రాయగడ/మక్కువ: దసరా పండగకు నాలుగు డబ్బులు సంపాందించాలని బయలుదేరిన ముగ్గురి యువకులను మృత్యువు కాటేసింది. లోయ రూపంలో అందని లోకాలకు తీసుకుపోయింది. కుటుంబ సభ్యులకు కన్నీరుమిగిల్చింది. కొరాపుట్ జిల్లా నారాయణపట్నం సమితి లంగడ్‌బేడ గ్రామ సమీపంలో బుధవారం జరిగిన దుర్ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మక్కువ మండలం దబ్బగెడ్డ పంచాయతీ అనసబద్ర గ్రామానికి చెందిన జన్ని బాలరాజు(21), మర్రి శివ(23), జయరాజు(22)లు బుధవారం ఉదయం కోళ్లు కొనుగోలు చేసేందుకు ఆంధ్రా సరిహద్దులోని ఒడిశా గ్రామాలకు వెళ్లారు.
అక్కడ చౌకగా దొరికే కోళ్లు కొనుగోలుచేసి దసరా పండగకు స్థానికంగా విక్రయిస్తే నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చన్న ఆశతో స్కూటీపై ముగ్గురు యువకులు ఉత్సాహంగా వెళ్లారు. తిరిగి వస్తుండగా వీరి స్కూటీ నారాయణపట్నం సమితి లంగడ్‌బేడ వద్ద ఘాట్‌రోడ్డులో అదుపుతప్పింది. అంతే.. 120 అడుగుల లోతులో ఉన్న లోయలో పడి దుర్మరణం చెందారు. ఉదయాన్నే వెళ్లిన పిల్లలు ఇంకారాలేదన్న ఆతృతతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు మృతివార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల్లో బాలరాజు వలంటీర్‌గా పనిచేస్తుండగా, మిగిలిన ఇద్దరు యువకులు వ్యవసాయకూలీలు.
శోకసంద్రంలో అనసబద్ర
అనసబద్ర గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతితో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలరాజు తల్లిదండ్రులు నారాయణ, రత్నాలు వ్యవసాయకూలీలు. జయరాజు నాన్న సోమయ్య మృతిచెందగా, అమ్మ శైలజ ఉంది. ఇప్పుడు కొడుకు మృతివార్తను తట్టుకోలేదని ఆమెకు తెలియకుండా గ్రామస్తులు గోప్యంగా ఉంచారు. అన్నయ్య, అమ్మ నల్లమ్మతో కలిసి కుటుంబానికి చేదోడుగా ఉంటున్న శివ మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నారాయణపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం అక్కడి సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment