ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లోని దివ్యాంగుల బోగీలో సంచారం
35 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో అత్యాచారాలు, హత్యలు
నిందితుడిని పట్టుకున్న గుజరాత్‌లోని వల్సాద్ కాప్స్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హత్య చేసినట్లు అంగీకారం
పీటీ వారెంట్‌పై ఇక్కడకు తీసుకురానున్న రైల్వే పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు భోలో కరమ్‌వీర్ జాట్ అలియాస్ రాహుల్..స్వస్థలం హర్యానాలోని రోహ్తక్‌లో ఉన్న మోక్రా ఖాస్...గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల్లో నేరాలు చేశాడు. ఇటీవల ‘రైల్వే’ కిల్లర్‌గా మారాడు. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి ఆదివారం (ఈ నెల 24) మధ్య 35 రోజుల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో సంచరిస్తూ ఐదు రాష్ట్రాల్లో ఐదు మర్డర్లు చేశాడు. వీటిలో కొన్ని సొత్తు కోసమైతే..మరికొన్ని అత్యాచారం, హత్యలు. గుజరాత్‌లోని వల్సాద్ పోలీసులు ఈ నరహంతకుడిని సోమవారం పట్టుకున్నారు. విచారణలో ఆఖరి ఘాతుకాన్ని ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులకు వల్సాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో పీటీ వారెంట్‌పై కరమ్‌వీర్‌ను నగరానికి తీసుకురావడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. వల్సాద్ ఎస్పీ డాక్టర్ కరణ్‌రాజ్ సింగ్ వాఘేలాను మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ద్వారా సంప్రదించింది. ఆయన ఈ సీరియల్ కిల్లర్ పూర్వాపరాలు వెల్లడించారు.
చిన్ననాటి నుంచి చిత్రమైన ప్రవర్తన..
హర్యానాలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాహుల్‌కు ఎడమ కాలికి పోలియో సోకింది. ఫలితంగా చిన్నతనం నుంచి ఆటపాటలకు దూరంగా ఉంటూ ఒంటరిగా ఉండేవాడు. విపరీతమైన భావాలు, చిత్రమైన ప్రవర్తన కలిగి ఉండేవాడటంతో కుటుంబం దూరంగా పెట్టింది. ఐదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన రాహుల్ లారీ క్లీనర్‌గా పని చేస్తూ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అయితే పోలియో కారణంగా ఇతడికి ఎవరూ డ్రైవర్‌గా ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో హైవే దాబాలో కారి్మకుడిగా మారిన రాహుల్... అక్కడ పార్క్ చేసి ఉన్న లారీలను తస్కరించడం మొదలెట్టాడు. దీంతో పాటు లూటీలు, కిడ్నాప్‌లకు పాల్పడ్డాడు. ఈ ఆరోపణలపై రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో 13 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే వరకు రాజస్థాన్‌లోని జోద్‌పూర్ జైల్లో గడిపిన రాహుల్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అక్కడ నుంచి గుజరాత్‌లోని ఉద్వాడ పట్టణానికి చేరుకుని ఓ హోటల్‌లో కారి్మకుడిగా చేరాడు. కొన్ని రోజులు పని చేసి వాపి ప్రాంతానికి చేరుకుని ఫుట్‌పాత్స్ పైన గడిపాడు.
ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని..
వివిధ రైళ్లల్లో దివ్యాంగుల కోసం చివరలో ప్రత్యేక బోగీలు ఉంటాయి. వీటిలో ప్రయాణించే దివ్యాంగులను సాధారణంగా టీసీలు సైతం తనిఖీ చేయరు. పాసులు కలిగి ఉంటారనే ఉద్దేశంలోనే వదిలేస్తుంటారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న రాహుల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లోని దివ్యాంగుల బోగీల్లో ఎక్కి దేశం మొత్తం తిరగడం ప్రారంభించాడు. ఈ ఏడాది జూన్ రెండో వారం నుంచి ఇలా దేశ సంచారం చేస్తున్న రాహుల్ అక్టోబర్ 17న తొలి హత్య చేశాడు. ఆ రోజు బెంగళూరు–మురుదేశ్వర్ రైలులో ప్రయాణిస్తుండగా బీడీ కాల్చడంపై తోటి ప్రయాణికుడు అభ్యంతరం చెప్పాడు. దీంతో విచక్షణకోల్పోయిన రాహుల్ గొంతు నులిమి చంపేశాడు. ఆపై అతడి వద్ద ఉన్న సొత్తు, సొమ్ము తీసుకుని రైలు దిగిపోయాడు. దీనిపై మంగుళూరులో ఉన్న ముల్కీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
వరుసపెట్టి మరో నాలుగు హత్యలు..
ఆపై కతిహార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన రాహుల్ పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్‌లో మరో వృద్ధుడి గొంతు కోసి చంపి దోపిడీకి పాల్పడ్డాడు. పుణే–కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో మరో మహిళపై అత్యాచారం చేసి, కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. వీటిపై ఆయా ఠాణాలో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 14న ఉద్వాడలో తాను పని చేసిన హోటల్‌కు వెళ్లి జీతం తీసుకోవాలని భావించాడు. అక్కడకు వచ్చిన రాహుల్‌కు స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పై ఒంటరిగా సంచరిస్తున్న యువతి కనిపించింది. ఆమెను సమీపంలోని మామిడి తోటలోకి లాక్కెళ్లి, అత్యా చారం చేసి చంపేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న వల్సాద్ పోలీసులు ఘటనాస్థలిలో లభించిన బ్యాగ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రైల్వేస్టేషన్లలోని 2500 సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను అధ్యయనం చేసి నిందితుడిని గుర్తించారు. ఉద్వాడ నుంచి రైలులో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం చేరుకు న్న రాహుల్ అట్నుంచి షిర్డీ, ఆపై బాంద్రా చేరుకున్నాడు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మహిళ హత్య..
అక్కడ నుంచి సికింద్రాబాద్ వచ్చిన రాహుల్ ఆదివారం తెల్లవారుజామున రైలు దిగాడు. ఆ సమయంలో తొమ్మిదో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై మంగుళూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉంది. దాని సీట్ కమ్ లగేజ్ ర్యాక్ (ఎస్‌ఎల్‌ఆర్) కోచ్‌లో ఓ మహిళ ఒంటరిగా ఉండటం గమనించాడు. ఆమెను గొంతునులిమి చంపేసిన రాహుల్ నగదు, సెల్‌ఫోన్ తస్కరించాడు. అక్కడ నుంచి రైలులోనే ఉడాయించాడు. ఈ హత్యపై సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివిధ రైళ్లు మారిన రాహుల్ బాంద్రా–భుజ్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం గుజరాత్‌లోని వాపి చేరుకున్నాడు. అప్పటికే ఇతడి కదలికలు సాంకేతికంగా గమనిస్తున్న వల్సాద్ పోలీసులు అక్కడ వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి సికింద్రాబాద్‌లో చంపిన మహిళ నుంచి తీసుకున్న సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఇతడి అరెస్టుపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment