దళారులకు పండగే.. పండగ | Passengers troubled with high ticket charges | Sakshi
Sakshi News home page

దళారులకు పండగ

Published Fri, Sep 29 2017 7:44 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

Passengers troubled with high ticket charges - Sakshi

సాక్షి, సిటీబ్యూరో :  సికింద్రాబాద్‌  రైల్వేస్టేషన్‌. గురువారం  మధ్యాహ్నం  3 గంటలు. ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆగిన  ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌. ఒక్కసారిగా ప్రయాణికుల పరుగులు. స్లీపర్‌ కోచ్‌లు, ఏసీ బోగీలు అన్నీ నిండిపోయాయి. జనమంతా జనరల్‌ బోగీల వైపు వెళ్లారు. అయితే అప్పటికే ఆ బోగీల్లోని సీట్లన్నింటినీ కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. తమవాళ్ల  కోసం  సీట్లను  ఆపి ఉంచినట్లుగా నటిస్తూ ఆ తరువాత సీట్ల బేరానికి దిగారు. ఒక్కో సీటుకు రూ.100 నుంచి రూ.200 చొప్పున విక్రయించి  తాపీగా  వెళ్లారు. ఒక్క ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మాత్రమే కాదు. ప్రయాణికుల రద్దీ  భారీగా  ఉండే పండుగ రోజుల్లో  ఇలాంటి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి.

దసరా సందర్భంగా నగర వాసులు  గురువారం భారీ సంఖ్యలో సొంతూళ్లకు తరలి వెళ్లడంతో రైళ్లు, బస్సులు  కిక్కిరిసిపోయాయి. రిజర్వేషన్లు లభించని ప్రయాణికులంతా సాధారణ బోగీలపైనే  ఆధారపడ్డారు. దీంతో  రద్దీ  విపరీతంగా పెరిగింది. రైళ్లు  ప్లాట్‌ఫామ్‌ వద్దకు చేరుకోకముందే  జనరల్‌  బోగీలను ఆక్రమించుకుంటున్న   దళారులు   ఈ తరహా సీట్ల  బేరానికి దిగుతుండడంతో  సీట్లు  కొనుగోలు చేసిన వాళ్లు దర్జాగా   కూర్చొని  పయనిస్తుండగా  ముందు వరుసలో నించున్నా సీట్లు  లభించని  ప్రయాణికులు నరకం చూస్తున్నారు. దీంతో కేవలం  72  సీట్లు  ఉండే జనరల్‌ బోగీల్లో వంద లాది మంది సర్దుకుపోవాల్సి వస్తోంది.  

కొరవడిన నియంత్రణ....
ప్రత్యేక రోజుల్లో జనరల్‌ బోగీలే కాకుండా కౌంటర్లు సైతం కిటకిటలాడుతాయి. విజయవాడ, విశాఖ, బెంగళూర్‌ వంటి దూర ప్రయాణికులే కాకుండా  వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, తదితర ప్రాంతాలకు వెళ్లే  ప్రయాణికులు కూడా జనరల్‌ బోగీలపైన ఆధారపడతారు. రిజర్వేషన్లు లభించని వారు, వెయిటింగ్‌లిస్టు  ప్రయాణికుల  నుంచి అనూహ్యమైన డిమాండ్‌ ఉంటుంది. దీనిని సొమ్ము చేసుకొనేందుకు దళారులు రంగంలోకి దిగుతున్నారు.  రైల్వే యార్డుల నుంచి ట్రైన్‌లు ప్లాట్‌ఫామ్‌కు వచ్చేలోపే  బోగీల్లోకి  దూరిపోయి  దర్జాగా సీట్లను ఆక్రమిస్తున్నారు. వారిని నియంత్రించడంలో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు విఫలమవుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికితోడు  జనరల్‌ బోగీల  సంఖ్య తక్కువగా ఉండడం కూడా ఇందుకు కారణం.  

24 బోగీలు  ఉండే  ప్రతి  ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో కనీసం  4 జనరల్‌ బోగీలు ఉండాలి. అయితే  లాభార్జన కోసం పాకులాడుతున్న  రైల్వేశాఖ   జనరల్‌ బోగీలను కుదించి  రిజర్వేషన్‌ బోగీలకు మాత్రమే ప్రాధాన్యతమిస్తోంది. 4 జనరల్‌ బోగీలు ఉండాల్సి రైళ్లలో  2 మాత్రమే ఉంటున్నాయి. దీంతో  ప్రయాణికుల రద్దీ, అనూహ్యమైన డిమాండ్‌  దళారుల అక్రమార్జనకు ఊతమిస్తున్నాయి. జంటనగరాల  నుంచి  కాజీపేట్, నల్లగొండ వైపు  గుంటూరు, వాడి, గుల్బర్గా, బీదర్, నిజామాబాద్, మన్మాడ్, ముంబయి, ఢిల్లీ, తదితర రూట్లలో  బయలుదేరే  రైళ్లలో జనరల్‌ బోగీలకు అత్యధికంగా డిమాండ్‌ ఉంటోంది.

పండగపూట నరకం...
పండగపూట  ప్రయాణికులకు నరకం తప్పడం లేదు. హైదరాబాద్‌  నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. రెండు రోజులుగా  4  లక్షల  మంది ప్రయాణికులు వివిధ మార్గాల్లో అదనంగా  బయలుదేరారు. నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్‌ స్టేషన్‌ల నుంచి  సాధారణ రోజుల్లో సుమారు 3 లక్షల మంది బయలుదేరుతుండగా  ప్రస్తుత పండగ  రద్దీ  దృష్ట్యా మరో 2 లక్షల మంది అదనంగా బయలుదేరారు.  ఆర్టీసీ, ప్రైవేట్‌  బస్సుల్లోనూ  రద్దీ తారస్థాయికి చేరింది.  హైదరాబాద్‌  నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే  3500 రెగ్యులర్‌ బస్సులతో పాటు  గురువారం మరో 500 బస్సులను ఆర్టీసీ  అదనంగా ఏర్పాటు చేసింది. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లతో పాటు నగర శివార్ల నుంచి కూడా  ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. సద్దుల బతుకమ్మ, దసరా, పర్వదినాల  దృష్ట్యా  ఈ  నెల  20 నుంచి ఇప్పటి వరకు సుమారు 14 లక్షల మంది  నగర వాసులు సొంతూళ్లకు తరలి వెళ్లినట్లు అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement