృతి కొనసాగుతోంది. రంజాన్ మాసంలో కొంత మంది షాపుల యజమానులు ప్యాకింగ్ చేయడంలో సిద్ధహస్తులైన వారిని నియమించుకొని ప్యాకింగ్ చేయించుకుంటారు. గిఫ్ట్ ప్యాక్‌లో పెట్టడానికి వాడే పండ్ల రకాలను బట్టి ధరలు ఉంటాయని మెహిదీపట్నం ఎస్‌ఏ రాయల్ ఫ్రూట్ మార్ట్ వ్యాపారి అబ్దుల్ అజీజ్ అంటున్నారు. మొత్తం 23 రకాల పండ్లతో సుపీరియర్ గిఫ్ట్ ప్యాక్‌లను ప్రత్యేకంగా తయారు చేస్తామని అన్నారు.
ఇందులో 23 రకాల పండ్లతో మొత్తం 19 కిలోల పండ్లు ఉంటాయి. అదే డీలక్స్ ఫ్రూట్ గిఫ్ట్ ప్యాక్‌లో 18 రకాల పండ్లు ఉండగా వీటిలో 14 కిలోల బరువు ఉంటుంది. అదేవిధంగా 11 రకాల పండ్లతో 10 కిలోల బరువు ఉండే ఫ్యాన్సీ గిఫ్ట్ ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఏడు రకాల పండ్లు, ఆరు కిలోల గిఫ్ట్ ప్యాక్‌లు కూడా ఎక్కువగా అమ్ముడవుతాయి. నెంబర్ వన్ క్వాలిటీ ఖర్జూరా పండ్లు ఉపయోగిస్తామని ఆయన వివరించారు. వీటి ధరలు రూ.550 నుంచి రూ.18 వేల వరకు ఉంటాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment