తెనాలిటౌన్,న్యూస్‌లైన్: సకాలంలో పెన్షన్లు అందక తెనాలి డివిజన్‌లోని లబ్ధిదారులు పలు అగచాట్లు పడుతున్నారు. గ్రామాల్లోని పోస్టాఫీస్‌ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ పొందే లబ్ధిదారులకు ఏడోతేదీ వచ్చినా అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడు తున్నారు. వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. లబ్ధిదారుని గ్రామంలో పోస్టాఫీస్ లేకపోతే పక్క గ్రామానికి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీ కార్యదర్శులు పంపిణీ చేసినపుడు ఒకటో తేదీ పండగైనా, ఆదివారమైనా పెన్షన్ నగదు అందించేవారు.
ప్రభుత్వం పోస్టాఫీస్‌ల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టిన తరువాతే ఈ ఇబ్బందులు ఆరంభమయ్యాయి. మొదటి రెండు మూడు నెలలు బాగానే ఇచ్చారు. ఆ తరువాత నుంచి తిప్పలు తప్పడం లేదు. తెనాలి మండలంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత పెన్షన్‌దారులు సుమారు 6500 మంది వరకు ఉన్నారు. కొల్లిపర మండలంలో అభయహస్తం, వికలాంగ, వితంతు, చేనేత, కల్లుగీత, వృద్ధాప్య పెన్షన్‌దారులు సుమారు 5,019 వరకు ఉన్నారు. తెనాలి డివిజన్‌లోని 18 మండలాల్లో పెన్షన్‌దారుల పరిస్థితి ఇలాగే ఉంది.
పనిచేయని బయోమెట్రిక్ మెషిన్లు
బయోమెట్రిక్ మెషిన్లు పనిచేయకపోవడం, సిగ్నల్స్ లేక సర్వర్‌లు కనెక్ట్ కాకపోవడం వల్ల సకాలంలో పెన్షన్లు అందించలేకపోతు న్నారు. వృద్ధుల వేళ్లు అరిగిపోవడంతో వేలిముద్రలు మెషిన్లపై పడడం లేదు. ఆధార్ కార్డు లేకపోయినా పెన్షన్ ఇవ్వడం లేదు. వచ్చే రెండొందల కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని, ఆటోలు, రిక్షాలకు యాభై రూపాయలు ఖర్చు అవుతున్నాయని వృద్ధులు వాపోతున్నారు.
తెనాలి మండలం నందివెలుగులో 39 మందికి పెన్షన్లు మంజూరైనప్పటికీ మూడు నెలల నుంచి నగదు ఇవ్వడం లేదు. లబ్ధిదారుల జాబితా కంప్యూటర్‌లో నమోదు కావడం లేదని, ఆన్‌లైన్ కూడా పనిచేయడం లేదని, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు చెపుతున్నారు. దీనిపై కొలకలూరు పోస్ట్ మాస్టర్ ఝాన్సీరాణిని వివరణ కోరగా బయోమెట్రిక్ మెషిన్‌లు పనిచేయడం లేదన్నారు. వృద్ధుల వేలిముద్రలు పడకపోవడం, సిగ్నల్స్ లేక సర్వర్ పని చేయనందున పంపిణీ ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు.
మరణించిన వారికీ పెన్షన్‌లు
పోస్టాఫీస్ సిబ్బంది, సీఎస్‌పీలకు అవగాహన లేకపోవడంతో మరణించిన వారి పేరుతో ఉన్న పెన్షన్లను పంపిణీ చేసిన దాఖలాలు ఉన్నాయి. తెనాలి మండలం కఠెవరంలో ఐదుగురు, చావావారిపాలెంలో ఒక రు మరణించగా వారిపేరుతో వున్న పెన్షన్లు అందజేసినట్లు తెలిసింది.
దారి ఖర్చులకు పోతున్నాయి.
మాది గుదిబండివారిపాలెం. మాకు కొల్లిపరలో ఇస్తున్నారు. రెండు కిలోమీటర్లు వెళ్లాలి. రోజుకు రూ.30 లు ఆటోకే ఖర్చు అవుతుంది. పోస్టాఫీస్‌కు వెళితే వేలిముద్రలు పడటం లేదు అంటున్నారు. రెండు రోజులు ఆగిన తరువాత వెళితే మళ్ళీ రెండు రోజులు ఆగి రమ్మంటున్నారు. ఈ డబ్బులు దారి ఖర్చులకే సరిపోతున్నాయి. - జొన్నల వెంకటరెడ్డి, గుదిబండివారిపాలెం
నాలుగు రోజులుగా తిరుగుతున్నా
పెన్షన్ కోసం పోస్టాఫీస్ చుట్టూ నాలుగు రోజులుగా తిరుగుతున్నా. రోజూ రేపు రమ్మంటున్నారు. వేలిముద్రలు పడటం లేదని చెబుతున్నారు. వృద్ధులను ఇబ్బంది పెట్టటం దారుణం. - నలుకుర్తి మరియమ్మ, కొలకలూరు
వారం గడిచినా ఇవ్వలేదు..
గతంలో ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ ఇచ్చేవారు. రెండు నెలల నుంచి నెలలో వారం రోజులు గడిచినా కూడా పెన్షన్ ఇవ్వడం లేదు. రెండు కిలోమీటర్ల దూరం నుంచి పోస్టాఫీస్‌కు వస్తున్నా. ఆధార్ కార్డు లేదని పెన్షన్ ఇవ్వడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్న మళ్లీ రేపు రా అంటున్నారు. - ఫాతిమున్నీసా, కొలకలూరు
పెన్షన్ల కోసం ప్రదక్షిణలు
Published Sat, Jan 11 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement