అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు? | Why Does Every Countries Currency Have Different | Sakshi
Sakshi News home page

అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?

Published Sat, Mar 22 2025 4:58 PM | Last Updated on Sat, Mar 22 2025 4:58 PM

Why Does Every Countries Currency Have Different

ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాల తోపాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్లద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణం. అయితే అన్ని వస్తువులు, అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో అన్ని రుతువుల్లో తయారు కావు. 

ఇచ్చి పుచ్చుకోవడం అవసరం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాకు, అమెరికాలో ఉత్పత్తి అయ్యే పరికరాలు సేవలు భారత దేశానికీ అవసరం. మన వస్తువును ఇచ్చి అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల సమస్యలున్నాయి కాబట్టి ఈ రోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకు ఇచ్చి దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్‌ తీసుకుంటాం. 

అదే టోకెన్‌ను రేపు నేను వారికి ఇచ్చి వారి వస్తువుల్ని తీసుకోగలను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడ్డం వల్ల బల్ల విలువ, సెల్‌ఫోను విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకొనే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తుమార్పిడి వేర్వేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేర్వేరు ప్రజలకు అవసరం అవుతుంది. కాబట్టి టోకెన్లు అంతర్జాతీయంగా, జాతీయంగానూ అవసరం. ఆ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం. అమెరికాకు డాలర్‌ ప్రమాణం, ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం.

అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. అత్యంత విలువైంది. కాబట్టి మన దేశంలో 10 గ్రాముల్ని దాదాపు 30 వేల రూపాయలకు అమ్మితే అమెరికాలో 500 డాలర్లు పెడితే 10 గ్రాములు వస్తుంది. అంటే 500 డాలర్ల విలువ 30 వేల రూపాయల విలువ సమానం. 

మరో మాటలో చెప్పాలంటే ప్రతి డాలరుకు ఆ సమయంలో 60 రూపాయల మారకం విలువ అన్నట్టు అర్థం. ఐరోపాదేశాలు కూడబలుక్కుని తమదేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా ’యూరో’ను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వస్తే ఒకే కరెన్సీని చలామణీ చేసుకోవడం అసాధ్యం కాదు.    

(చదవండి: ప్రపంచ శాంతి కోసం ఆ పాప ఏం చేసిందంటే..       )                                

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement