దసరా పండుగకు కూతురి ఇంటికి చేరే క్రమంలో వృద్ధ దంపతులు అదృశ్యమైన ఘటన ఫిలింనగర్‌లో చోటుచేసుకుంది.
బంజారాహిల్స్: దసరా పండుగకు కూతురి ఇంటికి చేరే క్రమంలో వృద్ధ దంపతులు అదృశ్యమైన ఘటన ఫిలింనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా కాశినాయన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కె. దేవదాసు(70), ఓబులమ్మ(65) దంపతులు ఫిలింనగర్‌లోని బీజేఆర్ నగర్ బస్తీలో నివసించే కూతురు ఈశ్వరమ్మ ఇంట్లో దసరా వేడుకలు జరుపుకునేందుకు ఈ నెల 10వ తేదీన రాత్రి 10 గంటలకు గిద్దలూరు రైల్వే స్టేషన్‌లో గుంటూరు ప్యాసింజర్ రైలు ఎక్కారు. 11వ తేదీ ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో దిగాల్సి ఉండగా అల్లుడు భిక్షపతి స్టేషన్‌తో పాటు రైలులో గాలించినా ఫలితం లేకపోయింది. ఆ దంపతులకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని రావడంతో ఆందోళన చెందిన అల్లుడు భిక్షపతి కాచిగూడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంటికి వచ్చారేమోనని చూడగా ఫిలింనగర్‌లో వారి జాడ కనిపించలేదు. ఈ దంపతుల వద్ద రూ.30 వేల నగదుతోపాటు రెండు తులాల బంగారం కూడా ఉండటంతో రైలులో ఎవరైనా మత్తు మందు ఇచ్చి వాటిని దోచుకొని ఉంటారని మత్తులో స్టేషన్‌లో దిగకుండానే ముందుకు వెళ్లిపోయి ఉంటారని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. వ్యవసాయం చేసుకొని బతికే ఈ దంపతులు సంతోషంగా కూతురి ఇంట్లో పండుగ జరుపుకుందామని ఆశిస్తే ఆచూకీ లేకుండా పోవడంతో బీజేఆర్ నగర్‌లో విషాదం అలుముకుంది.