
జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మార్చిలోనే ఎండలు ముదురుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రమైన ఎండలతోపాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కాలంలో మనం తీసుకునే ఆహారం అత్యంత కీలకంమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు శరీరం డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. చెమట అధికంగా ఉత్పన్నమవుతుంది. ఇలా ఉంటే శరీరంలోని లవణాలు తగ్గిపోయి వడదెబ్బ బారిన పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు తప్పక పాటించాలని చెబుతున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల లోపు నిత్యం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజుల్లో 42 వరకూ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. ఈ నేపత్యంలో వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలామంది చల్లని ద్రవ పదార్థాలు తీసుకునేందుకు ఇష్టపడతారు. వేసవిలో చర్మవ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటంది. ఇవన్నీ ఎదుర్కొవాలంటే రోగ నిరోధకశక్తి పెంచే విధంగా....ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవాలి. మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడుతుందనే ఆలోచన కలిగి ఉండాలి.
ఎక్కువ నీరు తీసుకోవాలి
శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు తగ్గించడంలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు 3–5 లీటర్ల వరకు నీరు తీసుకుంటూ ఉండాలి. శరీరం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది.
తాజా పండ్లు తీసుకోవాలి
ప్రతి రోజూ నీరు, పోషకాల శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. తాజా పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, జామ, అరటి, యాపిల్ పండ్లు తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, కమల రసాలు శ్రేయేస్కరం. రాగులు, జొన్నలు తదితర చిరుధాన్యాలు తీసుకోవడం కూడా మంచిది. ఇవి శక్తిని ఇవ్వడంతోపాటు ఎండల్లో నిస్సత్తువ రాకుండా చూస్తుంది.
ద్రవ పదార్థాలు తీసుకోవాలి
ఎండలో ఎక్కువగా తిరిగే వారు ద్రవ పదర్థాలను తీసుకుంటూ రావాలి. మజ్జిగతో పాటు కొబ్బరినీరు, లస్సీ, చెరుకు రసం అధికంగా వినియోగించాలి. ఉల్లిపాయల్లో శరీరాన్ని చల్లబరిచే గుణం కలిగి ఉంది. ఉల్లిని నిత్యం ఆహారంలో తీసుకుంటే వడ దెబ్బ బారిన పడే అవకాశాలు తక్కువ. మజ్జిగ శరీరంలోని జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు అందులో ప్రో బయోటిక్స్ అధికంగా ఉంటాయి. కొబ్బరినీరు ఈ కాలంలో తరుచుగా తీసుకుంటే ఖనిజ లవణాలు ఎక్కువ శక్తిని ఇచ్చి వడగాలులు, వేగి గాలుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
పటిష్టమైన రోగ నిరోధక శక్తి
వేసవిలో బలమైన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఖనిజ లవణాలు అధికంగా ఉండేలా చూడాలి. పాలు, గుడ్లు, టమోటా, నారింజ, పసుపు రంగు కూరగాయలు, చిలకడదుంప, చేపలు, బ్లాక్ బెర్రి, బ్లూ బెర్రి తినడం మంచిది. ఆహారంలో సొరకాయ, బీరకాయ, దోసకాయ, పొట్లకాయ తదితర కూరగాయలు వినియోగించడం శ్రేయస్కరం.
చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్
ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి
ప్రతి ఒక్కరూ ఎండలో అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండడం ఎంతో మంచిది. తలపై రక్షణకు గొడుగు లేదా టోపీ పెట్టుకోవాలి. చేనేత, కాటన్ దుస్తులు ధరించి మంచిది. ఎక్కువ నీరు తాగడంతోపాటు మనిషికి సరిపడేలా నిద్రపోవాలి. ప్రతిరోజు వ్యాయామం మరింత మంచిది. ఎండలు ఎక్కువగా ఉండడంతో కాపీ, టీలు అలవాటున్న వారు వీలైనంత తగ్గించుకుంటే మంచిది.
– డాక్టర్ శ్రీనాథరెడ్డి, సూపరింటెండెంట్, వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి, కడప
Comments
Please login to add a commentAdd a comment