
సాక్షి, చెన్నై: పెట్రో ధరలు వినియోగదారులకు సెగ పుట్టిస్తోంటే.. వినియోగదారులకు ఆకట్టుకునేందుకు సంస్థలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇపుడు ఈ కోవలోకి ఒక బేకరీ సంస్థ వచ్చి చేరింది. ఒక కిలో కేక్ కొంటే లీటరు పెట్రోలు ఉచితంగా ఇస్తామంటూ ఒక బేకరీ వినూత్న ఆఫర్ అందిస్తోంది.
తమిళనాడులోని ఒక బేకరీ దుకాణం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక కిలో పుట్టినరోజు కేక్ లేదా రూ .495 బిల్లు చేస్తే 1 లీటరు పెట్రోలు ఉచితమని అని ప్రకటించింది. దీంతో ఇది వైరల్‌గా మారింది
కాగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు బాగా పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటు తున్నాయి. రికార్డు ధరలతో వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక పెళ్లి వేడుకలో వధూవరులకు 5 లీటర్ల పెట్రోలును బహుమతిగా ఇవ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది. ముఖ్యంగా దేశంలో పెట్రోలు ధర మండుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. శుక్రవారం రాష్ట్ర రాజధాని చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 86.01 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీ, ముంబై రెండింటిలో 10 పైసలు పెరిగి రూ. 82.32 , 89.92 రూపాయలుగా ఉంది.