natu kodi
-
Chicken : కాకపుట్టిస్తున్న నాటుకోడి ధర
రాజాం: సాధారణంగా దసరా, సంక్రాంతి పండగకు నాటు కోడి ధర పెరుగుతుంటుంది. ఈ ఏడాది సంక్రాంతికి నెలరోజులు ముందునుంచే దాని ధర పెరుగుతూ వస్తుంది. నాటు కోడికి ప్రస్తుతం బాగా డిమాండ్ ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో వాటి పెంపకం అధికమైంది. కరోనా లాక్ డౌన్ నుంచి.. కరోనా లాక్డౌన్ ఏర్పడిన నాటి నుంచి నాటుకోడి మాంసం, గుడ్లుపై ప్రజలు దృష్టిసారించారు. వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటే కరోనా రాదని నిపుణులు తెలియజేయడంతో పాటు మాంసం, గుడ్లు, చేపలు తీసుకోవాలని సూచించారు. దీంతో ప్రజలంతా నాటుకోడి మాంసం, గుడ్లు, గొర్రె మాంసంపై పడ్డారు. గొర్రె మాంసం గతంలో కిలో రూ. 700లు ఉండగా ఇప్పుడు రూ.900 నుంచి రూ.1000 మధ్య పలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చోట వారానికి ఒకరోజు గొర్రె మాంసం విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇదే కోవలో నాటుకోడికి కూడా డిమాండ్ పెరిగింది. గతంలో కిలో మాంసం పడే నాటు కోడి ధర రూ.500 ఉండేది. ఇప్పుడు ఆ ధర రూ.600కు చేరింది. చికెన్‌సెంటర్ల వద్ద నాటు కోడి మాంసం రూ. 800కు విక్రయిస్తున్నారు. నాటు కోడి గుడ్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. నాటు కోడి గుడ్లు ఇప్పుడు ఎక్కడా సాధారణంగా లభించడం లేదు. ఒక గుడ్డు ధర రూ.10 పలుకుతుంది. దీంతో గ్రామాల్లో నాటుకోళ్లు పెంచేవారి సంఖ్య పెరిగింది. నాటుకోళ్లు కూడా నాలుగు నుంచి ఆరు నెలల వ్యవధిలో పెరుగుదలకు వచ్చి విక్రయాలకు అనువుగా మారుతుంటాయి. నాటుకోడి పెంచడం ద్వారా పల్లె ప్రాంతాల్లో ఆదాయ వనరులు పుష్కలంగా కొంతమంది రైతులకు కలిసివస్తున్నాయి. కల్లీ మాంసం విక్రయాలు పట్టణ ప్రాంతాల్లో పలు చికెన్ సెంటర్ల వద్ద బ్రాయిలర్‌తో పాటు నాటుకోడి మాంసం విక్రయాల బోర్డులు దర్శనమిస్తున్నాయి. కిలో నాటుకోడి మాంసం రూ. 600 నుంచి రూ. 800లకు విక్రయిస్తున్నాయి. ఈ మాంసంలో బ్రాయిలర్ కోడి మాంసం కలిపేయడం, మరికొన్ని చోట్ల క్రాస్ నాటుకోడి మాంసం కలిపేయడం చేస్తున్నారు. దీంతో నాటుకోడి మాంసం కల్తీకి కూడా గురవుతోంది. ఆ కల్లీ బారి నుంచి తప్పించుకునేందుకు నాటుకోడి మాంసం కావాలనుకునేవారు ఇప్పుడు పల్లెబాట పడుతున్నారు. అక్కడ కోళ్లు కొనుగోలు చేస్తున్నారు. పెరటికోళ్ల గుడ్లతో ఉపాధి నాటుకోడి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పెరటికోళ్ల పెంపకానికి మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గడిచిన నాలుగేళ్లలో జిల్లాలో 25 వేల మందికి పెరటికోళ్ల యూనిట్లు పంపిణీచేసింది. ఈ యూనిట్లో ఎనిమిది పెట్టలతో పాటు రెండు పుంజులు ఉంటాయి. ఈ కోళ్లు ఆరు నెలల పాటు గుడ్లు పెడుతూనే ఉంటాయి. వాటిని విక్రయిస్తున్న మహిళలకు ఆర్థిక చేయూత కూడా లభిస్తోంది. -
సంక్రాంతికి సింహపురి ‘కోడ’ల్లుళ్లు
సాక్షి, భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): సంక్రాంతి కోడి పందేలకు గోదావరి జిల్లాల్లో ఉండే క్రేజే వేరు. పందెం పుంజులకూ డిమాండ్ భారీగానే ఉంటుంది. సాధారణంగా సంక్రాంతి పందేల కోసం స్థానికులే పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తుంటారు. కాగా.. కోవిడ్ తరువాత సింహపురి (నెల్లూరు) ప్రాంత వ్యాపారులు పందెం పుంజులను గోదావరి జిల్లాలకు తెచ్చి అమ్మకాలు చేస్తున్నారు. పండుగ రోజుల్లో పూర్వ గోదావరి జిల్లాల్లోని ప్రధాన బరుల్లో ఒక్కొక్క చోట రోజుకు 25 నుంచి 30 వరకు పందేలు జరిగితే.. గ్రామాల్లోని చిన్న బరుల్లో జరిగే పందేలకు లెక్కే ఉండదు. పండుగ మూడు రోజుల్లో వేలాదిగా జరిగే పందేలకు రెట్టింపు సంఖ్యలో కోడి పుంజులు అవసరమవుతాయి. సంక్రాంతి పందేల కోసం కోడి పుంజుల పెంపకం ద్వారా గోదావరి జిల్లాల్లో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. వీటి అమ్మకాల రూపంలో ఏటా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి మరీ.. కోవిడ్ అనంతరం సింహపురి ప్రాంతానికి చెందిన వారు పందెం పుంజుల పెంపంకంపై ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లూరు జిల్లాతోపాటు సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన నాటుకోళ్ల పెంపకందారులు, వ్యాపారులు గోదావరి జిల్లాల్లో అమ్మకాలు చేసేందుకు కోడి పుంజులతో తరలివస్తున్నారు. ఒక్కొక్కరు 20 వరకు పుంజులతో.. నలుగురైదుగురు కలిసి ప్రత్యేక వాహనాల్లో వస్తున్నారు. విజయవాడ–కాకినాడ హైవే వెంట తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం, పెరవలి, సిద్ధాంతం, గుండుగొలను తదితర ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా ఉండే రద్దీ రోడ్లలో ఖాళీ ప్రదేశాల వద్ద కోడి పుంజులను ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, సేతువ తదితర జాతులు, వివిధ రంగుల్లో వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. పుంజు రంగు, ఎత్తు, బరువును బట్టి ఒక్కో పుంజు రూ.3 వేల నుంచి రూ.10 వేల ధర పలుకుతున్నాయి. రోజుకో చోట విక్రయం స్థానికంగా పందేల కోసం సిద్ధం చేసే పుంజుల ధర అధికంగా ఉంటోంది. వాటికి అందించే ఆహారం, శిక్షణను బట్టి ఒక్కొక్క పుంజు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతాయి. నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి తెచ్చే పుంజులు ఇక్కడి పుంజులకు ఏమాత్రం తీసిపోని విధంగా మంచి సైజు, రంగుల్లో ఉంటున్నాయి. ఇక్కడ పెంచే పుంజులతో పోలిస్తే నెల్లూరు ప్రాంత పుంజుల ధర తక్కువగా ఉండటంతో పందేల రాయుళ్లు వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. పుంజుల్ని అమ్ముతున్న చోటే డింకీ పందాలు కట్టి బాగున్న పుంజులను ఎంపిక చేసుకుని తీసుకుంటున్నారు. పందెంలో అదృష్టం కలిసొస్తే తమకు పెద్ద పండుగేనంటున్నారు. తెచ్చిన పుంజులు మూడు నాలుగు రోజుల్లో అమ్ముడవుతున్నాయని.. ఒక్కోరోజు ఒక్కోచోట అమ్మకాలు చేస్తుంటామని నెల్లూరుకు చెందిన కోళ్ల పెంపకందారుడు వెంకటరమణ తెలిపాడు. నాలుగేళ్లుగా ఏటా వస్తున్నామని, అమ్మకాలు బాగానే ఉంటున్నాయని వివరించాడు. హోటళ్లు.. లాడ్జిలకు డిమాండ్ కోళ్ల కుంభమేళాగా పిలిచే సంక్రాంతి పందేలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని హోటళ్లు, లాడ్జిలకు డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది నవంబర్ నెల నుంచి హోటల్స్, లాడ్జి రూమ్‌ల ముందస్తు బుకింగ్ ముమ్మరంగా సాగుతోంది. బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, ఏపీలోని విశాఖ, విజయవాడతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్దఎత్తున పందేలరాయుళ్లు, పందేలను వీక్షించేందుకు వివిధ వర్గాల ప్రజలు ఇక్కడకు తరలి వస్తుంటారు. దీంతో అతిథుల కోసం ఈ ప్రాంతాల వారు జిల్లాలోని హోటల్స్‌లో బస ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దృష్ట్యా సాధారణ లాడ్జిలతోపాటు పేరొందిన హోటల్స్‌లో రూమ్‌లను జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు అడ్వాన్స్‌గా బుక్ చేస్తున్నారు. జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం పట్టణాలతో పాటు ఆచంట, పెనుగొండ, అత్తిలి తదితర ప్రాంతాల్లోని హోటల్స్, లాడ్జిలలో ఇప్పటికే 70 శాతం రూమ్‌లు బుక్ అయ్యాయి. మరో వారం రోజులు గడిస్తే రూమ్‌లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. రూమ్ రూ.5 వేల నుంచి రూ.10 వేలు సంక్రాంతికి అడ్వాన్స్‌గా బుక్ చేసే హోటల్స్ రూమ్‌ల ధరలు ఆయా హోటల్స్ బట్టి 24 గంటలకు రూ.5 వేల నుంచి డిమాండ్ బట్టి రూ.10 వేల వరకు ఉంటోంది. ధర ఎక్కువైనా రూమ్ కచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ముందస్తుగానే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం బుక్ చేసుకుంటున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు దిగే డీలక్స్, సూట్ రూమ్‌లకు సైతం డిమాండ్ భారీగా పెరిగింది. పండుగ నాలుగు రోజుల ప్యాకేజీ రూపంలో అయితే రూమ్‌ను బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటోంది. 24 గంటలకు అయితే రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలుకుతున్నాయి. -
నాటుకోళ్ల కోసం వెళ్లి... ముగ్గురు యువకులు దుర్మరణం
రాయగడ/మక్కువ: దసరా పండగకు నాలుగు డబ్బులు సంపాందించాలని బయలుదేరిన ముగ్గురి యువకులను మృత్యువు కాటేసింది. లోయ రూపంలో అందని లోకాలకు తీసుకుపోయింది. కుటుంబ సభ్యులకు కన్నీరుమిగిల్చింది. కొరాపుట్ జిల్లా నారాయణపట్నం సమితి లంగడ్బేడ గ్రామ సమీపంలో బుధవారం జరిగిన దుర్ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మక్కువ మండలం దబ్బగెడ్డ పంచాయతీ అనసబద్ర గ్రామానికి చెందిన జన్ని బాలరాజు(21), మర్రి శివ(23), జయరాజు(22)లు బుధవారం ఉదయం కోళ్లు కొనుగోలు చేసేందుకు ఆంధ్రా సరిహద్దులోని ఒడిశా గ్రామాలకు వెళ్లారు. అక్కడ చౌకగా దొరికే కోళ్లు కొనుగోలుచేసి దసరా పండగకు స్థానికంగా విక్రయిస్తే నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చన్న ఆశతో స్కూటీపై ముగ్గురు యువకులు ఉత్సాహంగా వెళ్లారు. తిరిగి వస్తుండగా వీరి స్కూటీ నారాయణపట్నం సమితి లంగడ్బేడ వద్ద ఘాట్‌రోడ్డులో అదుపుతప్పింది. అంతే.. 120 అడుగుల లోతులో ఉన్న లోయలో పడి దుర్మరణం చెందారు. ఉదయాన్నే వెళ్లిన పిల్లలు ఇంకారాలేదన్న ఆతృతతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు మృతివార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల్లో బాలరాజు వలంటీర్‌గా పనిచేస్తుండగా, మిగిలిన ఇద్దరు యువకులు వ్యవసాయకూలీలు. శోకసంద్రంలో అనసబద్ర అనసబద్ర గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతితో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలరాజు తల్లిదండ్రులు నారాయణ, రత్నాలు వ్యవసాయకూలీలు. జయరాజు నాన్న సోమయ్య మృతిచెందగా, అమ్మ శైలజ ఉంది. ఇప్పుడు కొడుకు మృతివార్తను తట్టుకోలేదని ఆమెకు తెలియకుండా గ్రామస్తులు గోప్యంగా ఉంచారు. అన్నయ్య, అమ్మ నల్లమ్మతో కలిసి కుటుంబానికి చేదోడుగా ఉంటున్న శివ మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నారాయణపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం అక్కడి సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తక్కువ ఖర్చుతో నాటు కోళ్ళని పోషించవచ్చు
-
నాటు కోళ్ల పెంపకం...లాభదాయకం
-
నాటు కోళ్ల పెంపకంతో ఎన్నో ప్రయోజనాలు..!
-
పాడిపశువులు, నాటుకోళ్ల పెంపకం ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు
-
నాటు కోళ్ల పెంపకం నెలకు లక్షన్నర ఆదాయం
-
పందెం కోళ్ల పెంపకం... నెలకు 5 లక్షల ఆదాయం
-
నాటు కోళ్ల పెంపకంతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు
-
‘నాటు’ టేస్టు.. విదేశాల్లో హిట్టు.. నోరూరించే పచ్చడి.. కేరాఫ్ జగిత్యాల రైతు
జగిత్యాల అగ్రికల్చర్: ఎంత బ్రాయిలర్ కాలమైనా నాటు కోడి రుచే వేరు. అందుకే ఓ రైతు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించారు.. అందరిలా కాకుండా నాటుకోళ్లు పెంచుతూ వాటి మాంసంతో పచ్చళ్లు తయారు చేస్తున్నారు. కమ్మని రుచితో అందరి మనసు దోచుకుంటున్నారు. ఆయన చేతి పచ్చళ్లు రుచి చూసిన గ్రేటర్ హైదరాబాద్ వాసులే కాదు.. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఉండే మనవారు కూడా ఇక్కడ ఉండే తమ బంధువుల ద్వారా ఆర్డర్లపై ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. మామిడితోటలో నాటుకోళ్ల ఫారం జగిత్యాల జిల్లా రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎడ్మల మల్లారెడ్డికి గ్రామ శివారులో ఐదెకరాల మామిడితోట ఉంది. అందులో రెండు షెడ్లు నిర్మించారు. ఒక్కో బ్యాచ్‌లో 500 నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. ఒక్కోటి 1.5 కేజీల నుంచి 2 కేజీల బరువు అయ్యే వరకూ దాణా అందిస్తున్నారు. పెట్టని కేజీకి రూ.400 చొప్పున వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నారు. పుంజు మాంసంతో చికెన్ పకోడి వంటి ఆహార పదార్థాలు తయారు చేస్తూ వాటినీ నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు. ఆర్డర్‌రాగానే.. మల్లారెడ్డి నాటుకోడి మాంసంతో తయారు చేసే ఆహార పదార్థాల్లో పచ్చడి అతి ప్రధానమైంది. కస్టమర్ల నుంచి ఆర్డర్ రాగానే పచ్చడి తయారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ముగ్గురు కూలీల సాయం తీసుకుంటున్నారు. పచ్చడి కోసం కోడి పుంజును వినియోగిస్తున్నారు. గ్యాస్ వాడకుండా కట్టెల మీద కాల్చడం మరో విశేషం. బోన్‌లెస్ ముక్కలను ఉడికించి, నూనెలో వేపడం ద్వారా ప్రత్యేకంగా తయారు చేసుకున్న మసాలాలతో పచ్చడి తయారు చేస్తున్నారు. పెరిగిన ఆర్డర్లు.. నాటుకోడి పచ్చడి రుచిచూసిన కస్టమర్లు.. తమ బంధువులు, స్నేహితుల కోసం ఆర్డర్లు ఇస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలతోపాటు విదేశాల్లోని తమవారికీ పంపిస్తున్నారు. ఆర్డర్లు భారీగా వస్తుండటంతో మల్లారెడ్డి ఇతర రైతుల నుంచి కూడా కోడిపుంజులను హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నారు. ఏదైనా కొత్తగా ఉంటేనే ఆదరణ ఏదైనా వినూత్నంగా ఆలోచించి వినియోగదారులను ఆకర్షించగలగాలి. అదే ఉద్దేశంతో నేను నాటు కోడి పచ్చడి తయారీ ప్రారంభించా. కోళ్లను నేరుగా విక్రయించే బదులు పచ్చడి తయారుచేసి అమ్మడం లాభదాయకం. ఇందులో శ్రమ ఉంటుంది, ఖర్చూ ఉంటుంది. అలాగే లాభమూ వస్తుంది. –ఎడ్మల మల్లారెడ్డి బంధువులే తొలి కస్టమర్లు.. ఈ పచ్చడిని అరకిలో, కిలో చొప్పున ప్యాక్ చేస్తున్నారు. ఆరు నెలలుగా ‘ఏఎంఆర్ ఇంటిగ్రేటెడ్ ఫామ్’బ్రాండ్ పేరిట అర్ధకిలో రూ.700, కిలో రూ.1,400 చొప్పున విక్రయిస్తున్నారు. తొలుత బంధువులు, పరిచయస్తుల్లో ప్రాచుర్యం పొందింది. క్రమంగా వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కావాలనుకున్న వారు ఆన్లైన్లో చెల్లింపులు చేశాక ఒక్కరోజులోనే పచ్చడి తయారు చేసి అందజేస్తున్నారు. -
ఆహా ఏమి రుచి.. అంకాపూర్ దేశీ కోడి కూరకు 50 ఏళ్లు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ ‘అంకాపూర్ దేశీ చికెన్’.. ఈ పేరు వింటే చాలు మాంసం ప్రియులకు నోట్లో నీళ్లూరుతాయి. ఎన్ని రకాల చికెన్ ఐటమ్స్ ఉన్నా.. ఈ దేశీ (నాటు) కోడి కూర రుచే వేరంటే అతిశయోక్తి కాదు. నాన్‌వెజ్ ప్రియులు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అంకాపూర్ వచ్చి మరీ ఈ కోడి కూరను ఆస్వాదిస్తుంటారు. 50 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర ఇప్పటికీ తిరుగులేని బ్రాండ్ ఇమేజ్‌తో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అంకాపూర్ గ్రామానికి చెందిన దుబ్బ గౌడ్, లక్ష్మి దంపతులకు వచ్చిన ఆలోచన.. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ ఊరి పేరును మార్మోగిస్తోంది. ఈ పేరుతో అనేకచోట్ల హోటళ్లు, ఆర్డర్ మెస్‌లు ఏర్పాటు కావడం విశేషం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అనేక మంది జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులు ఈ అంకాపూర్ దేశీ కోడి కూరను రుచి చూసి మెచ్చుకున్న వారే కావడం గమనార్హం. కల్లు తాగే వారి కోసం.. గీత కార్మికుడైన బుర్ర దుబ్బగౌడ్ కల్లు తాగేందుకు తన వద్దకు వచ్చే వారికి.. నాటు కోడి కూర వండి విక్రయించేవాడు. క్రమంగా దుబ్బగౌడ్ దగ్గరికి కల్లు కోసం వచ్చేవారి సంఖ్య పెరిగింది. దీంతో దుబ్బ గౌడ్, అతని భార్య లక్ష్మి దేశీ కోడి కూరతో పాటు బాతు కూర, ఆమ్లెట్లు వేసివ్వడం ప్రారంభించారు. ఇందుకోసం గ్రామంలోని తమ ఇంటి వద్దనే దేశీ కోళ్లు, బాతులు పెంచడం ప్రారంభించారు. గిరాకీ పెరగడంతో మునిపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల నుంచి రెండున్నర రూపాయల నుంచి మూడు రూపాయలకు ఒక కోడిని కొనుగోలు చేసి నలుగురు వ్యక్తులు తినడానికి సరిపడా కిలో బియ్యంతో అన్నం వండి రూ.5కు అందించడంతో క్రమంగా వారి వ్యాపారం పుంజుకుంది. లాభాల బాటలోకి వచ్చిన ఈ దంపతులను చూసి అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి రామగౌడ్, తాళ్లపల్లి మల్లాగౌడ్, బోండ్ల భాజన్న కూడా దేశీ కోడి కూర వంటకం ప్రారంభించారు. పదేళ్ల పాటు గ్రామంలోని గాంధీ చౌరస్తాలో నాటు కోడి కూర వ్యాపారం చేసిన దుబ్బ గౌడ్, లక్ష్మి దంపతులు పోటీ అధికం కావడంతో విరమించుకుని జీవనోపాధి కోసం హోటల్ పెట్టుకున్నారు. ప్రస్తుతం వీరు కాలం చేశారు. ఈ దంపతులు ప్రారంభించిన దేశీ కోడి కూర రుచి, అంకాపూర్ పేరు క్రమంగా అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయి. డెలివరీ @ ‘డోర్ స్టెప్’ ఒక కోడి ఆర్డర్ చేసిన వారు తమ గ్రామ శివారులో ఎక్కడ కూర్చున్నా తోటలు, పంట పొలాలు, ఇళ్లకు నేరుగా వెళ్లి అందిస్తున్నారు. భోజనం తరువాత గిన్నెలను సైతం వారే తీసుకెళుతున్నారు. వండి నేరుగా తెచ్చి ఇస్తుండడంతో పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పంట పొలాల్లో, మామిడి తోటల్లో భోజనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు నిజామాబాద్, ఇతర గ్రామాల్లో కూడా ఆర్డర్ మెస్‌లు ప్రారంభించారు. అంకాపూర్ గ్రామం జాతీయ రహదారికి పక్కనే ఉండడంతో ఇక్కడ ఎర్రజొన్న సీడ్ వ్యాపారం అభివృద్ధి చెందింది. సుమారు 40 సీడ్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. మరోవైపు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తరచూ అంకాపూర్‌ను సందర్శిస్తున్నారు. దేశీ కోడి కూరను రుచి చూసి వివిధ ప్రాంతాల్లో దీని గురించి చెప్పడంతో ప్రాచుర్యం పొందింది. అంకాపూర్ దేశీ కోడి ఆర్డర్ మెస్‌ల నిర్వాహకులు కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో దేశీ కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఒరిజినల్ కోడి అయితే ఎక్కువ ధర.. అంకాపూర్ దేశీ కోడి (క్రాస్ బ్రీడ్) కూరను సొంతంగా తయారు చేసిన ప్రత్యేకమైన మసాలాలు దట్టించి వండటంతో దానికి మంచి రుచి వస్తుంది. కోరిన వారికి ఎల్లిగడ్డ కారం సైతం ప్రత్యేకంగా ఒక గిన్నెలో పెట్టి ఇస్తారు. భోజన ప్రియులు, ముఖ్యంగా నాన్‌వెజ్ ప్రియులు ఈ కూరను ఇష్టంగా తింటున్నారు. అయితే 50 ఏళ్ల క్రితం కిలోకు రూ.5తో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర, అన్నం ధర ప్రస్తుతం రూ.1,000 వరకు ఉంటోంది. గ్రామంలో సుమారు పది మంది ఆర్డర్ మెస్‌లు నెలకొల్పారు. ప్రస్తుతం రూ.700కు నలుగురికి సరిపడా ఫారంలో పెంచిన దేశీ కోడి కూర, అన్నం చేసి ఇస్తున్నారు. ఆర్డర్ మెస్‌లోనే తినేవారికి రూ.130కు ప్లేట్ చొప్పున వడ్డిస్తున్నారు. ఇక గ్రామాల్లో పెరిగిన ఒరిజినల్ దేశీ కోడికి మాత్రం రూ.1,000 వరకు తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకూ విస్తరణ.. పాతికేళ్ల క్రితం వరకు కేవలం అంకాపూర్ గ్రామానికే పరిమితమైన ఆర్డర్ మెస్‌లు ప్రస్తుతం విస్తరించాయి. ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో సైతం అంకాపూర్ దేశీ కోడి కూర పేరుతో ఆర్డర్ మెస్‌లు వెలిసాయి. హైదరాబాద్‌లోని కొంపల్లి, మేడ్చల్ తదితర ప్రాంతాలకు నిజామాబాద్, పెర్కిట్, మామిడిపల్లి కేంద్రాలకు విస్తరించాయి. నిజామాబాద్ జిల్లాలో సుమారు వందకు పైగా అంకాపూర్ దేశీ కోడి కూర అందించే ఆర్డర్ మెస్‌లు ఉండగా.. ఒక్క ఆర్మూర్ మండలంలోనే 50కి పైగా ఆర్డర్ మెస్‌లు ఉన్నాయి. అయితే ఈ దేశీ కూర మెస్‌లను అంకాపూర్ వాసులే కాకుండా వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం ఏర్పాటు చేసి ఆర్మూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. విదేశాలకూ పార్శిల్స్.. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పలువురు అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం అక్కడ స్థిరపడిన వారి కోసం బంధువులు అంకాపూర్ దేశీ కోడి కూరను ఇక్కడ ప్రత్యేకంగా ప్యాక్ చేయించి కొరియర్ ద్వారా పంపిస్తున్నారు. ప్రత్యేక మసాలాలతో ప్రత్యేక రుచి.. ఇంట్లో వండే చికెన్‌లా కాకుండా మేము ప్రత్యేకంగా తయారు చేసిన కొన్ని మసాలాలు దట్టించి దేశీ కోడి కూరను వండుతాం. చాలా రుచికరంగా ఉంటుండటంతో భోజన ప్రియులు తినడానికి ఆసక్తి చూపుతున్నారు. –కుంట నారాయణ గౌడ్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, అంకాపూర్ అంతర్జాతీయ గుర్తింపుతో ఆనందం అంకాపూర్ దేశీ కోడి కూర తినడానికి వివిధ ప్రాంతాల నుంచి భోజన ప్రియులు వస్తున్నారు. కోరిన విధంగా వారికి వండి పెడుతున్నాము. అంతర్జాతీయ స్థాయిలో అంకాపూర్‌కు గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. – తాళ్లపల్లి శ్రీకాంత్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, అంకాపూర్ అంకాపూర్‌ను మించి పెర్కిట్‌లో వ్యాపారం.. దేశీ కోడి తినాలనుకున్న భోజన ప్రియులు కోరిన విధంగా వండి ఇస్తున్నాము. అంకాపూర్ కంటే పెర్కిట్, మామిడిపల్లిలో దేశీ కోడి ఆర్డర్ మెస్ వ్యాపారం చాలా ఎక్కువగా జరుగుతోంది. పట్టణ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు. – జీవన్‌గౌడ్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, పెర్కిట్, ఆర్మూర్ -
తక్కువ సమయంలో అధిక ఆదాయం.. నెలకు లాభం ఎంతంటే?
