సాక్షి, హైదరాబాద్/ కేతేపల్లి: దసరాకు సొంత ఊళ్లకు వెళ్లిన నగరవాసులు తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. దీంతో నగరానికి వచ్చే బస్సులు, రైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు సోమవారం ప్రయాణికులతో పోటెత్తాయి. విజయవాడ, విశాఖ, బెంగళూరు, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే రైళ్లన్నీ రద్దీగా కనిపించాయి. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ తదితర జిల్లాల నుంచి వచ్చే బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి.
చౌటుప్పల్, బీబీనగర్, షాద్‌నగర్, మేడ్చల్‌లోని టోల్‌గేట్ల నుంచి ఒక్కో వాహనం బయటకు రావడానికి గంట నుంచి 2 గంటల సమయం పట్టింది. టోల్‌గేట్‌ల వద్ద కిలోమీటర్ల కొద్దీ రద్దీ నెలకొంది. సోమవారం 65వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద ఉన్న టోల్‌ప్లాజా వద్ద సాయంత్రం వాహనాలు అర కిలోమీటర్ మేర బారులుదీరాయి. నగరానికి వస్తున్న ప్రజలతో నగరంలోని రహదారులు సైతం ట్రాఫిక్ రద్దీతో స్తంభించాయి.
మరోవైపు ఆర్టీసీ, రైల్వేలు, ప్రైవేట్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున అదనపు ఆదాయాన్ని ఆర్జించాయి. ఆర్టీసీ 3,600 ప్రత్యేక బస్సులన్నింటిలోనూ 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేసింది. దసరా రోజు కూడా సాధారణ బస్సుల్లోనూ ‘ప్రత్యేక’చార్జీలు విధించారు. మొత్తంగా పండుగ రోజుల్లో ఆర్టీసీ సుమారు రూ.5 కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని ఆర్జించింది.
దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో సుమారు 420కి పైగా ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి సుమారు 55 రైళ్లు అదనంగా నడిచాయి. ప్రత్యేక రైళ్లన్నింటిపైనా 30 శాతం అదనపు చార్జీలు విధించారు. సికింద్రాబాద్ ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధరను కూడా రూ.10 నుంచి రూ.20కి పెంచారు. దీంతో రైల్వేకు దసరా సందర్భంగా రూ.75 కోట్లకు పైగా ఆదాయం లభించినట్లు అంచనా.