Telangana Inter-Board
-
రెండు మూడు రోజుల్లో సెకండ్ ఇంటర్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫలితాలు రాబోతున్నాయి. ఈనెల 25 లేదా 26 తేదీల్లో విడుదల చేసేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. కరోనా కారణంగా ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులను ప్రమోట్ చేసి, సెకండియర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మార్కులు కేటాయించే విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు (మెమో నంబరు 1583/ఎంసీ/2021) జారీ చేశారు. ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధి విధానాలను అందులో పొందుపరిచారు. ఈ ఫలితాల కోసం 4,73,967 మంది సెకండియర్ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. వారిలో ఫస్టియర్ ఫెయిలైన 1,99,019 మంది ఉన్నారు. ఫలితాలను https://tsbie.cgg.gov.in వెబ్సైట్లో చూడొచ్చని బోర్డు తెలిపింది. మార్గదర్శకాల్లోని ప్రధాన అంశాలివీ.. 2020–21లో విద్యార్థులకు ప్రథమ సంవత్సరం (జనరల్, వొకేషనల్, బ్రిడ్జి కోర్సు)లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు సెకండియర్ (2021–22)లో మార్కులను కేటాయిస్తారు. ప్రతి సబ్జెక్టులో ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే సెకండియర్‌లోనూ ఇస్తారు. సెకండియర్ ఫీజు చెల్లించిన విద్యార్థులు (రెగ్యు లర్, ప్రైవేటు) ఫస్టియర్‌లో ఫెయిలై ఉంటే 35% కనీస పాస్ మార్కులను కేటాయిస్తారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం ప్రాక్టికల్స్ నిర్వహించలేదు కాబట్టి అందరికీ ప్రాక్టికల్స్‌లో 100 శాతం మార్కులను ఇస్తారు ప్రైవేటు విద్యార్థులు ఏయే సబ్జెక్టుల్లో ఫెయిలై ఉంటారో ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం కనీస పాస్ మార్కులను ఇస్తారు. హాజరు మినహాయింపు కేటగిరీలో, అదనపు సబ్జెక్టుల్లో పరీక్షలకు హాజరు కావాలనుకున్న మ్యాథమెటిక్స్ జనరల్ బ్రిడ్జి కోర్సు, వొకేషనల్ బ్రిడ్జి కోర్సు, హ్యుమానిటీస్ కోర్సుల విద్యార్థులు ఫస్టియర్‌లో ఫెయిలై ఉంటే ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం కనీస మార్కులను ఇస్తారు. వారికి సెకండియర్‌లోనూ ఆయా సబ్జెక్టుల్లో అవే మార్కులను కేటాయిస్తారు. ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత పొందని సెకండియర్ విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం కనీస మార్కులను ఇస్తారు. ఈ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు తరువాత పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. కరోనా అదుపులోకి వచ్చి, సాధారణ పరిస్థితులు నెలకొన్నాక పరీక్షలను నిర్వహిస్తారు. విద్యార్థులు ఆ పరీక్షలకు హాజరై మార్కులను పెంచుకోవచ్చు. -
ఇంటర్ ఫలితాలపై హైకోర్టులో విచారణ
-
‘అనామిక’పై అశోక్ నిర్లక్ష్యపు సమాధానం..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిలవడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనామిక విషయంలో ఇంటర్ బోర్డు ఇంకా నిర్లక్ష్యం వీడటం లేదు. తాము చేసిన తప్పును ఒప్పుకో కుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థుల జవాబు పత్రాలు, మార్కులపై మంగళ వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బోర్డు కార్యదర్శి అశోక్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శ నం. ఆత్మహత్య చేసుకున్న అనామిక మార్కుల విషయంలో నెలకొన్న గందరగోళంపై విలేక రులు అడిగిన ప్రశ్నలకు ఆయన పొంతనలేని సమాధా నాలు చెప్పారు. అనామికకు జవాబుపత్రంలో 21 మార్కులు వస్తే 48 మార్కులు వచ్చినట్లు వెబ్సైట్లో ఎలా పొందుపరిచారని విలేకరులు ప్రశ్నించగా అశోక్ చిరాకుపడ్డారు. (అశోకా.. ఏంటీ లీల!) ‘వెబ్సైట్లో ఇచ్చినవి పరిగణనలోకి తీసుకోం. జవాబు పత్రాల్లో ఉన్న మార్కులనే పరిగణనలోకి తీసుకుంటాం. ఆ మార్కులే ఫైనల్. జవాబుపత్రాల మూల్యాంకనం గాలిలో చేయరు. ఆ జవాబు పత్రాలు నేను కరెక్షన్ చేయను. నాకు ఎలాంటి సంబంధంలేదు’ అంటూ విచిత్రమైన సమాధానం చెప్పారు. తప్పు ఎక్కడ, ఎలా జరిగిందో చెప్పకుండా తప్పించుకునే సమాధానం ఇచ్చారు. అనామిక విషయంలో బోర్డు తప్పే చేయనట్లు ఆయన మాట్లాడడం గమనార్హం. ఏ విద్యార్థి అయినా తమ ఫలితాలను ముందుగా వెబ్సైట్లో ఇచ్చే మెమోలోనే చూసుకుంటారు. అలా అనామికకు మొదట 20 మార్కులు వేశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నా ఆమె జవాబు పత్రాన్ని రీ వెరిఫికేషన్ చేసి 21 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. చివరకు మరోసారి ఫెయిల్ అయిన విద్యార్థులందరి జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేసిన సమయంలో అనామికకు 48 మార్కులు వచ్చినట్లు వెబ్సైట్లో పొందుపరిచారు. దీంతో గందరగోళం నెలకొంది. దానిపై బోర్డు స్పష్టౖ మెన వివరణ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. మరోవై పు ఓఎంఆర్ షీట్లలో బోర్డు తప్పుగా ముద్రించే పొరపాట్లను విద్యార్థులు సరిచూసుకొని ఇన్విజిలే టర్లకు చెప్పి సరిచేయించుకోవాలని, లేదంటే అందు లోని తప్పులకు విద్యార్థులదే బాధ్యత అంటూ వారిని ఆందోళన పడేసే చర్యలకు బోర్డు దిగింది. బాధ్యులపై చర్యలు.. మూల్యాంకనంలో పొరపాట్లకు బా«ధ్యులైన లెక్చరర్లపై చర్యలు చేపడతామని అశోక్ పేర్కొన్నారు. అలాగే తొలుత ఫెయిలై, ఆ తర్వాత రీ వెరిఫికేషన్‌లో పాసైన విద్యార్థుల జవాబుపత్రాలు మొదట మూల్యాంకనం చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రీ వెరిఫికేషన్‌లో 1,155 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. ఈ లెక్కన గమనిస్తే లెక్చరర్లపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రీ వెరిఫికేషన్‌లో ఐదు లేదా అంతకన్నా మార్కులు పెరిగిన పేపర్లను మూల్యాంకనం చేసిన లెక్చరర్లకు రూ. 5 వేల జరిమానాతోపాటు మూల్యాంకన విధుల నుంచి మూడేళ్లు డీబార్ చేయనున్నట్లు అశోక్ తెలిపారు. గత నెల విడుదల చేసిన రీ వెరిఫికేషన్ ఫలితాల్లో 1,137 మంది విద్యార్థులు పాసైనట్లు బోర్డు ప్రకటించింది. వారం తిరిగే సరికి ఆ సంఖ్య మారిపోయింది. ఉత్తీర్ణుల సంఖ్య 1,155కి చేరింది. అంటే మరో 18 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంకా 800 మంది ఫలితాల ప్రాసెసింగ్ ఇంకా పూర్తి కాలేదు. వారిలో ఎంత మంది ఉత్తీర్ణులు అవుతారో వేచి చూడాల్సిందే. -
విద్యా విధానంలో మార్పులు తప్పనిసరి
తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం రెండు డజన్లకుపైగా విద్యార్థుల ప్రాణాలు హరించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్య అవసరం గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణలో విద్యారంగంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సంక్రమించిన ఒంటెత్తువాదం ప్రభావం గురించి చర్చిస్తే గానీ తెలంగాణ విద్యారంగం తీరుతెన్నులు అర్థం కావు.విద్యారంగంలో దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలం గాణ స్థానం 28. దీని తర్వాత మిగిలింది బిహార్ రాష్ట్రం ఒక్కటే. దక్షిణాదిలో మనది అట్టడుగు స్థానం. విద్యాభివృద్ధి సూచికల విషయంలో 2018 లో ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా మన ర్యాంక్ 18 మాత్రమే. విద్యారంగంలో వెనకబాటుకు ప్రధాన కారణాలు రెండు. ఒకటి, అందరికీ సమానమైన చదువు అందకూడదనే ఫ్యూడల్ భావజాలం. రెండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి సంక్రమించిన విద్యారంగంలో ‘నా రూటే సెపరేట్‘ అనే వైఖరి. ఈ రెంటిలో మార్పు రానంత కాలం ఇంతే సంగతులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగానికి సంబంధించిన సమగ్రమైన చట్టం 1982లో వచ్చింది. 37 సంవత్సరాలు గడిచినా కనీసం సమీక్ష కూడా లేకుండా అదే చట్టం కొనసాగుతోంది. దేశంలో జాతీయ విద్యా విధానం 1986 (1992లో అప్డేట్ చేశారు)లో వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), విద్యాహక్కు చట్టం మున్నగునవి పాఠశాల విద్యా రంగాన్ని ఎంతోకొంత ప్రభావితం చేశాయి. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, తెలంగాణలో గానీ పాఠశాల విద్యా చట్రం ఎలాంటి సంస్థాగత మార్పులను అనుమతించకుండా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా వుండిపోయింది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ నేటి తెలం గాణలోగానీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1/1982లో ప్రీ–ప్రైమరీ (3–5 సం.ల వయసు) ఎడ్యుకేషన్ గురించి పేర్కొన్నా కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో అమలుకావడం లేదు. మరో ముఖ్య విషయం, 1968 జాతీయ విద్యా విధానంలోని 10+2+3 విధానాన్ని అమలు చేయడంలో వ్యత్యాసం. కేంద్ర ప్రభుత్వంలో, అన్ని రాష్ట్రాల్లో హైస్కూళ్లు 12వ తరగతి (+2) వరకు ఉన్నవి. తెలంగాణలో కూడా సీబీఎస్ఈ అనుబంధ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు మరియు ఇటీవల వచ్చిన ప్రభుత్వ గురుకులాలు, మోడల్ స్కూల్స్, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు నడుస్తున్నవి. కానీ అనాదిగా వస్తున్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ హైస్కూళ్లు మాత్రం 10 వ తరగతి వరకే పరిమితమైనవి. 11, 12 తరగతులను విడగొట్టి ఇంటర్మీడియట్ విద్యగా జూనియర్ కాలేజీలను నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాటు విద్యారంగంలో తెలంగాణ వెనుకబాటుతనానకి ఒక ముఖ్య కారణం. మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యాపారానికి ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థ వనరుగా మారింది. ఇంటర్మీడియట్ విద్యా విధానం వలన తెలంగాణకు జరుగుతున్న లాభం కంటే నష్టం ఎక్కువ. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సంవత్సరానికి ఐదారొందల మందికి సీట్లు వస్తూ ఉండవచ్చు. కానీ అందుకు భారీ మూల్యం చెల్లించడం జరుగుతోంది. ఐఐటీ, నీట్ తదితర పరీక్షల్లో సీట్లు వస్తున్న వారిలో అత్యధికులు కార్పొరేట్ కాలేజీల్లో ప్రత్యేక తర్ఫీదు పొందినవారే. ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీల్లో చదివిన వారికి కూడా కొన్ని రావచ్చు. కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివిన వారికి వస్తున్నవి చెప్పుకోదగినంత లేవు. ఇంటర్మీడియట్ విద్యా వ్యాపారంపైన జరుగుతున్న టర్నోవర్ సంవత్సరానికి రూ. పదివేల కోట్లు పైగా ఉన్నట్లు అంచనా. లక్షల మంది తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యాపారులకు ధారబోస్తున్నారు. టీనేజ్ దశలోని అమ్మాయిలు, అబ్బాయిలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోయి భావోద్వేగాలకు సామాజిక జీవనానికి దూరమై యంత్రాల్లా బతుకుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చనిపోతున్న వారిలో, ఫెయిలవుతున్న విద్యార్థుల్లో దళిత, గిరిజన, మైనార్టీ మరియు అమ్మాయిలే ఎక్కువ. ఇన్ని రకాల నష్టాలు కల్గిస్తూ రాష్ట్ర విద్యారంగానికి గుదిబండగా మారిన ఇంటర్మీడియట్ విద్యా అవస్థను ఇకనైనా విరమిస్తేనే మంచిది. జాతీయ విద్యా ప్రధాన స్రవంతిలో కలిసి పురోగమించే విద్యా విధానానికి మరలాలి. తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యా వ్యవస్థకు జాతీయ పాఠశాల విద్యా స్థాయిని కల్పించాలి. బడిలో చేరిన బాలబాలికలు అందరూ తమ నివాస ప్రాంతంలోనే 12వ తరగతి వరకు చదువుకునే అవకాశం కల్గుతుంది. సార్వత్రిక సెకండరీ విద్యను సాధిస్తూ విద్యాభివృద్ధిలో ఏపీ, తెలంగాణ ముందడుగు వేయగలవు. ఇందుకు అనువుగా మన విద్యా విధానాన్ని మార్చుకుంటే ఎంతో మేలు. నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు మొబైల్ : 94903 00577 -
ప్రైవేటు కనికట్టు.. ఇంటర్ బోర్డు తాకట్టు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డును ఓ ప్రైవేటు సంస్థకు తాకట్టు పెట్టారు. అధికారులు, ప్రైవేటు సంస్థ ప్రతినిధులు కుమ్మక్కై బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచే వ్యాపారానికి దారులు వేశారు. విద్యార్థుల వేలి ముద్రలు సేకరించే బయోమెట్రిక్ మెషీన్ల విక్రయాలకు బోర్డు వెబ్సైట్ ద్వారానే రాచబాట వేసి భారీగా దండుకుంటున్నారు. అసలు అవసరమే లేని.. ఒక్కోటి రూ.2 వేల విలువైన బయోమెట్రిక్ మెషీన్లను బోర్డు వెబ్సైట్ ద్వారా రూ.5 వేల చొప్పున కాలేజీలతో వేలాదిగా కొనుగోలు చేయించారు. అన్నీ అడ్డగోలు వ్యవహారాలే.. ఏటా 10 లక్షల మంది విద్యార్థుల సమాచారం, అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాల వెల్లడి వంటి వ్యవహారాలను ఇంటర్ బోర్డు సొంతంగా చేసుకునేలా ఓ సాఫ్ట్వేర్ సంస్థకు వచ్చిన ఆలోచనను అధికారులు ఆచరణలో పెట్టారు. తమకు భారీగా కమీషన్లు వస్తాయని ఉద్దేశంతో ఓకే చెప్పేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల డేటా ప్రాసెసింగ్, రిజల్ట్ ప్రాసెసింగ్ పనులను సదరు సంస్థకు అప్పగించారు. ఏటా రూ.20 లక్షలే ఆ పనులకు ఖర్చవుతున్నా.. సదరు సంస్థ రూ.4.5 కోట్లతో ఇచ్చిన ప్రతిపాదనలకు అనుమతిచ్చేశారు. డేటా ప్రాసెస్ పనులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) నుంచి తొలగించి ఆ సంస్థకు అప్పగించారు. పనులు దక్కించుకున్న సదరు సంస్థ తమ పనితీరును నిరూపించుకునేందుకు డేటా, రిజల్ట్స్ ప్రాసెసింగ్ టెస్టింగ్‌ను ఉచితంగా చేయాలి. కానీ అధికారులు టెస్టింగ్ కోసం కూడా రూ.75 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే టెస్టింగ్ ఏమైందో ఎవరికీ తెలియదు. ఒకటి తేలకుండానే ఇంకోటి.. టెస్టింగ్ ప్రాసెస్ తేలకముందే ఇంటర్ బోర్డు అదే సంస్థకు మరో పని అప్పగించింది. 2018–19కి సంబంధించి విద్యార్థుల ప్రవేశాలు, డేటా క్యాప్చర్ వంటి పనులను అప్పగించింది. మొదట ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్లైన్ చేసేందుకు సదరు సంస్థ చర్యలు చేపట్టింది. సాఫ్ట్వేర్ లేకపోవడం, ప్రోగ్రాం సరిగ్గా రూపొందించుకోని కారణంగా వీటిని సక్రమంగా చేయలేకపోయింది. సీజీజీ నుంచి గత ఏడాది ఆన్లైన్ ప్రవేశాల ప్రాసెస్ ప్రోగ్రాం మోడల్స్ తెచ్చుకొని కొంత మేర ఆన్లైన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అదీ కూడా సరిగ్గా చేయలేదు. ప్రభుత్వ కాలేజీల్లో రీ అడ్మిషన్లు, 37 వేల మంది సీబీఎస్ఈ విద్యార్థుల ప్రవేశాలు, ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి వెళ్లే విద్యార్థుల ప్రవేశాలు ఆన్లైన్ చేయలేకపోయింది. ప్రైవేటు కాలేజీల విద్యార్థుల ఆన్లైన్ ప్రవేశాలను ప్రాసెస్ చేయలేదు. మరో 30 రోజులు గడువు కావాలని కోరింది. దీంతో ఇంటర్ బోర్డు.. ప్రవేశాల వ్యవహారాలను తిరిగి సీజీజీకి అప్పగించింది. ప్రభుత్వ విధానాన్ని అడ్డుపెట్టుకొని.. విద్యార్థులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని, ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందే వారికే తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. దీంతో బయోమెట్రిక్ మెషీన్లను బోర్డు కొనుగోలు చేసింది. దీన్ని అడ్డుపెట్టుకొని సదరు సంస్థ రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ మెషీన్లు కొనుగోలు చేయాలని కాలేజీలకు ఆ సంస్థ సమాచారం పంపింది. కాలేజీల సమాచారం ఆ సంస్థకు ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు అర్థం కావడం లేదు. ఆ సమాచారమంతా ఇంటర్ బోర్డు, సీజీజీ, ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థ వద్దే ఉంది.ఆ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థనే కాలేజీల సమాచారాన్ని బయోమెట్రిక్ మెషీన్ల కంపెనీకి ఇచ్చి ఉంటుందని బోర్డు అధికారు లు అనుమానిస్తున్నారు. బోర్డు వెబ్సైట్లో (http:// acad.tsbie.telangana.gov.in) కాలేజీలు లాగి న్ అయ్యాక.. ‘మెషీన్లను బోర్డు గుర్తించింది. వాటినే కొనుగోలు చేయాలి’ అని కనిపించేలా మార్పులను ఆ ప్రైవేటు సంస్థే చేసిందని భావిస్తున్నారు. భారీ కుట్ర! బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే బయోమెట్రిక్ మెషీన్లను కొనుగోలు చేయాలనే పేజీ కనిపించదు. కాలేజీ యాజమాన్యాలు తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో వెబ్సైట్లో లాగిన్ అయ్యాక మాత్రం ప్రత్యేకంగా ఓ పేజీనే ప్రత్యక్షమయ్యేలా కుట్రపన్నారు. పైగా అవి బోర్డు ధ్రువీకరించిన మెషీన్లని, వాటిని కొనుగోలు చేయాలంటూ వెబ్సైట్లోనే మార్పులు చేసి భారీ మోసానికి పాల్పడ్డారు. ఇలా ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థ చేసిన మోసంతో యాజమాన్యాలు మెషీన్లను కొనుగోలు చేసి నష్టపోయా యి. రూ.కోట్ల వ్యవహారంలో బోర్డు అధికారులు కమీషన్ల రూపంలో భారీగా ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో రహస్యంగా ఉండాల్సిన విద్యార్థుల సమాచారా న్ని, బోర్డు ఆన్లైన్ వ్యవహారాలను కనీస గోప్యత పాటించని సంస్థకు అప్పగించడం వెనుక భారీ కుట్ర ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు సంస్థ మెషీన్ కొనుగోలు పేజీ -
వృత్తి విద్యా కోర్సుల రీడిజైనింగ్
- ఇంటర్ బోర్డు పాలకమండలి సమావేశంలో నిర్ణయం - వచ్చే ఏడాది మరిన్ని కొత్త - జూనియర్ కాలేజీలు: కడియం సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో వృత్తి విద్యా కోర్సులను మరింత పటిష్టం చేయాలని ఇంటర్ బోర్డు పాలక మండలి సంకల్పించింది. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి వెంటనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా రీడిజైన్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జేఎన్టీయూ, వైద్య, ఆరోగ్య శాఖ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండు నెలల్లో ఈ కమిటీ తన నివేదిక ఇవ్వాలని, దానికనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను రూపొందించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. అలాగే డిమాండ్ లేని కోర్సులను తొలగించాలని నిర్ణయించింది. బోర్డు చైర్మన్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంగళవారం బోర్డు పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కడియం వెల్లడించారు. దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతాం... ఇంటర్ బోర్డును దేశంలోనే ఉత్తమమైనదిగా తయారు చేస్తామని కడియం చెప్పారు. ఇప్పటికే దేశంలో బెస్ట్ డిజిటలైజ్డ్ బోర్డుగా వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో తెలంగాణ ఇంటర్ బోర్డుకు అవార్డు లభించిందన్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుమతుల్లో బోర్డు కఠినంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే అనుబంధ గుర్తింపు ఉన్న, లేని కళాశాలల జాబితాను వెబ్సైట్లో పెడతామన్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డులో 22 సర్వీస్‌లను ఆన్లైన్ చేశామని, త్వరలో మరిన్ని సేవలను ఆన్లైన్ చేస్తామన్నారు. విద్యాశాఖ చేపట్టిన పలు సంస్కరణల వల్ల జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగిందన్నారు. ఎక్కడెక్కడ జూనియర్ కాలేజీలు అవసరమో గుర్తించి, వచ్చే ఏడాది అక్కడ కొత్త కాలేజీలను మంజూరు చేస్తామని తెలిపారు. గతంలో మంజూరు చేసిన 59 కాలేజీల్లో పోస్టుల భర్తీకి సీఎం ఓకే చెప్పారని, దీంతో పోస్టుల భర్తీకి మార్గం సుగమమైందన్నారు. భవిష్యత్తులో ఇంటర్‌లోనూ ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు చేపడతామని కడియం చెప్పారు. ఈసారి ఎన్విరాన్మెంటల్ సైన్స్, ద్వితీయ భాషల సిలబస్‌ను మార్చుతున్నామని, వచ్చే ఏడాది ఈ మార్పులు అమల్లోకి వస్తాయన్నారు. సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్య కమిషనర్ వాణిప్రసాద్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య డైరెక్టర్ కిషన్ పాల్గొన్నారు.