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మహిళల స్వయం ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. తాజాగా స్వయం సహాయక సంఘాల్లో ఔత్సాహికుల కోసం పెరటికోళ్ల పెంపకం(లైవ్‌స్టాక్) పథకాన్ని ప్రవేశపెట్టింది. పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఆవులు, గొర్రెల పంపిణీ మాదిరగా మేలుజాతి పెరటి కోళ్లను ఈ పథకం ద్వారా రాయితీపై పంపిణీ చేయనుంది. ఇప్పటికే జిల్లాలో వెలుగు కార్యాలయాల వద్ద లైవ్‌స్టాక్ యూనిట్ల పంపిణీ సైతం ప్రారంభమైంది. పెరట్లోనే ఆదాయం.. పెరటి కోళ్ల పెంపకం అనేది మహిళలకు తక్కువ సమయంలో మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉండే వారు నెలకు రూ.10వేలు వరకు సంపాదించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇంటి వద్ద తినిపడేసే వ్యర్థ పదార్థాలతో పాటు పథకం కింద అందజేసే దాణాను కోళ్లకు ఆహారంగా వేస్తే సరిపోతుంది. బాయిలర్ కోడి గుడ్డు రూ.5 ధర పలుకుతుంటే, ఈ దేశవాళీ పెరటి కోడి గుడ్లు ఒక్కొక్కటి రూ.10 వరకు పలుకుతుంది. సాధారణ కోళ్ల కంటే రెట్టింపు బరువుతో మాంసం అమ్మకానికి ఉపయోగపడతాయి. కుక్కల బెడద నుంచి కాపాడుకుంటే సరిపోతుంది. యూనిట్ల కోసం దరఖాస్తు ఇలా.. పెరటి కోళ్ల పెంపకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వీటిని సబ్సిడీపై సమకూరుస్తుంటే వాటి రక్షణ, వ్యాక్సినేషన్ ఇతర బాధ్యతలు పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ చూస్తోంది. మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయంలో ఏపీఎంలకు గ్రామాల్లోని సీఎఫ్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి లబ్ధిదారులకు వాహనం ద్వారా కోళ్లు సరఫరా చేస్తారు. సంరక్షణ నియమావళి, ఇతర సౌకర్యాలను అధికారులే వివరిస్తారు యూనిట్ ధర రూ.3970. ఇందులో ఎనిమిది కోడిపెట్టలు, మూడు కోడి పుంజులు ఉంటాయి. ఒక్కో కోడి నాలుగు కేజీల బరువు వరకు పెరుగుతాయి. ఆరోగ్య పరిస్థితి బట్టి 160 నుంచి 180 వరకు గుడ్లు పెడతాయి. వీటితో పాటు 30 కేజీల దాణా అందించనున్నారు. మార్కెట్లో కిలో దాణా రూ.240 వరకు పలుకుతుంది. కోళ్లు ఎటువంటి అనారోగ్యం కాకుండా నలభై రోజులు వరకు పనిచేసే డీ వార్మింగ్– ఎండీ వ్యాక్సినేషన్ చేయించి అందిస్తారు. మెడికల్ కిట్లు సైతం సరఫరా చేస్తారు. ఇందులో లివర్ టానిక్, బి–కాంప్లెక్సు వంటి యాంటి బయాటిక్‌లు ఉంటాయి. చదవండి: ‘ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది’ చురుగ్గా గుర్తింపు ప్రక్రియ జిల్లాలోని 25 మండలాలకు గాను 2500 యూనిట్లను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేసింది. మండలానికి తొలిదశలో భాగంగా 100 యూనిట్లు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే పలు మండలాల్లో 1530 యూనిట్లకు సరఫరా చేసేందుకు లబ్దిదారుల గుర్తింపు జరిగింది. పలాస మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనం వద్ద పథకం తొలి విడత పంపిణీ ప్రారంభమైంది. ఏపీఎంలను సంప్రదించాలి పెరటికోళ్ల పెంపకం ఇటీవలే ప్రారంభమైంది. మండలాల వారిగా కోళ్ల పంపిణీ జరుగుతోంది. యూనిట్ల కోసం వెలుగు కార్యాలయంలో ఉన్న ఏపీఎంలను సంప్రదించాలి. – డాక్టర్ మోతిక సన్యాసిరావు, డీఆర్డీఏ డీపీఎం, శ్రీకాకుళం -
నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ టేస్టే వేరు.. రోజుకు వెయ్యి లాభం!
గూడూరు(తిరుపతి జిల్లా): మాంసంప్రియుల ట్రెండ్ మారింది. మటన్ కొనే స్థోమత లేని వారంతా ఆరోగ్యాన్ని, అంతకుమించి రుచికి ప్రాధాన్యతనిస్తూ నాటుకోడి వైపు పరుగులు తీస్తున్నారు. బ్రాయిలర్ కోళ్ల మాంసంకంటే గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన నాటుకోళ్ల మాంసం రుచిగా ఉండటంతో కాస్త ధర ఎక్కువైనా ఎక్కడెక్కడ దొరుకుతాయా అని రెక్కలు కట్టుకొని తిరుగుతున్నారు. ఈ మార్పుతో నాటుకోళ్ల పెంపకం సైతం అధికమైంది. పల్లెల్లో అధికంగా దొరికే నాటుకోళ్లను కొందరు అదేపనిగా కొనుగోలు చేసి, ఆదివారం రోజు పట్టణాల్లో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలోని ద్రైపది కాంప్లెక్స్ ప్రాంతం ఆదివారం నాటుకోళ్ల సంతను తలపిస్తోంది. ఒకప్పుడు పల్లెల్లో నాటు కోళ్లను పెంచుకుని, పండుక్కో పబ్బానికో కోసుకుని ఇంటిల్లిపాదీ సంతోషంగా గడిపేవారు. కాల క్రమంలో వాటిని పెంచడంతోపాటు ఇతర ఇబ్బందుల నేపథ్యంలో పెంచేవాళ్లు తగ్గుతూ వచ్చారు. ఈ కారణంగానే చిన్న చిన్న పల్లెల్లోనూ చికెన్ సెంటర్లు పుట్టగొడుల్లా పుట్టుకొచ్చాయి. అయితే నాటుకోడి రుచి తెలిసిన పల్లె జనానికి బ్రాయిలర్ కోడి రుచించలేదు. ఫ్రీజర్లలో నిల్వ చేస్తుండటం.. చెన్నై నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి కిలో రూ.99 బోర్డులు పెడుతుండటంతో ప్రజల్లో అనుమానం అధికమైంది. ఎందుకొచ్చిన గొడవ అని.. నాటుకోడి తింటే పోలా అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అంతెందుకు.. హోటళ్లలోనూ నాటుకోడి, రాగి సంగటి బోర్డులు చూస్తే వాటికి పెరిగిన డిమాండ్ ఇట్టే అర్థమవుతోంది. క్రమంగా పెరుగుతున్న పెంపకం మారిన మాంసం ప్రియుల అభిరుచికి అనుగుణంగా నాటుకోళ్లకు గిరాకీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వాటి పెంపకం కూడా అధికమైంది. కొందరు వ్యాపారులు పల్లెలకు వెళ్లి నాటుకోళ్లను కొనుగోలు చేసి తీసుకొచ్చి పట్టణాల్లో విక్రయిస్తున్నారు. ఇక చాలాచోట్ల నాటుకోళ్లను షెడ్లలోనూ పెంచుతున్నారు. వీటిలోనూ రకాలు ఉండటంతో, అందుకు అనుగుణంగా ధర ఉంటోంది. దాదాపుగా మటన్ ధరకు సరితూగుతూ... నాటు కోడి మాంసం దాదాపుగా మటన్ ధరకు సరితూగుతోంది. మటన్ ధర కిలో రూ.800 నుంచి రూ.1000 వరకూ పలుకుతోంది. ఇదే స్థాయిలో ఒకటిన్నర కిలో బరువున్న నాటుకోడి ధర రూ.700 వరకు ఉంటోంది. వ్యర్థాలన్నీ పోనూ సుమారు కిలో మాంసం ఇంటికి చేరుతుంది. అయితే నాటుకోడి అయితే, ఎలాంటి ఆలోచన లేకుండా ఇంటికి తీసుకెళ్లొచ్చు. అదే మటన్ అయితే, ఏది అంటగట్టారోననే అనుమానం తిన్నా తీరదు. ఇంకేముంది.. నాటు, నాటు పాటను గుర్తుకు తెచ్చుకొని ఎంచక్కా లొట్టలేసుకుంటూ నాటుకోడిని ఆరగించేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం విశేషం. నాటుకోళ్లకు డిమాండ్ నేను బేల్దారి పనిచేస్తుంటా.. ఆదివారం మాత్రం నాటు కోళ్లు తీసుకొచ్చి అమ్ముతుంటా. ఒక్కో రోజు వెయ్యి వరకూ మిగులుతుంది. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. పల్లెటూళ్లలో పెరిగిన కోళ్లు కావడంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోళ్లు చేస్తుంటారు. – రమేష్, గూడూరు ఆ రుచే వేరబ్బా బ్రాయిలర్ కోడి మాంసం తిన్నట్టే ఉండదు. ఆదివారం ముక్క లేనిదే ముద్ద దిగదు. మటన్ తెచ్చుకుందామంటే ఆ ధర వింటేనే అమ్మో అనిపిస్తుంది. అందుకే నాటుకోడి ఎక్కడ దొరుకుందా అని చూస్తుంటా. రాగి సంగటి కాంబినేషన్ ఉండనే ఉంది. ఆ టేస్టే వేరు. – శ్రీనివాసులురెడ్డి, గూడూరు చదవండి: రూమ్‌కు తీసుకెళ్లి రోల్డ్‌గోల్డ్ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి.. -
నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ రుచే వేరబ్బా.. ఎంత ఆరోగ్యమో తెలుసా..?
