సాక్షి, హైదరాబాద్: మామూలుగానే ఆదివారం వచ్చిందంటే ఇంట్లో కోడి కూర ఘుమఘుమలు ఉండాల్సిందే.. ముక్కతో ఓ ముద్ద తింటే ఆ మజాయే వేరు.. దానికి తోడు బోనాలు.. ఇల్లంతా సంబురం.. ఇక నాన్‌వెజ్ తప్పకుండా ఉండాల్సిందే.. కరోనా ప్రభావంతో నాటు కోళ్లకు కరువొచ్చింది. ఏ చికెన్ మార్కెట్, చికెన్ సెంటర్‌కు వెళ్లినా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల నాటుకోళ్లు అందుబాటులో ఉన్నా వాటి ధరలు మాత్రం ఆకాశాన్నంటాయి.
బోనాల వేళ నాటు కోళ్లు కోయడం ఆనవాయితీగా వస్తున్నందున ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. పెద్ద చికెన్ సెంటర్లలో బ్రాయిలర్, లెయర్ కోళ్లతో పాటు నాటు కోళ్లు విక్రయిస్తారు. కానీ నెల రోజుల నుంచి నాటుకోళ్లు విక్రయించే చికెన్ సెంటర్‌లలో నాటు కోళ్లు లేవు. చికెన్ సెంటర్ యజమానులను అడిగితే గ్రామాల నుంచి కోళ్లు రావడం లేదు. అయినా అక్కడే నాటు కోళ్ల ధరలు రూ.350–400 వరకు ఉన్నాయి. నగరంలోకి వచ్చాక వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
కిలో కోడి రూ.600 వరకు ధర పలుకుతుంది
నాటు కోడిలో పోషకాలు ఎక్కువ.. బ్రాయిల్ చికెన్‌తో బోర్‌కొట్టి నాటు కోడి రుచి చూద్దామంటే సులభంగా గ్రేటర్‌లో దొరకడం లేదు. బోనాలతో దానికి డిమాండ్ ఎక్కువ మరోవైపు ప్రజలు కరోనా నుంచి తప్పించుకునేందుకు రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు నాటు కోళ్లను బాగానే ఆరగిస్తున్నారు. బ్రాయిలర్ చికెన్‌లో అంతగా పోషకాలు ఉండవని, నాటు కోడి అయితే ఎక్కువ పోషకాలు ఉంటాయని గ్రేటర్ వాసులు అధికంగా నాటు కోడి తింటున్నారు. దీంతో విపరీతంగా డిమాండ్ పెరిగి కిలో ధర రూ. 600 వరకు పలుకుతుందని అమీర్‌పేట్ చికెన్ వ్యాపారీ గఫూర్ అంటున్నారు.
ఊళ్లలోనే అధిక డిమాండ్
గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచే కాకుండా కరీంనగర్, మెదక్, నల్లగొండతో పాటు రాయసీమ తదితర జిల్లాల నుంచి నాటు కోళ్లు దిగుమతి అవుతాయి. కానీ జిల్లాల్లో, గ్రామాల్లో ఊళ్లలో కూడా జనం నాటు కోళ్లను ఎక్కువగానే తింటున్నారు. దీంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న జాతర కోసం కూడా కోళ్లను విక్రయించడం లేదని ఎల్‌బీనగర్ హోల్‌సెల్ కోళ్ల వ్యాపారి కిషోర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment