
సండే వచ్చిందంటే.. మాంచి ఫుడ్ ఉండాల్సిందే.. ఇష్టమైన కూర అదీ అదిరిపోయే రుచి ఉంటే.. ఆ ఆనందమే వేరు. టమ్మీ ఫుల్.. దిల్ ఖుష్. మరి అలాంటి ఆదివారం ఆనందాన్ని పొందాలనుకుంటే.. బగారా రైస్ పచ్చిపులుసు, చేప వేపుడు, నాటుకోటి కూర.. దిల్‌ఫుల్‌గా ఇంట్రస్టింగ్ రెసిపీస్ మీకోసం...
పచ్చిపులుసు
కావల్సినవి: చింతపండు – నిమ్మకాయ పరిమాణం (వేడి నీళ్లలో నానబెట్టి, గుజ్జు తీయాలి); ఉప్పు – తగినంత; నీళ్లు – 3 కప్పులు; పచ్చిమిర్చి – 4; జీలకర్ర – టీ స్పూన్; కొత్తిమీర – టేబుల్‌స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉల్లిపాయ – 1; ఎండుమిర్చి – 2; వెల్లుల్లి – 4 రెబ్బలు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – రెమ్మ; ధనియాల పొడి – అర టీ స్పూన్.
తయారీ: ∙ చింతపండు గుజ్జులో నీళ్లు కలపాలి. ∙రోట్లో పచ్చిమిర్చి, ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, పసుపు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఈ మిశ్రమాన్ని చింతపండు రసంలో కలపాలి. స్టౌ మీద మూకుడు పెట్టి నూనె వేసి అందులో మిగిలిన జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ధనియాల పొడి వేసి, వేయించి ఈ పోపు మిశ్రమాన్ని చింతపండు రసంలో కలపాలి. తీపి కావాలనుకున్న వారు టీ స్పూన్ పంచదార / బెల్లం కలుపుకోవచ్చు. ఉల్లిపాయ తరుగు పైన వేసి, అన్నంలోకి వడ్డించాలి.
నాటు కోడి కూర
కావల్సినవి: నాటు కోడి ముక్కలు-అరకేజీ; పచ్చిమిర్చి-4, టొమాటోలు - 2(తరగాలి); అల్లం-వెల్లుల్లి పేస్ట్-2 టీ స్పూన్లు; గరం మసాలా (లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు)-2 టీ స్పూన్లు; ఉల్లిపాయలు-2, ఎండుమిర్చి -2; పసుపు-అర టీ స్పూన్; ఉప్పు-తగినంత; కారం - టీ స్పూన్; ఎండుకొబ్బరి- 2 టీ స్పూన్లు; నూనె-3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు-2 టేబుల్ స్పూన్లు
తయారీ: ∙నాటుకోడి ముక్కలలో కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం– వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కనుంచాలి. మందపాటి గిన్నె/కుకర్‌లో నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి, కలపాలి. అల్లం–వెల్లుల్లి ముద్ద వేసి, వేగాక కలిపి ఉంచిన చికెన్ వేసి 10 నిమిషాలు ఉడికించాలి. టొమాటో వేసి మగ్గనివ్వాలి. 2 కప్పుల నీళ్లు పోసి, ఉప్పు, కారం, ఎండుకొబ్బరి వేసి మరో 15 నిమిషాలు ఉడికించాలి. కుకర్‌లో అయితే 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. దించే ముందు సిద్దం చేసుకున్న గరం మసాలా, కొత్తిమీర వేయాలి. రోటీలు, అన్నంలోకి ఈ కూరను వడ్డించాలి
చేప వేపుడు
కావల్సినవి: చేప ముక్కలు- 6; కారం -అర టీ స్పూన్; మొక్కజొన్న పిండి – టీ స్పూన్; ఉప్పు -తగినంత; నిమ్మరసం- అర టీ స్పూన్; గుడ్డు-1; నూనె – తగినంత; ధనియాల పొడి-టీ స్పూన్; గరం మసాలా- అర టీ స్పూన్; అల్లం-వెల్లుల్లి పేస్ట్ -టీ స్పూన్; కొత్తి మీర – టీ స్పూన్; నూనె – 3 టేబుల్ స్పూన్లు (తగినంత).
తయారీ: గిన్నెలో చేప ముక్కలు వేసి కారం, మొక్కజొన్నపిండి, ఉప్పు, నిమ్మరసం, గుడ్డు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి అరగంట పక్క నుంచాలి. కడాయిలో నూనె వేసి అందులో చేప ముక్కలు వేసి, వేయించాలి. చేప ముక్కలు వేగిన తర్వాత కొత్తిమీర చల్లి దించాలి. గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలను అలంకరించి చేప ముక్కలను అన్నంలోకి సైడ్ డిష్‌గా వడ్డించాలి. ఇవి స్నాక్స్‌గానూ బాగుంటాయి.
చదవండి: #WomenPower :హంపీ టెంపుల్‌లోని ఈ సారథుల గురించి తెలుసా?

బగారా రైస్
కావల్సినవి: బాస్మతి బియ్యం/బియ్యం - 2 కప్పులు+ ఉల్లిపాయలు 3 (సన్నగా నిలువుగా తరగాలి); బిర్యానీ ఆకు3; పచ్చి మిర్చి7 (సన్నగా తరగాలి); కొత్తిమీర -2 టేబుల్ స్పూన్లు ; పుదీనా ఆకులు -గుప్పెడు; అల్లం - వెల్లుల్లి పేస్ట్ -2 టీ స్పూన్లు; ఉప్పు-తగినంత; నెయ్యి / నూనె -అర కప్పు; నీళ్లు-5 కప్పులు; లవంగాలు-10; యాలకులు -7; కరివేపాకు.
తయారీ: గిన్నెలో నూనె వేడి చేసి, ఉల్లి తరుగు గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. అందులో పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కరివే΄ాకు, పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సన్నని మంట మీద పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ∙దీంట్లో బియ్యం వేసి 2 నిమిషాలు వేయించాలి. ఉప్పు కూడా వేసి మరో మారు కలిపి, 5 కప్పుల నీళ్లుపోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర, వేయించిన ఉల్లి తరుగు చల్లి దించాలి.
చదవండి: ఇక్కడ జిమ్‌లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!
నోట్: పోపులో పచ్చిబఠాణీలు, మొక్కజొన్న గింజలు, బీన్స్ వేసి కూడా బగారా రైస్ చేసుకోవచ్చు. దీనిలోకి మాంసాహార వంటకాలే కాదు బంగాళదుంప కూర, గుత్తి వంకాయ కూర, పప్పు వంటి శాకాహార రుచులను కూడా వడ్డించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment