స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఉన్న నాగుపాములు
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బలియాపాల్ తహసీల్ పంచుపాలి ప్రాంతంలో విష సర్పాల అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా అనుబంధ వర్గాలు చేపట్టిన దాడిలో ఈ ముఠా వ్యవహారం బట్టబయలైంది. అటవీ శాఖ అధికారులు ఆకస్మికంగా చేపట్టిన దాడుల్లో బుధవారం 26 నాగుపాములను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. బాలాసోర్ జిల్లా లంగేశ్వర్ అటవీ కార్యాలయానికి సమీపంలో ని ఈ అక్రమ వ్యాపార శిబిరం కొనసాగడం సంచలనం రేపింది. బాలాసోర్ అటవీ విభాగం మరియు స్నేక్ హెల్ప్‌లైన్ వర్గాలు ఉమ్మడిగా ఈ శిబిరంపై దాడి చేశాయి. పట్టుబడిన ముఠాలో ఉన్న దంపతు లు అంతర్ రాష్ట్ర రాకెట్‌ను నడుపుతున్నట్లు తేలింది.
పలు ప్రాంతాలకు తరలింపు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పాములను సేకరించి వాటి విషాన్ని తీసి వివిధ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు స్నేక్ హెల్ప్‌లైన్ కార్యదర్శి సువేందు మల్లిక్ మీడియాతో మాట్లాడారు. నాగుపాముల అక్రమ వ్యాపారం (స్మగ్లింగ్) గురించి విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. సమాచారం అందడంతో తక్షణమే భువనేశ్వర్ నుంచి తెల్లవారు జామున 3 గంటలకు బయల్దేరి విష సర్పాల అక్రమ వ్యాపార శిబిరానికి చేరినట్లు వివరించారు.
విషయం స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో వారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారన్నారు. వీరి ఆధ్వర్యంలో జరిగిన దాడిలో 26 నాగుపాములకు స్వేచ్ఛ కల్పించి నట్లు పేర్కొన్నారు. పాములను రంధ్రాలతో ప్ర త్యేకంగా రూపొందించిన ప్లాస్టిక్ కంటైనర్లలో అక్రమార్కులు బందీచేసి ఉంచినట్లు దృష్టికి వచ్చిందన్నారు. ఈ వ్యవహారంలో మరింత మంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపా రు. దర్యాప్తు కొనసాగుతోందని బాలాసోర్ అటవీ విభాగం ఏసీఎఫ్ శోభన్ చాంద్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment