
ఎండాకాలం మొదలైంది. మార్చి రెండోవారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గతేడాది 47 నుంచి 49 డిగ్రీల సెల్సీయస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా అదేస్థాయిలో మండే ఎండలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఎలాంటి వైద్య సేవలు పొందాలి? తదితర అంశాలను గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీంనగర్ జిల్లా వైద్య అధికారి(డీఎంహెచ్‌వో) వెంకటరమణ వివరించారు.
వేసవిలో ఎలాంటి రక్షణ పొందాలి?
డీఎంహెచ్‌వో: ఎండ ఎక్కువగా ఉండే 11 నుంచి 3 గంటల మధ్య సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడం మంచింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా రుమాలు పెట్టుకుని, తెల్లని దుస్తులు ధరించాలి. రేకులషెడ్లలో నివాసముండే వారు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. రేకులపై గడ్డి, గోనె సంచులను వేసుకొని నీళ్లు చల్లాలి.
రోజూ ఎన్ని నీళ్లు తాగాలి?
డీఎంహెచ్‌వో: ఎండాకాలంలో నీటిశాతం లోపంవల్ల శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. శరీరంలో శక్తి తగ్గి అలసట కలుగుతుంది. ప్రతీ రోజు 8నుంచి 10గ్లాసుల నీరు తాగాలి. ముఖ్యంగా ప్రయాణం లేదా బయట పనులున్నప్పుడు నీరు తాగడం మరిచిపోవద్దు. అది కూడా సురక్షితమైన నీటిని తీసుకోవాలి.
ఆహారం విషయంలో జాగ్రత్తలు?
డీఎంహెచ్‌వో: ఎండాకాలంలో మిగిలిన ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. ప్రతీరోజూ తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్, బిర్యానీలు, మసాలాలతో తయారు చేసే ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. మజ్జిగ, ఓఆర్‌ఎస్, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి.
శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు ఏం చేయాలి?
డీఎంహెచ్‌వో: శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు, బట్టలు తీసేసి చల్లటి నీటితో ముఖం, చేతులు, కాళ్లు తుడవాలి. గాలి ఆడే స్థలంలో విశ్రాంతి తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.
ఆస్పత్రుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
డీఎంహెచ్‌వో: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. డీహైడ్రేషన్ జరగకుండా ఉండేందుకు 2 లక్షల ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో, ఉపాధిహామీ కూలీలకు పనిస్థలాల్లోనూ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైనా వాడుకోవచ్చు.
గతేడాది వడదెబ్బ మరణాలు సంభవించాయా?
డీఎంహెచ్‌వో: గతేడాది జిల్లాలో ఇద్దరు వడదెబ్బ కారణంగా మరణించారు. వడదెబ్బతో మరణించినట్లు నిర్ధారించేందుకు త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశాం. ఇందులో మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ సభ్యులుగా ఉంటారు. వీరి ద్వారా వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారణ జరిగితే ప్రభుత్వం నుంచి కలెక్టర్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.
గర్భిణులు, పిల్లలు, వృద్ధులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలికవ్యాధులతో బాధపడే వారు హైరిస్క్ గ్రూపులో ఉంటారు. వీరు ఎండలో ఎక్కువ సమయం ఉండొద్దు. ముఖ్యంగా గర్భిణులు డెలివరీకి ముందే ప్లాన్ చేసుకొని ఆసుపత్రికి చేరుకోవాలి. పిల్లలు, వృద్ధులు, బీపీ, షుగర్, కేన్సర్ తదితర వ్యాధులతో బాధపడేవారు ఎండలో తిరిగే సాహసం చేయవద్దు.
డీహైడ్రేషన్ అయితే ఏం చేయాలి?
డీఎంహెచ్‌వో: డీహైడ్రేషన్ అయితే రీహైడ్రేషన్‌తో చెక్ పెట్టాలి. ఎవరైనా డీహైడ్రేషన్‌కు గురైన వెంటనే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఉప్పునిమ్మకాయ కలిపిన నీరు తాగించాలి. ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
(చదవండి: ఆ చెఫ్ చేతులు అద్భుతం చేశాయి..! వావ్ బంగాళదుంపతో ఇలా కూడా..)
Comments
Please login to add a commentAdd a comment