రాయదుర్గం(అనంతపురం జిల్లా): రాయదుర్గానికి చెందిన ఎరుకుల వెంకటేశులు గ్రామాలు తిరుగుతూ నాటుకోళ్లను హోల్‌సేల్ ధరలకు కొనుగోలు చేస్తాడు. ద్విచక్రవాహనంపై బళ్లారికి తీసుకెళ్లి అక్కడ అధిక ధరలకు అమ్మకం చేపట్టి లాభాలు పొందుతున్నాడు. వారానికి అన్ని ఖర్చులూ పోను రూ.6 వేల వరకు సంపాదిస్తున్నాడు. ఇలా జిల్లా వ్యాప్తంగా నాటుకోడి వ్యాపారాలు చేపట్టి ఆశించిన లాభాలు పొందే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి.. నాటుకోడి అంటే మాంసం ప్రియులకు నోరూరుతుంది. బ్రాయిలర్ చికెన్ ధరకు రెట్టింపు, మటన్‌తో సమానంగా ధర పలుకుతున్నా కొనుగోలుకు వెనుకాడటం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాటి మాంసానికి ఉన్న ఆదరణ చూసి కొందరు దుకాణదారులు, హోటల్ నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. వాటిని పోలిన జాతులను చూపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నాటో.. కాదో నిర్ధారించుకోవడం కొంత కష్టంగా ఉన్నా, తరచి చూస్తే ఇలాంటి మోసాలకు తెరదించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎలా పెంచుతారంటే..? గ్రామాల్లో దేశవాళీ నాటుకోడి పెరిగేందుకు ఎక్కువ కాలం పడుతుంది. ఆరు వారాలకు 400 గ్రాముల బరువు పెరుగుతుంది. వంద రోజులు దాటితే 1.5 కిలోలకు ఎదుగుతాయి. అదే వనరాజ, గిరిరాజ కోళ్లు ఆరు వారాల్లోనే 850 గ్రాముల పైన, బ్రాయిలర్ 1.50 కిలోల వరకు పెరుగుతుంది. ఫారంలో లైట్ల వెలుగులో నిద్రపోకుండా చేసి, మొక్కజొన్న, జొన్న, శనగచెక్క వంటి బలమైన ఆహారాన్ని అందిస్తూ వేగంగా పెరిగేలా చేస్తున్నారు. వాటినే మార్కెట్లో నాటుకోళ్లుగా విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట తిరిగే దేశవాళీ కోళ్లు పురుగులు, ఆకులు, గడ్డి ఇతర విత్తనాలు వంటివి తిని బలిష్టంగా ఉంటాయి. గుర్తించడం ఇలా.. ♦నాటుకోడి కాళ్లు, ఎముకలు బలిష్టంగా ఉంటాయి. ఎక్కువ సమయం బయట నిల్వ ఉంచినా మాంసం పాడవ్వదు. ♦వండిన తర్వాత ఎముకలు నమిలేందుకు గట్టిగా ఉంటాయి. ♦మటన్‌తో సమానంగా ఉడికించాల్సి వస్తుంది. ♦గిరిరాజ, వనరాజ, కడక్‌నాథ్ కోళ్లు సాధారణంగా ఒకే రంగులో జుట్టు కలిగి ఉంటాయి. ఎముకలు పలుచగా, ఈకలు ఎక్కువగా ఉంటాయి. ♦బ్రాయిలర్ మాంసం కూడా తక్కువ సమయంలోనే ఉడికించవచ్చు. నాటుకోడి రుచే వేరు.. కోళ్ల మాంసంలో నాటు కోడి రుచేవేరు. ఆ మాంసం ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వైద్యులు చెపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే కోళ్లలో అనేక రకాలు ఉన్నాయి. ఇలాంటి దేశవాళీతో పాటు షెడ్లలో వేగంగా పెరిగే వనరాజ, గిరిరాజ, కడక్‌నాథ్ వంటివి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. వీటినీ నాటుకోడి మాంసమని చెప్పి విక్రయిస్తూ మోసగిస్తున్నారు. నాటుకోడి విక్రేతలు ధరలో ఎక్కడా రాజీపడరు. కిలో రూ.350 నుంచి రూ.400కు తక్కువ ఇవ్వలేరు. షెడ్లలో పెంచే కడక్‌నాథ్, గిరిరాజ ఇతర జాతుల కోళ్లు రూ.300లోపే లభ్యమవుతాయి. ఉమ్మడి జిల్లాలో రోజూ ఒకటిన్నర టన్ను వరకు విక్రయాలు జరుగుతుంటాయని, ఒక్క అనంతపురం జిల్లాలోనే టన్ను వరకు అమ్మకాలు జరుగుతాయని పశు సంవర్ధక శాఖ అధికారుల ప్రాథమిక అంచనా ద్వారా తెలిసింది. సాధారణంగా చాలామంది ఆదివారం మాంసం తినేందుకు ఇష్టపడతారు. పట్టణం, పల్లె ఏదైనా సరే ప్రస్తుతం అందరి చూపు నాటు కోడి వైపు మళ్లడంతో విక్రయదారులు సైతం ధరలు పెంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయం.. లాభదాయకం.. వ్యవసాయం కలిసిరాకపోవడంతో ప్రత్యామ్నాయంగా నాటుకోళ్ల పెంపకం ఎంచుకున్నాను. మూడేళ్ల క్రితం 100 కోళ్ల పెంపకంతో మొదలు పెట్టాను. ప్రస్తుతం 300 కోళ్లకు ఫారం సామర్థ్యం పెరిగింది. ఇప్పటికే 200 కోళ్లు అమ్మేశాను. మోసం లేకుండా నాణ్యమైన దేశవాళీ బ్రీడ్ కోళ్లు మాత్రమే అమ్మడంతో గిరాకీ బాగా పెరిగింది. ఫారం వద్ద అయితే కిలో రూ.350 నుంచి రూ.400కు కొనుగోలు చేస్తున్నారు. ఇదే కోడి బయట మార్కెట్లో రూ.500కు పైగా అమ్ముడుపోతున్నాయి. పెట్టుబడి పోనూ రూ.40 వేలకు పైగా లాభం చేకూరుతోంది. – గజ్జిని సత్యనారాయణ, రైతు, గొల్లపల్లి పొలం వద్దే పెంపకం పొలం వద్దే 50 నుండి 70 వరకు నాటు కోళ్లు పెంచుతాను. పొలంలో ఆరుబయట మేత కోసం తోలి.. సాయంత్రం కొన్ని గింజలు వేస్తాను. ఒక్కో కోడి 2.50 కిలోల నుంచి 3 కిలోలకు పైగా తూకం రాగానే అమ్మకం చేపడతాను. చాలామంది అధికారులు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తారు. అడ్వాన్స్ కూడా ఇచ్చిపోతారు. కిలో రూ.300 నుండి రూ.400 వరకు విక్రయిస్తాను. మంచి లాభాలు ఉన్నాయి. నాటుకోడి రుచికి.. గిరిరాజ రుచికి చాలా తేడా ఉంటుంది. – జయరాములు, రైతు, బానేపల్లి కొవ్వు శాతం తక్కువ పెరటి కోళ్లు స్వేచ్ఛగా పెరుగుతాయి. షెడ్లలో పెంచిన వాటికంటే బలంగా ఉంటాయి. మిగిలిన వాటితో పోల్చితే పోషకాలు ఎక్కువ. వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. నాటుకోడి గుర్తించే కొనుగోలు చేయడం మంచిది. ఆహార నియమాల్లో మార్పులు రావడంతో పాటు చాలా మంది మాంసం ప్రియులు నాటుకోడి వైపు చూస్తున్నారు. దీంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. మంచి గిరాకీ ఉండడంతో రైతులను ప్రోత్సహిస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ 10 నుండి 20 కోళ్ల వరకు ఇళ్ల వద్ద పెంపకం కూడా బాగా పెరిగింది. – నవీన్‌కుమార్, పశువైద్యాధికారి, రాయదుర్గం -
Chicken Price Hike: కొండెక్కిన కోడి.. కిలో చికెన్ అంత ధరా?
సాక్షి, పార్వతీపురం: రోజురోజుకూ కోడి మాంసం ధర కొండెక్కుతోంది. వేసవి కాలం కావడంతో బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గింది. కొత్త పౌల్ట్రీలు ఏర్పాటు చేయకపోవడంతో ఉన్న పౌల్ట్రీల ద్వారానే కోళ్ల సరఫరా జరుగుతోంది. మరో వైపు జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్లు, పండగలు జరుగుతుండడంతో మాంసానికి డిమాండ్ పెరుగుతోంది. సీజన్ కావడంతో డిమాండ్ ప్రస్తుతం చికెన్, మటన్ల విక్రయాలకు డిమాండ్ పెరిగింది. ఏటా ఫిబ్రవరి నుంచి జూలై వరకూ మాంసానికి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నెలల్లో ఎక్కువగా గ్రామ దేవతల సంబరాలు, ఇంటి వారాలు, యానాళ్లు, అసిరితల్లి పండగలు వంటివి నిర్వహిస్తుంటారు. చికెన్, మటన్ వంటి వంటకాలను ప్రజలు ఎక్కువ ఇష్టపడతారు. దీంతో ఏటా ఈ సమయంలో చికెన్ ధరలు పెరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగాయి. గతంలో బ్రాయిలర్ కోడి చికెన్ ధర కిలో రూ. 220లు ఉండగా, ప్రస్తుతం రూ. 260 నుంచి రూ. 280 మధ్య పలుకుతోంది. మరో వైపు బ్రాయిలర్ కోడి లైవ్ కిలో ధర గతంలో రూ 140 నుంచి రూ.150 మధ్య ఉండేది. ఇప్పుడు రూ.180 నుంచి రూ. 200 మధ్య పలుకుతోంది. ఇవి కూడా చికెన్ దుకాణాల వద్ద పరిమితంగానే ఉంటున్నాయి. పౌల్ట్రీల నుంచి ఉత్పత్తులు లేకపోవడంతో కోళ్లకు డిమాండ్ పెరిగి, మాంసం ధర పైపైకి వెళ్తోంది. చదవండి👉🏾 గంగపుత్రులకు మరింత చేరువగా.. వేసవి ప్రభావం ప్రతి పౌల్ట్రీకి 4,500 నుంచి 7 వేల వరకు బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి కంపెనీలు పిల్లలను అందిస్తాయి. కొంతమంది సొంతంగా కొనుగోలు చేస్తారు. ఇవి 72 రోజుల వ్యవధిలో కిలోన్నర నుంచి రెండున్నర కిలోల వరకూ పెరుగుతాయి. వేసవికాలంలో వీటిని పెంచేందుకు పౌల్ట్రీల వద్ద షెడ్డులు కూల్‌గా ఉంచాలి. ఇందుకోసం డ్రిప్ విధానాన్ని అమలుచేసి షెడ్డులు తడుపుతుంటారు. ఈ వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండడం, వేడి గాలులు వీస్తుండడంతో బ్రాయిలర్ కోళ్లు అధికంగా చనిపోతుండడంతో దిగుబడి పూర్తిగా పడిపోతోంది. వీటికి తోడు కోడి మేత ధర పెరిగింది. బ్రాయిలర్ కోడికి ప్రధాన మేతగా పరిగణిస్తున్న సోయాబీన్ మేత కిలో రూ.102 నుంచి రూ.113 మధ్య ఉంది. గతంలో కిలో రూ. 60 ఉండేది. సాధారణ మొక్కజొన్న మేత కిలో రూ.13 లు నుంచి రూ.23కు ఎగబాకింది. చదవండి👉🏼 వినూత్న కేజ్ కల్చర్.. అద్భుత ప్యా‘కేజ్’ ఇతర ప్రాంతాల నుంచి.. జిల్లాలో దిగుబడి తక్కువ కావడంతో విశాఖపట్నం,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి జిల్లాకు బ్రాయిలర్ కోళ్లు దిగుమతి అవుతున్నాయి. రవాణా చార్జీలు అదనంగా ఉండడంతో కోళ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నాటుకోడి కొనలేం బ్రాయిలర్ కోడి విషయం పక్కన పెడితే నాటుకోడి ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. నిత్యం జరిగే వారపు సంతలతో పాటు మార్కెట్లో కూడా నాటుకోళ్లు జిల్లాలో లభిస్తున్నాయి. కిలో బరువు తూగే కోడి ధర రూ. 400 దాటి 500 వరకూ పలుకుతోంది, నాటుకోడి మాంసం ధర కూడా కిలో రూ. 500 చొప్పున విక్రయిస్తున్నారు. పెరిగిన బ్రాయిలర్ చికెన్ ధర బ్రాయిలర్ కోడి మాంసం ధర మార్కెట్లో పెరిగింది. ప్రస్తుతం వేసవికావడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గుతోంది. పౌల్ట్రీల వద్ద దిగుబడి పెద్దగా ఉండదు. ఈ రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి. పౌల్ట్రీ నిర్వాహకులకు గతేడాది ఈ సమయంలో నష్టం వచ్చింది. ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -ఎ.ఈశ్వరరావు, పశుసంవర్థకశాఖ జేడీ, పార్వతీపురం మన్యం జిల్లా -
నాటు కోడికి గిరాకీ పెరుగుతున్నా, ధర తగ్గింది.. కారణం ఇదే!
సాక్షి,శ్రీకాకుళం: ఒకప్పుడు నాటుకోడి అందరికీ ఇష్టమైన మాంసాహారం. తర్వాత ధరలు పెరిగిపోవడంతో కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైంది. బ్రాయిలర్ చికెన్ ధరకు నాటుకోడి చికెన్ ధర రెట్టింపు ఉండేది. కోవిడ్ సమయం నుంచి ప్రజలు ధర కాస్త ఎక్కువైనా మళ్లీ నాటుకోడి వైపు దృష్టి సారించారు. పెరటి కోళ్ల పరిశ్రమకు ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం పెరటి కోళ్ల పరిశ్రమను ప్రోత్సహిస్తోంది. మహిళా సంఘాలు, పొదుపు సంఘాల వారికి రాయితీపై కోళ్ల పెంపకం యూనిట్లను అందజేస్తున్నారు. దీని వల్ల నాటుకోడి ధర తగ్గింది. ప్రస్తుతం కిలో నాటుకోడి ధర రూ.400 వరకు ఉంది. ప్రత్యేక సంతలు నాటు కోళ్లు కావాలంటే గతంలో గ్రామాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నగరాలు, పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామస్తులు నాటుకోళ్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్లో నాటుకోళ్ల సంత జరుగుతుంది. బుధవారం నరసన్నపేటలో నాటుకోళ్ల ప్రత్యేక సంత ఉంటుంది. ఇలా జిల్లాలోని పట్టణాల్లో నాటుకోళ్లకు ప్రత్యేక సంతలు నిర్వహిస్తున్నారు. చింతాడ, బుడుమూరు, సీతంపేటలలో వారానికోసారి నిర్వహించే సంతల్లో కూడా నాటుకోళ్లను విక్రయిస్తారు. చదవండి: బ్యాచిలర్స్ అద్దెకుంటున్న ఇంట్లో మహిళ అనుమానాస్పద మృతి -
నాటుకోడి పులుసు.. రాగిముద్ద.. ఆహా ఆ రుచే వేరు.. పుంజు రూ.5 వేలు!
కోవిడ్ నేర్పిన పాఠంతో ప్రస్తుతం ఇంటింటా నాటు కోడి రుచులు ఘుమఘుమలాడుతున్నాయి. రహదారికి ఇరువైపులా నాటుకోడి పులుసు–రాగిముద్ద హోటళ్లు వెలుస్తున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచే నాటుకోళ్లు పూర్వ వైభవంతో రెక్కలు విప్పుతున్నాయి. రుచిని, ఆరోగ్యాన్నిచ్చే పెరటి కోళ్ల వినియోగంతోపాటు ధరలూ పెరుగుతున్నాయి. ఈ కోళ్ల పెంపకందారులకు కాసులు కురుస్తున్నాయి. చదవండి👉 Health Tips: రోజూ కోడిగుడ్డు తిన్నారంటే.. కొలువులు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్లకూ ఈ కోళ్లే ఉపాధి కల్పిస్తున్నాయి. నాటుకోడి పులుసు–రాగిముద్ద హోటళ్లు వెలుస్తున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచే నాటుకోళ్లు పూర్వ వైభవంతో రెక్కలు విప్పుతున్నాయి. రుచిని, ఆరోగ్యాన్నిచ్చే పెరటి కోళ్ల వినియోగంతోపాటు ధరలూ పెరుగుతున్నాయి. ఈ కోళ్ల పెంపకందారులకు కాసులు కురుస్తున్నాయి. కొలువులు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్లకూ ఈ కోళ్లే ఉపాధి కల్నిస్తున్నాయి. పలమనేరు/బైరెడ్డిపల్లె: ఆదివారం వచ్చిందంటే చాలు ఇళ్లల్లో మాంసాహారం ఘుమఘుమలాడాల్సిందే. అందులోనూ నాటుకోడి చారు దానికి కాంబినేషన్‌గా రాగిముద్ద ఇప్పుడు జిల్లాలో ఓ ట్రెండ్‌గా మారింది. కోవిడ్ నేర్పిన పాఠంతో ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోయింది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుకొనేందుకు మాంసాహారంపై దృష్టి సారించారు. మందులతో పెంచే బ్రాయిలర్ కోళ్లకంటే నాటు కోళ్లలో మంచి ప్రోటీన్లు ఉండడంతో వీటికి గిరాకీ పెరిగింది. రాయలసీమ ప్రత్యేక వంటగా పేరొందిన రాగిముద్దకు నాటుకోడి పులుసుంటే ఆ మజానే వేరు. దీనికున్న డిమాండ్‌ను చూసి చిత్తూరుతోపాటు కర్ణాటకలోని కోలారు, చింతామణి, చిక్కబళ్లాపుర, బెంగళూరు ప్రాంతాల్లోనూ ఈ నాటుకోడిచారు రాగిముద్ద హోటళ్లు భారీగా వెలిశాయి. పెరుగుతున్న పెంపకం-వినియోగం గతంలో పల్లెల్లో ప్రతి ఇంటికి పెరటి కోళ్లు ఉండేవి. బంధువులు ఇంటికొచ్చినా, పండుగలొచ్చినా కోడి కూర వండడం అప్పటి సంప్రదాయం. కాల క్రమేణా జీవనశైలిలో వచ్చిన మార్పుతో పెరటికోళ్ల పెంపకం తగ్గింది. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండే బ్రాయిలర్‌కోళ్ల వినియోగం పెరిగింది. కేవలం 40 రోజుల్లో పెరిగే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అంతంతమాత్రమే. దీనికితోడు కోవిడ్ కారణంగా ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకునే మార్గాలు అన్వేషించి, రుచిని అందించే నాటు కోడిని ఎంచుకున్నారు. చదవండి👉: నీట్, ఎంసెట్ విద్యార్థులకు సాక్షి మాక్‌టెస్టులు దీంతో నాటుకోళ్ల పెంపకంతోపాటు వినియోగమూ పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 80 దాకా నాటుకోళ్ల ఫారాలున్నాయి. కోవిడ్కారణంగా కొలువులు వదిలేసి వచ్చిని సాఫ్ట్వేర్లు సైతం నాటుకోళ్ల ఫామ్‌లు పెట్టి రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బ్రాయిలర్ కోళ్ల అమ్మకాలు రోజుకు సగటున 30 టన్నులుగా ఉంది. నాటుకోళ్ల అమ్మకాలు 5 టన్నులుగా ఉండేది. ప్రస్తుతం రోజువారీ నాటుకోళ్ల వినియోగం 8 టన్నులకు చేరుకుందని వ్యాపారులు చెబుతున్నారు. బైరెడ్డిపల్లె సంత ప్రసిద్ధి పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లెలో ప్రతి శనివారం జరిగే నాటుకోళ్ల సంత రాయలసీమలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కోళ్ల సంత మూడు దశాబ్దాలుగా సాగుతోంది. చుట్టుపక్కల గ్రామాలనుంచి నాటుకోళ్లను పెంచేవాళ్లు ఇక్కడికి అమ్మకానికి తీసుకొస్తారు. వీటిని కొనేందుకు వందలాదిమంది వ్యాపారులు బయటి రాష్ట్రాలనుంచి సంతకు వస్తుంటారు. ఇక్కడ లక్షల్లో నాటుకోళ్ల వ్యాపారం జరుగుతుంది. ముఖ్యంగా బెంగళూరునుంచి ఖరీదైన కార్లలో వచ్చే వారు ఇక్కడి పందెంకోళ్లు, బెనిసికోళ్లను కొనుగోలు చేస్తుంటారు. నాటుకోడి పులుసు హోటళ్లు పలమనేరు, కుప్పం, చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, రాయచోటి ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని కోలారు, ముళబాగిలు, బంగారుపేట, కేజీఎఫ్, మాలూరు, విజయపుర, షిడ్లగట్ట, దొడ్డబళ్లాపురల్లో నాటుకోడిచారు– రాగిముద్ద హోటళ్లు, దాబాలు ప్రత్యేకంగా వెలిశాయి. చిన్న చిన్న పట్టణాల్లో అయితే ఇళ్లలోనే నాటు కోడివంటలు చేసి తోపుడు బండ్లపై విక్రయిస్తున్నారు. రహదారుల పక్కన వాహనాల్లోనూ నాటుకోడి పులుసు అమ్మకాలు సాగుతున్నాయి. పుంజు రూ.5 వేలు ప్రస్తుతం నాటుకోడి(లైవ్) కిలో రూ.250 నుంచి రూ.300 పలుకుతోంది. కోడి బరువునుబట్టి ధర నిర్ణయిస్తారు. అయితే ఈ సంతకొచ్చే కోడిపుంజుల్లో కొన్ని పందెంకోళ్లుంటాయి. వీటి ధర డిమాండ్‌ను బట్టి రూ.3వేల నుంచి 5వేల దాకా పలుకుతుంటాయి. మాంసం కోసమైతే కోడి పుంజు, బెనిసికోడి, నల్లకోడి, కోడిపెట్ట, గుడ్లుకోడికి మంచి డిమాండ్ ఉంటుంది. ఎంతో ఆరోగ్యం నాటుకోడిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. దీంతో విటమిన్-బి6తో పాటు ప్రొటీన్లు, ఫాస్ఫరస్, జింక్ ధాతువులు అందుతాయి. జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బందులుండవు. వీటికి పూర్తి సహజ సిద్ధంగా తయారైన ఆహారాన్ని అందిస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కోడికి పూర్వ వైభవం వచ్చింది. పెరిగిన గిరాకీ నేను బైరెడ్డిపల్లి సంతలో 20 ఏళ్లుగా నాటుకోళ్లను కొంటున్నాను. గత రెండేల్లుగా వీటికి డిమాండ్ బాగా పెరిగింది. నాటుకోడి మాంసం తినేవారి సంఖ్య పెరిగింది. బ్రాయిలర్ కోడిమాంసం కంటే కొంచెం ఎక్కువ ధర అయినప్పటికీ జనం ఎగబడి కొంటున్నారు. మాకు వ్యాపారం బాగానే ఉంది. ఇక్కడ కోళ్లను కొని కర్ణాటకలో అమ్ముతుంటాం. ప్రతివారం కోళ్ల సంతకు వస్తుంటాం. – రియాజ్, నంగిళి, కర్ణాటక ఈ కోళ్ల రుచే వేరు ఎన్నో ఏళ్లుగా బైరెడ్డిపల్లెలో నాటుకోళ్ల వ్యాపారం చేస్తున్నాను. మా కర్ణాటకలో బైరెడ్డిపల్లె నాటుకోళ్ల్లకు మంచి గిరాకీ ఉంటుంది. ఎందుకంటే వీటిని రైతుల పొలాలవద్ద, పల్లెల్లో పెంచుతారు. అవి ప్రకృతిలో తిరుగుతూ పెరుగుతాయి కాబట్టి రుచిగా ఉంటాయి. ఫారాల్లో పెంచే నాటుకోళ్లు క్రాసింగ్ కాబట్టి అంతరుచి రాదు. నాటుకోడి పులుసు తినేటపుడే నాటుదా ఫారమ్దా అని తెలిసిపోతుంది. శ్రీధర్, కోళ్లవ్యాపారి, ముళబాగిళు, కర్ణాటక -
రుచి తగ్గిన బ్రాయిలర్.. నాటుకోడికి జై, కిలో రూ.600
సాక్షి,తూర్పుగోదావరి: బ్రాయిలర్ రాకతో కనుమరుగైన నాటుకోళ్ల పెంపకం జిల్లాలో మళ్లీ ఊపందుకుంటోంది. మార్కెట్లు, రోడ్ల పక్కన వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నాటుకోడి గుడ్లు, మాంసాన్ని బలవర్ధక ఆహారంగా పరిగణిస్తారు. పూర్వం మాంసాహార ప్రియుల ఇళ్ల వద్ద కోళ్ల గూళ్లలో 10 నుంచి 30 వరకూ నాటుకోళ్లను పెంచేవారు. ఇంట్లో కూరలకు వీటి గుడ్లనే వినియోగించేవారు. చుట్టాలు వచ్చినప్పుడు వారికి నాటు కోడి కూర పెట్టడంతో పాటు పండగలప్పుడు నైవేద్యాలకు నాటుకోళ్లనే కోసేవారు. 1988–92 మధ్య కాలంలో జిల్లాలో లేయర్ కోళ్ల పరిశ్రమ విస్తరణతో తక్కువ ధరకే గుడ్లు లభించడం, ఇళ్ల వద్ద ఖాళీ స్థలాలు కనుమరుగవడంతో రానురానూ నాటుకోళ్ల పెంపకం తగ్గిపోయింది. మరోపక్క దుమ్ములు కూడా మెత్తగా నమలడానికి వీలుగా ఉండే బ్రాయిలర్ కోళ్ల వినియోగం పెరిగింది. అయితే కాలక్రమేణా మాంసాహార ప్రియుల అలవాట్లలో మార్పులొస్తున్నాయి. త్వరగా బరువు పెరగడానికి బ్రాయిలర్ కోళ్లకు చేస్తున్న హార్మోన్లు ఇంజక్షన్లు ఆరోగ్యానికి చేటు తెస్తాయన్న భావన పెరిగింది. దీనికితోడు వీటి మాంసం రుచి తగ్గడంతో నాటుకోడి వైపు మాంసాహార ప్రియులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా నాటుకోళ్ల పెంపకం రెండేళ్లుగా జోరందుకుంది. లాభదాయకంగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 200 పైగా నాటుకోళ్ల ఫారాలు ఏర్పాటయ్యాయి. గ్రామాల్లోని ఫారాల్లో కోళ్లను పెంచి వారాంతంలో పట్టణాలకు, నగరాలకు తీసుకువచ్చి మార్కెట్లు, రోడ్లు పక్కన ఉంచి విక్రయిస్తున్నారు. మార్కెట్లో నాటుకోడి లైవ్ కిలో రూ.600, చికెన్ రూ.700 ఉంటోంది. మటన్, నాటుకోడి ధరలు మార్కెట్లో దాదాపు ఒకేలా ఉంటున్నాయి. లేయర్ కోడి గుడ్డుతో పోలిస్తే నాటుకోడి గుడ్డులో పోషక విలువలు పుష్కలంగా ఉండటంతో ఒక్కో గుడ్డు రూ.20 పలుకుతోంది. లాభసాటిగా ఉంది నాటుకోళ్లకు డిమాండ్ పెరగడంతో రెండేళ్ల క్రితం పశువుల మకాం వద్ద నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాం. గుడ్ల ఉత్పత్తికి వినియోగించే కోడిపుంజుకు రూ.75 వేలు, పెట్టకు రూ.12 వేలు వెచ్చించాం. పూర్తి ఆర్గానిక్ తరహాలో ఒక్కో బ్యాచ్ సిద్ధం కావడానికి ఎనిమిది నెలలు పడుతోంది. మా వద్ద పెంచిన కోళ్లను చికెన్ వ్యాపారులు హోల్‌సేల్‌గా తీసుకువెళుతుంటారు. నాటుకోళ్ల పెంపకం లాభసాటిగా ఉంది. – పిల్లా విజయ్‌కుమార్, ఆర్గానిక్ నాటుకోళ్ల రైతు, పాలతోడు చదవండి: ప్రకాశం జిల్లా: 11 మంది వీఆర్వోల సస్పెన్షన్ -
బ్రాయిలర్ చికెన్‌తో బోరుకొట్టి.. నాటు కోడి తిందామంటే..!
సాక్షి, హైదరాబాద్: మామూలుగానే ఆదివారం వచ్చిందంటే ఇంట్లో కోడి కూర ఘుమఘుమలు ఉండాల్సిందే.. ముక్కతో ఓ ముద్ద తింటే ఆ మజాయే వేరు.. దానికి తోడు బోనాలు.. ఇల్లంతా సంబురం.. ఇక నాన్‌వెజ్ తప్పకుండా ఉండాల్సిందే.. కరోనా ప్రభావంతో నాటు కోళ్లకు కరువొచ్చింది. ఏ చికెన్ మార్కెట్, చికెన్ సెంటర్‌కు వెళ్లినా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల నాటుకోళ్లు అందుబాటులో ఉన్నా వాటి ధరలు మాత్రం ఆకాశాన్నంటాయి. బోనాల వేళ నాటు కోళ్లు కోయడం ఆనవాయితీగా వస్తున్నందున ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. పెద్ద చికెన్ సెంటర్లలో బ్రాయిలర్, లెయర్ కోళ్లతో పాటు నాటు కోళ్లు విక్రయిస్తారు. కానీ నెల రోజుల నుంచి నాటుకోళ్లు విక్రయించే చికెన్ సెంటర్లలో నాటు కోళ్లు లేవు. చికెన్ సెంటర్ యజమానులను అడిగితే గ్రామాల నుంచి కోళ్లు రావడం లేదు. అయినా అక్కడే నాటు కోళ్ల ధరలు రూ.350–400 వరకు ఉన్నాయి. నగరంలోకి వచ్చాక వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కిలో కోడి రూ.600 వరకు ధర పలుకుతుంది నాటు కోడిలో పోషకాలు ఎక్కువ.. బ్రాయిల్ చికెన్‌తో బోర్‌కొట్టి నాటు కోడి రుచి చూద్దామంటే సులభంగా గ్రేటర్లో దొరకడం లేదు. బోనాలతో దానికి డిమాండ్ ఎక్కువ మరోవైపు ప్రజలు కరోనా నుంచి తప్పించుకునేందుకు రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు నాటు కోళ్లను బాగానే ఆరగిస్తున్నారు. బ్రాయిలర్ చికెన్‌లో అంతగా పోషకాలు ఉండవని, నాటు కోడి అయితే ఎక్కువ పోషకాలు ఉంటాయని గ్రేటర్ వాసులు అధికంగా నాటు కోడి తింటున్నారు. దీంతో విపరీతంగా డిమాండ్ పెరిగి కిలో ధర రూ. 600 వరకు పలుకుతుందని అమీర్‌పేట్ చికెన్ వ్యాపారీ గఫూర్ అంటున్నారు. ఊళ్లలోనే అధిక డిమాండ్ గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచే కాకుండా కరీంనగర్, మెదక్, నల్లగొండతో పాటు రాయసీమ తదితర జిల్లాల నుంచి నాటు కోళ్లు దిగుమతి అవుతాయి. కానీ జిల్లాల్లో, గ్రామాల్లో ఊళ్లలో కూడా జనం నాటు కోళ్లను ఎక్కువగానే తింటున్నారు. దీంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న జాతర కోసం కూడా కోళ్లను విక్రయించడం లేదని ఎల్బీనగర్ హోల్‌సెల్ కోళ్ల వ్యాపారి కిషోర్ చెప్పారు. -
నీటు ఫాదర్... నాటు సన్!
పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే తండ్రీకొడుకుల మధ్య సాగే సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘నాటుకోడి’. శ్రీకాంత్, మనోచిత్ర జంటగా నానిగాడి సినిమా పతాకంపై బందరు బాబ్జీతో కలిసి స్వీయదర్శకత్వంలో నానికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శక- నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఇందులో నిజాయతీ గల కానిస్టేబుల్‌గా తండ్రి పాత్రలో కోట శ్రీనివాసరావు, ఆయన కొడుకుగా అవినీతిపరుడైన పోలీసాఫీసర్ పాత్రలో శ్రీకాంత్ నటించారు. కథాకథనాలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అని చెప్పారు. సంగీతం: యాజమాన్య, కెమెరా: మల్లేశ్ నాయుడు. -
పక్కా మాస్ యాక్షన్‌తో శ్రీకాంత్ నాటు కోడి
లంచగొండి పోలీస్ అధికారిగా శ్రీకాంత్ నటిస్తున్న చిత్రం ‘నాటుకోడి’. ‘దేవరాయ’ చిత్రం తర్వాత నానికృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. మనోచిత్ర కథానాయిక. నానిగాడి సినిమా పతాకంపై నానికృష్ణ, బందరు బాబి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక్క పాట మినహా సినిమా పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో శ్రీకాంత్ విభిన్నంగా కనిపిస్తారు. ఇప్పటివరకూ ఇలాంటి పాత్రను శ్రీకాంత్ చేయలేదు. అందర్నీ అలరించేలా ఆయన పాత్ర ఉంటుంది’’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో 40 రోజులు ఏకధాటి షెడ్యూలు చేశాం. ఈ నెలాఖరున బ్యాలెన్స్ సాంగ్ చిత్రీకరిస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, రావు రమేష్, సలీం పాండా, కారుమంచి రఘు, జీవా, ప్రభు, కాదంబరి కిరణ్, జయవాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, కెమెరా: సి.మల్లేష్ నాయుడు, ఎడిటింగ్: రమేష్, కళ: జె.కె.