ప్రధాని మోదీ మెచ్చిన ‘మిల్లెట్‌ కేక్‌’.. దెబ్బకు వ్యాపారం కోట్లకు పడగలెత్తింది | Millet Cake Creations Turn Into a MultiCrore Bakery Winning PMs Praise | Sakshi
Sakshi News home page

'మిల్లెట్‌ కేక్‌' తయారీతో కోట్ల రూపాయల టర్నోవర్‌..! మోదీ ప్రశంసతో ఒక్కసారిగా..

Published Wed, Mar 12 2025 5:40 PM | Last Updated on Wed, Mar 12 2025 6:06 PM

Millet Cake Creations Turn Into a MultiCrore Bakery Winning PMs Praise

సేల్స్‌మ్యాన్‌గా, ఈవెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తూ కెరియర్‌లో అంచలంచెలుగా ఎదిగాడు. అయితే పనిలో భాగంగా బేకరి పనులను అర్థం చేసుకోవడానికి బ్రిటానియా, అమూల్‌ వంటి కంపెనీలను సందర్శించడంతో బేకరీ ఫుడ్స్‌ తయారీపై ఆసక్తి ఏర్పరుచుకున్నాడు. అలా సొంతంగా వ్యాపారం చేద్దామన్నా ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. అందుకోసం విదేశాలకు వెళ్లి మరీ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నాడు. చివరిక బేకరీ పెట్టాడు..అలా మిల్లెట్స్‌ కేక్‌ తయారీతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించి..కోట్లకు పడగలెత్తాడు. ఎందరికో యువతకు ఆదర్శంగా నిలిచాడు. అతడి విజయ ప్రస్థానం ఎలా జరిగిందంటే..

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పుట్టి పెరిగిన అమిత్ సోనీ ఆభరణాల కళాకారుల కుటుంబం నేపథ్యం నుంచి వచ్చాడు. అమిత్‌ హెచ్‌ఆర్‌​ అండ్‌ మార్కెటింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసి, అనంతరం ఎలక్ట్రానిక్స్ రంగంలో సేల్స్‌మ్యాన్ నుంచి ఈవెంట్‌ మేనేజర్‌ స్థాయికి చేరుకున్నాడు. అలా వివిధ ఉద్యోగాలు చేశాడు. అయితే తన ఉద్యోగంలో భాగంగా బేకరీ పనులను అర్థం చేసుకోవడానికి తరుచుగా బ్రిటానియా, అముల్ వంటి కంపెనీలను సందర్శిస్తుండేవాడు. 

ఆ నేపథ్యంలో బేకరీ పెట్టాలనే ఆలోచన వచ్చింది అమిత్‌కి. అయితే బేకరీ ఉత్పత్తులను ఎలా తయారుచేస్తారనేది తెలియదు, కానీ బిజినెస్‌ గురించి మాత్రం బాగా తెలుసు అమిత్‌కి. ఉద్యోగంలో బాగానే రాణిస్తున్నా..వ్యాపారం చేయాలనే కోరికతో 2017లో ఉద్యోగానికి రిజైన్‌ చేశాడు. ముందుగా బేకరీలోని ఆహార పదార్థాల తయారీలో శిక్షణ తీసుకునేందుకు (ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్‌ అప్లైడ్ న్యూట్రిషన్)కి వెళ్లాడు. 

తర్వాత థాయిలాండ్‌ వంటి విదేశాలకు వెళ్లి ఆ రంగంలో మరింత మెరుగులు దిద్దుకున్నాడు. అయితే అమిత్‌కి విదేశాల్లో మంచి ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి కానీ తల్లిదండ్రులు ఇక్కడే ఉండాలని పట్టుబట్టడంతో..అలా 2019లో జోథ్‌పూర్‌లో తన సొంత బేకరీ RDz 1983ని ప్రారంభించాడు. మొదట్లో ఇది బ్రెడ్‌, కేక్‌లను అందించేది. అయితే అనూహ్యంగా ఐసీఏఆర్‌ రాజస్థాన్‌ నుంచి బజ్రా చాక్లెట్‌ ట్రఫుల్‌ కేక్‌ చేయాలనే ఆర్డర్‌తో మిల్లెట్‌ల వైపుకి ఆకర్షితుడయ్యాడు అమిత్‌. 

అయితే మిల్లెట్‌లో గ్లూటెన్ లేకపోవడంతో కేక్‌ తయరీ చాలా సవాలుగా మారింది. దాదాపు 96 సార్లు విఫలమయ్యాక చివరికి మిల్లెట్‌ కేక్‌ని తయారు చేశాడు. 80 కిలో గ్రాముల కేక్‌ని ఓ పది కిలోగ్రాముల ముక్కలుగా విభజించాడు. వాటిని కొంతమంది CAZRI (సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) అధికారులు ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI)కి తీసుకువెళ్లారు. 

రెండు రోజుల తర్వాత వీడియోతో కూడిన సందేశం పంపించారు వారు. అమిత్‌ దాన్ని ఓపెన్‌ చేసి చూశాకగానీ తెలియలేదు..ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా ఆ మిల్లెట్ కేక్‌ను కట్‌ చేస్తున్నారని. ఆ సమయంలో నరేంద్ర సింగ్ తోమర్, కైలాష్ చౌదరి, రాజ్‌నాథ్ సింగ్ వంటి ప్రముఖులు అతని పక్కనే ఉన్నారు. ఆయనలా అమిత్‌ తయారు చేసిన మిల్లెట్‌ కేక్‌ కట్‌ చేసి ప్రారంభించారో లేదో ఒక్కసారిగా ఆర్డర్లు వెల్లువలా రావడం జరిగింది. 

ఇక అమిత్‌ ఎక్కువ కాలం నిల్వ ఉండే కుకీలు, బ్రౌనీలపై దృష్టిసారించాడు. అలా పెర్ల్‌ మిల్లెట్‌ కుకీలను అందించే స్థాయికి చేరుకున్నాడు. దీంతో అమిత్ UN సమావేశాలు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఉదయపూర్‌లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశం వంటి ఉన్నత స్థాయి కార్యక్రమాలకు మిల్లెట్ కుకీలను అందించే పెద్ద పెద్ద ఆర్డర్‌లు అందుకున్నాడు. అంతేగాదు దేశీయంగా దాదాపు వందకి పైగా హోటళ్లలో ఈ మిల్లెట్‌ కుక్కీలు అమ్ముడయ్యాయి. 

బహ్రెయిన్‌, దుబాయ్‌ వంటి విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం అతడి బేకరీ ప్రతిరోజూ 150 కిలోల కుకీలను తయారు చేస్తోంది, అలాగే నెలకు 15 వేలకుపైగా కస్టమర్లకు సర్వ్‌ చేస్తోంది. ఈ వ్యాపార రంగంలోకి అమిత సోదరుడు ఫిజియోథెరపిస్ట్‌ అయిన డాక్టర్‌ సుమిత్‌ సోనీకూడా చేరారు. ఇలా అమిత్‌ కుటుంబ బేకరీ బిజినెస్‌ ఏడాదికి రూ. 1.5 కోట్లను ఆర్జిస్తోంది. 

బెంగళూరు, ముంబై వంటి నగరాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం అమిత్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్లకు మిల్లెట్‌ కుకీలను అందించే ఆర్డర్‌ తయారీకి రెడీ అవుతున్నాడు. నిజంగా ఇది మహర్షి మూవీలో హీరో మహేష్‌ చెప్పినట్లు "సక్సస్‌ ఈజ్‌ జర్నీ నాట్‌ ఏ డెస్టినేషన్‌ (విజయం అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు)" అంటే ఇదే కదా..!.

 

(చదవండి: మహిళలు నిర్మించిన అద్భుత స్మారక కట్టడాలు..! నాటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement