ప్రైవేటు కనికట్టు.. ఇంటర్‌ బోర్డు తాకట్టు!  | Illegal business from the inter-board official website | Sakshi
Sakshi News home page

ప్రైవేటు కనికట్టు.. ఇంటర్‌ బోర్డు తాకట్టు! 

Published Tue, Jul 24 2018 2:10 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

Illegal business from the inter-board official website - Sakshi

1. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో కాలేజీ లాగిన్‌ అయ్యాక ‘బయో జినీ’ మెషీన్‌ కొనుగోలు చేసేలా ఇచ్చిన ప్రత్యేక పేజీ 2. బయోమెట్రిక్‌ మెషీన్‌ వివరాలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డును ఓ ప్రైవేటు సంస్థకు తాకట్టు పెట్టారు. అధికారులు, ప్రైవేటు సంస్థ ప్రతినిధులు కుమ్మక్కై బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచే వ్యాపారానికి దారులు వేశారు. విద్యార్థుల వేలి ముద్రలు సేకరించే బయోమెట్రిక్‌ మెషీన్ల విక్రయాలకు బోర్డు వెబ్‌సైట్‌ ద్వారానే రాచబాట వేసి భారీగా దండుకుంటున్నారు. అసలు అవసరమే లేని.. ఒక్కోటి రూ.2 వేల విలువైన బయోమెట్రిక్‌ మెషీన్లను బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా రూ.5 వేల చొప్పున కాలేజీలతో వేలాదిగా కొనుగోలు చేయించారు. 

అన్నీ అడ్డగోలు వ్యవహారాలే.. 
ఏటా 10 లక్షల మంది విద్యార్థుల సమాచారం, అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాల వెల్లడి వంటి వ్యవహారాలను ఇంటర్‌ బోర్డు సొంతంగా చేసుకునేలా ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు వచ్చిన ఆలోచనను అధికారులు ఆచరణలో పెట్టారు. తమకు భారీగా కమీషన్లు వస్తాయని ఉద్దేశంతో ఓకే చెప్పేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల డేటా ప్రాసెసింగ్, రిజల్ట్‌ ప్రాసెసింగ్‌ పనులను సదరు సంస్థకు అప్పగించారు. ఏటా రూ.20 లక్షలే ఆ పనులకు ఖర్చవుతున్నా.. సదరు సంస్థ రూ.4.5 కోట్లతో ఇచ్చిన ప్రతిపాదనలకు అనుమతిచ్చేశారు. డేటా ప్రాసెస్‌ పనులను సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) నుంచి తొలగించి ఆ సంస్థకు అప్పగించారు. పనులు దక్కించుకున్న సదరు సంస్థ తమ పనితీరును నిరూపించుకునేందుకు డేటా, రిజల్ట్స్‌ ప్రాసెసింగ్‌ టెస్టింగ్‌ను ఉచితంగా చేయాలి. కానీ అధికారులు టెస్టింగ్‌ కోసం కూడా రూ.75 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే టెస్టింగ్‌ ఏమైందో ఎవరికీ తెలియదు. 

ఒకటి తేలకుండానే ఇంకోటి.. 
టెస్టింగ్‌ ప్రాసెస్‌ తేలకముందే ఇంటర్‌ బోర్డు అదే సంస్థకు మరో పని అప్పగించింది. 2018–19కి సంబంధించి విద్యార్థుల ప్రవేశాలు, డేటా క్యాప్చర్‌ వంటి పనులను అప్పగించింది. మొదట ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్‌లైన్‌ చేసేందుకు సదరు సంస్థ చర్యలు చేపట్టింది. సాఫ్ట్‌వేర్‌ లేకపోవడం, ప్రోగ్రాం సరిగ్గా రూపొందించుకోని కారణంగా వీటిని సక్రమంగా చేయలేకపోయింది. సీజీజీ నుంచి గత ఏడాది ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రాసెస్‌ ప్రోగ్రాం మోడల్స్‌ తెచ్చుకొని కొంత మేర ఆన్‌లైన్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అదీ కూడా సరిగ్గా చేయలేదు. ప్రభుత్వ కాలేజీల్లో రీ అడ్మిషన్లు, 37 వేల మంది సీబీఎస్‌ఈ విద్యార్థుల ప్రవేశాలు, ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి వెళ్లే విద్యార్థుల ప్రవేశాలు ఆన్‌లైన్‌ చేయలేకపోయింది. ప్రైవేటు కాలేజీల విద్యార్థుల ఆన్‌లైన్‌ ప్రవేశాలను ప్రాసెస్‌ చేయలేదు. మరో 30 రోజులు గడువు కావాలని కోరింది. దీంతో ఇంటర్‌ బోర్డు.. ప్రవేశాల వ్యవహారాలను తిరిగి సీజీజీకి అప్పగించింది.

ప్రభుత్వ విధానాన్ని అడ్డుపెట్టుకొని..
విద్యార్థులకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని, ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందే వారికే తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. దీంతో బయోమెట్రిక్‌ మెషీన్లను బోర్డు కొనుగోలు చేసింది. దీన్ని అడ్డుపెట్టుకొని సదరు సంస్థ రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ మెషీన్లు కొనుగోలు చేయాలని కాలేజీలకు ఆ సంస్థ సమాచారం పంపింది. కాలేజీల సమాచారం ఆ సంస్థకు ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు అర్థం కావడం లేదు. ఆ సమాచారమంతా ఇంటర్‌ బోర్డు, సీజీజీ, ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ సంస్థ వద్దే ఉంది.ఆ ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ సంస్థనే కాలేజీల సమాచారాన్ని బయోమెట్రిక్‌ మెషీన్ల కంపెనీకి ఇచ్చి ఉంటుందని బోర్డు అధికారు లు అనుమానిస్తున్నారు. బోర్డు వెబ్‌సైట్‌లో (http:// acad.tsbie.telangana.gov.in) కాలేజీలు లాగి న్‌ అయ్యాక.. ‘మెషీన్లను బోర్డు గుర్తించింది. వాటినే కొనుగోలు చేయాలి’ అని కనిపించేలా మార్పులను ఆ ప్రైవేటు సంస్థే చేసిందని భావిస్తున్నారు.

భారీ కుట్ర! 
బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేస్తే బయోమెట్రిక్‌ మెషీన్లను కొనుగోలు చేయాలనే పేజీ కనిపించదు. కాలేజీ యాజమాన్యాలు తమ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యాక మాత్రం ప్రత్యేకంగా ఓ పేజీనే ప్రత్యక్షమయ్యేలా కుట్రపన్నారు. పైగా అవి బోర్డు ధ్రువీకరించిన మెషీన్లని, వాటిని కొనుగోలు చేయాలంటూ వెబ్‌సైట్‌లోనే మార్పులు చేసి భారీ మోసానికి పాల్పడ్డారు. ఇలా ఓ ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ సంస్థ చేసిన మోసంతో యాజమాన్యాలు మెషీన్లను కొనుగోలు చేసి నష్టపోయా యి. రూ.కోట్ల వ్యవహారంలో బోర్డు అధికారులు కమీషన్ల రూపంలో భారీగా ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో రహస్యంగా ఉండాల్సిన విద్యార్థుల సమాచారా న్ని, బోర్డు ఆన్‌లైన్‌ వ్యవహారాలను కనీస గోప్యత పాటించని సంస్థకు అప్పగించడం వెనుక భారీ కుట్ర ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రైవేటు సంస్థ మెషీన్‌ కొనుగోలు పేజీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement